BREAKING NEWS

సంక్రాతి ప్రత్యేకం: సంక్రాంతి పండుగ గురించి ఎన్నో విషయాలు మీకోసం...!

సంక్రాంతి అంటేనే పెద్ద పండుగ. పెద్ద పండుగ అంటే కుటుంబమంతా కలిసి ఎంతో ఆనందంగా గడుపుతారు. ఎక్కడెక్కడో ఉండే వాళ్లు కూడా ఒక చోట ఏకమవుతారు. హిందువులు జరుపుకునే అనేక పండగల్లో దీనిని ప్రధాన పండుగగా మనం చెప్పుకోవచ్చు. ఈ పండగని ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు ఏకంగా  నాలుగు రోజుల పాటు దీనిని జరుపుకోవడం విశేషం.

కొత్త అల్లుడు ఇంటికి రావడం, కోడి పందాలు, హరిదాసులు, గంగిరెద్దులు, భోగి మంటలు.... అబ్బా..! ఊహించుకుంటేనే ఎంత బాగుందో కదా..?  మరి ఇలానే ఉంటుందండి ఈ పండుగ. మరి  ఈ పండుగ గురించి అనేక విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా...? మరి ఆలస్యం ఎందుకు పూర్తిగా చూసేయండి...
 
సంక్రాంతి పండుగని పట్టణాల్లో కంటే పల్లెల్లోనే బాగా జరుపుకుంటారు. రైతులందరికీ ఈ సమయంలో పంట చేతికొస్తుంది. ఈ సందర్భంగా చాలా మంది పాడి పశువులను పూజించడం కూడా జరుగుతుంది. ఇలా బంధు మిత్రుల తో కలిసి ఎంతో ఆనందంగా ఈ పండుగను చేసుకుంటారు. ఎవరి ఇల్లు చూసిన ఎంతో సందడిగా ఉంటుంది. మన అందరికీ మంచి అభ్యుదయాన్ని ఇచ్చు క్రాంతి కాబట్టే సంక్రాంతిగా దీనిని అంటారు.
 
భోగి పండుగ విశిష్టత, జరుపుకునే విధానం: 
 
సంక్రాంతి ముందు వచ్చేది భోగి. భోగి రోజున భోగి మంటల తో సందడి చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. పాత వస్తువుల్ని, గోవు పిడకలని వగైరా వాటిని  వేసి మంట పెడతారు. దీనితో ఈ భోగి పండుగ మొదలవుతుంది. చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోయడం కూడా ఆనవాయితీ. అయితే పురాణాల ప్రకారం ఈ రోజున బదరీ వనం లో శ్రీ మహా విష్ణువే పసి బాలుడుగా మారి దేవతలు బదరీ పండ్లు అంటే రేగు పండ్లు తో అభిషేకం చేసారు.

ఈ భోగి పళ్ళకి రేగు పళ్ళుగా రూపాంతరం చెందాయి అని అంటారు. ఈ రోజు చిన్న పిల్లలకు పూలు, రేగి పళ్ళు కలిపి భోగి పళ్ళు పోయడం వల్ల వారు ఏడాదంతా ఆయురారోగ్యాల తో ఉంటారని వారి నమ్మకం. అందుకే ఈ పద్ధతిని ఎన్నో ఏళ్ళ నుండి అనుసరించడం జరిగింది. అలానే ముగ్గులు వేసుకోవడం, గొబ్బెమ్మలు పెట్టుకోవడం లాంటివి జరుగుతాయి. పాటలు పాడుకోవడం, గొబ్బెమ్మల చుట్టూ తిరగడం, అందరినీ పిలిచి పేరంటం చేయడం.. ఇలా ఎవరి పద్ధతి ప్రకారం వాళ్ళు ఈ పండుగను జరుపుకుంటారు. 
 
సంక్రాతి పండుగ నాడు ఏం చెయ్యాలి...? 
 
ఇక పండగ లో రెండో రోజు సంక్రాంతి. మకర సంక్రాంతి సమయం లో సూర్యుడు మకర రాశి లోకి ప్రవేశిస్తాడు. ఇదే రోజున సూర్య భగవానుడు దక్షిణం నుండి ఉత్తరం లోకి రావడం వల్ల పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈరోజు మహా సందడిగా ఉంటుంది. ఉదయం నుండి రాత్రి వరకు అందరు కలిసి ఎంతో ఉల్లాసంగా గడుపుతారు. నిజంగా పెద్దలు కూడా పిల్లలుగా అన్నింటిలోనూ బహు సరదాగా ఉంటారు.

అంతే కాదండి ఈ సంక్రాంతి సమయం లో పండుగ అంతా పల్లెటూళ్ల లోనే కనబడుతుంది. ఉద్యోగులు, కూలీ పని చేసుకునే వాళ్లు, వలస వెళ్లిన వారంతా పట్నం వదలి పల్లెటూళ్లకి వెళ్లారు. సంక్రాంతి తమ కుటుంబం తో సరదాగా గడిపేందుకు స్వస్థలాలకు చేరుకుంటారు. దీనితో శోభతో వెలిగిపోతాయి పల్లెలు. ఇలా వెళ్లి ఏడాదికి సరిపోయే ఆనందాన్ని తీసుకెళ్తారు.
 
కోడిపందాలు, గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు ఇలా అన్నింటి తో కలిసి ఈ పండుగను జరుపుకుంటారు. కొత్త బట్టలు, పిండి వంటలు అబ్బో ఇలా అన్నింటి తో చక్కగా ఇంటిల్లిపాది   సందడి చేస్తారు. సంక్రాంతి అనే సరికి పల్లెకి వెళ్ళిపోతారు ప్రతీ ఒక్కరు. 
 
కనుమ, ముక్కనుమ: 
 
ఈ పండుగల్లో మూడో రోజు కనుమ పండగ. ఈ పండుగ సమయం లో పశువులను అలంకరించి పూజిస్తారు. ఇక నాలుగో రోజు అయితే ముక్కనుమగా వ్యవహరిస్తారు. ఈ రోజున కొన్ని ఊళ్ల లో కొత్తగా వివాహం చేసుకున్న యువతులు తమ సౌభాగ్యం కోసం బొమ్మల నోము, సావిత్రి గౌరీ నోము చేస్తారు. సంక్రాంతి రోజున అయితే పితృదేవతలు ఆత్మశాంతి కోసం వారి వారి సామర్థ్యం మేరకు దానధర్మాలు కూడా చేస్తారు. ముఖ్యంగా వంటల కోసం చెప్పుకునే తీరాలి. పిండి వంటల తో ఇంట్లో వాళ్లంతా సందడి చేస్తారు. సున్నుండలు, అరిసెలు, బొబ్బట్లు, జంతికలు,  పూతరేకులు ఇలా అనేక రకాల పిండి వంటలు చేస్తారు. 
 
సంక్రాంతికి పతంగులు:  
 
ఆకాశం లో ఎగిరే గాలి పటాలు గురించి చెప్పాలి. ఈ పండుగకు ప్రత్యేకంగా గాలి పటాలు తయారు చేసుకుని పెద్దలు కూడా పిల్లల్లాగే గాలి పటాల తో ఆడుతూ ఉంటారు. కొన్ని చోట్ల గాలి పటాలని తయారు చేయడం, గాలి పటాలని ఎగుర వేయడం పోటీలుగా కూడా నిర్వహిస్తారు. 
 
కోడిపందాలు: 
 
కోడి పందేలు, ఎడ్ల పందేలతో అందరిలో ఉత్సాహం మరెంత ఎక్కువవుతుంది. ఇక కోడి పందేలకు గోదావరి జిల్లాలకు పెట్టింది పేరు. ఈ పండుగ వేళ ఎక్కడెక్కడి నుండో వచ్చి ఇక్కడ కోడి పందాలను చూడటానికి వస్తుంటారు. ఇటువంటి పందాలు తెలుగు సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయి అనే చెప్పాలి.