BREAKING NEWS

మాఘ పౌర్ణమి స్నానాలు, దానాలు గురించి అనేక విషయాలు మీకోసం...!

మాఘ పౌర్ణమి విశిష్టత అంతా ఇంతా కాదు. హిందువులు భక్తి తో కొలిచే పర్వదినం ఇది. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. హిందువులు ఆ రోజున పవిత్ర నది లో స్నానం చేయడం, దానం చేయడం మొదలైన వాటిని అనుసరిస్తారు. మాసాలన్నిటిలో మాఘ మాసం చాలా విశిష్టమైనది. దీనిలో ఎటువంటి సందేహము లేదు. ఎందుకంటే రథసప్తమి, భీష్మఏకాదశి, శ్రీ పంచమి, మహా శివ రాత్రి ఇలా సకల దేవతలను ఈ నెల లో కొలుస్తాము.
 
ఇక మాఘ పౌర్ణమి వచ్చిందంటే పుణ్య తీర్థాలు అన్నీ కూడా కళకళలాడి పోతాయి. ముఖ్యంగా నదులు, సముద్రాలు గుడిలో ఉన్న చిన్న చిన్న కోనేరులు కూడా జనాలతో నిండిపోతాయి. ఇక మాఘ పౌర్ణమి నాడు ఏం చేయాలి...?  ఏ  విధంగా చేస్తే పుణ్యం లభిస్తుంది...?  ఇలా అనేక విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు దీని కోసం పూర్తిగా చూసేయండి. 
 
చంద్రుడు మఘ నక్షత్రాన ఉండే మాసం కాబట్టి దీన్ని మాఘ మాసం అని అంటారు. శ్రేష్టమైన ఈ మాసం యజ్ఞయాగాది క్రతువులకు శ్రేష్టమైనది అంటారు. భక్తులు తెల్లవారుజామునే లేచి పుణ్య స్నానాలు ఆచరిస్తారు. వైష్ణవ శివాలయాల్లో అయితే ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సముద్ర స్నానం చేయడం, శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం. 
 
మాఘ పౌర్ణమి ప్రత్యేకత:
 
ఈరోజు స్నానాలు ఆచరిస్తే సర్వ పాపాలు తొలగిపోయి మోక్షం వస్తుందని భక్తుల విశ్వాసం. మాఘ  మాసం వల్ల ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆయుష్షు తో పాటు మంచితనం కూడా లభిస్తాయని పద్మ పురాణం లో ఉంది. ఇలాంటి ప్రభావాలకు ముఖ్యమైన కారణం సూర్యుడు మకర రాశి నుండి కుంభ రాశిలో ప్రవేశించడమే. అయితే ఈ సమయం లో శివుడిని కేశవుని కూడా పూజించాలని అంటారు. అలానే దాన ధర్మాలు చేయడం వల్ల ఉత్తమ ఫలితం కలుగుతుందని పండితులు అంటున్నారు.
 
ఈ సంవత్సరం మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 26 శుక్రవారం మధ్యాహ్నం 03:49 నుంచి పౌర్ణమి ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 27న 1:46 నిమిషాల వరకు ముగుస్తుంది. ఉదయ తిథి శుక్రవారం 27న ఉంది కాబట్టి ప్రధానంగా ఈ రోజున జరుపుకుంటారు. ఈ రోజున నది లో స్నానం చేయడం చాలా మంచిది. పౌర్ణమి నాడు ఉపవాసం పాటించే వారు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలంటే 26వ తేదీన చేసుకోవచ్చు. 27న మాత్రం నదీ స్నానం చేయచ్చు. 
 
పవిత్ర నది లో స్నానం చేయడం వల్ల ఏం కలుగుతుంది:
 
మాఘ పౌర్ణమి నాడు గంగానదిలో స్నానం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది. లేదు అంటే దగ్గర లో  ఉన్న సముద్రాలు లేదా దేవాలయం లో ఉండే కోనేరు లో కూడా స్నానం చేయచ్చు. ముఖ్యంగా కాశి, ప్రయాగ, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాల లో  స్నానం చేయాలని పురాణాల్లో ఉంది. అక్కడ భక్తులు కూడా ఎక్కువగా వచ్చి స్నానం ఆచరించి  పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. హిందువుల విశ్వాసం ప్రకారం శివుడు  ప్రధానంగా మాఘ పౌర్ణమి రోజు గంగాస్నానం చేయడం పట్ల అదృష్టం మరియు సంపద మరియు మోక్షాన్ని ఇస్తాడు అని అంటారు.
 
మాఘ పౌర్ణమి నాడు చేయవలసిన దానాలు:
 
మామూలు రోజుల్లోనే దానం వల్ల ఎంతో మంచి ఫలితం కనిపిస్తుంది అని అంటారు. అటువంటిది ఇటువంటి పర్వ దినాన ఎవరికైనా దానం చేస్తే చాలా మంచి ఫలితం కనిపిస్తుంది. మాఘ పౌర్ణమి మహాభాగ్యం అని కూడా అంటారు. మాఘ మాసం లో దేవతలు తమ సర్వశక్తులూ తేజస్సులు జలాల్లో ఉంచుతారు. అందువల్ల మాఘ స్నానం చాలా గొప్పది అని అంటారు. ప్రవాహ జలంలో చేస్తే అధిక ఫలితం కనిపిస్తుంది.
 
స్నానం చేసిన తర్వాత సమస్త జీవ రాశికి ఆధారమైన సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పణ చెయ్యాలి. దగ్గర లో ఉన్న వైష్ణవ, శివాలయానికి వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. పూజ అయిపోయిన తర్వాత ధర్మాలు చేయొచ్చు. గొడుగు, నువ్వులు దానం చేస్తే విశేష ఫలం లభిస్తుంది. ఇలా చేయడం వల్ల జన్మజన్మల నుంచి వెంటాడుతున్న పాపాలు మరియు దోషాలు తొలగిపోతాయి ఇవి దానం చేయడం వల్ల అశ్వమేధయాగం చేసినంత ఫలితం మనకి వస్తుంది. ఈ విషయం సాక్షాత్తు శ్రీకృష్ణుడే ధర్మరాజు తో చెప్పాడట.
 
మాఘ పౌర్ణమి స్నాన ఫలం:
 
బావి నీటితో స్నానం చేయడం వల్ల 12 సంవత్సరాల పుణ్య ఫలితం లభిస్తుంది. అదే చెరువులో స్నానం చేస్తే 24 సంవత్సరాల పుణ్యఫలం లభిస్తుంది. సాధారణ నదిలో స్నానం చేయడం వల్ల 96 సంవత్సరాల పుణ్య స్నాన ఫలం లభిస్తుంది. పుణ్య నదీ జలాలలో స్నానం చేస్తే 9600 సంవత్సరాల పుణ్యఫలం లభిస్తుంది. అలానే సంగమ నదుల్లో స్నానం చేస్తే 38400 సంవత్సరాల పుణ్య స్నాన ఫలితం లభిస్తుంది.
 
గంగా నది లో స్నానం చేస్తే మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల సంవత్సరాల పుణ్యఫలం లభిస్తుంది. ప్రయాగ లోని, త్రివేణి సంగమంలో స్నానం చేస్తే గంగానదీ స్నాన ఫలితం కంటే నూరు  రెట్లు అధిక ఫలం కలుగుతుంది. సముద్ర స్నానం చేస్తే వచ్చే పుణ్య ఫలాన్ని చెప్పడానికి మాటలు చాలవుట. ఇంత గొప్ప ఫలితం మనకి మాఘ పౌర్ణమి నాడు కలుగుతుంది.