BREAKING NEWS

డిస్కో కింగ్… 'బప్పి లహిరి' కన్నుమూత!

భారతదేశంలో డిస్కో సంగీతాన్ని పరిచయం చేసి, ప్రాచుర్యంలోకి తెచ్చిన ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు బప్పి లహిరి(69), బుధవారం అనగా, ఈరోజు తెల్లవారుజామున ముంబైలోని క్రిటికేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన ఓఎస్ఏ(అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా)తో మరణించినట్లుగా వైద్యులు నిర్ధారించారు. కావున ఈ సందర్భంగా ఆయన నిజజీవిత విషయాలతో పాటు, సమకూర్చిన స్వర విశేషాల గురుంచి ఈరోజు మనం తెలుసుకుందాం:
 
బాల్యం...

1952 నవంబర్ 27న పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్ గురిలో అపరేష్ లహిరి, బన్సారీ లహిరి దంపతులకు జన్మించారు బప్పి. ఆయన అసలు పేరు అలోకేష్ లహిరి.
తండ్రి ప్రసిద్ధ బెంగాలీ గాయకుడు. తల్లి సంగీత విద్వాంసురాలు. శాస్త్రీయ, శ్యామ సంగీతాల్లో బాగా ప్రావీణ్యం పొందిన గాయని. అతని తల్లిదండ్రులు అతనికి సంగీతంలోని ప్రతి అంశంలోనూ శిక్షణనిచ్చారు. బప్పి వారికి ఏకైక సంతానం. మూడేళ్ల వయసు నుంచే తబలా వాయించడం మొదలు పెట్టాడు. బప్పి లహిరికి, చిత్రాణితో వివాహం జరిగింది. అతని కుమార్తె రెమ కూడా అద్భుతమైన గాయని.
 
కెరీర్ లోకి...

బప్పి 19 సంవత్సరాలకే సంగీత దర్శకుడిగా వృత్తిని ప్రారంభించాడు.
1972లో వచ్చిన మొదటి బెంగాలీ చిత్రం 
'దాదు'తో తొలి సినిమావకాశాన్ని పొందారు.
మొదటి హిందీ చిత్రం 1973లో వచ్చిన 'నన్హా షికారి'. బాలీవుడ్‌లో బప్పిని నిలబెట్టిన చిత్రం 1975లో వచ్చిన జఖ్మీ, దీనికి సంగీతాన్ని సమకూర్చడమే కాక  నేపథ్య గాయకుడిగానూ స్వరాలందించాడు. ఈ చిత్రం అతన్ని ఓ స్థాయికి తీసుకొచ్చింది. దీంతో హిందీ చిత్ర పరిశ్రమలోనే కొత్త శకానికి దారి తీసింది. తదుపరి చిత్రాలైన 'చల్తే చల్తే', 'సురక్షా' పాటలు విపరీతమైన ప్రజాదరణను పొందాయి. అతి తక్కువ వ్యవధిలో స్వరకర్తగా ఎన్నో విజయాల్ని తన ఖాతాలో వేసుకున్నారు.
 
డిస్కో కింగ్...

బప్పి భారతదేశంలోని డిస్కో ట్యూన్లకు మార్గదర్శకుడయ్యారు. అతని జోష్, రిథమిక్ మ్యూజిక్ తో దశాబ్దాలుగా సంగీతాభిమానుల్ని ఓలలాడేలా చేశారు.
భారతదేశంలో డిస్కో బీట్ కి సంబంధించి ఏకైక మూలకర్తగా బప్పి భారతదేశం అంతటా విస్తృతంగా గుర్తింపు పొందాడు. నేటికీ ఆయన్ను "డిస్కో కింగ్" గానే పిలుస్తారు.

1980లలో 'డిస్కో డ్యాన్సర్' వంటి చిత్రాలకు తన కంపోసింగ్ ద్వారా మంచి గుర్తింపు సాధించారు. బప్పి సంగీత స్వరకర్త మాత్రమే కాదు గాయకుడు కూడా.
అతను మహ్మద్ రఫీ, కిషోర్ కుమార్‌లతో కలసి యుగళగీతాలు పాడాడు. లతా మంగేష్కర్, ఆశా భోంస్లే వంటి ప్రఖ్యాత గాయకులతో కూడా పని చేశాడు. మిథున్ చక్రవర్తి హీరోగా నటించిన ప్రకాష్ మెహ్రా నిర్మించిన 'దలాల్' చిత్రానికి సంగీతం అందించాడు. 1990లలో హిందీ సంగీత పరిశ్రమలో ఆయన హవానే నడిచింది. 

2000లో అతని ఆల్బమ్ 'బప్పీ మ్యాజిక్ - ది అస్లీ బాప్ మిక్స్', 'గోరీ హై కలైయాన్', 'జిమ్మీ జిమ్మీ' వంటి ప్రముఖ పాటలు 2004లో విడుదలై గొప్ప విజయాన్ని అందుకున్నాయి.

2006లో టాక్సీ నంబర్ 9211 చిత్రం కోసం విశాల్- శేఖర్ కోసం పాడిన "బొంబాయి నగరియ" పాటతో మొదటిసారిగా తన గాత్రాన్ని మరొక స్వరకర్తకు అందించాడు. దానికి అనూహ్య స్పందన వచ్చింది. 

బుల్లితెరపై రియాల్టీ షోలవైపు దృష్టి సారించారు. 2006లో, జీ టీవీలోని ప్రముఖ టెలివిజన్ షో 'స రే గ మ ప' ఇల్ చాంప్స్'లో గాయకులు అల్కా యాగ్నిక్, అభిజిత్‌లతో సహా న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఈ రియాలిటీ షోలన్నీ ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీని పొందినవే.
 
2016 చివర్లో, లహిరి డిస్నీకి చెందిన త్రీడి కంప్యూటర్- యానిమేటెడ్ ఫాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్ మోనా హిందీ-డబ్బింగ్ వెర్షన్‌లో టమాటోవా పాత్రకు గాత్రదానం చేశారు. అలాగే "షైనీ" హిందీ వెర్షన్ "షోనా" (గోల్డ్) కూడా స్వరపరిచాడు. యానిమేషన్ క్యారెక్టర్‌కి డబ్బింగ్ చెప్పడం ఇదే మొదటిసారి. అలాగే రామరతన్ పాట "యే హై డ్యాన్స్ బార్"లో కూడా కనిపించాడు. 

తెలుగులో గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, నిప్పు రవ్వ, రౌడీ ఇన్‌స్పెక్టర్ వంటి హిట్ సినిమాలకు ఆయన సంగీతం అందించారు. తరువాత మణిరత్నం నిర్మించిన తెలుగు చిత్రం 'గురు' టైటిల్ ట్రాక్‌కి తన గాత్రాన్ని అందించాడు.
తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా తెచ్చుకున్న బప్పి లహిరి తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ సినిమాల్లో ఎన్నో గుర్తుండిపోయే పాటలు పాడారు. ఎన్నో సినిమాలకు సూపర్ హిట్ ఆల్బమ్స్ ను అందించారు.
 
గోల్డెన్ లుక్...

బప్పి లహిరి అనగానే మనకు మదిలో వెంటనే ఓ లుక్ స్ట్రైక్ అవుతుంది. కాస్త జులపాల జట్టు, కళ్లకు నల్లద్దాలు, మెడ నిండా బంగారంతో విభిన్న లుక్ లో కనిపిస్తుంటారు. బప్పికి బంగారమంటే అమితమైన ఇష్టం. 'గోల్డ్ ఈజ్ మై గాడ్' అనేది తన ఫేవరెట్ కొటేషన్‌గా ఆయన చెబుతుండేవారు. బంగారంపై తనకు ఎందుకంత ఇష్టం ఏర్పడిందంటే..

అప్పట్లో అమెరికన్ పాప్ స్టార్ ఎల్విస్ ప్రెస్లీ తన మ్యూజిక్ కాన్సర్ట్స్‌లో మెడ నిండా బంగారంతో కనిపించేవాడని, అది చూశాక తనకు కూడా అలా కనిపించాలనే ఆసక్తి ఏర్పడిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు లహిరి. తాను సక్సెస్ అయిన రోజు అలా బంగారంతో కనిపించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అనుకున్నట్లుగానే సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా సక్సెస్ అయ్యాక ఆయన అప్పటినుంచి మెడ నిండా బంగారంతోనే కనిపించేవారు.
 
ఇతరాంశాలు

◆ 63వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో బప్పి 'ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు'ను గెలుచుకున్నారు.

◆ 2014 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని శ్రీరాంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 

సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘సింహాసనం’తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి, మంచి అవకాశాలు అందుకున్నారు. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తరువాత మెగాస్టార్ చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్’ మరో అతిపెద్ద మ్యూజికల్ హిట్‌ గా నిలిచింది.

◆ దిగ్గజ స్వరకర్త, గాయకుడి ఆకస్మిక మరణంపై అతని అభిమానులు, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బప్పి లహిరి అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం ముంబైలో జరగనున్నాయి.