BREAKING NEWS

ద్వారకా తిరుమల ప్రత్యేకత, ఆలయ విశేషాలు..!

ఆంధ్ర ప్రదేశ్ లో చూడదగ్గ ఆలయాల్లో ద్వారకా తిరుమల ఆలయం ఒకటి. ద్వారకా తిరుమల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం యొక్క పశ్చిమ గోదావరి జిల్లా లో ఒక గ్రామం. ఈ ఆలయాన్ని, ఆలయ గోపురాన్ని, ప్రాకారాలను నూజివీడు జమిందారు ధర్మా అప్పారావు కాలంలో కట్టించారు. స్థల పురాణం ప్రకారం ఈ ఆలయం రాముని తండ్రి దశరథ మహా రాజు కాలం నాటిది అని అంటారు. ద్వారకుడు అనే ఋషి తపస్సు చేసి స్వామి వారి పాద సేవను కోరారట. కనుక పాదములు పూజించే భాగ్యం అతడికి దక్కింది అని అంటుంటారు. అనేక ప్రాంతాల నుంచి ఈ ఆలయాని కి  భక్తులు వచ్చి దర్శించుకుంటారు.
 
ద్వారకా తిరుమల క్షేత్రం :
 
ఇది విజయవాడ నగరానికి 98 కిలోమీటర్ల దూరంలో, రాజమండ్రి కి 75 కిలో మీటర్ల దూరం లో ఉంది. ఇది భారత దేశం లో అత్యంత ప్రాచీన క్షేత్రంగా చెప్పబడింది. ఈ క్షేత్రం లో శేషాద్రి కొండ మీద కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఉంటారు. ఇక్కడ స్వయంభువుగా ప్రత్యక్షమైన వేంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుంచి వెతికి తీసిన ద్వారక అనే ముని పేరు మీదుగా ఈ ప్రదేశమునకు ద్వారక తిరుమల అని పేరు వచ్చింది. మరి అటువంటి మహిమ గల పుణ్య క్షేత్రం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా...?  మరి ఆలస్యం ఎందుకు పూర్తిగా చూసేయండి.
 
చిన్న తిరుపతి:
 
ద్వారకా తిరుమలనే చిన్న తిరుపతి అని అంటారు. ఆనాటి కాలం నుండి ఈ క్షేత్రం చిన్న తిరుపతిగా ప్రసిద్ధి గాంచింది. ద్వారకుడు ఉత్తరాభి ముఖుడై తపస్సు చేశాడట అందుకే ఆ మునికి ప్రత్యక్షమైన స్వామి దక్షిణాభిముఖుడై యున్నాడు. అయితే మూల విరాట్టు దక్షిణ ముఖంగా ఉండటం కూడా చాలా అరుదు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే..?  పెద్ద తిరుపతి లో ఉండే మొక్కుని చిన్న తిరుపతి లో తీసుకున్న అదే ఫలం లభిస్తుంది. కానీ చిన్న తిరుపతి లో మొక్కుని మాత్రం అక్కడే తీర్చుకోవాలి.
 
ద్వారకా తిరుమల లో కల్యాణోత్సవాలు: 
 
ఈ గుడికి ఉన్న సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏటా రెండు కల్యాణోత్సవాలు ఘనంగా జరుపుతారు. ఒకటి వైశాఖ మాసం లో మరొకటి ఆశ్వయుజ మాసం లో జరుపుతారు. దీనికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే..... స్వయం భూమూర్తి వైశాఖ మాసం లో దర్శనం ఇచ్చారని, సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వయుజ మాసం లో ప్రతిష్ఠించారు అని చెబుతారు. ఈ రెండు విగ్రహాలకు అనుకూలంగా రెండు కళ్యాణోత్సవాలు జరుపుతుంటారు. అత్యంత ఘనంగా జరిగే ఈ ఉత్సవాల్లో భక్తులు వేల సంఖ్యలో పాల్గొంటారు. దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకొంటారు.
 
గాలిగోపురాలు:
 
ఈ ఆలయానికి తూర్పు వైపున యాగశాల, వాహనశాల, మహా నివేదన శాల... పడమటి వైపున తిరువంట పడిపరికరాలశాల ఉన్నాయి. నాలుగు దిక్కులా నాలుగు గాలి గోపురాలు ఉన్నాయి అయితే వీటిలో పెద్దదైన దక్షిణ దిక్కు గాలి గోపురం ఐదు అంతస్తులది. ఇక్కడ పడమర వైపు తలనీలాలు సమర్పించుకునే కళ్యాణ కట్ట కూడా ఉంది. కళ్యాణ కట్ట వద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, ఒక నంది విగ్రహం కూడా ఉంది.
 
ఆలయాన్ని ఎలా చేరుకోవాలి?
 
 ద్వారకా తిరుమలకి రెండు విమానాశ్రయాల దగ్గర లో ఉన్నాయి. రాజమండ్రి విమానాశ్రయం 75 కిలో మీటర్లు అలానే మరొక విమానాశ్రయం అయిన విజయవాడ విమానాశ్రయం 92  కిలో మీటర్లు దూరం. ఈ రెండు విమానాశ్రయం నుండి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ నగరాలకు ప్రయాణం చేయవచ్చు. రైలు మార్గంవిషయానికి వస్తే.. ద్వారకా తిరుమల క్షేత్రానికి దగ్గర లో ఉన్న రైల్వే స్టేషన్ తాడేపల్లి గూడెం. ఇది నలభై ఏడు కిలోమీటర్ల దూరం లో ఉంది అలానే భీమడోలు లో కూడా పాసింజర్ ట్రైన్స్ ఆగుతాయి. ఇది  17 కిలో మీటర్ల దూరం లో ఉంది.
 
ఇక బస్సు మార్గం లో వచ్చే వాళ్ళు  విజయవాడ - రాజమండ్రి వెళ్లే మార్గం లో ఉన్న ద్వారకా తిరుమల క్షేత్రం, జిల్లా ప్రధాన కేంద్రం ఏలురుకు 41 కి. మీ. దూరం లో, భీమడోలుకు 17 కి. మీ. దూరం లో, తాడేపల్లి గూడెం కి 47 కి. మీ. దూరం లో ఉన్నది. కాబట్టి సులువుగా ఆలయాన్ని చేరుకో వచ్చు. 
 
సుదర్శన పుష్కరిణి:
 
గ్రామం పశ్చిమాన స్వామివారి పుష్కరిణి ఉంది. దీనిని సుదర్శన పుష్కరిణి అని అంటారు నరసింహ సాగర్, మణికుమార్ తీర్థం అని కూడా అంటారు. ఇక్కడ చక్ర తీర్ధము, రామ తీర్ధము అనే రెండు స్నాన ఘట్టాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ రాళ్ళ మీద సుదర్శన ఆకృతి ఉన్నందుకు మూలాన ఆ పేరు వచ్చింది. ఇదిలా ఉండగా ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తెప్పోత్సవం జరుపుతారు. ఈ ఉత్సవాలకు లక్షల మంది ప్రజలు చేరుతారు.