BREAKING NEWS

'హెల్తీ' న్యూ ఇయర్…!

పిల్లలు బడికి పోలేదు...
అన్నకు కాలేజి లేదు...
నాన్నకి జాబ్ తిరిగి రాదు…
అమ్మ పొయ్యి వెలిగించలేదు…
ఇప్పుడు ఆ కుటుంబం… 
మొత్తం ఇంట్లోనే ఉంది.. సంతోషంతో కాదు
సగం ఆకలితో…
అలా ఒక్కరోజు కాదు… ఒక్కపూట కాదు...
కొన్ని నెలలు…రోజులు… ఘడియలు…
ఏ ఒక్కరో… ఎక్కడో కాదు...
కొన్ని జీవితాలు, కొన్ని కుటుంబాలు, 
కొన్ని రాష్ట్రాలు, కొన్ని దేశాలు… 
ఇలా ప్రపంచమంతా గడగడలాడిపోయింది.
తరచి చూస్తే అది '2021'… కరోనా కాలం…
ఆ సంవత్సరం..
ఎన్నో చేదు కరోనా జ్ఞాపకాల్ని, 
ఎన్నో చెడు లాక్ డౌన్ అనుభవాల్ని, 
చెరపలేని ఆసుపత్రి రోజుల్ని మిగిల్చింది.
ఇక ఈ రేపటి 2022లో అయిన...
ఓ కొన్ని ఆశలు
ఓ కొన్ని కలలతో...
ఓ కొంత సంతృప్తి
ఓ కొంత సాంత్వన దొరకాలనే కాక…
కొత్త వేరియెంట్లకు జడవకుండా…
మాస్కును మరవకుండా…
వ్యాక్సిన్ కు వెరవకుండా…
ఇమ్యూనిటికు తగ్గకుండా…
వైరస్ ను కట్టడి చేస్తూ...
ఓ వారియర్ లా నిలుస్తూ...
నిత్య ఆరోగ్యమస్తుగా
ఇంటిల్లిపాది వెలగాలని కోరుకుందాం. 
మరి న్యూ ఇయర్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది... మనం ఈరోజునే జరుపుకోవడానికి గల కారణమేంటి… అసలు మొదటి న్యూ ఇయర్ ఎప్పుడు జరిగిందిలాంటి ఆసక్తికర అంశాల గురుంచి ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం:

◆న్యూ ఇయర్ ఎప్పుడు జరుపుకున్నారంటే…
క్రీస్తు పూర్వం బాబిలోనియన్లు 4,000ల సంవత్సరాలకు మొట్టమొదటిసారిగా నూతన సంవత్సరాన్ని జరుపుకున్నట్లు చరిత్ర చెబుతోంది.
నిజానికి, రోమ్ చక్రవర్తి జూలియస్ సీజర్ జనవరి 1వ తేదీని జాతీయ సెలవుదినంగా ప్రకటించారు. 
తలుపులు, ద్వారాలకు సైతం రోమన్ దేవుడి జానస్ పేరునే పెట్టాడు. అతనికి రెండు ముఖాలున్నాయి. అవి ఒకటి వెనుకకు ఉంటే, మరొకటి ముందుకు ఉంటుంది. చెడు అలవాట్లను వదిలించుకొని, మంచిని అలవర్చుకోవాలనే తీర్మానాలు చేసే ఆచారం కూడా ఆ కాలం నుంచే పుట్టింది.

◆ 1582లో రోమన్ క్యాథలిక్ చర్చి స్వీకరించిన గ్రెగోరియన్ క్యాలెండర్ జనవరి 1న నూతన సంవత్సర రోజుగా రూపుదిద్దుకుంది. ఆ తరువాతే చాలా యూరోపియన్ దేశాలు క్రమంగా దీనిని అనుసరించాయి. స్కాట్లాండ్- 1660లో, జర్మనీ, డెన్మార్క్ లు- సుమారు 1700, ఇంగ్లాండ్- 1752లో, రష్యా- 1918లో జరుపుకున్నాయి.

◆ ముస్లిం క్యాలెండర్ సాధారణంగా ప్రతి సంవత్సరం 365 రోజులు కాకుండా, 354 రోజులు మాత్రమే ఉంటుంది, వీరికి కొత్త సంవత్సరం మొహర్రం నెలతో ప్రారంభమవ్వడం మనం చూస్తూనే ఉంటాం.

◆ చైనీస్ న్యూ ఇయర్... జనవరి 21 నుంచి ఫిబ్రవరి 20 మధ్య వచ్చే మొదటి అమావాస్యతో ప్రారంభమై నెలపాటు లాంఛనంగా జరిపే వేడుక. 

◆ ఇతర ఆసియా సంస్కృతులు సంవత్సరం మొత్తంలో వివిధ సమయాల్లో ఈరోజును జరుపుకుంటున్నాయి. 
◆ దక్షిణ భారత్ లో తమిళులు శీతాకాలపు అయనాంతంలో కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు.

◆ టిబెటన్లు ఫిబ్రవరిలో ఈరోజును కొత్త సంవత్సరంగా చేస్తారు. 

◆ థాయ్‌లాండ్‌లో ఈరోజు మార్చి లేదా ఏప్రిల్‌లో జరుపుతారు. 

◆ జపనీయులు జనవరి 1-3 తేదీలలో వరుసగా మూడు రోజులపాటు వేడుకలు చేసుకుంటారు.

◆ అనేక దేశాల్లో నూతన సంవత్సర వేడుకలు డిసెంబరు 31నే ప్రారంభమవుతాయి.
ఏయే దేశాల్లో ఎప్పుడు…

◆ పసిఫిక్‌ మహా సముద్రంలోని ‘సమోవా’ ద్వీపం... ప్రపంచంలోనే అందరికంటే ముందుగా 2022లోకి వెళ్లింది. భారత కాలమానం ప్రకారం 3.30 గంటలకే అక్కడ నూతన సంవత్సరం వచ్చేసింది. ఆ తరువాత టోంగా, కిరిబాటి దీవుల్లోనూ వచ్చేసింది.

◆ జపాన్ కూడా మూడున్నర గంటల ముందే 2022లోకి అడుగుపెడుతుంది. ఇదే సమయానికి దక్షిణ కొరియా, ఉత్తరకొరియా దేశాలు కూడా కొత్త ఏడాదిలోకి ప్రవేశించాయి. భారత్‌ పొరుగు దేశాలైన భూటాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌ మనకంటే 30 నిమిషాల ముందు కొత్త సంవత్సరంలోకి అడుగుమోపాయి.

◆ ఇక మన తర్వాత సుమారు నాలుగున్నర గంటల తరువాత అత్యధికంగా 43 దేశాలు ఒకేసారి కొత్త ఏడాదికి స్వాగతం పలికాయి. వాటిలో జర్మనీ, నార్వే, ఫ్రాన్స్‌, ఇటలీలాంటి ఐరోపా దేశాలతోపాటు కాంగో, అంగోలా, కామెరూన్‌ లాంటి ఇతర ఆఫ్రికా దేశాలు ఉన్నాయి.

◆ భారత్‌ తర్వాత అయిదున్నర గంటలకు ఇంగ్లండ్‌లో న్యూఇయర్‌ మొదలవుతుంది. 

◆ రష్యాలో నూతన సంవత్సర వేడుకలను రెండు సార్లు జరుపుకొంటారు. ఒకటి జనవరి 1న (కొత్త క్యాలెండర్‌ ప్రకారం అయితే), రెండోది జనవరి 14న (పాత జూలియన్‌ క్యాలెండర్‌ ప్రకారం) జరుగుతుంది.

◆ ఇక నూతన సంవత్సరాన్ని జనవరి 1న జరుపుకోని దేశాల్లో… మొదటగా చైనా, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్‌, వియత్నాంలు ఉన్నాయి. ఆయా దేశాల క్యాలెండర్ల ప్రకారం అక్కడ న్యూఇయర్‌ వేడుకలు జరుగుతాయి.

వేడుకలపై ఒమిక్రాన్ ఎఫెక్ట్‌..
గతేడాదిలాగే ఈసారి కూడా నూతన సంవత్సర వేడుకలపై కరోనా మహమ్మారి బుసకొడుతుంది. ఇటీవలే పుట్టుకొచ్చిన కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌.. ప్రపంచ దేశాలకు తగ్గని చలి వణుకును పుట్టిస్తోంది. దీంతో ఇప్పటికే అనేక దేశాలు మళ్లీ ఆంక్షల బాట పట్టాయి. కాబట్టి ఈసారి కూడా కొత్త సంవత్సరాన్ని నిరాడంబరంగానే ఆహ్వానించాల్సిన పరిస్థితి తలెత్తింది. పబ్బులు, క్లబ్బుల కాకుండా… ఇంటి సభ్యులతో కలిసి జరుపుకుంటూ… హెల్తీ గా ఉండేలా చూసుకుందాం.

Photo Gallery