BREAKING NEWS

చరిత్రకు సాక్ష్యం - మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల

విజయనగరం జిల్లా. ఈ జిల్లా పేరు చెప్పగానే రాజ్యాలు రాజులు రాజభవనాలు గుర్తు వస్తాయి... దీంతోపాటు కళలకు కూడా ఈ జిల్లా పుట్టినిల్లు.... ఇప్పుడు దేశ విదేశాల్లో ఎంతో పేరు తెచ్చుకున్న ఎంతో మంది కళాకారులు విజయనగరం జిల్లాకు చెందిన వారే... పుట్టుకతోనే ఏదో ఒక కళ తమతో పాటు తెచ్చుకుంటారు ఈ జిల్లా వాసులు., ముఖ్యంగా సంగీతం, నృత్యం ఈ రెండిటిలోనూ ఈ జిల్లా వాసులుదే పైచేయి... ఇలా ఆసక్తి ఉన్న ఎంతోమంది విద్యార్థులను ఇప్పుడు విద్వాంసులుగా మన ముందు గర్వంగా తలెత్తుకునేలా నిలబెట్టింది ఈ కళాశాల.... వేలాది మంది విద్యార్థులు కళామతల్లి ఒడిలోనే సంగీతంలో సరిగమలు నేర్చుకునే ఉన్నత స్థాయికి ఎదిగారు.... ఈ సంవత్సరం ఫిబ్రవరి ఐదో తారీకు తో శత వసంతాలు పూర్తి చేసుకోబోతున్న ఈ సంగీత కళాశాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం... 

ఈ జిల్లాలో పుట్టిన ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో ఏదో ఒక కళలో ప్రావీణ్యం సాధించాలి అని అనుకుంటూ ఉంటారు... అలాంటి వారందరి కోసమే ఏర్పడినది మహారాజా ప్రభుత్వ సంగీత మరియు నృత్య కళాశాల. ఈ సంవత్సరంతో 100 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్న సంగీత కళాశాల రాష్ట్రంలో ఇదే మొదటిది.... ఇలాంటి అద్భుతమైన కళాశాలకు ఎన్నో రకాల ప్రత్యేకతలు కూడా ఉన్నాయి... దక్షిణ భారతదేశం మొత్తం మీద మొట్టమొదటి సారిగా స్థాపించిన సంగీత మరియు నృత్య కళాశాలగా విజయనగరం లోని ఈ మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల పేరు గాంచింది... 36 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ కళాశాల ప్రస్తుతం 432 మంది కి వివిధ రంగాలలో శిక్షణ ఇస్తోంది... రాష్ట్ర విభజనకు ముందు 12 సంగీత కళాశాలలో ఉండగా ప్రస్తుతం మన రాష్ట్రం కి ఆరు సంగీత కళాకారులు వచ్చాయి... విజయనగరం సంగీత కళాశాలలో చదువుకున్న ఆనాటి విద్యార్థుల ఇప్పుడు మిగిలిన సంగీత కళాశాలలో నేటి అధ్యాపకులు... కేవలం ఇక్కడే కాదు ప్రపంచం నలుమూలల సంగీతం ఎక్కడ ఉన్నా అక్కడ విజయనగరం సంగీత నృత్య కళాశాల పూర్వ విద్యార్థి మాత్రం ఉండడం గ్యారెంటీ...  
  
సువిశాల కళాశాల ప్రాంగణం, సాధనకు అవసరమయ్యే సంగీత పరికరాలు, అర్థమయ్యేలా వివరించే ఇక్కడి గురువులు విద్యార్థులను కళాశాల వైపు అడుగులు వేయిస్తున్నాయి.. ఫిబ్రవరి మూడు నుంచి 5 వ తారీకు వరకు జరిగే శతాబ్ది ఉత్సవాలకు కళాశాల ముస్తాబవుతోంది... వందేళ్ల క్రితం నిర్మించిన ఈ కళాశాల సరికొత్త సొబగులు అద్దుకుంటోంది... ఎన్నో ఏళ్ల తర్వాత తమ కళాశాలను.... తాము సంగీతంలో ఓనమాలు నేర్చుకున్న సంగీత ఆలయాన్ని చూసుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న పూర్వ విద్యార్థులకు స్వాగతం చెప్పేందుకు అన్ని విధాలుగా కళాశాల ముస్తాబవుతోంది. సరికొత్త రంగులతో విద్యుత్ దీప కాంతులతో సర్వాంగ సుందరంగా తయారవుతుంది... మూడు రోజులపాటు వివిధ రకాల కచేరీలు పూర్వ విద్యార్థుల ప్రదర్శనలు.. ఇలా ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు... ప్రత్యేక అతిథిలు...

ఇప్పటివరకు దేశంలో మరెక్కడా జరగని విధంగా ఈ సంగీత కళాశాల శత జయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు అధికారులు ప్రభుత్వం సమాయత్తమైంది... అందరిదీ ఒక్కటే లక్ష్యం విజయనగరం ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ఇదే పేరు ప్రపంచవ్యాప్తంగా మారు మోగిపోవాలి. అందుకే ఈ మూడు రోజుల ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు... 
 
మనం ఏ పని చేసిన దాని వెనక ఒక కారణం ఉంటుంది అలాగే ఈ సంగీత కళాశాల స్థాపన కూడా ఓ కారణం ఉంది. ఆనాటి విజయనగరం రాజావారు విజయ రామ గజపతిరాజు ఆస్థానంలో ఉద్యోగి అయినా చాగంటి జోగారావు కుమారుడు గంగ బాబు అంధుడు.. అందుకే తన కోసం విజయ రామ గాన పాఠశాల పేరుతో ఈ కళాశాల స్థాపించారు..  హరికథ పితామహుడిగా పేరుగాంచిన ఆదిభట్ల నారాయణదాసు ఈ పాఠశాలకు మొదటి అధ్యక్షులయ్యారు... వయోలిన్ వాయిద్యంలో మేటి అయిన పద్మశ్రీ అవార్డు గ్రహీత ద్వారం వెంకటస్వామి నాయుడు ఆనాడు ఈ కళాశాలలో విద్యార్థిగా చేరడానికి వచ్చారు.. అప్పుడు ఆయనను అధ్యక్షుడిగా నియమించారు.  దక్షిణాదిన కర్ణాటక శాస్త్రీయ సంప్రదాయాలను పరిరక్షించే ఈ కళాశాలలో మొత్తం ఏడు విభాగాలలో కోర్సులు అందిస్తున్నారు. వీణ, గాత్రం, వయోలిన్, మృదంగం, సన్నాయి, డోలు వీటితోపాటు భరతనాట్యం లో కూడా ఎంతోమంది విద్యార్థులు సుశిక్షితులు గా మారుతున్నారు...

ఘంటసాల, పి.సుశీల, సాలూరు రాజేశ్వరరావు, శ్రీరంగం గోపాలరత్నం, నేదునూరి కృష్ణమూర్తి, ద్వారం సత్యనారాయణ ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరా ఇద్దరా ఎన్నో వేలమంది విద్యార్థులను విద్వాంసులుగా తీర్చిదిద్దిన ఘనత ఈ కళాశాలకు దక్కుతుంది.. ఈ కళాశాలకే దక్కుతుంది... ఇలాంటి ప్రతిష్టాత్మకమైన కళాశాలలో సంగీతం నేర్చుకోవడం నిజంగా ఈ కళాశాల విద్యార్థుల అదృష్టమే... అంతేకాకుండా చరిత్రలో మిగిలి పోయే శతాబ్ది ఉత్సవాలలో భాగం కావడం మరో అదృష్టం.. సంగీతానికి వయసుకి ఏమైనా సంబంధం ఉందా... ఉంది అని అనుకునే వాళ్ళు ఒక్కసారి ఈ కళాశాలకు వచ్చి చూడండి... సంగీతం నేర్చుకోవడానికి వయసుతో ఏమాత్రం సంబంధం లేదు అని వెంటనే ఒప్పుకుంటారు.... 10 సంవత్సరాల పిల్లల నుంచి 80 సంవత్సరాల వృద్ధుల వరకు అన్ని వయసులవారు సంగీతం నేర్చుకోవడానికి అర్హులే అని ఈ కళాశాల చూసినవారు ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది..
     
తెలుగు భాషలో పూర్తిగా మరిచి పోతున్న ఈ రోజుల్లో పలకరింపులు కూడా తెలుగులో అందులోనే సాంప్రదాయబద్ధంగా ఉంటే నిజంగా హర్షించదగ్గ విషయం... ఈ సంగీత కళాశాలలో ఇప్పటికీ తెలుగులోనే పలకరింపులు తెలుగులోనే తరగతులు... గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పే ఈనాటి విద్యార్థులకు నమస్కారం గురువు గారు అని చెప్పే ఈ సంగీత కళాశాల విద్యార్థులను ఒక్కసారి చూపిస్తూ తెలుగు భాష మీద కాస్తయినా ప్రేమ కలుగుతుందేమో...   పరిరక్షిస్తున్నారు కూడా.... ఇలాంటి కళాశాలలో చదువుకుని దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు సాధించిన ఎంతోమంది ఉద్దండులు ఈ మూడు రోజుల ఉత్సవాలలో పాల్గొననున్నారు... 

కేవలం విజయనగరం జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లాలైన శ్రీకాకుళం, విశాఖపట్నంతో పాటు పక్క రాష్ట్రం ఒడిస్సా నుంచి కూడా ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ మ్యూజిక్ నేర్చుకోవడానికి వస్తుంటారు... ఇప్పటికే వేలాది మంది సంగీత విద్వాంసులను అందించిన ఈ కళాశాల భవిష్యత్తులో మరింత మంది విద్వాంసులను తయారు చేయనుంది....