BREAKING NEWS

అనాథ పిల్లలకు ఆప్తురాలామె… సింధూతాయి సప్కాల్‌!

అడగందే అమ్మైనా పెట్టదంటారు..
కానీ అడగకుండానే ఈ అమ్మ...
కన్నతల్లిలా అక్కున చేరదీసింది…
ఒక్కరూ కాదు.. ఇద్దరూ కాదు…
ఏకంగా వెయ్యి మందికి పైగా… 
అనాథ పిల్లలకు అమ్మగా అవతారమెత్తింది.
వెలలేని ఆత్మీయతను అందించింది.
ఆపై వారి జీవితాల్ని ఉత్తమంగా తీర్చిదిద్దింది…
అంతేనా… 
అణగారిన ప్రజల బాగోగులు చూసింది.
మహిళలకు పునరావాసాల్ని కల్పించింది.
ఎంతో ఆదరణ… మరెంతో ఆచరణ…
కలగలిపితే వచ్చినవే,
ఆమె స్థాపించిన ఆశ్రమాలు, ఆశ్రయ కేంద్రాలు…
అందుకు గుర్తింపుగానే...
ఎన్నో పురస్కారాలు… మరెన్నో అవార్డులు…
ఆమెను పిల్లలంతా 'మాయ్(అమ్మ)' అని ఇష్టంగా పిలుచుకుంటారు…
తానే.. 'సింధుతాయ్‌'...
సంఘ సేవకురాలిగా, సామాజిక కార్యకర్తగా,
పద్మశ్రీ అవార్డు గ్రహీతగా…
గుర్తుంచుకోదగ్గ సామాజిక వ్యక్తుల్లో ప్రేరణగా నిలిచిన ఆమె… నాలుగురోజుల క్రితం గుండెపోటు కారణంగా తుదిశ్వాస విడిచారు.
అనారోగ్యంతో నెలరోజుల క్రితం పుణెలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరారు. అనంతరం చికిత్స పొందుతూ జనవరి 4న కన్నుమూశారు. ఈ సందర్భంగా ఆమె చేసిన విశేష సేవల్ని మనం స్మరించుకుందాం:
 
జననం:

1948 నవంబర్‌ 14న మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో జన్మించారు సింధుతాయ్.
ఆమె నాలుగో తరగతి వరకు చదువుకున్నారు. ఆమెకు ఇంట్లోవాళ్లు పదేళ్ల వయసున్నప్పుడు 40 సంవత్సరాలున్న వ్యక్తికిచ్చి పెళ్లి చేశారు. పెళ్లయ్యాక ఆమె భర్తతో కలిసి వార్ధాలోని నవర్‌గావ్ అటవీ ప్రాంతంలో స్థిరపడ్డారు. అయితే ఆమె గర్భవతిగా ఉన్నపుడు ఆ ఊర్లో భూస్వామి ఆమెపై తప్పుడు వదంతులు ప్రచారం చేశారు. దీంతో ఆమెను ఆమె భర్త వదిలిపెట్టడం జరిగింది. ఆమె కుటుంబీకులు సైతం ఇంట్లోకి రానివ్వలేదు.

ఆమె కులం కూడా ఆమెను వెలివేసింది. ఆమె ఓ పశువుల పాకలో తన బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తరువాత జీవనోపాధి కోసం రైల్వే స్టేషన్లలో పాటలు పాడుతూ వచ్చిన డబ్బుతో బతికింది. అలాంటి రోజుల్లో… తల్లి అవసరమున్న అనాథ పిల్లల్ని చూసిన ఆమె ఎలాగైనా వారికి భరోసాగా నిలవాలనుకుంది. అలా ఆమె మనసులో పడిన బీజం... అనాథలు, తల్లిదండ్రులు విడిచిపెట్టిన పిల్లలను దత్తత తీసుకోవడంవరకు ఎదిగింది.
 
ఆశ్రమం...

పుణెలోని హడప్సర్ ప్రాంతంలో ‘సన్మతి బాల్‌ నికేతన్‌’ అనే అనాథ ఆశ్రమాన్ని స్థాపించారు. ఆమె తన జీవితం మొత్తంలో ఇప్పటిదాకా 1000 మందికి పైనే అనాథ పిల్లలను దత్తత తీసుకొని చేరదీయడం జరిగింది. వారికంటూ ఓ జీవితాన్ని బహుమతిగా ఇచ్చింది.
 
గుర్తింపు...

◆ సింధుతాయ్‌ సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దేశవ్యాప్తంగా ఎన్నో అవార్డులను అందుకునేలా చేసింది.

◆ ఆమె చేసిన సామాజిక సేవకు గుర్తింపుగా దాదాపు 750కి పైగా పురస్కారాలు లభించాయి.

◆ 2010లో మరాఠీలో ‘మి సింధుతాయ్‌ సప్కాల్‌ బోల్టే’ అనే పేరుతో సింధుతాయ్‌ బయోపిక్‌ కూడా విడుదలైంది. 

◆ మహారాష్ట్ర ప్రభుత్వం 2020లో ఆమెను 'అహల్యాబాయ్ హోల్కర్' అనే విశిష్ట పురస్కారంతో సత్కరించింది. 

◆ ఆమె సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2021లో పద్మ శ్రీ అవార్డుతో సత్కరించింది.
 
ప్రముఖుల సంతాపం...

◆ సింధుతాయ్‌ మృతికి ప్రధాని మోదీ ట్వీట్టర్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. ‘‘సమాజానికి ఆమె చేసిన సేవలతో సింధుతాయ్‌ ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఆమె కృషితో చాలామంది పిల్లలు ప్రస్తుతం ఉత్తమమైన జీవితాన్ని గడుపుతున్నారు. బలహీనవర్గాల కోసం సైతం ఆమె కృషి చేశారు. సింధుతాయ్‌ మృతి తీరని లోటు. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని అన్నారు.
 
◆ సింధుతాయ్ జీవితం ధైర్యసాహసాలు, అంకితభావం, సేవలకు సంబంధించిన అంశాలపై ప్రతి ఒక్కరికి ప్రేరణనిచ్చే సుదీర్ఘ చరిత్ర అని రామ్ నాథ్ కోవిద్ తెలిపారు. ఆమె అనాథలు, గిరిజనులు, అణగారిన వర్గాలవారిని ఎంతో ప్రేమించి, సేవ చేశారని, అద్భుతమైన దృఢ నిశ్చయంతో ఆమె తన చరిత్రను చక్కగా లిఖించుకున్నారని పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు, ఆమెను అనుసరించేవారికి ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని వ్యక్తం చేశారు.
 
◆ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే స్పందిస్తూ... సింధుతాయ్ మరణ వార్త విని తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. వేలాది మంది అనాథ బాలబాలిలకు ఆమె తల్లిలాంటి సంరక్షణను అందజేశారని ఆయన పేర్కొన్నారు. ఆమె ఆకస్మిక మరణం వల్ల సామాజిక సేవా రంగం ఓ స్ఫూర్తిదాయకమైన వ్యక్తిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.