BREAKING NEWS

నోరూరించే కోనసీమ పొట్టిక్కలు, చిట్టి పెసరట్లు రెసిపీ మీకోసం..!

చిరు ధాన్యాల తో, తృణధాన్యాల తో ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే కేవలం వట్టి ఆరోగ్యం మాత్రమే మనకి వస్తుంది అనుకుంటే పొరపాటు. వీటితో ఈ వంటకాలు చేసుకుంటే చాలా రుచిగా కూడా ఉంటాయి. పోషకాలు లభించే ఆహార పదార్థాలతో ఇంట్లో సులువుగా చేసుకోవచ్చు. వీటిని ఎక్కువగా కోనసీమ ప్రాంతాల లో తయారు చేస్తూ ఉంటారు. అక్కడ జనాలు వీటిని తినడానికి క్యూ కడతారు.

దూర ప్రాంతాల్లో ఉన్నాం కదా ఎలా చేసుకోవాలి అని సందేహం కలిగిందా....?  అయితే మీ ఇంట్లో ఇలా చేసుకోండి. దీంతో మీకు ఆరోగ్యం, రుచి కూడా లభిస్తుంది. చక్కగా పొట్టిక్కలు, దిబ్బ రొట్టి వంటివి కూడా సరదాగా మీరు చేసుకుంటూ ఉంటే బోర్ కూడా కొట్టదు. పైగా మీ బ్రేక్ ఫాస్ట్ లో మార్పు కూడా కనిపిస్తుంది. అంతే కాదండి ముఖ్యంగా ఆరోగ్యం కలుగుతుందని మర్చిపోవద్దు. 
 
ప్రత్యేకమైన చిట్టి పెసరట్టు ఎలా తయారు చేసుకోవాలో ముందు చూద్దాం. చిట్టి పెసరట్టు పేరు ఎత్తితే నోరూరి పోతుంది కదా...?  ఎంతో సులువుగా దీనిని చేసుకోవచ్చు. ఇక ఎలా చేయాలో తెలుసుకుందాం.
 
చిట్టి పెసరట్టు కి కావలసిన పదార్థాలు: పెసలు, అల్లం, జీలకర్ర, కారం, ఉప్పు, నూనె
 
చిట్టి పెసరట్టు తయారు చేసే విధానం:
 
వీటి కోసం ముందుగా పెసలుని శుభ్రం చేసుకుని, బాగా కడిగి ముందు రోజు రాత్రి నాన బెట్టుకోవాలి. ఆ తర్వాత ఉదయాన్నే ఆ నానిపోయిన పెసలని తీసి రుబ్బుకుని పిండి సిద్ధం చేసుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టి అట్టు లాగ దానిని పోయాలి. అల్లం, జీలకర్ర, కారం పొడి వేసి కొద్దిగా నూనె వేసుకుని ఎర్రగా కాల్చుకుంటే వావ్ అనాల్సిందే. దీన్ని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు.
 
పొట్టిక్కలు:
 
వీటిని కూడా ఎక్కువగా మనం కోనసీమ ప్రాంతాల లో చూస్తూ ఉంటాము. ఇవి గొప్ప రుచిగా ఉంటాయి. ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇక తయారు చేసుకునే విధానం కావలసిన పదార్థాలు చూసి మీరు కూడా ట్రై చేయండి. దీనితో మీకు వీటి రుచి బాగా తెలుస్తుంది. 
 
పొట్టిక్కలుకి కావలసిన పదార్థాలు: మినప్పప్పు, నూక, ఉప్పు, పనస ఆకు బుట్టలు
 
పొట్టిక్కలు తయారు చేసుకునే విధానం:
 
ముందుగా మినప్పప్పును శుభ్రం చేసుకుని ఒకటికి రెండుసార్లు కడిగి నాన బెట్టుకోవాలి. దీనిని మెత్తగా రుబ్బుకోవాలి. నూక కలిపిన మిశ్రమాన్ని తయారు చేసుకుని పక్కన ఉంచుకోవాలి. పనస ఆకులతో బుట్ట మాదిరిగా కుట్టి.... సిద్ధం చేసుకున్న పిండిని ఈ ఆకుల మధ్య లో వేయాలి. వేసిన తర్వాత ఆవిరి మీద పెట్టి ఉడికించాలి. కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, బొంబాయి చట్నీ లేదా మీకు నచ్చిన చట్నీ తో దీనిని వేడివేడిగా తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. వీటిని ఆవిరి మీద పనస ఆకులతో ఉడికించడం వల్ల దీని టేస్ట్ మరింత బాగుంటుంది. నిజంగా నమ్మాల్సిందే నమ్మట్లేదా...?  అయితే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి దీంతో మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది.
 
విటమిన్ ఇడ్లీ:
 
అవును చాలా మంది చిన్న పిల్లలు ఇడ్లీని ఇష్టపడరు. అలాంటప్పుడు వాళ్లకి ఈ విటమిన్ ఇడ్లీని పెట్టండి. దీనిని వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. విటమిన్ ఇడ్లీ ఏంటి గమ్మత్తుగా ఉంది అనుకుంటున్నారా...?  లేదండి ఇది కోనసీమలో అక్కడక్కడ హోటల్స్ లో దొరుకుతుంది. దీనిని చాలా మంది ఇష్టపడి తింటుంటారు. మరి అంత దూరం వెళ్ళలేరు కదా...! అందుకే మీ ఇంట్లో మీరే తయారు చేయండి. రుచితో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది. 
 
విటమిన్ ఇడ్లీ కి కావలసిన పదార్థాలు: రాగులు, బీట్‌రూట్‌, మినప్పప్పు, ఇడ్లీనూక, ఉప్పు, నూనె.
 
విటమిన్ ఇడ్లీని తయారు చేసుకునే విధానం:

 
ఈ ఇడ్లీని చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. ముందు రోజు రాత్రి మినప్పప్పు రాగులు తీసుకుని నానబెట్టుకోవాలి. ఈ రెండిటినీ విడిగా నాన బెట్టుకోవాలి గమనించండి. అయితే ఉదయాన్నే నాన బెట్టిన వాటిని తీసి మిక్సీ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత బీట్రూట్ ని తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పిండి లో వేసి రుబ్బు కోవాలి.

ఆ తర్వాత ఇడ్లీ నూక కలపండి. ఇప్పుడు పిండి సిద్ధమై పోయింది కదా...! ఇడ్లీ కుక్కర్ తీసుకుని అచ్చం ఇడ్లీ మాదిరి వేసుకోండి. మీకు నచ్చిన చట్నీ తో దీన్ని తింటే అదిరిపోతుంది మరి. చూశారా..! ఎంత ఈజీగా ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ చేసుకో వచ్చో..! పైగా ఇవి రొటీన్ కి భిన్నంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ తినడానికి ఇష్ట పడతారు పైగా ఆరోగ్యం కూడా. మరి ఇంకేం ఆలోచించకండి ఈ సింపుల్ రెసిపీస్ మీ ఇంట్లో ట్రై చేసేయండి.