BREAKING NEWS

వివాదంగా మారిన 'హిజాబ్'!

హిజాబ్ ధరించిన ఓ విద్యార్థిని కాలేజ్‌ లోపలికి వస్తుండగా కాషాయ కండువాలు ధరించిన మరొక వర్గం విద్యార్థులు ఆమెను అడ్డుకున్నారు. యువతి కళాశాలవైపు వెళ్తుండగా… ఆ వర్గం ఆమెకు వ్యతిరేకంగా 'జై శ్రీరామ్‌' అంటూ నినాదాలు చేశారు. వీరికి ధీటుగా ఆ విద్యార్థిని తిరిగి ‘అల్లా హు అక్బర్‌’ అంటూ నినదించింది. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది కూడా! ఇప్పటికే ఈ వ్యవహారం కోర్టులో ఉండగా..

మరోవైపు ఇదే అంశంపై రాజకీయ దుమారం కూడా కొనసాగుతోంది. ఇటీవల ముస్లిం మహిళలు హిజాబ్‌  ధరించడంపై అవగాహన కల్పించడానికంటూ ఫిబ్రవరి 1న 'ప్రపంచ హిజాబ్ దినోత్సవా'న్ని నిర్వహించారు. దీని తర్వాత హిజాబ్‌ వివాదం మరింత పెరగటానికి కారణమైంది. అసలు ముస్లిం మహిళలు ధరించే హిజాబ్... వివాదంగా ఎందుకు మారింది?, అందుకు గల కారణాలను వివరంగా ఈరోజు మనం తెలుసుకుందాం:
 
హిజాబ్ అంటే

సాధారణ 'బురఖా' అంటే స్త్రీల శరీరాన్ని తల నుంచి కాళ్ల వరకు పూర్తిగా కప్పేసి ఉండేదని అర్ధం. చాలా దేశాల్లో దీనిని 'అబాయా' అని కూడా పిలుస్తారు.
'హిజాబ్' అంటే తెర. మేలిముసుగు వంటిది. ముస్లిం మహిళలు పర పురుషుల సమక్షం నుంచి తమ ముఖం, శరీరాన్ని కనపడకుండా ధరించే దానినే హిజాబ్ గా పరిగణిస్తారు. హిజాబ్ అనేది అరబిక్ పదం. 'గౌరవంతో కూడినద'ని భావం.
బురఖా తరహా 'నికాబ్‌' అనేది ఒక రకమైన క్లాత్‌ మాస్క్‌ లాంటిది. ఇది ముఖాన్ని మాత్రమే కవర్ చేస్తుంది.
 
హిజాబ్వివాదం ఏంటి..?

భారతదేశం 'భిన్నత్వంలో ఏకత్వా'న్ని పాటిస్తుందని మనమంతా ఎంతో గర్వంగా చెప్పుకుంటాం. కానీ సరిగా గమనిస్తే, కొన్ని సంవత్సరాలుగా భారత్ లో మత అసహనం, మతాహంకారం పెరిగిపోతుంది. కొన్ని రాజకీయ స్వార్ధాలకోసం ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నాయి.

ఇతర ముస్లిం దేశాల్లో హిజాబ్ కు నిషేధం విధించాయి. సౌది అరేబియాలో అయితే ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు, హిజాబ్ ను ధరించాల్సిన పని లేదు. పాలస్తీనియన్ లు కూడా హిజాబ్ ను తిరస్కరించారు. కానీ ఇరాన్, ఆప్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండోనేషియా లాంటి దేశాల్లో మాత్రం హిజాబ్ ను కచ్చితంగా ధరించాల్సిందేనన్న నియమం పాటిస్తున్నాయి. ఇవి పక్కనపెడితే, కొన్ని వర్ణాలు, వర్గాలపై కొనేళ్లుగా ఏదో కారణం చేత దాడులు జరుగుతున్నాయి. 

ముఖ్యంగా తినే తిండి నుంచి వేసుకునే బట్టల వరకు, ఆఖరికి కొలిచే దేవుళ్ల వరకు ఉద్దేశించి జరుగుతున్నాయి. అలాంటిదే, ఇప్పుడు కొత్తగా కర్ణాటకలో హిజాబ్ వివాదం రాజుకుంది.

ఇస్లాం ప్రకారం, ఆడవారికి హిజాబ్ తప్పనిసరి! ఖురాన్ లోనూ దీని గురుంచిన ప్రస్తావన ఉంది. మరికొన్ని గ్రంథాల్లో మణికట్టు, ముఖం, చేతులు మినహా మిగతావన్ని కప్పి ఉంచేలా హిజాబ్ ను వేసుకునేలా ఆదేశించినట్లు తెలుస్తోంది.
 
ఎక్కడ మొదలైందంటే...

కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లాకు చెందిన కుందాపూర్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పీయూ కళాశాలలో ఇది మొదలైంది. అక్కడ చదివే ముస్లిం విద్యార్థినులకు ఆ కాలేజి యాజమాన్యం హిజాబ్ ను నిషేధించింది. దీంతో వివాదం మొదలైంది. ఆ ముస్లిం విద్యార్థినులు 'తమకన్నా ముందు చదువుకున్న సీనియర్లు హిజాబ్ ను ధరించే కాలేజ్ కు వచ్చేవారు. మేము కూడా అలానే చదువుకుంటాం. అసలైతే, హిజాబ్ మా మత హక్కు! అది వదిలేసి, మా హక్కులకు విరుద్ధంగా ఈ కొత్త రూల్ విధించడం ఏంటని ఘాటుగా ప్రశ్నించారు?', వారు స్పదించకపోవడంతో అది కాస్త నిరసనగా మారింది.

దీంతోపాటు ఉర్దూ, అరబిక్ భాషల్లో సైతం వారిని మాట్లాడటానికి అనుమతి ఇవ్వకపోవడంతో ఈ వివాదం మరింత సమస్యగా మారింది. ఈ రెండు విషయాలకు ఆ ముస్లిం యువతులు ఒప్పుకోలేదు. దీనికి తోడు హిందూ అబ్బాయిలు కాషాయం కండువాలను ధరించి రావడంతో గందరగోళం మొదలైంది. చాప కింద నీరులా అది ఆ చుట్టుపక్కల కాలేజీలకు విస్తరించింది.

ఈ కాలేజ్ లానే… భద్రావతి పీయూ కాలేజీలో చదువుతున్న 27మంది ముస్లిం అమ్మాయిలు హిజాబ్ ధరించి రావడంతో, వీరికి వ్యతిరేకంగా హిందూ అబ్బాయిలు నిరసన వ్యక్తం చేశారు. ఏకరూపత పాటించేందుకే ఈ నిబంధనను పెట్టినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. దీని వెనుక ఏదో రాజకీయ దురుద్దేశం ఉందని ముస్లిం విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. 
చినికి చినికి గాలి వానైనట్లు…
ఈ సమస్య హైకోర్టు వరకు వెళ్లింది. 
అమ్మాయిల తరపున ఒకటి, అబ్బాయిల తరపున ఒకటి.. రెండు కేసుల్ని కోర్టు స్వీకరించింది. 
 
ఆర్టికల్ 21 ప్రకారం, వైయుక్తిక స్వాతంత్ర్యాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలని మనకు చట్టం చెబుతోంది. హిజాబ్ ను ధరించడం, ధరించకపోవడం పూర్తిగా వారి మత వ్యవహారం. ఇప్పటికే చాలా దేశాలు హిజాబ్ కు మినహాయింపులిస్తున్నాయి.
సమస్య మరింత జటిలం కాకముందే ఈ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని అందరూ అనుకుంటున్నారు.
 
ప్రభుత్వ నిర్ణయం...

హిజాబ్‌ వివాదం నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వివాదం సద్దుమణిగేందుకు పాఠశాలలు, కాలేజీలకు మూడు రోజులపాటు సెలవులను ప్రకటించింది. ఈ నిర్ణయం మేరకు సీఎం బసవరాజ్‌ బొమ్మై ట్విట్టర్‌లో స్పందించారు. రాష్ట్రంలో శాంతిని కాపాడాలని… అందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల, కళాశాలల యాజమాన్యాలతోపాటు రాష్ట్ర ప్రజలు సైతం సహకరించాలని ఆయన ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. 
 
కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు

హిజాబ్‌ వివాదంపై విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో ఎటువంటి భావోద్వేగాలకు తావులేదని వ్యాఖ్యానించింది. చట్ట ప్రకారం, రాజ్యాంగబద్దంగానే నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. తమకు 'రాజ్యాంగమే భగవద్గీత' అని తెలిపిన హైకోర్టు తదుపరి విచారణను ఈరోజుకు వాయిదా వేసింది. మరి వేచి చూడాలి తీర్పు ఎలా ఉండబోతుందో… అందుకు ప్రజలు ఎలా స్పందిస్తారో…?, చివరకు ఈ హిజాబ్ వివాదం ఎలా ముగుస్తుందో?!