BREAKING NEWS

చలికాలంలో మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోండి…!

శీతాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల్లో… జలుబు, దగ్గులకు చోటున్నట్లే…. గుండె సంబంధిత జబ్బులకు ఆస్కారం వుంది. అవి ఒక్కోసారి ప్రాణాంతకం కావొచ్చు. పైగా కరోనా, ఒమిక్రాన్ లాంటి వేరియెంట్ల బెడద కూడా తోడైంది. కాబట్టి ఈ కాలంలో వయసు పైబడిన వారితో సహా కుటుంబంలో వారంతా జాగ్రత్త వహించాలి. మరి ముఖ్యంగా మహిళలు మరింత జాగ్రత్తపడాలి. ఎందుకంటే పురుషులతో పోలిస్తే మహిళల్లో వచ్చే గుండెపోటు లక్షణాలు భిన్నంగా ఉంటున్నాయి.
 
గుండె ఆరోగ్యం ఎలా దెబ్బ తింటుందంటే..

నిజానికి, గుండె ఆరోగ్యం ఎలా దెబ్బ తింటుందంటే… ఉన్నట్టుండి రోజువారి ఉష్ణోగ్రతలు ఆకస్మికంగా పడిపోవడం వల్ల గుండెకు ఇబ్బంది కలుగుతుంది. ఆ సమయంలో గుండె సంబంధిత రక్తనాళాలు చలికి కుంచించుకుపోయి శరీరానికి కావాల్సిన రక్త ప్రసరణను అందించడంలో అలస్యమవుతుంది. దీంతో శరీరానికి అవసరమయ్యే రక్తం, ఆక్సిజన్‌ను పంప్ చేయడానికి గుండె చాలా కష్టపడాల్సి ఉంటుంది. కాబట్టి అదనంగా పని చేయడానికి గుండెకు ఎక్కువ ఆక్సిజన్ అవసరం. ఇది మరీ ముఖ్యంగా 65 ఏళ్లు పైబడిన వారిలో, మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారిలో ముప్పు తెచ్చే ప్రమాదం ఉంది. 

ఒక వ్యక్తి రోజువారీ పనులను చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కలగొచ్చు. పైగా ఒక్కోసారి శరీర ఉష్ణోగ్రత 95 డిగ్రీల కంటే తక్కువగా పడిపోయినప్పుడు, అల్పోష్ణస్థితికి దారి తీస్తుంది. అంటే, దీనర్థం శరీర ఉష్ణోగ్రతల్లో అతి ప్రమాదకరమైన తగ్గుదలగా మనం భావించొచ్చు. ఇది గుండె కండరాలపై ప్రభావం చూపుతుంది, ఆపై ప్రాణాంతకం కావచ్చు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని కొందరి వైద్యులు హెచ్చరిస్తున్నారు. కావున కనీస జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అవి:
 
ఇంట్లోనే ఉండండి... 

ఉదయం, సాయంత్రం ఇంట్లోకి చల్లని గాలి రానివ్వకుండా చూసుకోండి. వీలైనంతమేర ఇంట్లోనే ఉండటానికి ప్రయత్నించండి. చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఉదయాన్నే వ్యాయామం, ఎక్సర్సైజ్ లవి చేయవద్దు. దానికి బదులు ఇండోర్ వ్యాయామం చేసుకోవడం ఉత్తమం. 
ఇంట్లో పరిసరాలను ఎప్పుడు వేడిగా ఉండేట్టు వల్ల కూడా చలిని దూరం చేయొచ్చు. అందుకు కిటికీలు, తలుపులను ఎప్పటికప్పుడు మూసి ఉంచాలి. ఒంట్లో వేడి కోసం ఉన్నితో చేసిన స్వేట్టర్లు, టోపీలు, చేతి తొడుగులను వేసుకోవాలి. 
 
బీపిను చెక్ చేసుకుంటూ ఉండండి

గుండెపోటుకు కారణం అధిక రక్తపోటే! కాబట్టి బీపిని రోజూ చెక్ చేసుకోవడం మంచిది. ధూమపానం, ఆల్కహాల్ లను దరి చేరనివ్వకండి. ధూమపానం అథెరోస్క్లెరోసిస్‌కు కారణమయ్యేలా చేస్తుంది. ఇది అధిక రక్తపోటుకు గురై, గుండెవైపు వెళ్లే ఆక్సిజన్ ప్రవాహాన్ని నిదానిస్తుంది. ఇక ఆల్కహాల్ చర్మంలోని రక్తనాళాల విస్తరణకు దారితీస్తుంది. ఆపై అవయవాల పనితీరుపై ప్రభావం చూపెడుతోంది. కాబట్టి ఈ రెండింటికి ఆస్కారం లేకుండా చూసుకోవాలి.
 
ఒత్తిడిని చిత్తు చేయండి 

అధిక ఒత్తిడి కూడా గుండెపై ప్రభావం చూపుతుంది. కావున నిత్యం యోగా, ధ్యానంలాంటివి ప్రాక్టీస్ చేయండి, రోజులో భాగం చేయండి. కుటుంబంతో వీలైనంతసేపు సరదాగా గడపండి. మీకు నచ్చిన చిన్న చిన్న పనులను చేసేయండి. దీంతో మీ శరీరం ఎల్లప్పుడూ అలసటకు గురి కాదు. ఉత్సాహంగా ఉంటుంది. కావున ఒత్తిడిని ఎంచక్కా జయించొచ్చు. 
 
ఆహారంలో మార్పు: రోజూ తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్థాలను తగ్గించుకోవటం ముఖ్యం. మాంసాహారులైతే అప్పుడప్పుడు మాంసానికి బదులుగా చిక్కుళ్లు తినొచ్చు. వీటితో కొలెస్ట్రాల్ లేకుండానే మంచి ప్రొటీన్‌ లభిస్తుంది. వేపుళ్లు సైతం కాస్త తగ్గిస్తే మేలు. వనస్పతికి దూరంగా ఉంటే ఇంకా మంచిది. అలాగే బాగా పాలిష్‌ చేసిన బియ్యంకన్నా దంపుడు బియ్యాన్ని స్వీకరించొచ్చు. రకరకాల కూరగాయలు, పండ్లను రోజూ వారీగా తినొచ్చు. 
 
గుండె వేగాన్ని పెంచే వ్యాయామాలివి

రోజులో పది నిమిషాలపాటు ఇంటి చుట్టుపక్కల్లో కాస్త వేగంగా నడవొచ్చు. వీలుంటే ట్రెడ్‌మిల్‌ మీద నడవాలి. ఎలాంటి వ్యాయామ పరికరాలు లేవని, చేయలేనని బాధపడాల్సిన పనిలేదు. ఉన్నచోటే చిన్న చిన్న కదలికలతో… చేతులు, కాళ్లను ఫ్రీగా ఆడిస్తూ ఉండాలి. దీంతో శారీరక ఆరోగ్యం మెరుగవుతుంది. 
 
ఆరోగ్య సూచికలపై అవగాహన

గుండె పనితీరును శరీరతత్వమే చెప్తుంది. వీటిని గుర్తించే నేర్పే మనకు కావాలి. ఇందుకోసం కొన్ని సూచికలు/ పరిమాణాల గురించి కొంత తెలుసుకొని ఉండటం మంచిది. 

బీఎంఐ- శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి(బాడీ మాస్ ఇండెక్స్) ఎంతుందో సరి చూసుకోండి. ఇది కనీసం 18.5 నుంచి 25 మధ్యలోనే ఉండాలి. పెరిగితే జాగ్రత్త పడాల్సిందే సుమా! 

బీపీ- సాధారణ రక్తపోటు 120/80 కన్నా తక్కువగానే ఉండాలి. 
రక్తంలో మొత్తం కొలెస్ట్రాల్‌ సంఖ్య 200 ఎంజీ/డీఎల్‌ కన్నా మించకూడదు. 
ఇక పరగడుపున, అంటే ఉదయంపూట రక్తంలో గ్లూకోజు స్థాయి 100 ఎంజీ/డీఎల్‌ కన్నా తక్కువగా ఉండాలి. 

అయితే ఇవి అందరిలో ఒకేలా ఉండాలనేమీ లేదు. వయసు, ఇతరత్రా వ్యాధులు, వంశపారంపర్యంగా వచ్చే స్వభావాలు… వంటివన్నీ వీటిపై ఆధారపడి ఉంటాయి కాబట్టి కాస్త అటుఇటు తేడా చూపొచ్చు. అటువంటప్పుడు ఒకసారి వైద్యుల్ని సంప్రదించి ఆయా సూచికల సంఖ్యలు ఎంత మోతాదులో ఉండాలో తెలుసుకొని, దానికి తగ్గట్టుగా నడచుకోవాలి.

చివరగా ఎల్లప్పుడూ… మంచి ఆలోచనలతో… సంతోషకరమైన వార్తలు వింటూ, వినిపిస్తూ... పాజిటివ్ దృక్పథంతో ఆలోచిస్తే మీ గుండె హెల్తీగా ఉంటుంది.