BREAKING NEWS

లోటుగానే... 'బడ్జెట్'!

ఉపాధి హామీకి కత్తెర విధింపు… 
నిరుడు బడ్జెట్‌ కంటే 25శాతం మేర తగ్గింపు... ఆహార సబ్సిడీకి ఎసరు…
ఎరువుల సబ్సిడీకి 4వ వంతు కట్టింగ్…
వేతన జీవులకు కోత...
ఆదాయపు పన్ను… యధాతథం!
మొత్తానికి ఈ యేడు బడ్జెట్.. కొన్ని మినహాయించి, లోటుగానే పూర్తయింది.
మౌలిక సదుపాయాల కల్పన, డిజిటలైజేషన్‌ విధానాలే ధ్యేయంగా... రూ.39.45 లక్షల కోట్లతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ 2022–23 కేంద్ర బడ్జెట్‌ ను రెండు రోజుల క్రితం ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా... రోడ్లు, ఇతర రవాణా మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటలైజేషన్‌పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. విద్యారంగం, నైపుణ్య శిక్షణకు సంబంధించి పలు కీలక ప్రతిపాదనలు తీసుకొచ్చారు.
 
అంతా 'డిజిటల్' మయం

తప్పనిసరి అయిన ఆన్‌లైన్‌ క్లాసులను... ఒక్కో తరగతికి ఒక్కో టీవీ ఛానల్‌ ఉండేలా ఏర్పాటు, అవికూడా స్థానిక భాషల్లోనే పాఠాలు బోధించాలన్న ప్రతిపాదన అయితే బావుంది. దీంతోపాటు డిజిటల్‌ యూనివర్సిటీలు, చిప్‌ ఆధారిత పాస్‌పోర్ట్ ల వాడకం, అన్నింటికి పేపర్ లెస్ సిస్టమ్, 5జీ టెక్నాలజీ అమల్లోకి తేవడం, ఆప్టికల్ ఫైబర్‌ నెట్‌వర్క్, టెలిమెడిసిన్‌ సేవలు, వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం, ‘ఈ–రూపీ’ డిజిటల్‌ కరెన్సీను ప్రవేశపెట్టడం లాంటి డిజిటలైజేషన్‌ చర్యలను తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.
 
► ప్రధానమంత్రి గతిశక్తి, సమ్మిళిత అభివృద్ధి, ఆర్థిక వృద్ధి, సుస్థిర అభివృద్ధే లక్ష్యంగా నాలుగు ప్రాధాన్యతలతో కూడిన ఇండియా 100 విజన్‌ను సాధించే క్రమంలో వీటిని ఎంచుకున్నట్లు నిర్మలా సీతారామన్‌ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.  
 
గతి 'శక్తి'గా...

ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద చేపట్టిన పథకాలు విజయవంతమైన్నందున… వచ్చే మరో ఐదేళ్లలో 30 లక్షల కోట్ల అదనపు ఉత్పత్తులు, 60 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయని ఆమె తెలిపారు.

◆ ప్రధానంగా ఏడు చోదకశక్తులైన రోడ్లు, రైల్వే, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, జల మార్గాలు, ప్రజారవాణా, సరకు రవాణా సదుపాయాలు కీలకమని నిర్మలా వెల్లడించారు. ఈ ఏడు చోదకశక్తులకు తోడుగా ఇంధన వనరుల మార్పు, ఐటీ కమ్యూనికేషన్లు, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థలు, సామాజిక మౌలిక సదుపాయాలను కలిసి ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్తాయని ఆమె ప్రసంగించారు.

◆ వ్యవసాయరంగంతో పాటు విద్యుత్, నదుల అనుసంధానం, ఫుడ్‌ ప్రాసెసింగ్, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు తోడ్పాటు, కార్మికులు, ఆయుష్మాన్‌ భారత్, నేషనల్‌ టెలిమెంటల్‌ హెల్త్‌ ప్రోగ్రామ్ లే కాక, మహిళా శిశు సంక్షేమ పథకాలు, ఇంటింటికీ సురక్షిత మంచినీరు, అందరికీ ఇళ్లు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, డిజిటల్‌ బ్యాంకింగ్, డిజిటల్‌ పేమెంట్స్‌ వంటి రంగాల్లో ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు ఆమె వెల్లడించారు.  

◆ పరిశ్రమలు, వివిధ సంస్థలు మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు మూలధనం, మానవ వనరుల ఉత్పాదకతను పెంచేందుకు సులభతర వ్యాపారం(ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌) 2.0ను అమలు చేయనున్నట్టు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.
వీటి ద్వారా యువతకు భారీగా ఉద్యోగావకాశాలను కల్పించే యానిమేషన్, టెలికాం, కృత్రిమ మేధ(ఏఐ), జినోమిక్స్, ఫార్మా, గ్రీన్‌ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు చర్యలు చేపడతామన్నారు.
 
వీటికి ఊరట…!

రోడ్లు, తాగునీరు, ఇళ్లవంటి మౌలిక సదుపాయాలకు ఊరటనిచ్చారు. కరోనా కారణంగా రెండేళ్లుగా ఆగిపోయిన 25వేల కిలోమీటర్ల జాతీయ రోడ్డు నిర్మాణానికి పచ్చజెండా ఊపారు. 400ల వందే భారత్‌ రైళ్లనూ ప్రతిపాదించి, రాష్ట్రాలు చేసే మూలధన వ్యయానికి, కేంద్రం అందించే సాయాన్ని 50శాతం వరకూ పెంచారు. 
 
రేట్లు పెరిగే ఉత్పత్తులు...

దిగుమతి చేసుకున్న హెడ్‌ఫోన్లు, ఇయర్‌ఫోన్లు, లౌడ్‌స్పీకర్లు, స్మార్ట్‌ మీటర్లు, సోలార్‌ సెల్స్, సోలార్‌ మాడ్యూల్స్, ఇమిటేషన్‌ ఆభరణాలు, ఎక్స్‌రే మెషీన్లు, ఎలక్ట్రానిక్‌ బొమ్మల్లో విడిభాగాలు, గొడుగులు మొదలైనవి.
 
తగ్గే ఉత్పత్తులు...

వజ్రాలు, దుస్తులు, సెల్‌ఫోన్లలో వాడే కెమెరా లెన్స్, మొబైల్‌ చార్జర్లు, సముద్ర ఆహార ఉత్పత్తులైన ఫ్రోజెన్‌ మసల్స్‌, ఫ్రోజెన్‌ స్క్విడ్స్‌, కోకో బీన్స్, ఇంగువ, మీథైల్‌ ఆల్కహాల్, ఎసిటిక్‌ యాసిడ్, పెట్రోలియం ఉత్పత్తులకు ఉపయోగపడే రసాయనాలు, స్టీల్‌ స్క్రాప్‌… ఇతరాలు.
 
రాష్ట్రాలకు దక్కిందేం లేదు...

కేంద్ర బడ్జెట్​లో కొత్తగా నిధులేమీ లేకపోవడం ఈసారి తెలంగాణను బాగా నిరుత్సాహపరిచింది. రాష్ట్రాలకు వచ్చే పన్నుల వాటాతో పాటు ఫైనాన్స్​ కమిషన్​ గ్రాంట్లు మాత్రమే ఈసారి రాష్ట్రానికి రానున్నాయి. 
గత బడ్జెట్ తో పోలిస్తే, కొత్త ఆర్థిక సంవత్సరంలో వచ్చే నిధుల్లో మార్పేమి లేదనే చెప్పొచ్చు. కేంద్రం నుంచి దాదాపు రూ. 36వేల కోట్లు విడుదలవనున్నాయి. అది కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని ట్రైబల్​ యూనివర్సిటీలకు రూ. 40 కోట్లు కేటాయించడం తప్ప బడ్జెట్​లో రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక వరాలు, నిధులేమీ కేటాయించలేదు. 
 
◆ మిషన్​ భగీరథకు సుమారుగా రూ. 2,350 కోట్ల ఆర్థిక సాయం అందించాలని ఫైనాన్స్​ కమిషన్​ చేసిన సిఫారసు మేరకు ఈ బడ్జెట్​లో కూడా చోటు దక్కలేదు. నీతి అయోగ్​ సిఫారసు మేరకు ఈ పథకానికి భారీగా నిధులు కావాలని నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. కానీ అంచనాలు తారుమారు కావడంతో కేంద్రం ఇచ్చే నిధులపై రాష్ట్ర ప్రభుత్వం ఆశలు వదులుకుంది. 

◆ కాళేశ్వరం ప్రాజెక్టు, బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట వ్యాగన్‌‌  కోచ్‌‌ ఫ్యాక్టరీ ఏర్పాటు, కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాలకు సైతం బడ్జెట్​లో స్థానం దక్కలేదు.
 
జీఎస్టీ పన్ను వాటాతో ఊరట...

ప్రతి ఏడాది కేంద్రం నుంచి  పన్నుల వాటా(టాక్స్​ డెవల్యూషన్)​ కింద సెంట్రల్​ జీఎస్టీ, ఇన్​కమ్​ ట్యాక్స్,  సీజీఎస్టీ, కస్టమ్స్ ట్యాక్స్​, ఎక్సైజ్​ డ్యూటీ, సర్వీస్​ ట్యాక్స్, కార్పొరేట్​ ట్యాక్స్​ల ద్వారా కేంద్రానికి వచ్చే పన్నుల ఆదాయంలో 41 శాతాన్ని రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది. 

ఫైనాన్స్​ కమిషన్​ నిర్ణయించిన వాటా ప్రకారం అయితే, అందులో 2.1 శాతం నిధులు తెలంగాణకు దక్కుతాయి. ఈ బడ్జెట్ ప్రకారం పన్నుల వాటా కింద దాదాపుగా రూ. 17,165 కోట్లు వస్తాయి. 
 
■ ఎరువులు చల్లడానికి డ్రోన్లు ఇస్తామన్నారు కానీ ఎరువుల సబ్సిడీని నాలుగోవంతు తగ్గించేశారు.  నిరుపేదలందరికీ ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పిస్తామన్నారు కానీ... ఆహార సబ్సిడీలో 80వేల కోట్లకు కోత వేశారు. ఇక ఆదాయపు పన్ను సవరణల కోసం ఆశపడిన వేతన జీవులపై కొంచం కూడా దయ చూపలేదు. అలాగని పొదుపరులు, మదుపరులకు కూడా దక్కిందేమీ లేదు. ఇంటర్నెట్‌ సిగ్నల్స్‌ అందడం కోసం మైళ్ల దూరం నడిచే గ్రామాల్లో...  కుటుంబం మొత్తం ఆధారపడి బతికే వ్యవసాయ క్షేత్రాల్లో ఈ డిజిటల్‌ విప్లవం ఎటువంటి మార్పులు తెస్తుందో… ఇక వేచి చూడాల్సిందే!