BREAKING NEWS

'సాహసిం'చి చూపింది… 'పోలార్ ప్రీత్'!

చాలామందికి కొన్ని ప్రత్యేకమైన కళలుంటాయి. ఆ కళలతో కూడిన కలలుంటాయి. ఎప్పటికైనా నెరవేరాలనే తపన ఉంటుంది. కొందరైతే అవి నెరవేర్చుకునే వరకు విశ్రమించరు. మరికొందరు బంధాలు, బాధ్యతల చెరలో చిక్కుకుపోయి ఆ కలను ప్రేతకలలా వదిలేస్తుంటారు.

కానీ మన దేశానికి చెందిన హర్ ప్రీత్ చాందీ మాత్రం… వృత్తిలో కొనసాగుతూనే… ప్రవృతిగా తనకిష్టమైన ట్రెక్కింగ్ లోనూ మరో మెట్టు ఎక్కి… నేడు అందరికీ ఆదర్శంగా నిలిచింది.
చుట్టూ… మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రత... 
గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వీచే శీతల గాలులు... 
మనిషి జాడే కానరాని చోటుకి వెళ్లి... అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిందామె... మరెవరో కాదు... బ్రిటిష్‌ ఆర్మీ ఆఫీసర్‌ హర్‌ప్రీత్‌ చాందీ. 
భారత సంతతికి చెందిన ఈమె.. 40 రోజుల పాటు ఒంటరిగా అంటార్కిటికా ఖండాన్ని చుట్టేసింది…
ఆపై ఈ ఘనత సాధించిన తొలి నల్ల జాతీయురాలిగా పేరు తెచ్చుకుంది. 
మహిళలు మనసు పెడితే చేయలేనిదేమి లేదని మరోసారి రుజువు చేసి చూపింది… ఈ ఆర్మీ లేడీ…
ఆమె చేసిన ఈ గొప్ప సాహస యాత్ర గురించిన ఆసక్తికర విశేషాలను ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం..
 
భారత్ లోని సిక్కు కుటుంబానికి చెందిన ఈమె తల్లిదండ్రులు బ్రిటన్‌లో స్థిరపడ్డారు. దీంతో చాందీ కూడా అక్కడే పుట్టింది. పెద్దయ్యే కొద్దీ సాహసాలపై ఇష్టం పెంచుకుంది. చదువయ్యాక 2007లో వాయవ్య ఇంగ్లండ్‌లోని మెడికల్‌ రెజిమెంట్‌లో భాగంగా సైన్యంలో పనిచేసే వైద్యులకు క్లినికల్‌ ట్రైనింగ్‌ ఆఫీసర్‌గా శిక్షణనిస్తుంది. ఫిజియోథెరపిస్ట్‌ కూడా. 
 
జర్నీఆమె మాటల్లోనే

గత ఏడాది నవంబర్ 7న అంటార్కిటికాలోని హెర్క్యులస్‌ ఇన్‌లెట్‌ వద్ద నా సాహస యాత్రను మొదలుపెట్టాను.
మూడేళ్ల క్రితం దక్షిణధృవం(అంటార్కిటికా) గురించి అడిగితే బహుశా ఏమీ తెలియదనే చెప్పేదాన్ని... అలాంటిది నేను ఇప్పుడిక్కడున్నానంటే  నమ్మలేకున్నాను. 
40 రోజుల్లో 700ల మైళ్ల దూరం ప్రయాణం… అది చేసే క్రమంలో నాకు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. 

మైనస్ 50 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతకు తోడు, గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వీచే శీతలగాలులే నాకు అతిపెద్ద అవరోధాలుగా నిలిచాయి. ఇక దీనికన్నా ముందు యాత్ర 48 రోజుల్లో పూర్తి చేయాలన్న దృఢ నిశ్చయంతో, అన్నిరోజులకు సరిపోయేంత ఆహారం, కావాల్సిన ఇతర సామగ్రిని వెంట తీసుకెళ్లాను. సుమారు 90 కిలోల స్లెడ్జ్‌ని లాగుతూ ప్రయాణం సాగించాను. ఈ క్రమంలో శారీరకంగానేగాక, మానసికంగానూ అలసిపోయేదాన్ని.. అయినా లక్ష్యాన్ని చేరాలన్న నా గట్టి సంకల్పం ఈ అవరోధాలన్నింటిని దాటుకునేలా చేసింది.

‘నేను నా వృత్తిని ఎంతగా గౌరవిస్తానో... సాహసాలనూ అంతకంటే ఎక్కువగా ఆరాధిస్తాను. అంటార్కిటికాను చుట్టి రావాలన్న ఆలోచన రెండున్నరేళ్ల కిందటే వచ్చింది. అయితే ఆ సమయంలో ఇది నేను చేయగలనా, నా వల్ల అవుతుందా అని అనిపించింది. కానీ అదే ఆలోచనతో అక్కడే ఆగిపోవడం కరెక్ట్ కాదని ఆ తర్వాతే తెలుసుకున్నా. 

ఏదైనా చేయగలిగే శక్తి సామర్ధ్యాలు మనకున్నపుడు… మనం దాన్ని చేసి తీరాలి. అది సాధ్యం కావాలంటే ముందు మనల్ని మనం నమ్మాలంటూ' తన జర్నీ గురించి చెబుతోంది చాందీ. 
 
తరువాత ఎం చేయబోతున్నారంటే...

మొదట్నుంచీ సాహసాలంటే ఇష్టపడే చాందీ. గతంలోనూ పలు అల్ట్రా మారథాన్స్‌లో చురుకుగా పాల్గొంది. ఇందులో భాగంగా సహారా ఎడారిని కూడా చుట్టేసింది. ఇక తాజాగా అంటార్కిటికా నుంచి తిరిగొచ్చాక.. మహిళలు ఇలాంటి ఒంటరి సాహసాలకు ధైర్యంగా ముందుకొచ్చేలా తనవైపు నుంచి తగిన ప్రోత్సాహం అందిస్తానంటోంది. అందుకోసం నిధులు సమీకరించుకోవడమే తన లక్ష్యంగా తెలుస్తోంది.
 
బ్లాగులో పోస్ట్ లు పెడుతూ...

మంచుతో కప్పబడిన ప్రాంతంలోనూ తన ప్రయాణం గురించి బ్లాగులో ఎప్పటికప్పుడు పోస్ట్‌ చేస్తూనే ఉంది. తన ప్రయాణం గురించి బయటి ప్రపంచానికి తెలియడానికంటూ… ఆమె తన ట్రెక్‌ లైవ్‌ ట్రాకింగ్‌ మ్యాప్‌ను అప్‌లోడ్‌ చేసింది. 'సోలో సాహస 40వ రోజు పూర్తయ్యింది. అంటార్కిటికాలో యాత్రను పూర్తి చేసిన మొదటి వర్ణ మహిళగా ప్రీత్‌ ఓ చరిత్ర సృష్టించింది’ అని ఆమె బ్లాగ్‌ లో చివరన పేర్కొన్న ఎంట్రీ చెబుతుంది.

ఈ జర్నీ అనుభవాన్ని ఉదహరిస్తూ...
‘మీరు కోరుకున్న దేనినైనా సాధించగలరు. ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒకచోట నుంచి తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. నాకు కేవలం మూస పద్ధతిలో ఉన్న గాజు పై కప్పును పగలగొట్టడం ఇష్టం లేదు. దాన్ని వీలైనన్ని మిలియన్‌ ముక్కలుగా చేయాలని భావించా’నని దృఢంగా వెలిబుచ్చిన ఆమె సందేశంలోని పదాలు మనందరినీ లోతుగా ఆలోచింపజేస్తాయి.
 
పెళ్లి జర్నీ...
ఆమె తన సాహసయాత్రకు బయలుదేరేముందు ఆర్మీ రిజర్విస్ట్‌ డేవిడ్‌ జర్మాన్‌తో నిశ్చితార్థం చేసుకుంది. ఇంగ్లండ్‌కు తిరిగి వచ్చాక వివాహ పనుల గురించి ఆలోచించడానికి ఆమె తన సమయాన్ని ఈ జర్నీలోనే ఉపయోగించుకుందని తెలిపింది. 
 
శిక్షణ సైతం...

స్లెడ్జ్‌కి ప్రత్యామ్నాయంగా పోలార్‌ ట్రైనింగ్‌ కోసం కొన్ని నెలలపాటు అత్యంత బరువైన రెండు పెద్ద టైర్లను లాగుతూ కఠిన శిక్షణ తీసుకుంది. 
స్లెడ్జ్‌లో కావాల్సిన తప్పనిసరి వస్తువులను ఉంచి, అంటార్కిటికా సౌత్‌పోల్‌ మొత్తం ఇదే ప్రయాణాన్ని కొనసాగించింది. అంతేకాదు తన 40 రోజుల జర్నీలో తనకెదురైన అనుభవాల్ని సోషల్‌ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు పంచుకున్నారు చాందీ. 
మరీ చాందీని ఆదర్శంగా తీసుకుంటూ… ఇంకొంతమంది సాహసిమణులు వెలుగులోకి రావాలని ఆశిద్దాం.