BREAKING NEWS

సంక్రాంతి పండుగ ప్రత్యేకతలు…

పండుగ అంటేనే సంతోషం. ఆ రోజుల్లో చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఆట, పాటలతో గడుపుతారు. పతంగులను ఎగరేస్తూ ఒకరితో ఒకరు పోటీ పడతారు. కోళ్లతో పందాలు కాస్తారు. ముగ్గులేసి గొబ్బెమ్మలు పెడతారు. వ్రతాలు, పూజలు చేస్తారు. ఇలా ఎన్నో…. మరీ అలాంటి పండుగైన సంక్రాంతి గురుంచి మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం….
 
గాలిపటాలను ఎందుకు ఎగరవేస్తారు...

పురాణాల ప్రకారం…. సంక్రాంతి పండగ రోజున ఉత్తరాయన పుణ్యకాలం ఆరంభమవుతుంది. అంటే ఈ కాలంలో దేవతలందరికి పగలు మొదలయిన సందర్భంగా వారందరూ ఆకాశంలో విహరిస్తారట. అలా దేవతలకి స్వాగతం పలికేందుకు, వారి దృష్టిని ఆకర్షించేందుకు గాలి పటాలు ఎగరవేస్తుంటారు. 

●గుజరాత్ లోని అహ్మదాబాద్ లో సంక్రాంతి రోజున ఏకంగా 'అంతర్జాతీయ పతంగుల పండుగ'ను నిర్వహిస్తారు. అక్కడికి దేశవిదేశాల నుంచి ఎంతోమంది ప్రజలు 'ఉత్తరాయన్' గా పిలిచే ఈ వేడుకలో పాల్గొంటారు. అదే ఊరిలో పతంగ్ బజార్లో వారం రోజుల నుంచే గాలిపటాల అమ్మకాల, కొనుగోలు జాతర మొదలవుతుంది. 
 
కోడి పందాల జోరు….


●థాయిలాండ్ దేశంలో కోడిపందాలను నిర్వహిస్తారు. అక్కడ ఒక్కో కోడిపుంజు ధర డెబ్భై లక్షల రూపాయల వరకు ఉంటుంది. దాదాపు ఏడువందల ఏళ్లుగా ఈ ఆటను ఆడిస్తున్నారు. అందుకోసం స్టేడియాలు, రింగులు, కాక్ పిట్ లను ఏర్పాటు చేశారు. ప్రతి కోళ్ల పందాల రింగును ప్రభుత్వంతో ముందే రిజిస్టర్ చేయించుకోవాలి. ఇక్కడ జరిగే పోటీల్లో అన్ని పందెం కోళ్లకు చాకులు, సూదుల్ని కట్టినట్టు కాకుండా మామూలుగానే పోటీలోకి వదులుతారు.

●కోడిపందాలకు ఫిలిప్పీన్స్ దేశంలో 'సబోంగ్' అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ ధనవంతులు, పేదవారు అనే తేడాతో ఆడతారు. ఈ దేశ రాజధాని మనీలాలో జరిగే కోడిపందాల ఒలింపిక్స్ ను 'వరల్డ్ స్లాషర్ కప్' గా పిలుస్తారు. దీనిని ఏడాదిలో రెండు సార్లు నిర్వహిస్తారు. ఈ పోటీలకు కెనడా, ఇండియా, మలేషియా, ఆస్ట్రేలియా, అమెరికలాంటి దేశాల నుంచి వారి పందెంకోళ్లతో పోటీ పడతారు.  

●వియత్నాం దేశంలో క్రీస్తుశకం 11వ శతాబ్దానికి చెందిన లీ అనే రాజు కాలం నుంచే ఈ కోళ్ల పందాల పోటీలు జరుపుతున్నారు. సేక్రెడ్ చికెన్స్, బ్లాక్ రూస్టర్స్, వైట్ రూస్టర్స్ పేర్లతో మూడు రకాల పందెం కోళ్లను పెంచుతారు. ఇందుకు ప్రత్యేకంగా పందెం రింగులు ఉన్నాయి.

●ఇండోనేషియాలోని బాలిలో కోళ్ల పందాలను నిర్వహిస్తారు. హిందూ దేవత రాతు సౌంగ్ ఆరాధిస్తూ ఆమెకు కోళ్లను బలి ఇవ్వడం అనాదిగా వస్తున్న ఆచారం. అందుకే మొదటిగా దేవత ముందు కోళ్ల పందాలను మొదలుపెట్టి అందులో చనిపోయిన కోడిని అమ్మవారికి సమర్పిస్తారు. 

●అమెరికా దేశంలోని మెక్సికోలో చుట్టూ కలపతో నిర్మించిన రింగులను కడతారు. దీనిని 'పాలెన్ క్యూ' అంటారు. కుస్తీ పోటిలాగా ఇక్కడ కూడా అలాంటి రింగును ఏర్పాటు చేస్తారు. కోళ్లకు కత్తులు, బ్లేడ్లు కడతారు. ఈ పోటీలకు ఛారిటీ తరఫు పందెం కోళ్లు కూడా పాల్గొంటాయి. గెలిస్తే వచ్చే డబ్బుతో అక్కడి పాఠశాలు, కమ్యూనిటీ హల్ వంటి మొదలైన వాటిని నిర్మిస్తుంటారు. ఇక్కడ జరిగే పోటీలను చూడటానికి కెనడా, అమెరికా దేశాల నుంచి పర్యాటకులు వస్తారు. 
 
గొబ్బెమ్మలు పెట్టడానికి కారణం…

గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాలైన గోపికలకు సంకేతం. ఆ గొబ్బెమ్మల పైన చల్లే పసుపు, కుంకుమలు, పూలరేకులు మొదలైన వాటిని కలిపి పుణ్య స్త్రీలని నమ్ముతారు. ఆ గోపికా  రూపాలను కలిపి గొబ్బెమ్మలుగా, మధ్యలో ఉండే గొబ్బెమ్మను గోదాదేవికి కొలుస్తారు. బాలికలు వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ, నృత్యం చేస్తే కృష్ణని ప్రాప్తి కలుగుతుందని అంటుంటారు. వీటిని పొద్దున్నే పెడతారు. కనుకే దీనిని 'సంధ్య గొబ్బెమ్మ' అంటారు. 
 
ముగ్గులు వేయడానికి కారణం…

ఈ పండగకు బియ్యపు పిండితో ముగ్గులేస్తారు. ఎందుకంటే ఆ పిండిని తినడానికి ఇంట్లోని సూక్ష్మక్రిములు, చీమలు, బొద్దింకలు అన్ని వాకిట్లోకి చేరుతాయి. అలా ఇల్లు శుభ్రం అవుతుంది. 

●సంక్రాంతికి 27 చుక్కల ముగ్గు వేస్తారు. ఎందుకంటే మనకు 27 నక్షత్రాలు ఉన్నాయి కాబట్టే. జన్మించిన ప్రతి ఒక్కరి నక్షత్రాల ప్రకారం వారి మంచి, చేడుల తేడాలను చూస్తుంటారు. అందుకు ప్రతీకాత్మకంగా 27 చుక్కల్ని కలిపి వేస్తే ఒక రంగవల్లిక ఏర్పడినట్లు, ఏ నక్షత్రంలో పుట్టినా సరే జీవితాన్ని మంచి దారిలోకి తీసుకెళ్లడమనేది మన చేతుల్లో ఉందనే భరోసాను కలిగిస్తుంది. 
రథం ముగ్గు..

మూడు రోజులతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని పంచే పండుగను ఘనంగా సాగనంపేందుకే పుట్టినదే రథం ముగ్గు. అందరూ కలిసే ఉండాలనే సంకేతానికి గుర్తుగా... ఒక రథం ముగ్గు తాడును మరొక ఇంటి వారి ముగ్గుతో కలుపుతూ పోతుంటారు.

●గ్రెగోరియన్ క్యాలెండర్ మాదిరిగానే హిందూ పండుగల్లో సంక్రాంతి కూడా సౌరగమనాన్ని అనుసరిస్తుంది. కాబట్టే సంక్రాంతి పండుగ ప్రతీ సంవత్సరం ఒకే తేదీన వస్తుంది. మిగిలిన పండుగలన్నీ భారతీయ సంప్రదాయం ప్రకారం.. చాంద్రమానాన్ని అనుసరిస్తాయి. అందుకే ఆ పండుగల తేదీల్లో తేడాలు కనిపిస్తాయి. 

●భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు రోజుల పండుగే కాదు. నాల్గవ రోజు జరుపుకునే పండుగను 'ముక్కనుమ' అంటారు. ఆ రోజు పెళ్ళైన మహిళలు 'సావిత్రి గౌరివ్రతం' చేస్తారు. దేవిని తొమ్మిది రోజులు పూజిస్తూ, ఆమెకు తొమ్మిది రకాల పిండి వంటలతో రోజు నైవేద్యం చేసి పెడతారు. ఆ తర్వాతి రోజు మట్టి బొమ్మను తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. అలా చేయడం వలన దీర్ఘసుమనంగళీ ప్రాప్తం చేకూరుతుందని నమ్మకం.