BREAKING NEWS

కేంద్ర సాహిత్య పురస్కారాలు పొందిన తెలుగు వారు

ఎన్నో కథలు ఎన్నో పాటలు, ఎన్నో పుస్తకాలు,.... నిత్య జీవితంలో ఎదురైనా సంఘటనలు, ఎన్నో జ్ఞాపకాలు, ఇలా మరెన్నో... ప్రజలను కదిలిస్తూ స్పూర్తినందించే సాహిత్యాలకు కేంద్ర  ప్రభుత్వం పురస్కారాలతో గౌరవించింది. అలాంటి అవార్డులకు పోటీపడిన వారిలో మన తెలుగు వారు ఉండడమే కాదు... పురస్కారాలను అందుకున్నారు. వారి గురుంచి...  
 
కేంద్ర సాహిత్య అకాడమీ:- కేంద్ర సాహిత్య అకాడమీని 1954 మార్చి 12న దిల్లిలో ప్రారంభించారు. దీనిపూర్తి బాధ్యత మొత్తం ప్రభుత్వం చూసుకుంటుంది. మన రాజ్యాంగంలో గుర్తించిన 22భాషల్లో కృషి చేసిన సాహితీవేత్తలకు, రచయితలకు, కవులకు ఈ ప్రోత్సాహకాలు అందజేస్తారు. ఈ పురస్కారంతో పాటు లక్ష రూపాయల నగదును బహుకరిస్తున్నారు.

పురస్కారాలు:-                               
కేంద్ర సాహిత్యఅకాడమీ వివిధ కేటగిరిల్లో పురస్కారాలను అందిస్తుంది. అవి భాషా సమాన్ పురస్కారం , అనువాద బహుమతి పురస్కారం, బాల సాహిత్య పురస్కారం, యువ పురస్కారం.

భాషా సమ్మాన్ పురస్కారం:- 1996లో రాజ్యాంగం గుర్తించని అనేక భాషల్లో సాహిత్యం కోసం కృషిచేసిన వారికి ‘భాషా సమ్మాన్ పురస్కారం’ అందజేస్తారు. దీనితోపాటు లక్ష రూపాయల నగదును బహుకరిస్తున్నారు.

అనువాద బహుమతి:- ఈ పురస్కారాన్ని 1989 నుంచి 24 భాషల్లో అనువాద సాహితీవేత్తలకు దీనిని అందజేస్తున్నారు. 50వేల రూపాయల నగదును ఇస్తున్నారు. 

బాల సాహిత్య పురస్కారం:- బాలసాహిత్యం కొరకు గుర్తించిన భాషల్లో కృషిచేసిన వారికి ఈ బాల సాహిత్య పురస్కారాన్ని అందజేస్తున్నారు.
యువ పురస్కారం:- యువతకు సాహిత్యం పట్ల మక్కువను పెంచడానికి ఈ యువ పురస్కారం ఇవ్వనున్నారు. కనీసం 35 సంవత్సరాలలోపు వయసున్న వారికి దీనిని బహుకరిస్తారు.

పలు భాషల్లో:- 1955లో ఈ పురస్కారాలు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతోపాటు బెంగాలీ, గుజరాతీ, ఆంగ్లం, అస్సామీ, డోగ్రి, కాశ్మీరీ, మరాఠీ, కొంకణి, మైథిలి, నేపాలీ, ఒరియా, మీటీ, పంజాబీ, రాజస్థానీ,మణిపురి, సంస్కృతం, సింధీ, ఉర్దూ...లాంటి పలు భాషల్లో అందజేస్తారు.
ఈ సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడమీ పోటిలో 20భాషల నుంచి పాల్గొన్న వారిలో మన తెలుగువాడైన గోరేటి వెంకన్న, యువ పురస్కారంలో తగుళ్ల గోపాల్, బాల సాహిత్య అవార్డుకు దేవరాజు మహారాజు ఎంపికయ్యారు.

గోరేటి వెంకన్న:- గోరేటి వెంకన్న 2021 తెలుగులో ‘వల్లంకి తాళం’అనే సాహిత్యానికి కేంద్ర సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు.     
గోరేటి వెంకన్న గురుంచి..
గోరటి వెంకన్న1963లో నాగర్‌కర్నూల్ జిల్లా, గౌరారం (తెల్కపల్లి) గ్రామంలో జన్మించారు.
తండ్రి నర్శింహ, తల్లి ఈరమ్మ. ఈయనకు ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు.
వెంకన్న ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగులో ఎంఏ పట్టా పొందారు. ఇప్పుడు ఏఆర్‌ సబ్‌ డివిజనల్‌ కో ఆపరేటివ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.

సాహిత్యంపైన మక్కువ
వెంకన్నకు చిన్నప్పటి నుంచీ పాటల రాయడమంటే ఇష్టం. కానీ సినిమా పాటల అంటే పెద్దగా నచ్చేవికాదు. అలా ఈయనలోని ఆసక్తిని గమనించిన వెంకటరెడ్డి మాస్టారు కొన్ని పాటల పుస్తకాలను బహుమతిగా ఇచ్చేవారు.1984లో రైతుల సమస్యలపై రాసిన ‘నీ పాట ఏమాయెరో నీ మాట ఏమాయెరో’ అనే పాటకు మంచి పేరు వచ్చింది. అంతేకాదు కమ్యూనిస్టు ఉద్యమాల్లో పాలుపంచుకునేవారు. ఈయన పాటలు, పుస్తకాలు రాసేవారు.

ఇతరంశాలు:-
నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక అంశాల మీద సంత, కొంగ, తుమ్మచెట్టులాంటి పాటలు రాసారు.
రేల పూతలు, ఏకనాథం మోత, పూసిన పున్నమి, అల చంద్రవంక, వల్లంకితాళం, ద వేవ్‌ ఆఫ్‌ ద క్రిసెంట్‌ అనే పుస్తకాలు రాశారు.
‘జై భోలో జై భోలో అమరవీరులకు జై భోలో’, ‘పల్లె కన్నీరు పెడుతోంది’ లాంటి  సినిమా పాటలను రాశాడు.

పురస్కారాలు, పదవులు...
కబీర్‌ సమ్మాన్‌, కాళోజీ, సినారే, లోకనాయక్‌, అరుణసాగర్‌, హంస అవార్డులను,
అధికార భాషా సంఘం పురస్కారాలను గోరటి వెంకన్న పొందారు.
ఈయన 2020 నవంబరులో శాసనమండలి సభ్యుడిగా (గవర్నర్ కోటా) ఎంపికయ్యారు.
2021లో కవితా విభాగంలో గోరేటి వెంకన్నకు కేంద్ర సాహిత్య పురస్కారం వరించింది. దీనితోపాటు లక్ష రూపాయల నగదును అందజేశారు.
 
తగుళ్ల గోపాల్:- ఈయన రచించిన ‘దండకడియం’  అనే కవితాసంపుటికి సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది.
తగుళ్ల గోపాల్ గురుంచి....
ఈయన తల్లి ఎల్లమ్మ, తండ్రి కృష్ణయ్య. గోపాల్ తెలుగులో ఎంఏ పూర్తి చేశారు. ఆ తర్వాత ఇప్పుడు నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం అజిలాపూర్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా  పనిచేస్తున్నారు.

ఇతరంశాలు:-
బాల్యం నుంచి కవితలు రాసేవారు. చిన్నప్పుడు తన అక్క ఆత్మహత్య చేసుకొని చనిపోవడంతో ఆ బాధను “ఎక్కడి  నుంచో రేగుపండ్ల వాసన... వచ్చేది మా హంస అక్కాయి ఉంటుంది” అని రాసి తన అక్క మీద ఉన్న ప్రేమను చూపించారు.
తన ఊరిలో తాను చూసిన కష్టసుఖాలు, శ్రామికుల జీవన విధానాలు, ఈయన పొందిన జ్ఞాపకాలు అన్నింటిని కలిపి “దండ కడియం” అనే పుస్తకంగా రాశారు. 

పురస్కారాలు:-
రాష్ట్ర సాహితీ పురస్కారం, మహబూబ్‌నగర్‌ సాహితీ అవార్డు, రాయలసీమ సాహితీ పురస్కారం, రొట్టెమాకురేవు సాహితీ అవార్డులను తగేళ్ల గోపాల్ అందుకున్నారు. 

దేవరాజు:- దేవరాజు మహారాజు రాసిన  ‘నేను అంటే ఎవరు’ అనే పుస్తకానికి బాల సాహిత్య  పురస్కారంవరించింది.
దేవరాజు గురుంచి...
దేవరాజు 1951 ఫిబ్రవరి 21న వరంగల్‌ జిల్లా కోడూరు లో జన్మించారు.
పీజీ చదువుతున్నప్పుడే ‘పాలు ఎర్రబడ్డాయి’ అనే కవిత రాశారు. ఆ తర్వాత తెలంగాణ మాండలికంలో ‘గుండె గుడిసె’ను రచించారు. అలా భారతీయ వారసత్వం, సంస్కృతి, విజ్ఞాన నాగరికతలు ఉండేలా రాశారు. వీటితోపాటు రాజముద్ర, మధుశాల, నీకూ నాకూ మధ్య ఓ రంగుల నది లాంటి పలు రచనలు రచించారు.
ఆధునిక, వైజ్ఞానిక పరమైన అంశాల గురించి వివరిస్తూ ‘నేను అంటే ఎవరు?’ అనే పుస్తకాన్ని రాసారు.

గౌరవాలు.. 
1991లో ‘గాయపడ్డ ఉదయం’ వచన కవితకు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి పురస్కారం అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉగాది సత్కారం, దాశరథి దంపతుల సత్కారం, తొలి ఎక్స్‌రే పురస్కారం, సురమౌళి అవార్డు వంటివెన్నో అందుకున్నారు.