BREAKING NEWS

రాక్షస సంహరణ కోసం పుట్టిందే ‘ఏకాదశి’

స్వర్గ ద్వారం, ఉత్థాన ఏకాదశి, శయని ఏకాదశి, తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి ... అని చాలా పేర్లతో ఏకాదశిని మనం జరుపుకుంటాం. ఈ రోజు ఉపవాసం ఉంటూ, రాత్రి జాగారం చేసి మరుసటి రోజు ఉపవాసం విడుస్తారు. ఈ నాడు ఉత్తర ద్వారం నుంచి శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం.... ఇంకా ఈరోజు గురుంచి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం..

ఏకాదశి అంటే...

ఏకాదశి అంటే పదకొండు సంఖ్యకు సంకేతం. ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనసు. ఇలా పదకొండింటి పైన నియంత్రణ కలిగివుంటూ వ్రతం ఆచరించాలన్నది ఈ పండుగ సందేశం. 

పురాణాల ప్రకారం, సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. ఆషాడ శుద్ధ ఏకాదశి నాడు పాలకడలిలో యోగనిద్రకు ఉపక్రమించే నారాయణుడు కార్తిక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు. అలా మేల్కొన్న స్వామిని ముక్కోటి దేవతలూ పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి నాడు దర్శించుకునేందుకు వైకుంఠానికి చేరుకుంటారు. ఆ తర్వాత మహావిష్ణువు గరుడ వాహనంపైన మూడుకోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. కాబట్టే ఈ ధనుర్మాస ఏకాదశిని ‘ముక్కోటి ఏకాదశి’ అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.

విష్ణు పురాణాల ప్రకారం... ‘కృతయుగంలో చంద్రావతి నగరంలో ‘ముర‘ అనే అసురుడు రాజ్యపాలనం చేస్తూ ఉండేవాడు. ఆ రాక్షసుడు దేవతల్ని ఇబ్బంది పెట్టవాడు. దాంతో వాళ్ళంతా కలిసి రక్షించమని విష్ణుమూర్తిని వేడుకున్నారు. అలా శ్రీమన్నారాయణుడు ఆ రాక్షసుడిని చంపడానికి బయలుదేరుతాడు. ఆ విషయం తెలుసుకున్న అసురుడు సముద్రగర్భంలో దాక్కుంటాడు.

విష్ణువు భూమి మీదికి వచ్చి సిహ్మావతి గుహలోకి వెళ్లుతుండగా ఆయన శరీరం గుహ గోడలకు రుద్దుకోవడంతో ఆ రాపిడి నుంచి ఏకాదశి అనే మహిళ జన్మించింది. ఆమె ఆ రాక్షసుడిని చంపింది. ఆ సంహరణ తర్వాత శ్రీమన్నారాయణున్ని ఏకాదశి మూడు వరాలు కోరింది. అవి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన రోజు ఏకాదశిగా, అన్ని తిథిలలో ఏకాదశి ఉత్తమ తిథిగా ఉండాలని, ఆ రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి నీ (విష్ణుమూర్తి) మోక్షాన్ని ప్రసాదించాలని కోరుకుంటుంది. అందులో ఉపవాసం చాలా శక్తివంతమైనది. అప్పటి నుంచి వైకుంఠ ఏకాదశిని  జరుపుకోవడం మొదలుపెట్టాము.

ఆ రోజున ఏం చేయాలి?

ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారి పటాన్ని గంధంతోటీ, జాజిమాలతోటీ అలంకరించి ఆయనకు ఎంతో ఇష్టమైన పాయసంతో పాటు వివిధ రకాల తీపిపదార్థాలను లేదా ఆకుపచ్చని పండ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ పర్వదినాన స్వామివారిని ఉత్తరద్వారం గుండా దర్శించుకోవడం, విష్ణులీలలను తెలిపే గ్రంథాలను భగవద్భక్తులకు దానం చేయడం, విష్ణు సహస్ర నామ పారాయణం చేయడం, ఉపవాసం ఉండటం, యథాశక్తి దాన ధర్మాలు చేయడం, జాగరణ చేయడం వలన మోక్షం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంవత్సరంలో 24 ఏకాదశిలు రావడానికి కారణం....

హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం, పాడ్యమి రోజున చాంద్రమాన మాసం మొదలువుతుంది. పదిహేను రోజుల వ్యవధిలో వచ్చే ఆరోహణ చంద్రుని మొదటి సగాన్ని ‘శుక్ల పక్షం’ అని, మరో పదిహేను రోజుల వ్యవధిలో ప్రవేశించే అవరోహణ చంద్రుని రెండవ అర్ధభాగాన్ని ‘కృష్ణ పక్షం’ అని పిలుస్తారు. అందులో ఏకాదశి పదకొండవ రోజు. అందుకే నెలలో రెండు ఏకాదశిలు వస్తాయి. అలా ప్రతి సంవత్సరంలో 24 ఏకాదశిలు ఉంటాయి.

ఉపావాసం ఉండడానికి కారణం...

ముర అసురుడిని సంహరించే సమయంలో అతడు బియ్యంలో దాక్కోవడం వల్లే ఉపవాసం ఉండాలనే నియమం వచ్చిందనీ చెబుతారు. ఈ రోజున ఉపవాసం, ధాన్యం చేయడం వలన మిగితా 23 ఏకాదశిలు ఉపవాసం చేస్తే వచ్చే ఫలితం కలుగుతుందని విష్ణు పురాణం చెబుతుంది.
మన గ్రంథాల ప్రకారం, బ్రహ్మా దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించేటప్పుడు ఆయన చెమట నుంచి ఒక రాక్షసుడు జన్మించాడు. ఏకాదశి రోజు ఆ అసురుడికే చెందాలని నిర్ణయించుకున్నాడు. ఆ రోజున ఆహారం తీసుకుంటే, భూతానికి సంబంధించిన ఆహారాన్ని భుజిస్తున్నట్లు అనమాట. అందుకే ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి అని చెబుతారు.

ఏకాదశికి చాలా పేర్లు..... 

దక్షిణాయాణంలో ఆషాడమాసంలో ఏకాదశి నాడు విష్ణుమూర్తి క్షీరసాగరంలో శేషతల్పంపైన శయనిస్తాడు. అందుకే ఈ ఏకాదశిని ‘శయని ఏకాదశి’ అని,
సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ కాబట్టి ‘తొలి ఏకాదశి’ గా పిలుస్తారు.
ఉత్తరాయణంలో మార్గశిర మాసంలో ఏకాదశి నాడు విష్ణుమూర్తి నిద్ర నుంచి మేల్కొంటారు. అందుకే ఈ ఏకాదశిని ‘ఉత్థాన ఏకాదశి’ అంటారు.
వైకుంఠ ద్వారాలు తెరుచుకోవడంతో ‘వైకుంఠ ఏకాదశి’ అని, ముక్కోటి దేవతలు కూడా మేల్కొవడంతో ‘ముక్కోటి ఏకాదశి’ గా చెబుతారు.

ఏ దేవాలయాల్లో పుజిస్తారు..

ఈ పర్వదినాన దేవాలయాల్లో  ఉత్తరద్వారాన శ్రీ మహావిష్ణువును దర్శించిన వారికి పునర్జన్మ ఉండదని శాస్త్రప్రమాణం చెబుతుంది. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఈ రోజున శ్రీరంగనాథ స్వామి దేవాలయంలో ‘ద్వారస్థ భగవదాలోకన’ మహోత్సవం జరుగుతుంది.  ప్రపంచవ్యాప్తంగాఅన్ని విష్ణుదేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుతారు.

కలియుగ వైకుంఠంగా పేరు పొందిన తిరుమలలో, ఉడిపిలో, గురువాయూర్‌లో, అరసవిల్లి, శ్రీకూర్మంలో, అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో, భద్రాద్రిలో, యాదాద్రిలోనూ.. ఇంకా అనేక ఆలయాల్లో నేడు భక్తులు తెల్లవారు జామునే వచ్చి స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకోవటానికి తరలివస్తారు.