BREAKING NEWS

వెహికల్స్ నాట్ అలౌడ్

కొన్ని కొన్ని ప్రకటనలు చూడడానికి, చదవడానికి చాలా వింతగా ఉంటూ ఉంటాయి. అసలు ఇలా కూడా చేయచ్చా.. అని ఒక్కోసారి అనిపిస్తుంది. అలాగే నోటీస్ బోర్డులు కూడా అలాంటివే కొన్ని కొన్ని కనిపిస్తూ ఉంటాయి.

అలా విచిత్రంగా ఉండే నోటీస్ బోర్డులలో మనం ఎక్కువగా చూసేది విజిటర్స్ వెహికల్స్ ఆర్ నాట్ అలౌడ్... ఇందులో తప్పు ఏమి లేదు. కొన్ని కొన్ని సంస్థల్లో మన వాహనాలను అనుమతించరు. కానీ ఉండాల్సి స్థానంలో లేకపోతేనే అలాంటి బోర్డులు విచిత్రంగా అనిపిస్తాయి.. ఆ ఉండకూడని ప్లేస్ అపార్ట్మెంట్స్... అక్కడే విచ్చలవిడిగా కనిపిస్తుంటాయి ఈ బోర్డులు... 
 
విజిటర్స్ వెహికల్స్ ఆర్ నాట్  అలౌెడ్ తరచుగా అపార్టుమెంట్స్ గేటుకి ఈ బోర్డు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ విజిటర్స్ అంటే ఎవరు?

లక్షలు పోసి ఓ ఫ్లాట్ కొనుక్కుని , మన అన్నో , తమ్ముడో , అక్కో , చెల్లో లేదా దగ్గరి బంధువో ఉంటే వారిని చూద్దామని ఎంతో దూరం నుండి శ్రమపడి వస్తే ..... మనం వచ్చిన వాహనాన్ని లోపలకు అనుమతించరు అపార్టుమెంట్ వాచ్ మెన్ లేదా సెక్యూరిటీ. మరి మన వాహనాన్ని ఎక్కడ పార్క్ చెయ్యాలో ప్లేస్ చూపిస్తారా అంటే అదీ లేదు...

అంటే మనం మనవాళ్ళ ఇంటికి రావాలంటే కచ్చితంగా నడిచి గానీ, బస్సు లో గానీ, ఆటోలో గానీ, అద్దె కారులో గానీ మాత్రమే రావాలి తప్ప మనదైన మన స్వంత వాహనంలో రావడానికి మనం అర్హులం 

కాదన్నమాట. తప్పి దారి , తెలిసో తెలియకో స్వంత వాహనంలో వస్తే ... దానినెక్కడో పార్క్ చేసి , మన వాళ్ళింటికి వెల్లింది మొదలు మనకి ఒకటే టెన్షన్ ...

మన బండి ఎలా ఉందో ?? పోలీసులు వచ్చారా ...ఆకతాయిలు ఏమైనా గీతలు పెడుతున్నారా?? రేష్ గా వచ్చి ఎవరైనా తగిలించి పోయారా ??? ఇలా మనసంతా మన వాహనం చుట్టూ తిరుగుతుందే తప్ప.. రాక రాక వచ్చాం కాసేపు అన్నీ మరచి హాయిగా ఆప్యాయంగా మాట్లాడుకుందాం అని అనిపించదు.

ఇన్ని ఆందోళనల మధ్య అన్యమనస్కంగానే రెండు నిమిషాలు ఎదో వెట్టికి గడిపి బై చెప్పేసి కంగారు కంగారుగా మన బండి దగ్గరకు పరిగెత్తి ఏమీ జరక్కపోతే అమ్మయ్య అని గట్టిగా ఊపిరి పీల్చుకుని ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించినంత గొప్పగా ఫీలవుతున్న రోజులివి.

ఇక్కడ మనం  ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ..మనం ఒక షాప్ కి వెళ్తే అక్కడ మనం కొంటామో కొనమో కూడా తెలియదు మనవలన వారికి ఏ మాత్రం వ్యాపారం జరగక పోవచ్చు .. అయినా మన వాహనాలు పార్క్ చెయ్యడానికి ప్లేస్ చూపించాల్సిన భాద్యత షాప్ వాళ్ళది. అంతకంటే తీసికట్టు గా ఉంది అపార్టుమెంట్స్ లో ఉంటున్న మన బంధువుల పరిస్థితి.
 
       దీనికి పరిష్కారం... అపార్టుమెంట్స్ కడుతున్న బిల్డర్ కచ్చితంగా విజిటర్స్ వెహికల్స్ పార్క్ చెయ్యడానికి కొంత స్థలం కేటాయించాలి. షట్ బేక్ లు ఉంచాలి , 40 అడుగులు రోడ్డు ఉండాలి లాంటి నిబంధనలు ఉన్నట్లే అపార్టుమెంట్స్ లో ఉన్న  వాల్లింటికి వచ్చే అతిధుల వాహనాలకు కూడా పార్కింగ్ ప్లేస్ చూపించాలి అనే నిబంధన అమలు చెయ్యాలి.

అలాగే ఫ్లాట్స్ కొనేవారు కూడా జెనరేటర్ ఉందా? కార్ పార్కింగ్ ఉందా? లిఫ్ట్ ఉందా?అని చూసుకున్నట్లే మనింటికి మన వాళ్ళు వస్తే వారి వాహనాలు లోపలకు అనుమతిస్తారా ?అని కూడా చూసుకోవాలి.. లేకపోతే .. కేవలం పార్కింగ్ సమస్య మూలంగా మన ఇంటికి ఎవరూ రాక మనం ఏకాకులం అయిపోయే పరిస్థితి దగ్గర లోనే ఉంది ...తస్మాత్ జాగ్రత్త ...!!

 

Photo Gallery