BREAKING NEWS

వనజంగి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు...!

అందమైన ప్రకృతి మధ్య సరదాగా గడపడం ఎవరికి ఇష్టం ఉండదు. ఓ పక్క మంచు, మరో ప్రక్క పచ్చని చెట్లు, ఎత్తయిన కొండలు, సూర్యోదయం అబ్బా...!  చూడడానికి ఎంత బాగుంటుందో కదా....?  ఇటువంటి అద్భుతమైన ప్రదేశాలను చూడటానికి దేశ విదేశాలు వెళ్ళక్కర్లేదు.  పైగా పెద్దగా ఖర్చు కూడా మనం పెట్టక్కర్లేదు. ఇక్కడ ఉన్న ఈ ప్రదేశాన్ని చూస్తూ ఉంటే సమయమే తెలీదు. ఈ ప్రదేశాన్ని అద్భుతం అన్న కూడా తక్కువే.

అదేమిటి అసలు  ఈ ప్రదేశం ఎక్కడ ఉందా అని ఆలోచిస్తున్నారా...?  ఎక్కడో కాదండి మన  వనజంగి. ఇది విశాఖపట్నం జిల్లాలో ఉంది. చుట్టూ పల్లెటూర్లు... అందమైన ప్రకృతి అల్లుకుని ఎంతో అద్భుతంగా ఉంటుంది. గత కొన్ని నెలల నుంచి ఈ ప్రదేశం చాలా పాపులర్ అయిపోయింది. అనేక జిల్లాల నుంచి ప్రజలు చూడడానికి వస్తున్నారు. ఇక్కడ ఉన్న గ్రీనరీ, వాతావరణం బాగా ఆకట్టుకుంటోంది.
 
ఇప్పటి వరకు మన విశాఖపట్నం జిల్లా లో అరకు, లంబసింగి హిల్ స్టేష్టన్స్ మాత్రమే ఉన్నాయి. అయితే ఇప్పుడు వనజంగి కూడా వీటితో పాటు కలిసింది. అరకు, లంబసింగి ఎంతగా పాపులర్ అయ్యాయో అదే రీతి లో ఇప్పుడు మన  వనజంగి పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇటువంటి అద్భుతమైన పర్యావరణం తో కూడుకున్న ప్రదేశం గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారా...?  మరి ఆలస్యం ఎందుకు ఇప్పుడే వనజంగి గురించి చూసేయండి.
 
వనజంగి: 
 
వనజంగి పాడేరు కి ఆరు కిలో మీటర్ల దూరం లో ఉంది. ఇప్పుడు ఈ ప్రదేశం ప్రతి ఒక్కరి నోటా వినబడుతోంది. విశాఖపట్నం నుండి ఇది కేవలం మూడు గంటల ప్రయాణం. వనజంగి లో సూర్యోదయం చూడడానికి జనం క్యూ కడుతున్నారు. నిజంగా ఇక్కడ సూర్యోదయంని  తప్పక చూడాలి అన్నట్టు ప్రతి ఒక్కరూ వస్తున్నారు. అద్భుతమైన నీలి మేఘాలు ఆకాశం లో తేలుతూ ఉంటే... తూర్పు నుండి వచ్చిన సూర్య కిరణాలు అందమైన రంగుల తో ఆకాశానికి మరెంత అందాన్ని ఇస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఇప్పటికే ఈ గ్రామం లో ఉన్న ప్రజలు ఫెసిలిటీస్ ని ఒక్కొక్కటిగా తీసుకొస్తున్నారు. దీనితో పర్యాటకులకు ఎటువంటి ఇబ్బంది కూడా కలగదు. 
 
విశాఖపట్నం లో ఉన్న వనజంగి కి  ఎలా చేరుకోవాలి...? 
 
వంజంగిని  ఎలా చేరుకోవాలి అనే విషయానికి వస్తే.... పాడేరు నుంచి ఇది ఆరు కిలో మీటర్లు కాబట్టి పాడేరు వరకు వెళ్లి అక్కడ నుంచి వనజంగి కి వెళ్లొచ్చు. ఇక విశాఖపట్నం నుంచి అయితే వంద కిలో మీటర్ల దూరం లో ఉంది. అంటే మీరు ప్రయాణం చేయడానికి మూడు గంటలు పడుతుంది. విశాఖపట్నం నుంచి మీరు పాడేరు వెళితే అక్కడి నుంచి ఎంతో సులువుగా వెళ్ళిపోవచ్చు. అదే వనజంగి కి దగ్గర లో ఉన్న విమానాశ్రయం. సొంత వాహనాల ద్వారా కూడా ఎంతో సులువుగా అక్కడికి వెళ్లి పోవచ్చు. మరి ఇంకా ఏం ఆలోచిస్తున్నారు ఈ చలికాలం లో ఒక్క సారైనా వనజంగి వెళ్లిపోండి లేదంటే మీరు చాలా మిస్ అవుతారు.
 
నిజంగా వనజంగి  తక్కువ సమయం లోనే బాగా పాపులర్ అయిపోయింది. తాజాగా బయట పడిన ఈ ప్రదేశం కొన్ని రోజుల్లోనే పెద్ద పర్యాటక స్థలంగా మారి పోతోంది. రోజు రోజుకు ఇక్కడకు వచ్చే పర్యాటకులు కూడా బాగా ఎక్కువ అయిపోతున్నారు. ట్రెకింగ్ చేసుకోవడానికి కూడా ట్రెక్కర్స్  ఇక్కడికి వస్తున్నారు. ఏది ఏమైనా ఇది ఎంతో త్వరగా  పాపులర్ అయిపొయింది అని  మనం చెప్పవచ్చు.  
 
అందమైన ప్రకృతి నీ ఆస్వాదించాలంటే ఇక్కడికి చేరుకోవాల్సిందే. ఈ ప్రదేశాన్ని చూడడానికి మంచి సమయం ఏమిటి అనే విషయానికి వస్తే...  ఉదయం 5 గంటల 40 నిమిషాలకు సూర్యోదయం అవుతుంది. సూర్యోదయం  చూడడానికి తప్పకుండా వెళ్ళండి. రెండు హిల్స్ మధ్య నుంచి వచ్చే సూర్య కిరణాలు నిజంగా ఆకట్టుకుంటాయి. 20 నుంచి 30 నిమిషాల పాటు మేఘాలు కరగడం అబ్బా...!  పదాల్లో ఎంత వివరించిన కళ్ళకు కట్టినట్లు చూపించడం సాధ్యపడదు. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటుంది ఈ ప్రదేశం. గత కొన్ని నెలల నుంచి అనేక మంది ఈ ప్రాంతాన్ని దర్శిస్తున్నారు. 
 
కాలేజీ ట్రిప్స్ లాంటి వాటి కోసం కూడా దీనిని ప్రిఫర్ చేస్తున్నారు. అలానే ఇక్కడికి ఫోటోగ్రాఫర్లు కూడా వచ్చి అద్భుతమైన క్లిక్స్ ని తీసుకుంటున్నారు. గ్యాంగుల తో వచ్చి యువత ఇక్కడ సెల్ఫీ లతో చిందులేస్తారు. విపరీతంగా అవి సోషల్ మీడియా లో వైరల్ అయిపోతున్నాయి. వీటిని చూసిన వాళ్ళు ఎక్కడ ఉంది ఈ  ప్రదేశం...?  అని ప్రతి ఒక్కరూ అనుకోవడం... చూడడానికి వెళ్లడం చేస్తున్నారు... దీనిని మేఘ సముద్రం అని కూడా అంటున్నారు. చూసారా...! ఈ ప్రదేశం ఎంత అందంగా వుందో...? మరి మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో లేదా కుటుంబం తో ఒక ట్రిప్ వేసేయండి. ఈ వనజంగిని చూసేయండి.