BREAKING NEWS

మెలోడీ క్వీన్ 'లతాజీ' ఇక లేరు…!

 కవుల పాటలకు అందలం ఆమె స్వరం…
తెరమీద కథానాయికలకు జీవం ఆమె గానం...
ఒకప్పుడు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూను కంటతడి పెట్టించిన భారతదేశపు అత్యంత ప్రియమైన గాయని… భారతరత్న గ్రహీత… ఆమె.. లతాజీ, దీదీగా సుపరిచితురాలైన 'లతా మంగేష్కర్'... ఆమె తన 92వ యేట కొవిడ్ బారిన పడి, చికిత్స పొందుతూ ఆదివారం(6వ తేదీన) ఉదయం 8.12 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా ఆమె జీవిత, స్వర ప్రయాణం గురుంచి విశేషంగా తెలుసుకుందాం:
 
జననం...

1929 సెప్టెంబరు 28న దీనానాథ్ మంగేష్కర్, శేవంతి(శుద్ధమతి) దంపతులకు జన్మించారు లతా మంగేష్కర్‌. దీనానాథ్ అప్పటి ఇండోర్ సంస్థానంలో శాస్త్రీయ గాయకుడు, మరాఠీ రంగస్థల నటుడు, సంగీత నాటకాల రచయితగా పని చేసేవారు. ఆమె తల్లిదండ్రులు లతకు మొదటగా 'హేమ' అని పేరు పెట్టారు. తరువాత ఆమె తండ్రి సంగీత నాటకాలలో వేసిన లతిక పాత్ర తర్వాత, దానిని లతగా మార్చారు.

ఐదేళ్ల వయసులోనే సంగీత సాధన మొదలు పెట్టడంతో స్కూలు చదువు అంతగా కొనసాగలేదు. 

అయితేనేం, తన బంధువైన వసంతి తన బాల్యంలో మ్యూజిక్‌ క్లాసులకు వెళ్లేదని, ఆమెతో పాటు వెళ్లిన తనను పాట బాగా ఆకర్షించిందని ఆమె చెప్పారు. తనకు నాలుగేళ్ల వయసున్నప్పుడు తన ఆసక్తిని గమనించి టీచర్ల ముందు పాడమని కోరగా, అప్పుడు హిందోళంలో పాట పాడానని చెప్పారు. ఆ తర్వాత తనను బడికి రమ్మన్నారని, అక్కడకు చెల్లి ఆశాను తీసుకొని వెళ్లిన తనను టీచర్‌ అడ్డుకోవడంతో వెనక్కు వచ్చానని వివరించారు.

కాలక్రమంలో బంధువులు, ప్రైవేట్‌ టీచర్ల సాయంతో హిందీ నేర్చుకున్నానన్నారు. తర్వాతి కాలంలో ఉర్దూ, బెంగాలీ, కొంత మేర పంజాబీ నేర్చుకున్నానని, సంస్కృతం మాట్లాడకున్నా, అర్థమవుతుందని, తమిళ్‌ అవగాహన చేసుకునే యత్నం చేశానని ఓ సందర్భంలో లత స్వయంగా చెప్పారు.

1942లో లతా 13వ ఏట కితీ హసాల్‌ అనే ఒక మరాఠీ చిత్రానికి తొలి పాట పాడటంతో గాయనిగా కెరీర్‌ లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఆమె మళ్లీ వెనుదిరిగి చూడలేదు.
 
సంగీత గురువులు

సంగీత స్వరకర్త గులాం హైదర్, లతా మంగేష్కర్‌కి 'దిల్ మేరా' పాటతో ఫస్ట్ బ్రేక్ ఇచ్చారు. 

1948లో వచ్చిన 'మజ్బూర్'  చిత్రంలో తోడా, 'ముఝే కహిన్ కా నా చోరా' పాటలు బాగా క్లిక్ అయ్యాయి.

లతా మంగేష్కర్‌ను ముందుగా ముంబయికి తీసుకెళ్లి, మరాఠీ సినిమాకి పరిచయం చేసింది మాస్టర్ వినాయక్. ఆమెను భేండీ బజార్ ఘరానాకు చెందిన ఉస్తాద్ అమన్ అలీ ఖాన్ నుంచి హిందుస్తానీ శాస్త్రీయ సంగీత పాఠాలు నేర్చుకోమని ఆయన వసంత్ దేశాయ్, వి. శాంతారామ్‌లకు పరిచయం చేశాడు. 
హైదర్ తన 'షహీద్' (1948) చిత్రం కోసం కాజోల్, రాణి ముఖర్జీ తాతగా పిలిచే ఫిల్మిస్థాన్ బాస్ అయిన శశధర్ ముఖర్జీకు అవకాశం కల్పించాడు. కానీ ఆమె స్వరం సన్నగా ఉన్నందున ఆమెను తిరస్కరించడం జరిగింది.
 
తొలి ప్రదర్శన...

1974లో లండన్ లోని ప్రఖ్యాత రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్లో లత సంగీత విభావరి ప్రదర్శన ఇచ్చింది. ఇలా లైవ్ లో ప్రదర్శన ఇచ్చిన తొలి భారత ఆర్టిస్టుగా పేరుగాంచారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ఆర్టిస్టుగానూ రికార్డు సృష్టించారు. ఆమెకు అదే తొలి అంతర్జాతీయ ప్రదర్శన కూడా. ‘‘ఇన్హీ లోగోం నే’, ‘ఆజా రే పర్‌దేశీ’, ‘ఆయేగా ఆనేవాలా’ అంటూ లత లైవ్‌లో పాడిన బాలీవుడ్‌ ఆపాత మధురాలు వినేందుకు అభిమానులు ఇక్కడకు ఎక్కువ సంఖ్యలో రావడం విశేషం! అప్పట్లో ఆడిటోరియం మొత్తం కిక్కిరిసిపోయింది.
ఈ షోకి సంబంధించిన ఎల్పీ రికార్డింగులు రెండు వాల్యూమ్‌లుగా విడుదలై, అప్పట్లో రికార్డు స్థాయిలో 1.33 లక్షల కాపీలు అమ్ముడుపోవడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు. 
 
అవార్డులు...

మొత్తం కెరీర్ లో హిందీలోనే గాక తెలుగు, తమిళ్, కన్నడతో పాటు ఏకంగా 36 భాషల్లో 30వేలకు పైగా పాటలు పాడి అరుదైన ఘనత సాధించింది. 
2012 అక్టోబరులో చివరి పాట పాడారు లత. దేశ చరిత్రలోనే అత్యుత్తమ ప్లేబ్యాక్ సింగర్‌గా పేరు గాంచిన ఆమెను వరించని అవార్డు లేదు.

మూడు జాతీయ చలనచిత్ర అవార్డులు,
పలు ఫిల్మ్‌ఫేర్ లు, నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డులతో పాటు 1989లో దాదాసాహెబ్‌ ఫాల్కే, పద్మవిభూషణ్, పద్మభూషణ్ లను, 2001లో 'భారతరత్న'ను అందుకున్నారు. 

ఎం.ఎస్. సుబ్బలక్ష్మి తర్వాత రెండవ గాయనిగా అంతటి పేరు లతకే దక్కింది.
మరాఠీ చిత్రాలకు సంగీతం అందించి, నిర్మాతగానూ వ్యవహరించారు. భారతదేశం, ఫ్రాన్స్‌లలో అత్యున్నత పౌర పురస్కారాలను అందుకున్నారు.
 
రికార్డు స్థాయిలో పాటలు...

లతా మంగేష్కర్ హిందీ సినిమాల్లో 'అల్లా తేరో నామ్', 'రంగీలా రే', 'సత్యం శివం సుందరం' టైటిల్ ట్రాక్ వరకు, 'రంగ్ దే బసంతి'లోని 'లుక్క చుప్పి' వరకు వరుస చిత్రాలకు తన గాత్రాన్ని అందించారు.

మరాఠీలోని పాటలతో పాటు బెంగాలీ, తమిళం, కన్నడ, మలయాళం, సింహళంలోనూ పాటలు పాడారు.

1974లో, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జాబితాలో చరిత్రలోనే అత్యధికంగా పాటలు రికార్డ్ చేయబడిన కళాకారిణిగా లతా మంగేష్కర్‌ చోటు సంపాదించారు.

ఆమె 1948- 1974 మధ్యకాలంలో 20 భారతీయ భాషల్లో 25,000 కంటే తక్కువ సోలో, యుగళగీతాలు, బృందగానంతో కూడిన పాటల రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఆమె చిరకాల గాన ప్రత్యర్థి మహ్మద్ రఫీ దాదాపు 28,000 పాటలు పాడారు.

రఫీ మరణానంతరం, గిన్నిస్ బుక్ 1984 ఎడిషన్‌లో 'అత్యధిక పాటల రికార్డింగ్‌ల జాబితా'లో లతా మంగేష్కర్ పేరును నమోదు చేసింది. మొత్తంగా, 1948 నుంచి 1987 వరకు 30,000 పాటలకు తక్కువ కాకుండా పాడారని గిన్నిస్ బుక్ తరువాతి సంచికలో పేర్కొంది.

◆ 1988లో తెలుగులో నాగార్జున నటించిన 'ఆఖరి పోరాటం' సినిమాలో… 'తెల్లచీరకు థకదిమి' అనే పాట పాడారు.
2015లో ఆమె తన చివరి పాటను పాడింది. అది ఒక ఇండో-నార్వేజియన్ ప్రొడక్షన్ లో 'డు యు నో వై టు… లైఫ్ ఈజ్ ఎ మూమెంట్' లోనిది.
 
రెమ్యునరేషన్ఎక్కువే

కెరీర్‌లో ఎన్నో వేల పాటలు పాడిన లతాజీ రెమ్యునరేషన్‌ కూడా ఎక్కువగానే తీసుకునేవారట.

1950ల కాలంలో ఒక్కో పాటకు సుమారు 500రూపాయల పారితోషికాన్ని అందుకునేవారట. అప్పట్లో ఆశా భోస్లే సహా పేరున్న సింగర్స్‌కి సైతం 150 రూపాయలు మాత్రమే ఇచ్చేవారట. కానీ ఆ సమయంలో కూడా లతాజీకి అందరికంటే అత్యధిక రెమ్యునరేషన్‌ ఇచ్చేవారని స్వయంగా ఆశా భోస్లే ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మొదట్లో 25 రూపాయలతో ప్రారంభమైన లతాజీ  సంపాదన.

ఇప్పుడు వంద కోట్లకు పైగా చేరుకుంది. ఆమెకు ముంబై సహా పలు ప్రముఖ నగరాల్లో విలాసవంతమైన భవనాలు, లగ్జరీ కార్లున్నాయి. అలా చనిపోయేనాటికి లతా మంగేష్కర్‌ ఆస్తుల విలువ సుమారు రూ. 200 కోట్లకు పైనే ఉందని సమాచారం. 

◆ ఆమె అవివాహితగానే మిగిలిపోయారు. దిగ్గజ గాయకులు, సంగీత దర్శకులు, నటీనటులెందరో లతను అమితంగా అభిమానించేవారు. అపర సరస్వతిగా కీర్తించేవారు కూడా.
ఆమె వివాహం చేసుకోలేదు, కానీ 1996 నుంచి 1999 వరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) కులీన మాజీ క్రికెటర్ అధ్యక్షుడు దివంగత రాజ్ సింగ్ దుంగార్‌పూర్‌తో సన్నిహితంగా ఉన్నారని పుకార్లు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల పెళ్లి చేసుకోలేదు. ఆ తరువాత కూడా చేసుకోకుండానే ఉన్నారు. అప్పట్లో లతను చాలామంది సినీప్రముఖులు ఆరాధించేవారట.
 
లతా మంగేష్కర్‌కి ఎంతో ఇష్టమైన దర్శకుల్లో ఒకరైన దివంగత యష్ చోప్రా, లతాజీ 75వ పుట్టినరోజు సందర్భంగా ఆమె గురుంచి ఓ ప్రముఖ వెబ్సైట్ కి రాసిన వ్యాసంలో యష్ ఇలా చెప్పుకొచ్చారట... రూప్ కుమార్ రాథోడ్‌లోని 'లియే హమ్ హై జియే' అనే పాటతో "నేను ఆమె స్వరమాధుర్యాన్ని రుచి చూశాను, దేవుడు ఆమెకు గళాన్ని ఆశీర్వాదంగా ఇచ్చాడు", ఆ స్వరం మనతో కలకాలం జీవించడం నిజంగా మన అదృష్టం అని చెప్పారు.
 
ప్రముఖుల సంతాపం...

కేంద్రం దేశవ్యాప్తంగా రెండు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. అధికారిక కార్యక్రమాలన్నింటినీ వాయిదా వేశారు. పార్లమెంట్  సోమవారం లతకు నివాళులు అర్పించింది. అనంతరం ఆమె గౌరవార్థం ఉభయ సభలను గంటపాటు వాయిదా వేయాలని నిర్ణయించాయి. 

సోషల్ మీడియా వేదికగా ప్రముఖ సంగీత దర్శకులు, బాలీవుడ్ తారలు ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ఆమె మృతి పట్ల రాష్ట్రపతి మొదలుకుని ప్రముఖులంతా ప్రగాఢ సంతాపం వెలిబుచ్చారు. ఆమె పార్థివ దేహం చూడటానికి ముంబై పొద్దార్ రోడ్డు లోని లతా నివాసం ఉన్న ప్రభు కుంజ్ వరకు ఆమె అభిమానులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. దాదాపు 10 కిలోమీటర్ల మేర సాగిన అంతిమయాత్ర శివాజీ పార్కు వద్ద ముగిసింది. ప్రభుత్వ లాంఛనాలతో లత అంత్యక్రియలు నిన్న(సోమవారం) పూర్తయ్యాయి.