BREAKING NEWS

అంతా మన మంచికే...

సోషల్ నెట్వర్కింగ్... గత కొన్ని సంవత్సరాల నుంచి యువతకు చాలా చేరువయ్యింది. సోషల్ నెట్వర్క్ వదిలి ఉండలేకపోతున్నారు. దాదాపుగా యువత అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లు, హై స్పీడ్ ఇంటర్నెట్ లు కచ్చితంగా ఉంటున్నాయి.. దీంతో క్షణం కూడా ఖాళీ లేకుండా ఆన్లైన్ లో గడిపేస్తున్నారు .. అయితే ఈ సోషల్ మీడియా మంచా???? చెడా???

ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు చేశారు. అయితే అవన్నీ కేవలం సమాజానికి మంచి జరగాలి అనే ఉద్దేశంతో కనిపెట్టినవి మాత్రమే... అయితే వాటిని ఉపయోగించే విధానంలో మాత్రమే వ్యత్యాసం ఉంటోంది..

చూసే కళ్ళను బట్టే లోకం ఉంటుంది. అలాగే ఈ సోషల్ మీడియా కూడా అంతే... ఒకటి రెండూ కాదు. ఎన్నో రకాల మంచి పనులకు కూడా సోషల్ మీడియా వేదికగా మారుతోంది. చిన్నప్పుడు ఎప్పుడో విడిపోయిన చిన్ననాటి స్నేహితులు సోషల్ మీడియాలో ఒక్కటి అవ్వచ్చు.... మనకు దూరంగా ఉండే బంధువుల్ని ఆన్లైన్ లో రోజూ పలకరించచ్చు... 

ఎంతో మంది ఆపదలో ఉన్నవారికి ఇదే సోషల్ మీడియా చేయూతను ఇచ్చింది... ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది.... ఆనందాన్ని ఇచ్చింది. సంతోషాలు పంచింది... రాబోయే ప్రమాదాలను నివారించింది. ఎప్పుడో అంతరించిపోయిన ఉమ్మడి కుటుంబాలు ఈ వాట్సప్ , ఫేస్బుక్ లు మళ్లీ ఓకే చోటుకి చేరుస్తాయి...

వర్చువల్ గా. వాట్సప్ , ఫేస్ బుక్ గ్రూపులో ఎక్కడెక్కడో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ హాయిగా ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ హ్యాపీగా టైం స్పెండ్ చేస్తుంటారు. ఒకటా రెండా.... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో... ఎన్నెన్నో సమాజ హిత కార్యక్రమాలు సోషల్ మీడియా వేదికగా సాధించవచ్చు... కానీ " కడివెడు పాలలో చల్ల చుక్క" అన్న చందంగా మారిపోయింది ప్రస్తుతం ఈ సోషల్ మీడియా...

సమాచారం ఒకరి నుంచి మరొకరికి చేరడానికి చాలా సమయం పట్టేది ఒకప్పుడు... కానీ ఇప్పుడు ఈ టెక్నాలజీ యుగంలో సెకండ్స్ లో ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అయిపోతోంది. అయితే ఆ మారుతున్న సమాచారమే నిజమా? కాదా? అనేది ఆలోచించాలి...

కానీ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మన వాట్సప్ లో అన్ని గ్రూప్స్ కి ఆ మెసేజ్ నీ "*ఫార్వర్డ్*" చేసేస్తాం.. అక్కడే వస్తోంది అసలు చిక్కు. మనం ఒక్కరికి పంపిన ఆ మెసేజ్ ఒకరి నుంచి మరొకరికి ట్రావెల్ చేస్తూ కొన్ని వేల మందికి రీచ్ అయిపోతోంది. ఈ ఫేక్ ఫార్వర్డ్ మెసేజ్ లను నివారించడానికి మంచి సలహాలు ఇచ్చిన వారికి నగదు బహుమతులు కూడా వాట్సాప్ ప్రకటిస్తోంది అంటే సమస్య ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

 కేవలం ఈ సోషల్ మీడియా లో వచ్చే వార్తలు, ఫార్వర్డ్ మెసేజ్ లను గుడ్డిగా నమ్మే వాళ్లు కూడా ఉన్నారు. జరగరాని ఎన్నో ఘోరాలు కూడా జరుగుతున్నాయి. "*వాట్సప్ లో సంతోషాలు పంచండి... రూమర్స్ కాదు"* అనే ప్రకటనలు కూడా మనం ఈ మధ్య కాలంలో అన్ని టివి ఛానెల్స్, వార్తా పత్రికల్లో చూస్తున్నాం. 

ఏదైనా ఒక చిన్న సంఘటన జరిగితే దాని గురించి గంటల పాటు చర్చించుకుంటూ ఉంటాం... నిజానికి ఆ ఘటనకు మనకు ఎటువంటి సంబంధం కూడా ఉండదు. అయినా ఆ విషయం గురించే తెగ ఆలోచిస్తూ ఉంటాం... కానీ మన వాట్సప్ కు వచ్చిన ఒక్క మెసేజ్ గురించి మాత్రం కనీసం మన పక్కన ఉన్న వారిని ఒక్క మాట కూడా అడగం..

నిజమో కాదో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయం. జస్ట్ సింపుల్ గా ఫార్వర్డ్ ఆప్షన్ క్లిక్ చేసేస్తాం... *"ఎవడు చూస్తాడులే"* అని నిర్లక్ష్యమా... లేదా "*అందరి కంటే మనమే ముందు చెప్పాం"* అనే ఆరాటమా... ఏమో ఆ ఫార్వర్డ్. చేసేవారికి తెలియాలి... "*మా మెసేజ్ 10 మందికి షేర్ చేస్తే 100 రూపాయల బాలెన్స్ వస్తుంది"*..... *"ఈ పాపకి క్యాన్సర్... వాట్సప్ ఒక్కో ఫార్వర్డ్ మెసేజ్ కి 1 రూపాయి ఇస్తుంది. దయచేసి ఫార్వర్డ్ చేయండి"*.. 

ఇలాంటి ఎన్నో మెసేజ్ లు మనం నిత్యం చూస్తూ ఉంటాం... అందులో మన మొబైల్స్ కి ఫార్వర్డ్ రూపంలో వచ్చినవి ఎన్నో... నిజంగా వాట్సప్ సహాయం చేయాలి అనుకుంటే నేరుగా డబ్బులు ఇస్తుంది గానీ షేర్ లు చేయండి అంటూ ఎందుకు చెప్తుంది... కొత్తగా పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం వాట్సప్ కు లేదు కదా... కనీసం ఈ చిన్న విషయం కూడా ఆలోచించలేని స్థితిలో ఉన్నామా మనం... 

ఒక్కసారి ఆలోచించండి. మంచి కోసం కనిపెట్టిన వాటిని మంచి కోసమే వాడుకుందాం... సమాజ వ్యతిరేక పనులు , ఇలా అసత్య ప్రచారాలు చేయకుండా ఆనందంగా మనకు ఉన్న వనరులను వినియోగించుకుందాం... 

Photo Gallery