BREAKING NEWS

రాంగ్ రూట్.... టేక్ కేర్...

ప్రేమ.... ఇష్క్... కాదల్.... ఇదేదో సినిమా డైలాగ్ లా ఉందే అనుకుంటున్నారా... అవును .. ఇదే పేరుతో ఓ సినిమా కూడా ఉంది. కానీ ప్రస్తుతం యువత అందరూ జపిస్తున్న మంత్రం ఇదే...

భాష ఏదైనా భావం ఒక్కటే... అక్షరాలు రెండే... లక్షణాలు ఎన్నో... ఇలా ఏవేవో పొయిటిక్ మాటలు చెప్పుకుంటూ తెగ లవ్ చేసేసుకుంటున్నారు ఈ జనరేషన్... అయితే ఈ ప్రేమలో ఎంత వరకు నిజం ఉంది. ఎన్ని ప్రేమలు సఫలం అవుతున్నాయి. యువత దారి ఎటు?? 

టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఇంటర్ లోకి అడుగుపెట్టే టీనేజీ కుర్రాళ్ళు అందరూ... ప్రపంచం మొత్తం డిఫరెంట్ కలర్స్ లో కనిపించే కలర్ ఫుల్ ఏజ్.. మంచికి, చెడుకి తేడా తెలియని ప్రమాదకర వయస్సు. సినిమాల ప్రభావమో, నిజ జీవితంలో చూస్తున్న ఘటనలో తెలియదు గానీ అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరిపై ఒకరు అట్రాక్షన్ పెంచుకుంటున్నారు. దానినే ప్రేమ అనుకుని భ్రమ పడుతున్నారు.

ప్రేమకు , ఆకర్షణకు ఉండే సన్నని గీతను అర్థం చేసుకోలేక తొందరపడుతున్నారు.. అదే నిజమైన ప్రేమ అనుకుంటూ పీకల్లోతు వరకు మునిగిపోతున్నారు. తెలిసీ తెలియని వయస్సులో చేస్తున్న ఈ తప్పు వలన జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు.

బైక్ ల పై చెట్టా పట్టాలేసుకునీ చక్కర్లు కొట్టేస్తున్నారు. పార్క్ లు , సినిమా థియేటర్లు ఇలా ఎక్కడ బడితే అక్కడే విహరిస్తూ ఊహా లోకంలో తేలిపోతున్నారు. పబ్లిక్ ప్లేస్ లు అన్న సంగతి కూడా మరచిపోయి ప్రవర్తిస్తున్నారు. పొరపాటున ఏ ఆకతాయి కుర్రాళ్ళు కెమెరా కంటికి చిక్కితే... ఇక అంతే సంగతులు... రెండు కుటుంబాలు రోడ్డున పడతాయి . కనీసం ఆ మాత్రం కూడా ఆలోచన లేకుండా ఆకర్షణను ప్రేమ అని భ్రమ పడుతూ కోరి కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు... 

ఇది ఒక రకమైన ప్రేమ అయితే జీవితాలను కూడా త్యాగం చేసే ప్రేమ మరికొంత మందిది... నూనూగు మీసాల వయస్సు... కాలేజీ , ఇల్లు, చదువు తప్ప వేరే టెన్షన్లు ఏమీ లేని హ్యాపీ లైఫ్. అప్పుడే కంప్యూటర్ వైరస్ లా ఎక్కుతుంది ఈ ప్రేమ... అప్పటి వరకు ఉన్న కుటుంబం, ఫ్రెండ్స్, భవిష్యత్తు ఏమీ గుర్తు రావు... కని పెంచిన తల్లిదండ్రులు వదిలేసి కొన్ని నెలల ముందు పరిచయం అయిన అమ్మాయి/అబ్బాయి కోసం ప్రాణాలు బలి తీసుకుంటున్నారు.

గత కొన్ని రోజుల్లో విశాఖపట్నం, విజయనగరం లో జర్8గిన ఘటనలే దీనికి ఉదాహరణ... పెద్దలు పెళ్లికి ఒప్పుకోరు అనే భయంతో రైలు కింద పడి ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంటే, ఉరేసుకుని ఆత్మహత్య కు పాల్పడింది విశాఖలోని ఓ జంట... వీళ్ళ వయస్సు కేవలం 20 మాత్రమే. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు... ప్రేమ జంట కులాలు/మతాలు వేరు... ఇలా కారణం ఏదైనా కావచ్చు. పరిష్కారం మాత్రం *"ఆత్మహత్య"*... ఇదీ ఇప్పుడు యువతను చూస్తే అందరికీ అనిపించే విషయం....  ఈ రెండు కేవలం ఉదాహరణలు మాత్రమే.

రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలోనూ ఇలాంటి ఘటనలు రోజూ చూస్తూనే ఉన్నాం... ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న  యువత ... అర్థం లేని ప్రేమ మాయలో పడి అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు..

యువత ఇలా తయారవ్వడానికి కారణం ఎవ్వరూ?? సినిమాలా? సీరియల్స్?.... ఈ ప్రశ్నకు సమాధానం కచ్చితంగా తల్లిదండ్రులే. పిల్లలు సక్రమమైన దారిలో వెళ్తున్నారా... దారి తప్పుతున్నారా అని గమనించాల్సింది తల్లిదండ్రులే... అసలే స్పీడ్ జనరేషన్. కోటి ఆశలు.. అంతకు మించి ఆలోచనలు... లైఫ్ ను ఎంజాయ్ చేయాలి అనే ఉత్సాహం... కొత్త కొత్త స్నేహాలు... వీటన్నింటి వలన ఎందుకో లేని పోని ఆలోచనలు మనసుల్లో ఉంటాయి. కనీసం కన్న పిల్లల గురించి కూడా పట్టించుకోలేనంత బిజీ బిజీ గా లైఫ్ గడిపేస్తున్నారా???  ఇంట్లో ఉంటే కాస్తో కూస్తో తల్లిదండ్రులకి తెలిసే అవకాశం ఉంటుంది.

కానీ చదువు బాగా రావాలనో లేదా మరేదైనా ఇతర కారణమో గానీ ఆడ, మగ తేడా లేకుండా చిన్నప్పటి నుంచే హాస్టల్స్ కి అలవాటు చేస్తున్నారు. ఏం చేసినా అడిగే వాళ్లు ఎవ్వరూ లేరు కాబట్టి కొత్త కొత్త అలవాట్లు చేసుకుంటున్నారు.. కోటి విద్యలు కూటి కొరకే అన్నారు. కానీ ప్రేమ కోసం నిండు జీవితాలనే బలి చేసుకుంటున్న యువతను సరైన దారిలో పెట్టకుండా ఎంత సంపాదిస్తే మాత్రం ఏం ప్రయోజనం.... 

నాకొక గర్ల్ ఫ్రెండ్/బాయ్ ఫ్రెండ్ ఉన్నారు అని చెప్పుకోవడానికి మాత్రమే లవ్ చేస్తున్నారు నేటి తరం యువతీ యువకులు... డియర్ పేరెంట్స్.... మీరు ఎంత బిజీగా ఉన్నా మీ పిల్లల్ని కూడా కాస్త పట్టించుకోండి. ఏం చేస్తున్నారో ... వాళ్ళ ఫ్రెండ్స్ గురించి అప్పుడప్పుడు తెలుసుకోండి.

వాళ్ళని మించిన ముఖ్యమైన పనులు ఏమీ ఉండవు కదా... ఈ రోజు కాకపోతే రేపు ఆ పని చేయచ్చు..  కానీ నిండు ప్రాణం... క్షణికావేశంలో నిర్ణయం తీసుకునే మీ పిల్లలు తిరిగి రారు.   ఒక్క సారి ఆలోచించండి...  

Photo Gallery