BREAKING NEWS

వల కోసం రగిలిన మంటలు

గంగమ్మ ఒడిలో సేదతీరుతారు....
సముద్ర నీటి గలగల సవ్వడులను వింటూ...
తీరానికి చేరే సమయాన అలసట దరిచేరనివ్వరు....
భయంతో ప్రారంభమైన వీరి ప్రయాణం....
ఎగిసే అలలకు ఎదురుతిరుగుతూ... 
ఎదురు చూపుకై నిలిచిన కుటుంబానికి...
తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా....
వారి జీవితాల కోసం మరో జీవుల వెతుకులాటకై....
ప్రతి రోజు ఒక ఆశతో బయలుదేరుతూ వలలను చేపట్టిన వారే... చేపల మత్స్యకారులు
 
అలాంటిది చేపల వేట కోసం సముద్రానికి వెళ్లిన మత్స్యకారుల మధ్య జరిగిన ఘర్షణలు, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడం. తీరానికి చేరిన పడవలు మంటల్లో కాలిపోవడం, యువకుల అపహరణ, నేవీ అధికారుల సందర్శన, పోలీసుల ప్రవేశం, అధికారుల పర్యటన... ఇలా చాలా జరిగాయి...       
ఎందుకు ఈ వాగ్వాదం....

వైజాగ్‌లో పెదజాలరిపేటలోని సంప్రదాయ(గిల్) వలల మత్స్యకారుల వర్గానికి, చిన్నజాలరిపేటలోని ఉంగరాల(రింగ్) వలలను ఉపయోగించే మరో వర్గానికి చెందిన జాలర్లకు మధ్య వాగ్వాదం జరిగింది.
 
అసలేం జరిగిందంటే...

విశాఖపట్నంలో బంగాళాఖాతంలో వేట కోసం వెళ్లిన సంప్రదాయ(గిల్) వలల మత్స్యకారులకు, ఉంగరాల(రింగ్) వలలను ఉపయోగించే వారికి మధ్య గొడవలు అయ్యాయి. ఎందుకంటే దానికి కారణం రింగ్ వలలో చిన్న చిన్న చేపలు పడటం వలన మిగితా సముద్ర జీవుల ఆహారానికి నష్టం వాటిల్లుతుంది. దాని వలన అవి చనిపోతున్నాయి. అంతేకాదు సంప్రదాయ వలల మత్స్యకారాలు ఎక్కువ మంది ఈ చేపల వేటపైనే ఆధారపడి బ్రతుకుతున్నారు.

అందుకే గిల్ వలలు ఉపయోగిస్తే పెద్ద చేపలు వలకు చిక్కి, చిన్న చేపలు తప్పించుకొని సముద్రంలో ఎక్కువ రోజులు జీవిస్తాయి. అలాగే మత్య్సకారుల జీవనోపాధికి ఏ ఆటంకాలు ఉండవు. అందుకే రింగ్ వలలను వాడటాన్ని నిషేదించిన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇది అలా ఉండగా మంగమారిపేట, చేపలుప్పాడ, వాసవానిపాలెం, జాలరిఎండాడకు చెందిన కొందరు జాలరులు రింగ్ వలలతో మంగళవారం ఉదయం సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు. ఆ విషయం తెలుసుకున్న పెదజాలరిపేటకు చెందిన సంప్రదాయ మత్స్యకారులు పడవలను వేసుకొని సముద్రంలోకి వెళ్లి వారితో వాగ్వాదానికి దిగారు. గిల్ వల జాలర్లకు, సంప్రదాయ మత్స్యకారులకు జరిగిన గొడవల్లో కొందరికి గాయాలయ్యాయి.

సముద్ర తీరానికి చేరాక వారి ప్రాంతాల వారికి జరిగిన విషయాన్నీ చెప్పడంతో రెండు గ్రూపుల వారు అందరూ ఒక్కసారిగా గొడవ పడ్డారు. ఆ ఘర్షణలో గాయపడిన వారికి చికిత్సను అందిచడం కోసం అక్కడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే  పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకొని ఆ గొడవలను ఆపేశారు. అందరిని అక్కడి నుంచి తరిమి కొట్టారు.
 
చేపల వలలో రకాలు....

మత్స్య కారులు సముద్రంలో చేపల వేటకు సాధారణంగా గిల్, రింగ్ వలలను ఉపయోగిస్తారు.

రింగ్ వల:- రింగ్ వల కన్ను వృత్తాకారంలో కనిపిస్తుంది. దీని ధర ఏడు నుంచి పది లక్షల వరకు ఉంటుంది. ఈ వలలో చిన్న చిన్న చేపలు పడతాయి. కాబట్టి పెద్ద మొత్తంలో ఎక్కువ చేపల్ని పట్టుకునే అవకాశం ఉంటుంది. అందుకే జాలరులు రింగ్ వలతో తీరం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో వేటకు వెళతారు.

దీన్ని ఉపయోగిస్తుండటంతో గిల్ వలతో చేపల వేటను సాగించే సంపద్రాయ మత్స్యకారులకు చేపలు దొరక్క వారు నష్టపోతున్నారు. ఈ కారణంగా ఎనిమిది కిలోమీటర్ల లోపు రింగ్ వలల వినియోగాన్ని నిషిదించారు. 

గిల్ (సంప్రదాయ) వల:- ఈ వలకు చతురస్రాకారంలో కన్నుకనిపిస్తుంది. దీని ఖరీదు 20 వేల నుంచి 50 వేల వరకు ఉంటుంది. ఈ గిల్ వలను చాలా మంది మత్స్య కారులు ఉపయోగిస్తున్నారు. సముద్రంలో వేటకు వెళ్లినప్పుడు చిన్న చేపలు ఈ వల నుంచి జారిపోగా, పెద్ద చేపలు మాత్రం చిక్కుతాయి. రింగ్ వలతో పోలిస్తే గిల్ వలలో  చేపలు తక్కువ పడతాయి.
 
మంటల్లో పడవలు:-

సముద్రంలో రింగ్ వలతో వేటకు వెళ్ళిన మంగమారిపేట, చేపలుప్పాడ, వాసవానిపాలెం, జాలరిఎండాడకు చెందిన జాలర్ల పడవలను కొందరు జాలరిపేట తీరానికి తీసుకొచ్చి తగలబెట్టారు. అందులో నాలుగు పడవలు పూర్తిగా కాలిపోయాయి. రెండు పడవలు మాత్రం కొద్దిగా దెబ్బతిన్నాయి. ఆ కోపంతో అక్కడి ఊరిలోని యువకులను మరో ఊరిలో దాచిపెట్టారు. దాంతో మళ్లి గొడవలు జరిగాయి. పోలీసులు కలగజేసుకొని ఆ యువకులను వారి నుంచి విడిపించారు. పడవలు దగ్ధం కావడం, యువకులను దాచిపెట్టిన విషయాలను తెలుసుకున్న నేవీ అధికారులు హెలికాఫ్టర్ లో సంఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. సంఘటన జరిగిన ప్రాంతాలను అధికారులు పర్యటించారు.

అక్కడ మళ్లి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పికెటు ఏర్పాటు చేసారు. దానితోపాటు మత్స్యకారుల ఊరిలో 144 సెక్షన్ ను అమలు చేశారు. దాంతో గొడవలను సద్దుమణిగించేలా చేయడం కోసం మత్స్యకారుల రెండు వర్గాలకు చెందిన నాయకులతో చర్చలు జరపాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.