BREAKING NEWS

అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం: తెలుగు గొప్పతనం, ప్రాముఖ్యత..!

తెలుగు భాష యొక్క మధురిమను వివరించలేము. తేనె కన్నా తీయనిది తెలుగు భాష. కానీ నేటి కాలం లో పిల్లలు తెలుగుకి దూరం అయిపోతున్నారు. పూర్వ కాలం లో వేమన పద్యాలు, సుమతి శతకాలు, సుభాషిత రత్నాలు, పెద్దబాల శిక్ష వీటన్నిటినీ చదివే వారు. కానీ ఇప్పుడు పిల్లలకి ఇటువంటివి ఏమి తెలియక పోతుంది. ప్రతి ఒక్కరికి తమ భాష రావాలి. ఎలా అయితే మన సంస్కృతిని,  మన సంప్రదాయాన్ని మనం ఎలా అయితే పాటిస్తున్నామో...అలానే మన భాష కి కూడా గౌరవం ఇచ్చి దానిని అనుసరించాలి.
 
వేమన పద్యాలు చెదిరిపోయాయి. వేల ఏళ్ల నుంచి మనం అనుసరిస్తున్న చందస్సు, యతి, ప్రాసలు ఇవన్నీ కనుమరుగై పోతున్నాయి. రోజు రోజుకీ పదాలు కూడా పక్కకు వెళ్లి పోతున్నాయి. ఎటు చూసుకున్న ప్రతి ఒక్కరు మన భాషను మరచిపోతూనే ఉన్నారు. కానీ ఇటువంటి రోజులలో  ఈ ప్రముఖ రోజులని జరుపుకుంటూ... తెలుగు భాష ప్రాధాన్యత ఈతరం వాళ్ళకి కూడా అందేలా చెప్పాలి. తెలుగు భాష గొప్పతనం చాటాలి. పిల్లలకి తెలుగు పట్ల ఆసక్తిని కల్పించాలి. అయితే నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. ఈ సందర్భంగా మనం మన మాతృభాష అయిన తెలుగు కోసం, వాడుక భాష కోసం పోరాడిన గిడుగు వారి కోసం అనేక విషయాలు తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు దీని కోసం పూర్తిగా చూసేయండి.
 
పరాయి భాష మీద మక్కువ:
 
ఇప్పుడు మన బాషని మనమే మాట్లాడుకోకుండా పరాయి భాషలో మాట్లాడుకుంటూ... మన బాషని మనమే అవమానించు కుంటున్నాం. ఒకప్పుడు ఆకాశ మార్గాన ఉన్నా ఈ భాషను, ఈ సాహిత్యాన్ని ఇప్పుడు నేల మీద పాదేశము.
 
గిడుగు రామ్మూర్తి పంతులు గారు వాడుక భాష కోసం ఎంతగానో పోరాడారు. ప్రతి ఏటా ఆగస్టు 29వ తేదీన తెలుగుభాషా దినోత్సవాన్ని జరుపుకుంటాం. అయితే ఫిబ్రవరి 21న మాత్రం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుతాము. ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ భాషల్ని గౌరవించుకుని  ఈ దినోత్సవాన్ని జరుపుతారు. మన మాతృభాష అయిన తెలుగు భాషని కూడా మనం గౌరవించుకునే జరుపుకోవాలి. తెలుగు వెలుగులు మసకబారి కాకుండా మనమే దానిని కాపాడుకోవాలి. తెలుగు భాషకు పట్టాభిషేకం చేసి వైభవ ప్రభావాలతో కలవడానికి మనం ఈ రోజు జరుపుకోవాలి.
 
నేటి తరాలకి ఆదర్శం మీరే:
 
తెలుగు భాష తియ్యదనం వివరించడానికి సాధ్యం కాదు. తెలుగు భాష తియ్యదనం తెలుగు భాష గొప్పతనం... అని  సినీ కవుల కలం నుంచి ఈ అమృత అక్షరాలు జాలువారాయి. కొన్ని పాటల్లో అయితే తెలుగు మధురిమ మనకు కనబడుతుంది. నేటి కవులు, కవయిత్రిలు కూడా ఈ జనరేషన్ వాళ్ళకి తెలుగు భాష కోసం చెప్తూ ఉండాలి. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వాళ్లు తెలుగు వైపు కి మక్కువ చూపేలా మీరు వాళ్ళకి ఆదర్శంగా నిలవాలి.
  
వాడుక భాష కోసం పోరాడిన గిడుగు వారి గురించి కొన్ని విషయాలు:
 
గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు తెలుగుభాష కోసం ఎంత గానో కృషి చేశారు. ఈయన తో పాటు వీరేశలింగం, గురజాడ అప్పారావు గారు కూడా పోరాడటం జరిగింది. గిడుగు రామ్మూర్తి పంతులు గారు తన జీవితం లో అనేక ఉద్యమాల లో పాల్గొన్నారు. ఈయన శ్రీకాకుళం జిల్లాకు చెందిన పర్వతాలపేట గ్రామం లో జన్మించారు.
 
ఈయన ఉపాధ్యాయుడిగా పని చేసేవారు. విద్యకు సంబంధించి వివిధ బాధ్యతలు కూడా ఈ నెరవేర్చారు. పదవీ విరమణ తర్వాత ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు గారు అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది వాడుక భాష గురించి, ఆయన చేపట్టిన ఉద్యమం గురించి. అప్పుడు ఆయన ఆ ఉద్యమం చేయబట్టి ఇప్పుడు మనం పాఠశాల లో సమాచార, ప్రసార సాధనాల్లో సాహిత్యంలో మాట్లాడే భాషను ఉపయోగించుకుంటున్నాము. ఈయన చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిది.
 
తల్లితో సమానం మన మాతృ భాష: 
 
మాతృ భాష ఏదైనా తల్లితో సమానం మనం తల్లిని ఎలా  అయితే గౌరవిస్తామొ అలానే  మనం మాతృ భాషను కూడా అంతే గౌరవించాలి. ఆంగ్ల భాష కేవలం ఊతకర్ర మాత్రమే. మామూలుగా ఊతకర్ర ని మనం నడవలేని సమయం లో ఉపయోగిస్తూ ఉంటాము. దీని వల్ల ఏమవుతుంది అంటే మనం సరిగ్గా నడవచ్చు అని. అయితే తెలుగు భాష మీద మనం ఆధార పడటం మానేసి ఊతకర్ర అయినా ఆంగ్లం లో మనం నడుస్తున్నాము. కానీ అర్థం కాని విషయం ఏమిటంటే అంతా సొంత కాళ్ళ మీద నిలబడటం మానేశాము అని. కాబట్టి ఎప్పుడూ అమ్మ భాషని మరవకండి.
 
ఈ కమ్మని భాషని  గౌరవించండి. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని తెలుగు చదవడానికి ప్రోత్సహించాలి. ఉపాధ్యాయులు కూడా తెలుగు పుస్తకాలను చదివిస్తూ ఉండాలి. నేటి కాలంలో చాలా మందికి తెలుగులో రాయడం చదవడం కూడా రావడం లేదు కనుక వాళ్లకి నేర్పండి. 
 
అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం శుభాకాంక్షలు..