BREAKING NEWS

మాస్ ఆడియెన్స్ కు ఫుల్ పవర్ ప్యాక్ ఈ 'నాయక్‌'…!

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. అభిమానుల ఆశల్ని రెట్టింపు చేసేలా… ఆసక్తికరమైన ట్రైలర్, దద్దరిల్లే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో, ఎన్నో రోజుల నిరీక్షణకు తెర తీసి, థియేటర్లలో బ్రహ్మాండంగా విడుదలైంది భీమ్లా నాయక్ సినిమా. 

ఇది పవన్ ఫ్యాన్స్ కు పెద్ద పండగనే చెప్పాలి. 
‘వకీల్ సాబ్ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన తాజా సినిమా 'భీమ్లా నాయక్‌'…మరో కీలక పాత్రలో హీరో రానా నటించారు. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్‌, స్క్రీన్‌ ప్లే అందించారు. 

ఇప్పటికే మలయాళంలో మంచి హిట్ అందుకున్న  'అయ్యప్పనుమ్‌ కొషియుమ్‌' మూవీకి రీమేక్‌గా తెలుగులో ఈ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. నిత్యా మీనన్‌, సంయుక్త మీనన్ లు హీరోయిన్లుగా అలరించారు. 
కొవిడ్ వల్ల పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం… ఎట్టకేలకు ఈ శుక్రవారం అంటే, ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? ఈ సినిమాకి సంబంధించిన ఇతర ప్రత్యేకతల గురుంచి ఈరోజు రివ్యూలో చూసేద్దాం.  
 
టైటిల్‌: భీమ్లా నాయక్‌
నటీనటులు: పవన్‌ కల్యాణ్‌, రానా, నిత్యా మీనన్‌, సంయుక్త మీనన్‌, మురళీ శర్మ తదితరులు…
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
దర్శకత్వం: సాగర్‌ కె. చంద్ర
సంగీతం: తమన్‌
నిర్మాణ సంస్థ: సితార ఎంటర్టైన్మెంట్స్ 
సినిమాటోగ్రఫీ: రవి కె. చంద్రన్‌
ఎడిటర్‌: నవీన్‌ నూలి
 
కథేంటంటే

భీమ్లా నాయక్‌(పవన్‌ కల్యాణ్‌) కర్నూలు జిల్లా హఠకేశ్వర్‌ మండలం పోలీస్టేషన్‌లో నిజాయతీపరుడైన ఎస్సై. డేనియల్‌ శేఖర్‌ ఓ రిటైర్డ్‌ ఆర్మీ ఆఫీసర్‌. అతని తండ్రి(సముద్రఖని) వరంగల్‌   మాజీ ఎంపీ. రాజకీయ పలుకుబడి ఉన్న డేనియల్‌ శేఖర్‌ ఓ రోజు రాత్రి బాగా తాగేసి, అడవి మార్గం వైపు వెళ్తూ మద్యం బాటిళ్లతో నాయక్ కు దొరుకుతాడు. దీంతో డేనియల్‌ను అక్కడే విధుల్లో ఉండగా కొట్టి, ఆపై అరెస్ట్‌ చేస్తాడు. ఈ సంఘటనతో డేనియల్‌ అహం దెబ్బతింటుంది. తనను అరెస్ట్‌ చేసిన భీమ్లా నాయక్‌ని ఎలాగైనా దెబ్బ కొట్టాలని అనుకుంటాడు.

ఆయన చేసిన ఓ కుట్రలో భాగంగా భీమ్లా నాయక్‌ కు ఉద్యోగం పోతుంది. అంతేకాదు అతని భార్య సుగుణ(నిత్యా మీనన్‌) కూడా అరెస్ట్‌ అవ్వాల్సి వస్తోంది. అసలు భీమ్లా నాయక్‌ ఉద్యోగం ఎందుకు పోతుంది? తన ప్రతీకారం తీర్చుకునే క్రమంలో డేనియల్‌ శేఖర్‌ ఎలాంటి తప్పులు చేశాడు? సస్పెండ్‌ అయిన తర్వాత భీమ్లా నాయక్‌ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? అహంకారి అయిన మాజీ సైనికాధికారి, ఆత్మగౌరవం ఉన్న పోలీసు అధికారికి మధ్య జరిగిన పోరులో ఎవరు విజయం సాధించారు? భీమ్లా నాయక్‌ నుంచి డేనియల్‌ శేఖర్‌ని ఆయన భార్య(సంయుక్త మీనన్‌) ఎలా రక్షించుకుంది? అనే విషయాలను సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
 
ఎవరెలా చేశారంటే..?

నిజాయితీపరుడైన ఎస్సై భీమ్లా నాయక్‌ పాత్రలో పవన్‌ చక్కగా ఒదిగిపోయారు. ఇక బాగా పొగరు, అహంకారం ఉన్న రాజకీయ నేతగా, రిటైర్డ్‌ ఆర్మీ అధికారి డేనియల్‌ శేఖర్‌గా రానా అద్భుత నటనను ప్రదర్శించాడు. రాజకీయాల్లో ఆరితేరిన నాయకుడు ఏవిధంగా అయితే తన ఆటిట్యూడ్‌ చూపిస్తాడో.. అచ్చంగా అలానే రానా తెరపై కనిపిస్తాడు. ఈగో దెబ్బతింటే.. ఎంతకైనా తెగించే పాత్ర తనది. ప్రతి సీన్‌లో పవన్‌ కల్యాణ్‌తో పోటాపోటీగా నటించడం సినిమాకు ప్లస్.

ఇక భీమ్లా నాయక్‌ భార్య సుగుణ పాత్రలో నిత్యా మీనన్‌ పరకాయ ప్రవేశం చేస్తుంది. మాతృకతో పోలిస్తే.. ఇందులో సుగుణ పాత్రకు స్క్రీన్‌ నిడివి ఎక్కువ. అంతేకాదు కొన్ని కీలక సన్నివేశాలు కూడా ఆమె పాత్రకు ఈ రీమేక్ లో ఎక్కువగా ఇచ్చారనే చెప్పొచ్చు. డేనియల్‌ శేఖర్ భార్యగా సంయుక్త మీనన్‌ ఫరవాలేదనిపించింది. సీఐ కోదండరాంగా మురళీ శర్మ, బార్‌ ఓనర్‌ నాగరాజుగా రావు రమేశ్‌, మాజీ ఎంపీగా సముద్రఖని తదితరులు తమ పాత్రల పరిధిమేరకు బాగానే నటించారు. 
 
ఎలా ఉందంటే..?

మలయాళం బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘అయ్యప్పనుమ్‌ కొషియుమ్‌’ రీమేక్‌ మూవీయే ‘భీమ్లా నాయక్‌’. ఇద్దరు బలమైన వ్యక్తుల అహం దెబ్బ తింటే ఎలాంటి విపరీత పరిణామాలు చోటు చేసుకుంటాయనేదే ‘అయ్యప్పనుమ్‌ కొషియుమ్‌’మూవీ స్టోరీ. ఇదే కథను తీసుకొని, కొన్ని మార్పులు చేసి ‘భీమ్లా నాయక్‌’ చిత్రంగా తెరకెక్కించారు. అయితే వాటిలో కొన్ని సినిమాకు అనుకూలంగా ఉంటే, కొన్ని ప్రతికూలంగా మారాయి.

ముఖ్యంగా కొన్ని యాక్షన్ సీన్లు అయితే అతిగా అనిపించొచ్చు. అలాగే సెకండాఫ్‌లో వచ్చే ప్లాష్‌ బ్యాక్‌ స్టోరీ అచ్చం అలానే పెట్టినట్లు అనిపిస్తుంది. మాతృకలో మాదిరిగానే పవన్‌, రానా పాత్రలను పరిచయం చేసిన దర్శకుడు.. వారి నేపథ్యాన్ని మాత్రం మరింత బలంగా, హైప్ తో చూపించారు. తండాకు సంబంధించిన సీన్స్‌, హీరో ప్లాష్‌బ్యాక్‌ సీన్స్‌ తరహా కొన్ని సన్నివేశాలు మాతృకలో ఉండవు.
 
ఇతర పాత్రలు

రావు రమేశ్‌ కామెడీ పంచులు, నిత్యామీనన్, పవన్ తో సరదాగా సాగే సన్నివేశాలతో ఫస్టాఫ్ అంతా ఫీల్‌గుడ్‌గా సాగిపోతుంది. భీమ్లా నాయక్‌ సస్పెండ్‌తో ఫస్టాఫ్‌ ముగుస్తుంది. ఇక సెకండాఫ్‌లో ఓరిజినల్‌ కథలో చాలా మార్పులే చేశారు. పవన్‌, రానాల మధ్య వచ్చే ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా ఉంటాయి.

ఇరువురి మధ్య వచ్చే డైలాగ్స్‌ కూడా ఆకట్టుకుంటాయి. అదేసమయంలో కొన్ని యాక్షన్‌ సీన్స్‌లో డోస్‌ ఎక్కువైందనే ఫీలింగ్‌ కలుగుతోంది. క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్‌ సీన్‌ అయితే కాస్త సిల్లీగా అనిపించినా.. ట్విస్ట్‌ మాత్రం కొత్తగా అనిపిస్తుంది. 

త్రివిక్రమ్‌ డైలాగ్స్‌, స్క్రీన్‌ ప్లే సినిమాకే బిగ్ ప్లస్. 

ఈ సినిమాకు మరో ప్రధాన బలం తమన్‌ అందించిన సంగీతం. పాటలతో పాటు చక్కటి నేపథ్య సంగీతాన్ని తమన్ అందించాడు. 

రవి కె. చంద్రన్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. 

అడవి అందాలను తెరపై చక్కగా చూపించాడు. నవీన్‌ నూలి ఎడిటింగ్‌ నైపుణ్యాలు బావున్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగట్లుగా ఉన్నాయి. మొత్తానికి సినిమా అన్ని రకాల వేరియేషన్స్ తో తీర్చిదిద్దారని చెప్పొచ్చు.

మొత్తంగా ఈ ‘భీమ్లా నాయక్‌’ మాస్ ప్రేక్షకులకు మాంచి కిక్ ఇచ్చే పవర్ నాయక్.
 
ఏపీలో సినిమా

తెలుగు రాష్ట్రాల్లో నిన్న పవన్ అభిమానులు హంగామా చేశారు. ఇక మొదటిరోజు కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చాయని టాక్. ‘భీమ్లా నాయక్’ సినిమా చూసి పలువురు స్టార్లు, సెలబ్రిటీలు పవన్, రానాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఏపిలో పరిస్థితులు ఇందుకు భిన్నం.

ప్రస్తుతం టికెట్‌ ధరలు గిట్టుబాటు కావని ఈ చిత్రాన్ని ప్రదర్శించాల్సినప్పటికీ, రాష్ట్రంలోని 15 థియేటర్లను వాటి యాజమాన్యాలు శుక్రవారం మూసేశాయి. మరో అయిదు థియేటర్లలో ఈ చిత్రానికి బదులుగా వేరే సినిమాలను ప్రదర్శించారు. ఇంకో ఏడు థియేటర్లలో మధ్యాహ్నం, సాయంత్రం తర్వాత భీమ్లానాయక్‌ చిత్రాన్ని వేశారు. టికెట్‌ ధరలు పెంచకుండా థియేటర్లపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు.

దీంతో తమ అభిమాన హీరో నటించిన భీమ్లానాయక్‌ చిత్రాన్ని థియేటర్లలో ప్రదర్శించకుండా ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందని ఆందోళనలకు దిగారు. సీఎంకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలుచోట్ల నిరసనలు చేపట్టారు. మంత్రులు కొడాలి నాని, పేర్ని నానికి కృష్ణా జిల్లా గుడివాడలో పవన్‌ అభిమానుల నిరసనల సెగ తగిలింది. 

త్వరలో థియేటర్లు తెరచుకొని, సరైన ధరలకే సినిమా చూసే వెసులుబాటు కలగాలని ఆశిద్దాం.