BREAKING NEWS

బెల్లాన్ని బంగారంగా సమర్పించే గిరిజనుల జాతర

మనదేశంలో అతిపెద్ద గిరిజనుల పండుగ ఈ “మేడారం జాతర”. ప్రతి రెండు సంవత్సరాలుకు ఒకసారి మాఘ మాసంలో శుద్ధ పౌర్ణమినాడు ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుతారు. ఈ జాతరకు అశేషంగా భక్తులు తండోపతండాలుగా వస్తారు. ఆరోగ్యం బాగుండాలని, పిల్లలు పుట్టాలని, చదువులో, వృత్తిలో ఉన్నత స్థాయిని అందుకోవాలని... ఇలా తమ కోర్కెలు తీర్చుకోవడానికి ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు. ఎంతో ఘనచరిత్ర కలిగిన ఈ జాతర గురుంచి తెలుసుకుందాం...

సమక్క సారక్క జాతర వెనుక దాగి ఉన్న అసలు కథ...

13వ శతాబ్దంలో కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలలో కొందరు గిరిజనలు వేటకు వెళ్లారు. అక్కడ అడవిలో పులులు కాపలాగా ఉన్న ఒక పసిపాపను చూసి వారు వారి ప్రాంతానికి తీసుకెళ్ళారు. ఆ పాపను ఆ తెగ అధిపతికి ఇవ్వగా ఆయన దత్తత తీసుకొని ఆమెకు ‘సమ్మక్క’ అని పేరు పెట్టారు. ఆమె పెరిగి పెద్దయ్యాక, మేడారంను పాలించే పగిడిద్ద రాజుతో వివాహం చేశారు. వీరికి సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు పిల్లలు పుట్టారు. వారిలో పెద్ద కుమార్తె అయిన సారలమ్మను, గోవిందరాజు మనువాడాడు.

కొన్నేళ్ల తర్వాత ఆ ఊరిలో కరువు వచ్చింది. అలాంటి సమయంల్లోనే పన్ను చెల్లించాలని కాకతీయ రాజు అయిన మొదటి ప్రతాపరుద్రుడు, మేడారంను పాలిస్తున్న పగిడిద్ద రాజుకు ఆదేశం జారీ చేశాడు. కానీ కరవు కారణంగా పంటలు కొట్టుకుపోయాయని పన్ను కట్టలేమని చెప్పడంతో ఆగ్రహించిన ప్రతాపరుద్రుడు గిరిజనులపై  యుద్ధం ప్రకటించాడు. దాంతో “సంపన్న వాగు” కాస్త యుద్ధ ప్రాంతంగా మారింది.

కాకతీయ సైన్యంతో, గిరిజనులు తలపడి ఓడించారు. ఇలా కాదని శత్రువులు గిరిజనుల రాజైన పగిడిద్ద రాజును వెనుక నుంచి దాడి చేసి చంపేశారు. ఆ తర్వాత సైనికుల చేతిలో నాగులమ్మ, సారలమ్మ, గోవిందరాజులు కూడా మరణించారు. జంపన్నను పొడిచి అక్కడే ఉన్న వాగులో పడేశారు. అలా ఆ వాగు జంపన్న వాగుగా మారింది. అది తెలిసిన సమక్క శత్రు సైన్యంపైకి దూకి వీరోచితంగా పోరాడింది. ఒక సైనికుడు ఆమెను వెనుక నుంచి వచ్చి పొడిచాడు. దాంతోపాటు ఒంటినిండా బాణాలతో రక్తం కారుతున్న పట్టించుకోకుండా మేడారంకు ఈశాన్య వైపు పయనించింది.

ఆమెను వెతుకుతూ గిరిజనులు అంతట గాలిస్తూ చిలకల గుట్ట వైపు వెళ్లారు. అక్కడ ఒక చెట్టు కింద పుట్ట దగ్గర కుంకుమ భరణి కనిపించిందట. అప్పుడే “రెండు గద్దెలు కట్టించి రెండేళ్లకొకసారి ఉత్సవం జరిపిస్తే, భక్తుల కోరికలు తీరుస్తానని” గిరిజనులకు వినిపించిందట. అలా సమ్మక్క మాయమై కుంకుమ భరణిగా మారిందని, సారలమ్మ మేడారంలోని కన్నేపల్లిలో వెలిసిందని భక్తులు నమ్ముతారు. ఆనాటి నుంచి ప్రతి రెండు సంవత్సరాలకొకసారి ఈ ఉత్సవాన్ని జరిపిస్తారు. 1940 నుంచి మేడారం జాతరకు జనాలు భారీగా తరలి రావడంతో 1996లో ఈ జాతరను అధికారకంగా జరపాలని ప్రకటించారు.

జాతరలో ఏంఏం చేస్తారంటే...     

ఈ జాతరలో ముందుగా ఊరి పొలిమేరలో ఉన్న జంపన్నవాగులో స్నానం చేసి వచ్చి, జంపన్న గద్దెకు మొక్కుతారు. ఆ తర్వాత సమ్మక్క, సారలమ్మగా కొలిచే కుంకుమభరణి, వెదురుకర్రను పూజిస్తారు. మొదటి రోజున కన్నేపల్లి నుంచి సారలమ్మను ఆరుగురు పూజారులు ఉరేగింపుగా తీసుకొస్తారు. కొత్తగూడెంలోని పోనుగుండ్లలో పూజారులంతా కలిసి పగిడిద్ద రాజుతో వస్తారు.

ఏటూరు నాగారంలోని కొడాయి గ్రామం నుంచి కాక వంశస్థులు కలిసి గోవిందరాజును తీసుకొని వస్తారు. ఆఖరిగా సమ్మక్కను కుంకుమ భరణి రూపంలో చిలకల గుట్టకు చెందిన కొక్కెర వంశీయులు గద్దెపైకి తెచ్చి ప్రతిష్టిస్తారు. రెండు రోజులు పూజలు జరిపించిన తర్వాత మూడో రోజున దేవతలకు భక్తులు బంగారం(బెల్లం), కుంకుమ, పసుపులతో మొక్కును చెల్లించుకుంటారు. నాలుగో రోజున దేవతలు ‘వనప్రవేశం’ చేయడంతో జాతర పూర్తవుతుంది.  
    
ఆ నాలుగు రోజులను మరో పేర్లతో.....  

‘మండెమెలిగె’ పేరుతో తల్లీబిడ్డల రూపాలకు పసుపు, కుంకుమలు కలిపిన నీటితో స్నానం చేయిస్తారు. ‘మందిర సారె’ పేరుతో దేవతలకు చీర సారెల్ని సమర్పిస్తారు.

‘నిండు జాతర’ నాడు భక్తులు తమ మొక్కులను తీర్చుకోవడానికి వస్తారు.
‘వన ప్రవేశం’తో జాతర ముగిస్తుంది.

అక్కడ భక్తులు బెల్లాన్ని బంగారంగా భావిస్తారు.

మొక్కులు తీర్చుకునే ముందు భక్తులు బెల్లాన్ని తలపై మోసుకొని వచ్చి అక్కడి తక్కెడలో కొలిచి దేవతలకు సమర్పిస్తారు.

ప్రభుత్వ ఏర్పాటుతో...

ఈ నెల 16 నుంచి 19 వరకు జరగనున్న మేడారం జాతరకు చాలా మంది భక్తులు తరలివస్తున్నారు. అందుకుగాను ఈ ఏడాది 75కోట్లతో తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ జాతర కోసం నాలుగు వేల ఆర్టీసీ బస్సులను కేటాయించారు. కొన్ని ఎకరాల్లో పార్కింగ్ సదుపాయం కల్పించారు. కరోనా వేళా అందరి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ఆసుపత్రితోపాటు మరో 35 ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేశారు. జాతరలో 11వేల మంది పోలీసులు పాల్గొని భద్రత కలిపిస్తున్నారు. 22వేల సీసీ కెమరాలతో అనుక్షణం పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటున్నారు.   

ఎలా చేరాలంటే...

హైదరాబాద్ నుంచి మేడారం జాతరకు దాదాపు 239 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నాంపల్లి స్టేషన్ నుంచి వరంగల్ స్టేషన్ కి చేరి అక్కడి నుంచి ములుగు వెళ్లే దారి గుండా వెళితే మేడారం జాతరకు వెళ్ళవచ్చు.  
 
విజయవాడలోని పండిట్ నెహ్రు బస్సు స్టేషన్ నుంచి మేడారం జాతరకు 285 కిలోమీటర్ల దూరంలో, ఖమ్మం నుంచి మేడారం జాతరకు 159 కిలోమీటర్ల దూరంలో ఉంది.