BREAKING NEWS

నేను ఒమిక్రాన్… మీరు ఇవి... పాటిస్తున్నారా? లేదా?!

కరోనా కోరలు చాచి ఏడాదికో రకం వేరియెంట్లతో మనల్ని ప్రాణభయుల్ని చేస్తోంది. ఏ కాస్త నిర్లక్ష్యం వహించినా ప్రాణాలకు నో గ్యారంటీ! ఓవైపు డోసుల లెక్కన వ్యాక్సిన్ లు వేయించుకున్నా… వ్యాప్తి మాత్రం తగ్గట్లేదు. మాస్కులు, శానిటైజర్ల వాడకం పెరిగినా, కరోనా ముప్పు మాత్రం తప్పట్లేదు. 

ఇందుకు కోవిడ్ టెస్ట్ చేయించుకున్న, లేకున్నా... హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ… తగిన జాగ్రత్తలు పాటిస్తూ… ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకున్నవారే ఈరోజు కరోనాయోధులుగా నిలుస్తున్నారు. పైగా ఇప్పుడు పండగల కాలం… సంక్రాంతి అంటేనే… పల్లె పండుగ… భోగి, మకర సంక్రాంతి, కనుమ అంటూ మూడు రోజులు జరుపుకునే ముచ్చటైన పండుగ.

అటువంటి పండుగకు ఊర్లో చిన్నా, పెద్దా అంతా ఒకచోట చేరతారు. ఎంతమంచి సందర్భం అనుకున్నా… ఒమిక్రాన్ ఎటు నుంచి పొంచి వస్తుందో తెలియడం లేదు. ఇందుకు 'మాస్కే శ్రీరామ రక్ష' అంటూ, దగ్గరి అనుబంధాన్ని దూరంగా పాటిస్తూ ఉండటం తప్ప చేసేదేం లేదు. ఈ కారణంగా ప్రభుత్వం తాజాగా కొన్ని ఆరోగ్య మార్గదర్శకాల్ని విడుదల చేసింది. అవేంటో చూసేద్దాం, జాగ్రత్త పడదాం:
 
కరోనా సోకినవారు...

◆ కరోనా సోకినవారు కుటుంబంలోని మిగతా సభ్యుల నుంచి తప్పకుండా ఐసోలేషన్ లో ఉండాలి.

◆ గాలి బాగా వీచే గదిలోనే హోమ్ ఐసోలేషన్ అవ్వాలి.

◆ ఎల్లప్పుడూ మూడు పొరలతో కూడిన మెడికల్ మాస్కునే  ధరించాలి.

◆ ఎక్కువ విశ్రాంతి అవసరం. అలాగే ఎక్కువశాతం ద్రవపదార్థాల్ని తీసుకోవాలి.

◆ తరచుగా చేతుల్ని శుభ్రపరచుకోవాలి లేదా శానిటైజర్ ను వాడాలి.

◆ ఐసోలేషన్ లో ఉన్నప్పుడు వ్యక్తిగత వస్తువుల్ని,  సామగ్రిని ఇతరులతో పంచుకోకూడదు.

◆ పరిసరాల్ని ఎల్లప్పుడూ శుభ్రం చేసుకోవాలి.

◆ పల్స్ ఆక్సిమీటర్ ద్వారా బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ ను స్వయంగా చెక్ చేసుకోవాలి.
 
వారిని చూసుకునేవారు...

◆ ఒకే గదిలో ఉన్నప్పుడు మూడు పొరల మెడికల్ మాస్కును లేదా ఎన్ 95 మాస్కును తప్పక వేసుకోవాలి. ముందువైపున మాస్కును తాకకూడదు.

◆ ఒకవేళ మాస్క్ తడిగా ఉన్న, అశుభ్రంగా ఉన్న వెంటనే మార్చేయాలి.

◆ మాస్క్ ను పారేశాక, హ్యాండ్ హైజీన్ ను పాటించాలి.

◆ ముఖం, నోరు, ముక్కును అస్తమానం తాకకూడదు.
 
చేతులు శుభ్రంగా...

◆ కరోనా సోకిన వ్యక్తి పరిసరాల్లో తిరిగినప్పుడు లేదా వారికి సపర్యలు చేసినప్పుడు వెంటనే చేతి శుభ్రతను పాటించాలి. అందుకు సబ్బును నీటితో కలిపి నలభై సెకన్లపాటు కడగాలి లేదా ఆల్కహాల్ శానిటైజర్ ని వాడాలి.

◆ తడి చేతుల్ని పేపర్ టవల్ తో లేదా సున్నితమైన వస్త్రంతో తుడుచుకోవాలి. టవల్స్ తడిగా ఉంటే వెంటనే మార్చాలి.

◆ గ్లోవ్స్ ను వాడే ముందు, వాడిన తరువాత చేతి శుభ్రతను పాటించాలి. ఒకసారి వాడి పారేసే గ్లోవ్స్ లనే మాత్రమే ఉపయోగించాలి.

◆ తినే పాత్రలు, గ్లాసులు, వాడిన టవల్స్, బెడ్ షీట్లను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి.

◆ కరోనా సోకిన వ్యక్తికి ఎల్లవేళలా తాజా ఆహారాన్ని అందుబాటులో ఉంచాలి.

◆ గ్లోవ్స్ ను ధరించే వారి పాత్రల్ని శుభ్రం చేయాలి. ఆ పై చేతుల్ని పరిశుభ్రంగా కడగాలి. 
 
వ్యర్ధాలను సైతం వేరుగా...

◆ ఉపయోగించిన నీటి సీసాలను మిగిలిన ఆహారాన్ని విడిగా సంచిలో నింపి, గాలి వెళ్లకుండా గట్టిగా ప్యాక్ చేసి, పారేయాలి.

◆ చెత్తను సేకరించే వారికి ఈ వ్యర్ధాలను విడిగా ఇవ్వాలి.

◆ వాడిన మాస్కులు, గ్లోవ్స్ లు, టిష్యు పేపర్లను బయోమెడికల్ వేస్ట్ గా గుర్తించాలి.

◆ వాటిని విడిగా పసుపుపచ్చని బ్యాగ్ లో సేకరించి, చెత్తను తరలించే వారికి అందించాలి లేదంటే లోతైన బావుల్లో, గుంటల్లో పారేయాలి. సాధారణంగా చెత్తను జంతువులు తీసే ప్రమాదముంది. కాబట్టి కుక్కలు తీయలేని స్థలంలో పారేయాలి.
 
ఆరోగ్య ఇబ్బందులు ఏర్పడితే...

◆ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నప్పుడు ఏదైనా  ఇబ్బందిగా అనిపిస్తే, వెంటనే డాక్టర్ తో సంప్రదింపులు జరపాలి లేదా వారికి రిపోర్ట్ చేయాలి.
◆ విధిగా మందులను వాడాలి. 

◆ హోం ఐసోలేషన్ లో ఉన్నవారు టెలీ కన్సల్టేషన్ ను వినియోగించుకోవాలి.

◆ జ్వరం, దగ్గు, జలుబు ఉంటే ప్రాథమిక కరోనా లక్షణాలుగా భావించి, ఆపై జాగ్రత్తలు పాటించాలి.

◆ ప్రతిరోజూ కాచి, చల్లార్చిన నీటినే తాగాలి.  రోజులో కనీసం మూడుసార్లు ఆవిరి పట్టాలి.

◆ ఒకవేళ జ్వరం తగ్గకుంటే వైద్యుల సలహామేరకు పారసిటమాల్ 650 ఎంజిను రోజుకు నాలుగుసార్లు వాడాలి. 

◆ సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చెందే వార్తలను నమ్మరాదు. ఎందుకంటే ఈ సమయంలో మానసిక దృఢత్వం ముఖ్యం. అందుకు మంచి విషయాలనే వినాలి, చూడాలి.
 
సొంత వైద్యం వద్దు...

◆ డాక్టర్ ను సంప్రదించకుండా.. స్వయంగా మందులను వాడటం, అంచనా మేరకు రక్త పరీక్షలు, ఎక్స్ రే, సీటీ స్కాన్ లను చేయించుకోకూడదు.

◆ స్టెరాయిడ్స్ ను వాడొద్దు. ఏవైనా ఇబ్బందులు ఏర్పడొచ్చు.

◆ మందుల చీటీని ఇంకొకరికి రిఫర్ చేయకూడదు. ఒక్కొక్కరి శరీర స్పందనలు, గురయ్యే వైరస్ లక్షణాలు విభిన్నంగా ఉంటాయి. కాబట్టి ఏ ఒక్కరి ప్రిస్క్రిప్షన్ ఇంకొకరికి ఒకేలా ఉండదు.

◆ శ్వాసక్రియ తగ్గినా, శ్వాస తీసుకోవడంలో ఏదేని ఇబ్బందులు వచ్చినా, ఆక్సిజన్ సాచురేషన్ స్థాయి తగ్గినా వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

◆ 100 డిగ్రీల ఫారన్ హీట్ తో జ్వరం మూడు రోజులకు మించి ఉంటే, దాన్ని హై ఫీవర్ గా పరిగణించాలి.

◆ ఛాతిలో నొప్పి, బరువుగా అనిపించినప్పుడు వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

◆ ఎల్లప్పుడూ  తప్పక మాస్కును ధరించాలి.

◆ హోమ్ ఐసోలేషన్ పూర్తయ్యాక మరలా కరోనా పరీక్ష చేయించాల్సిన అవసరం లేదు.