BREAKING NEWS

స్వామియే….'అయ్యప్ప'

శరిగిరిశుడిగా, కాంతిమల, జ్యోతిస్వరూపుడిగా… ఇలా శబరిమలలో కొలువైన అయ్యప్పను ఎన్నో పేర్లతో పిలుస్తూ భక్తులు దర్శించుకుంటారు. ఎన్నో కఠోర దీక్ష నియమాలను పాటిస్తూ కాలినడకన అడవుల్లో నడుస్తూ దారి నడుమ "స్వామియే అయ్యప్పో… అయ్యప్పో స్వామియే" అంటూ శరణు కోరుతూ భక్తులు ఇరుముడిని స్వామికి సమర్పించుకుంటారు. సంవత్సరంలో ఒకసారి దర్శించుకునే పుణ్యక్షేత్రంగా రెండో స్థానంలో శబరిమల ఉంది.. ఇంకొన్ని విషయాలు అయ్యప్ప గురుంచి తెలుసుకుందాం...
 
శబరి అని పేరు రావడానికి కారణం...

ఒకరోజు తపస్సు చేసుకుంటున్న శబరిని చూసి "ఆనాడు నీ మోక్షానికి మెచ్చి భద్రాద్రిలో శ్రీరాముడిగా కొలువయ్యాను. ఇప్పుడు నీ అకుంఠిత దీక్షకు ఆనందించి, ముక్తిని ప్రసాదిస్తూ నీవు శబరిగిరిగాను, నేను శబరిగిరిశుడి గాను కీర్తించబడతాము. నన్ను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు శబరిగిరి అనే నీ నామము తలుచుకుంటారు" అని అయ్యప్ప వరమిస్తాడు.  
 
అయ్యప్ప అసలు కథ:-

మహిషి సోదరుడి మరణం తట్టుకోలేక బ్రహ్మా కోసం ఘోర తపస్సు చేస్తుంది. ఆమె తపస్సుకు మెచ్చి దేవుడు ఏం కావాలో కోరుకోమంటాడు. అందుకు మహిషి 'హరిహరులకు జన్మించిన బాలుడి చేతిలో నేను మరణం పొందేలా' వరం ఇవ్వమంటుంది. ఆ తర్వాత దేవతలను, ఋషులను భయభ్రాంతులకు గురిచేసేది. దాంతో అందరూ కలిసి విష్ణుమూర్తికి మొరపెట్టుకోగా, ఆయన స్త్రీమూర్తి అవతారమెత్తి, శంకరుడితో ఏకమవుతారు. అలా వాళ్లిద్దరికి ఒక శిశువు జన్మిస్తాడు. ఒకనాడు వేటకు వెళ్లిన రాజవంశీయుడైన పందల రాజుకి ఈ బాలుడు కనిపిస్తాడు. ఉత్తరా నక్షత్రములో పుట్టినవాడు. మెడలో దివ్యమైన మణిని ధరించడం వలన ఈయన్ని 'మణికంఠుడు' అని పిలుస్తారు. పెద్దయ్యాక గురుకులానికి పంపించి అన్ని విద్యలను నేర్పిస్తారు.

ఆ తర్వాత పందల రాజ్యంలో రాజుగా పట్టాభిషేకం చేయాలనుకుంటారు. కానీ అదే సమయంలో మణికంఠుడి తల్లి అనారోగ్యంతో బాధపడుతుండగా అందుకు ఆడపులి పాలు కావాలని చెబుతారు. అందుకు మణికంఠుడు అడవికి వెళతాడు. అక్కడ ఇంద్రుడు మణికంఠుడికి తన జన్మరహస్యం గురుంచి చెబుతాడు. దాంతో 12 ఏళ్ల వయసులో మహిషి రాక్షసిని సంహరిస్తాడు. ఆ తర్వాత ఇంద్రుడే పులిగా మారి మణికంఠుడుని తనపై మోస్తూ తల్లి దగ్గరకి తీసుకెళతాడు.
 
మణికంఠుడు అయ్యప్పగా ఎలా మారారంటే
● రాక్షసి సంహరణ తరువాత తపస్సు చేయడానికి మణికంఠుడు సిద్ధం అవుతాడు. అప్పుడు తల్లిదండ్రులు ఈయన్ని అయ్యా, అప్పా అని పిలవగా, ఆ మాటనే 'అయ్యప్ప'గా మార్చి ఇకపై తనను భక్తులు అయ్యప్పగా పిలిస్తే పలుకుతాను అని సంభోధిస్తాడు.

●విద్యలను నేర్పిన గురువు తనకు గురుదక్షణగా తన కుమారుడి లోపాలను సరి చేయాలని విన్నపించుకుంటాడు. అందుకు మణికంఠుడు ఆ బాలుడి దగ్గరికి వెళ్లి అతని తలపై చేయి పెట్టి ఆశీర్వదిస్తాడు. దాంతో ఆ బాలుడు ఆరోగ్యవంతుడవుతాడు. మణికంఠుడుని "స్వామి శరణం అయ్యప్ప శరణం" అని స్మరిస్తూ, భజనలు చేస్తాడు.
 
దీక్ష ఎలా తీసుకోవాలి..
అయ్యప్పస్వామి దీక్షను అయ్యప్ప ఆలయంలో గానీ, మరొక గుడిలో కానీ తీసుకోవచ్చు. 108 పూసలతో ఉన్న మాలను గురస్వాములతో లేదంటే ఆలయ అర్చకులతో వేయించుకుని దీక్షను చేపట్టాలి. దీక్ష పూర్తయ్యే వరకు మాలను తీయకూడదు. ప్రతిరోజు అయ్యప్ప ఆలయంతోపాటు ఇతర ఆలయాలను దర్శించుకోవాలి.
 
మండల దీక్ష అంటే ఏంటి? దీక్షను ఎలా తీసుకోవాలి..
41 రోజులు నియమ నిష్టలతో చేసే దీక్షను 'మండల దీక్ష' అంటారు. దీక్ష తీసుకునే ముందు నుంచి మద్యం, మంసహారాలు తీసుకోకూడదు. ఇల్లు శుభ్రం చేసుకోవాలి. దీక్ష తీసుకునే రోజు ఉదయాన్నే స్నానం చేసి, ఇంట్లో పూజ చేయాలి. తల్లిదండ్రులకు, పెద్దలకు పాదాభివందనం చేసి భార్య అనుమతితో దీక్ష తీసుకోవాలి. ఈ దీక్ష పూర్తయ్యాక ఇరుముడిని ధరించి శబరిమలై చేరి స్వామివారిని దర్శించుకుంటారు. ఇలా చేస్తే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.
 
ఇరుముడి అంటే..
ఇరుముడి అంటే రెండు ముడులు అని అర్థం. మొదటి ముడిలో అభిషేకం కోసం నెయ్యిని నింపిన కొబ్బరికాయ, మిగితావి పూజ సామాగ్రి ఉంటాయి. రెండవ ముడిలో మాల వేసుకున్న స్వామికి సంబంధించిన సామానులుంటాయి. ఒకవేళ ఇరుముడిని తలపై నుంచి తీయాలనుకుంటే శుచీశుభ్రత ఉన్న ప్రాంతంలో గురుస్వామి కిందికి దింపుతారు. శబరిమలై చేరి స్వామివారికి ఇరుముడి సమర్పిస్తారు.
 
దీక్ష నియమాలు, అలాగే నల్లటి వస్త్రాలను ధరించడానికి కారణాలు:-
ఒకానొక సమయంలో అయ్యప్ప, శని దేవుడితో "నీ ఏడేళ్ల కాలంలో అనుభవించే కష్టాలన్నీ ఒక సంవత్సరంలో 41 రోజులు నా భక్తులు అనుభవిస్తారు అని చెప్పాడు. అంతేకాదు కేవలం శాకాహారం మాత్రమే భుజిస్తారని, కటిక నేలపై శయనిస్తారని, ఉదయం, సాయంత్రాల్లో చల్లటి నీటితో స్నానం చేస్తారని, నల్లటి దుస్తులను ధరించి, పాదరక్షలు వీడుతారని, బాహ్య సౌందర్యానికి, అన్ని బంధాలకు దూరంగా ఉంటారని చెప్పాడు.

ఇకపై మాలను ధరించి భక్తి, శ్రద్ధలతో ఉంటూ దీక్ష నియమాలు పాటించే వారిని స్వామిగా పిలిపించుకుంటారు. కఠోరమైన బ్రహ్మచర్య వ్రతం పాటించి, 'స్వామియే శరణం అయ్యప్ప' అంటూ శరణు కోరుతూ కాలినడకన అడవుల వెంట నడిచి అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తులకు నీ(శని) పీడ పట్టారాదు. వారు ఎప్పుడూ సుఖసంతోషాలతో ఉండాలని" మణికంఠుడు శని దేవుణ్ణి ఒప్పించాడు.
 
అయ్యప్ప షట్ చక్రం;-

కామోపశమనం కైవల్యం, క్రోధనాశనం వేదభూషణం, లోభవర్జనం వైభవార్జనం, మోహమూర్ఛనం ముక్తిదాయకం, మద విమర్ధనం మహావిభూషణం, మాత్సర్య వారణం మణికంఠ సేవనం ఈ సూక్తి ప్రాచీన లిపిలో రాసి ఉంది. అయ్యప్ప ఈ షట్ చక్రాన్ని తన వెనుక భాగంలో ఉంచాడు. ముందు భాగంలో ఓం కారం నామం కనిపిస్తుంది.
 
స్వామి దర్శనానికి ముందు వావర్ ని దర్శించుకుంటారు. కారణం…..
శబరిమలై దర్శించుకోవడానికి ముందు ఇరుమలై అనే చిన్న పట్టణంలో ఆగుతారు. సుమారు 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ వావర్ మసీదుకు వెళ్తారు. ఎందుకంటే
అయ్యప్ప, వావర్ స్వామికి 'నన్ను దర్శించుకోవడానికి ముందే నా భక్తులు నీ దగ్గరికి వస్తారని' వరం ఇచ్చాడు. మాల వేసుకున్న స్వాములు మసీదులో ప్రదక్షిణలు చేసి, తమ ఆచారాల ప్రకారం పూజలు చేసి, నమాజు కూడా చేస్తారు. మసీదులో ప్రదక్షిణలు చేసే ఈ సంప్రదాయం గత 500 ఏళ్లకు పైగా ఉంది. శబరిమల ఆలయంతో, మసీదుకు ఉన్న సంబంధాలను చాటిచెప్పేలా మసీదు కమిటీ 'చందనకూడమ్' ఉత్సవాన్ని నిర్వహిస్తుంది.
 
ఇతరాంశాలు...

●స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని పంబా నదికి తీసుకెళతారు. ఇది ఏటా డిసెంబర్ 23న జరుగుతుంది. దీనిని 'ఆరట్టు' అంటారు.

●మణికంఠుడు 18 బాణాలు వదలడంతో 18 మెట్లుగా మారాయి. ఆ మెట్లపైనే అస్త్రాల దేవతలు అధిష్టించి భక్తుల పూజలు అందుకొని, నిష్టానియమాలు పాటించే వారి కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. అందుకే ఈ పూజను 'పడి పూజ' అంటారు. 

●సంక్రాంతినాడు తనకు ఆభరణాలు ధరించవచ్చని మణికంఠుడు తన తండ్రికి వరం ఇచ్చాడు. అలా మూడు రోజుల ముందుగా ప్రస్తుత పందాలదేశ రాజ కోట నుంచి ఆభరణాలు బయలుదేరుతాయి.

●మణికంఠుడు సంధించిన బాణం ఒక స్థలంలో గుచ్చుకుంది. అందుకే దానిని 'శరణు గుత్తి' అంటారు. మొదటిసారి మాల వేసుకున్న కన్నెస్వాములు ఇరుమేలు నుంచి తెచ్చిన నల్లదారం కట్టిన శరాలను ఆ శరణు గుత్తిలో గుచ్చుతారు. 

●మాలికపురోత్తమ అయ్యప్పను పెళ్లి చేసుకోమని అడగ్గా 'బ్రహ్మచర్యం పట్టిన నేను నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాను. ఏ సంవత్సరంలో నన్ను చూడటానికి కన్నెస్వాములు శబరిమలైకి రాకుండా ఉంటారో ఆ సంవత్సరం నిన్ను పెళ్లి చేసుకుంటాను' అని మణికంఠుడు మాట ఇస్తాడు. అలా ప్రతీ ఏటా మాలికపురోత్తమ ఏనుగునెక్కి అడగటానికి అయ్యప్ప దగ్గరికి వస్తుంది. 
 
● జగన్మోహిని అవతారంలో వెలసిన జగన్మోహిని కేశవ స్వామికి పూజలు చేసే అర్చకుడు, అయ్యప్ప స్వామి ప్రధాన అర్చకునిగా పూజలు నిర్వహించారు.