BREAKING NEWS

ప్రకృతి ప్రేమికులు ఉబ్బలమడుగు జలపాతాల్ని చూస్తే వావ్ అనాల్సిందే...!

ఉబ్బలమడుగు జలపాతం ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఉంది. ఈ ప్రదేశం చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది.  వర్షా కాలం లో అయితే ఈ ప్రదేశం కళకళ్ళాడుతూ ఉంటుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తికి ఈ జలపాతాలు 35 కిలో మీటర్ల దూరం లో ఉన్నాయి. సిద్ధులకొన అని పిలవబడే అడవి లో ఈ జలపాతాలు ఉన్నాయి. తిరుపతి నుండి ఈ ప్రదేశానికి 85 కిలో మీటర్ల దూరం. ఉబ్బలమడుగు జలపాతంని తడ జలపాతం అని కూడా అంటారు.
 
నిజంగా ఈ జలపాతాలు వీక్షకుల్ని బాగా ఆకట్టుకుంటాయి. వరదయ్య పాలెం అనే ఊరు నుండి ఇక్కడికి రోడ్డు సౌకర్యం కలదు. అందుకే పర్యాటకులు ఈ మార్గం లోనే ఎక్కువగా వెళుతూ ఉంటారు. నిజంగా ఈ ఉబ్బలమడుగు జలపాతం ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. మహా శివ రాత్రి నాడు ఎక్కువ మంది వస్తూ ఉంటారు. చుట్టూ అందమైన ప్రకృతి వాటి నడుమ ఈ జలపాతాలు ఎంత గానో ఆకట్టుకుంటాయి. ప్రకృతి ప్రేమికులు కనుక ఇక్కడికి వచ్చాయంటే వదిలి వెళ్లడం చాలా కష్టం. పక్షుల కిలకిల రావాలతో అందమైన జలపాతాలతో కనువిందు చేస్తుంది ఈ ప్రదేశం. 
 
నీళ్ల మీద నిర్మించిన వంతెన:
 
నీళ్ల మీద వంతెన ప్రధానంగా ఆకర్షిస్తుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ వంతెన మీద నుంచుని ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. నీటిలో దిగి ఈత కూడా కొడుతూ ఉంటారు. నిజంగా ఈ దృశ్యం చాలా బాగుంటుంది. చిన్నపాటి సెలయేర్లు ప్రశాంత ప్రకృతిని కనుక చూస్తే ఎంతటి వారైనా ముగ్గులు అవ్వాల్సిందే. ఈ జలపాతం లో తనివి తీరా జలకాలు ఆడొచ్చు. 
 
సిద్దేశ్వర ఆలయం:
 
ఉబ్బలమడుగు జలపాతం పక్కనే సిద్దేశ్వర ఆలయం ఉంది. వందేళ్ల చరిత్ర ఈ ఆలయానికి ఉంది. ఈ ఆలయం లో పూజలు చేస్తే శుభం చేకూరుతుందని భక్తులు నమ్ముతారు. స్వయంభువుగా వెలసిన శివుడు ఇక్కడ ఉన్నాడు. శివరాత్రి కి జనం అధిక సంఖ్య లో వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు.
 
అతి వైభవంగా శివరాత్రి ఉత్సవాలు:
 
ఇక్కడ సిద్దేశ్వరం ఆలయం లో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మహా శివ రాత్రి రోజున ఉబ్బలమడుగు ప్రాంతం జనసంద్రాన్ని తలపిస్తుంది. కుటుంబ సమేతంగా స్థానికులు ఇక్కడకు వచ్చి పూజ కార్యక్రమం లో పాల్గోవడమే  కాకుండా టెంట్లు వేసుకుని వంటా వార్పు కానిస్తారు. ఆ సమయం లో దుకాణాలు కూడా ఎక్కువగా పెడుతూ ఉంటారు. నిజంగా అప్పుడు ఒక పెద్ద పండగ లాగ ఉంటుంది.
 
ఈ జలపాతానికి ఎలా చేరుకోవాలి..?
 
సొంత వాహనాల మీద వచ్చే వారు సులువుగా వచ్చేయొచ్చు. పబ్లిక్ వాహనాల మీద వచ్చే వాళ్ళు వరదయ్యపాలెం నుంచి ఆటో లో ఇక్కడికి చేరుకోవచ్చు. శివరాత్రి పర్వ దినాన ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కూడా నడుపుతూ ఉంటారు. కాబట్టి ఇబ్బంది లేదు. సాధారణ రోజుల్లో అయితే ఈ ప్రాంతంలో ఉండడం కొంచెం ప్రమాదకరం. కనుక చీకటి పడగానే వరదయ్య పాలెం తిరుగు ప్రయాణం అవ్వడమే మంచిది.

ఇది పూర్తిగా అటవీ ప్రాంతం కాబట్టి ఎటువంటి వసతి సౌకర్యాలు ఉండవు. వరదయ్యపాలెం వరకు కనీస సౌకర్యాలు ఉంటాయి. అక్కడి నుంచి దాటిన తర్వాత మీకు ఏ సౌకర్యాలు ఉండవు కాబట్టి ముందు గానే మీరు అన్ని సిద్ధం చేసుకుంటే మంచిది. ఎత్తయిన పర్వత శ్రేణి లో ఉండే ఈ జలపాతాన్ని చేరాలంటే కాలినడకన కొంత దూరం గుట్టపై మీదగా రావాలి. చుట్టూ అందమైన అడవి, పైన జలపాతం ఎంత అందంగా ఉంటుంది...! 
 
ఉబ్బల మడుగు ట్రెక్కింగ్: 
 
ఇక్కడ ట్రెక్కింగ్ కోసం ట్రెక్కర్స్ వస్తూ ఉంటారు. జలపాతానికి చేరుకోవాలంటే 10 కిలో మీటర్లు నడవాలి. ఈ జలపాతం ఎంతో అందమైన, ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉంటుంది. ట్రెక్కర్స్  ఇక్కడికి రావడానికి బాగా ఆసక్తి చూపిస్తారు. అలానే వేసవి తాపం తగ్గించేందుకు పర్యాటకులు ఈ వాటర్ ఫాల్స్ కి రావడానికి క్యూ కడతారు. ఇటు ఆంధ్ర నుంచి మాత్రమే కాకుండా తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు అధిక సంఖ్య లో వస్తుంటారు.
 
ఆదివారాలు సందడి:
 
 ఆదివారం రోజు పర్యాటకులు ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఇక వేసవి లో అయితే ఎండ వేడి  ఎక్కువ ఉండడం వల్ల చిత్తూరు జిల్లా లో ప్రముఖ పర్యాటక కేంద్రాల లో తలకోన, ఉబ్బలమడుగు, సదాశివ కోన, కైలాసకోన పర్యాటకుల తో సందడిగా మారిపోతాయి. సాధారణ రోజుల్లో ఎక్కువ మంది కుటుంబ సమేతంగా ఇంటికి వస్తూ ఉంటారు.

  ఇది ఇలా ఉండగా ఇక్కడ ఎన్నో రకాల పక్షులు కూడా మనకి కనిపిస్తాయి. ప్రధానంగా పిచ్చుకలు సందడి చేస్తాయి. దట్టమైన వృక్షాల మధ్య నుంచి ప్రవహించే స్వచ్ఛమైన నీరు పరవళ్ళు తొక్కుతూ కనిపించే సుందర దృశ్యం ఎంతో రమణీయంగా ఉంటుంది. మరి మీరు కూడా ఈ వాటర్ ఫాల్స్ కి ఒక ట్రిప్ వేసేయండి. కుటుంబ సమేతంగా గడిపేయండి.