BREAKING NEWS

ఇలా చేస్తే 'కేశాలు' పదిలం

సాధారణంగా ఈరోజుల్లో అమ్మాయిలైన, అబ్బాయిలైన అందం విషయంలో ఎక్కువగా హెయిర్ కే ప్రాధాన్యతనిస్తారు. చూడగానే ఎవరినైనా ముందుగా ఆకర్షించేది వారి అందమైన జుత్తే! మందమైన, దృఢమైన కుదుళ్ల కోసం విశ్వప్రయత్నాలు చేసే ఉంటారు. ఈ షాంపూ అని, ఆ ఆయిల్ అని... అన్ని రకాలుగా ప్రయత్నించి విసుగెత్తిపోయి ఉంటారు. దీనికి తోడు ఎటు చూసినా కాలుష్యం... జుత్తు ఆ వేడిని, తీవ్రతను భరించలేక కురుల చివర్లు పాడై, ఫలితంగా పెరుగుదల ఆగిపోయేలా చేస్తుంది. నిజానికైతే, పొడవైన జుత్తు కావాలని అందరికీ ఉంటుంది. కానీ సరిగా పట్టించుకోకుంటే… ఉన్న జుత్తు కూడా ఊడిపోతుందన్నమాట! ఇక ఇప్పుడైతే… వాడే శాంపులకు, రాసే నూనెలకు…బయట పొల్యూషన్ కు… 20 ఏళ్లకే తెల్ల జుత్తు… 30 ఏళ్లకే బట్టతల…
వచ్చేస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే...
అందుకు మొదటగా కేశాలకి దృఢత్వం రావాలి. సరైన పోషకాలు అందాలి. ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడు కుదుళ్ల మొదలు నుంచి… ఎదుగుదల సాధ్యపడుతుంది. ఇందుకోసం మీరు
కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ… చిట్కాలు ఫాలో అయితే మీ కేశాలు పదికాలాలపాటు పట్టులా ఉంటాయి. మరవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...
 
పొడవైన జుత్తు కావాలనుకున్నప్పుడు...
◆ నిత్యం క్రమం తప్పకుండా తలపై నూనెతో మసాజ్ చేయండి. మీ జుత్తు కుదుళ్లను పటిష్ఠం చేయడానికి వారానికి కనీసం రెండుసార్లైన నూనె రాసుకోవాలి. 
◆ జుత్తు చివర్లను ప్రతి 2- 3 నెలలకోసారి సమానంగా కత్తిరించండి. 
◆ తగినంత నిద్ర లేకపోతే కూడా ఒత్తిడి, చిరాకు అనిపిస్తుంది. దీంతో స్ట్రెస్ ఎక్కువై జుత్తు రాలడానికి దారి తీయొచ్చు. రోజులో కనీసం 7 నుంచి 8 గంటలు హాయిగా నిద్రపోండి. దీనివల్ల జుత్తు చిట్లడం వంటి సమస్య తగ్గుతుంది. 
 
పట్టులాంటి జుత్తు కోసం.. 
వర్షాకాలంలో జుత్తు పొడిబారి గడ్డిలా మారడం మనలో చాలామందికి అనుభవమే! అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందాలంటే 
కొన్ని ఎర్ర(ఆరెంజ్) గుమ్మడికాయ ముక్కల్ని తీసుకొని, అందులో రెండు టీస్పూన్ల తేనె వేసి పేస్టులాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్లవరకు అప్లై చేసుకోవాలి. 
పడుకునే ముందు షవర్‌ క్యాప్‌ పెట్టుకొని... ఉదయాన్నే గాఢత తక్కువున్న షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా తరచూ చేస్తుంటే గడ్డిలా మారిన జుత్తు కాస్త పట్టులా తయారవుతుంది.
 
ఎలాంటి ఆహారం తీసుకోవాలి...
మీ ఆహారపు అలవాట్లు మీ జుత్తు ఆరోగ్యాన్ని పరోక్షంగా ప్రభావితం చేస్తాయి. 
జుత్తు పొడవు పెరగటానికి పాలు, ఆకుకూరలు, క్యారెట్, బీన్స్, జీడిపప్పు, ఎండుద్రాక్ష, బాదం 
వంటివి రోజులో భాగం చేసుకోవాలి. 
అలాగే సీజనల్ పండ్లు… ఆపిల్, ఆరెంజ్, దానిమ్మ, బెర్రీ, అవకాడో, అరటి, చిలగడదుంపలాంటి పండ్లను తీసుకోవాలి. 
◆ మీరు మాంసాహారులైతే గుడ్లు, చేపలకు ప్రాధ్యాన్యమివ్వండి. 
◆ వీటన్నిటితో పాటు రోజు నీరు ఎక్కువగా తాగాలి. 
 
అందమైన జుత్తుకు 'జ్యూసు'లేప్లసు!
సాధారణంగా సీజనల్ పండ్లతో పండ్ల రసాలను తాగొచ్చు. పండ్లరసంతో పాటు జ్యూస్ గా తీయగా వచ్చిన పండ్ల గుజ్జును కూడా జుత్తుకు అప్లై చేయడం వల్ల ఆరోగ్యంగా, బలంగా పెరగడానికి సాయపడుతుంది. అంతేకాదు కురులకు మంచి మెరుపు వస్తుంది. మందపాటి జుత్తు పొందాలంటే వివిధ రకాల పద్ధతులను పాటించాలి. వాటిలో కొన్ని హెయిర్ బ్రేకేజ్, పొడి జుట్టును రాకుండా చూసుకుంటాయి. మరికొన్ని తలలో రక్తప్రసరణకు బాగా సాయపడతాయి. తలలో చుండ్రును నివారిస్తుంది. కొన్ని రకాల పండ్లు, వెజిటేబుల్ జ్యూసులను తాగినప్పుడు మన 
శరీరంలో అతి త్వరగా కొన్ని పోషకాలు చేరతాయి. అయితే మీరు తీసుకొనే జ్యూసులు తాజా పండ్లు, కూరగాయలతో తయారు చేసినవై ఉండాలి.
 
మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ కన్నాఇంట్లో చిట్కాలు మేలు!
చాలామంది ఫ్యాషన్ పేరుతో తలకు నూనె అప్లై చేయరు. దానివల్ల తలలో చర్మం పొడిబారి చుండ్రు, జుత్తు రాలే సమస్యలు వస్తాయి. అందుకే వారానికి రెండు సార్లయినా నూనె అప్లై చేయాలి. కోడిగుడ్డు లోని పచ్చ సొనతో జుట్టును అందంగా మార్చుకోవచ్చు. కొన్నిసార్లు జుత్తు మధ్యలో చిట్లిపోవడం, ఎక్కువ మొత్తంలో ఊడిపోవడం జరుగుతుంది. ఈ కారణంగా కురుల పెరుగుదల 
ఆగిపోతుంది. పచ్చసొనలో ఉన్న లుటిన్ జుత్తును బలపరచి, ఆపై ఊడిపోకుండా కాపాడుతుంది.
 
ఒత్తైన జుత్తు కోసంచేయకూడనివి
నల్లని, ఒత్తైన కురులకోసం మంచి ఆహారం తీసుకుంటే మాత్రమే సరిపోదు. 
మీరు మీ జుత్తు ఆరోగ్యం గురించి నిజంగా శ్రద్ధ వహిస్తే, మీరు మీ జీవనశైలిలో కూడా ఈ మార్పులు చేయాలి. 
మద్యం సేవించవద్దు, అతి తీపి పదార్థాలను తినకూడదు. సోడిక్ పానీయాలు తాగొద్దు. 
ఎక్కువగా ఆయిల్ ఫుడ్ తీసుకోకూడదు. 
తక్కువ గాఢత కలిగిన షాంపూతో తలస్నానం చేశాక, పూర్తిగా ఆరనివ్వండి. 
అధిక గాఢత కలిగిన షాంపూతో చేయడం వల్ల జుత్తు పొడిబారి, జీవం లేకుండా అవుతుంది. 
 
ఆరబెట్టుకోండి..
వర్షాకాలంలో తడిసిన జుత్తును సరిగ్గా ఆరబెట్టుకోకపోతే జలుబు చేస్తుంది. అంతేనా తలలోని బ్యాక్టీరియా, ఇతర ఇన్ఫెక్షన్లు త్వరగా వ్యాపిస్తాయి. అలా జరిగితే చుండ్రు, 
జుత్తు రాలిపోవడం వంటివి దారి తీస్తాయి. 
ఇలా కాకుండా ఉండాలంటే మీరు తలస్నానం చేసిన తర్వాత కురులను సహజంగా టవల్‌తో తుడుచుకొని ఆరబెట్టుకోవాలి లేదా బ్లో డ్రయర్‌ని చాలా తక్కువ లెవల్‌లో ఉపయోగించి ఆరబెట్టుకోవడం లాంటివి చేయొచ్చు.
 
జుత్తు బలహీనపడటానికి గల కారణాలేంటి
జీన్స్ వల్ల, ఆహారంలో పోషక లోపం, మానసిక ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, వాతావరణంలో మార్పు, జుత్తు మీద రకరకాల ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం లేదా తీరొక్క హెయిర్ స్టైల్స్ ను చేయించుకోవడం… ఇవన్నీ జుత్తును బలహీనపరిచే అంశాలే. పైన తెలిపిన జాగ్రత్తలు పాటిస్తూ… మీ కేశాల్ని కాపాడుకోండి.