BREAKING NEWS

“సప్తాశ్వాల భగవానుడు”

సమస్త లోకానికి కాంతిని పంచిన దేవుడైన, మహర్షి కశ్యప కుమారుడైన, యమ ధర్మరాజు, శని దేవుడి తండ్రి అయిన, ఛాయా, సంగ్యా భర్తైన ‘సూర్య భగవానుణ్ణి’ పుట్టిన రోజునే “రథ సప్తమి”గా జరుపుకుంటాము. ఈ రోజు ప్రొద్దునే లేచి సూర్యున్ని పూజిస్తే మరణం నుంచి విముక్తి పొందినట్లుగా భావిస్తారు. ఈ రోజు ఉపవాసం చేస్తే అనారోగ్యం బారిన పడకుండా ఉంటారని, ఉద్యోగంలో, చదువులో ఆటంకాలు తొలిగిపోతాయని నమ్ముతారు. అంతేకాదు ఈ రోజు నోములు, వ్రతాలు కూడా చేస్తారు. ఈ రోజు పుణ్యకార్యలను మొదలు పెడితే మంచి ఫలితాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. కొందరు దానాలు కూడా చేస్తారు. రథ సప్తమిని పలు పేర్లతో కూడా పిలుస్తుంటారు. సోమవారం సాయంకాలంతో మొదలై మంగళవారం ఉదయంతో ఈ రథ సప్తమి ముగుస్తుంది. ఈ పండుగ గురుంచి మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం...

రథ సప్తమి అంటే...

అదితి, కశ్యపుల సంతానంగా మాఘమాసంలో శుక్లపక్ష సప్తమిని సూర్యుడు పుట్టిన రోజుగా జరుపుకుంటాం. దీనినే ‘రథ సప్తమి’ అని అంటారు. ఈ రోజు సూర్యుడిని ఆరాధిస్తారు. అంతేకాదు ఈ నాడు ఆకాశం మొత్తం రథం ఆకారంలో కనిపిస్తుంది అని చెబుతారు. ఈ రథ సప్తమిని అచల సప్తమి, సూర్య రథ సప్తమి, ఆరోగ్య సప్తమి లాంటి పేర్లతో కూడా పిలుస్తారు.

ఈరోజు విశిష్టత ఏంటంటే...

సూర్యభగవానుణ్ణి భాస్కరుడు, ఆదిత్యగా అని కూడా పిలుస్తుంటారు. ‘భాసం’ అంటే ప్రకాశం,
‘కరుడు’ అంటే చేసేవాడు. ‘భాస్కరుడు’ అంటే ‘ప్రపంచానికి వెలుగును పంచేవాడు’ అని అర్థం.

మన సనాతన ధర్మం ప్రకారం సూర్యుడిని దేవుడిగా పూజించారు. ఎందుకంటే వెలుగు లేకపోతే జీవకోటి మనుగడ లేదు. అంతేకాదు జ్ఞాన మండలంగా కూడా ఆరాధించేవారు. సూర్య కిరణాలు శరీరానికి తాకడం వలన రోగనిరోధక శక్తి పెరిగి అనారోగ్య బారిన పడకుండా ఉంటారని వైద్యలు చెబుతారు. సూర్య భగవానుని  ‘ఏడు గుర్రాలను’ ఏడు రోజులు (ఒక వారం), ఏకచక్రాన్ని ‘కాలచక్రం’గా వర్ణిస్తారు. ఏడు గుర్రాలను మహత్తు,అహంకారం, భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశంగా భావిస్తారు. సూర్య భగవానుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ మార్గానికి రథాన్ని మళ్లించడమే ఈ రోజు విశిష్టత.

పురాణాల ప్రకారం...

ఈ రోజు చేసే వ్రతం గురుంచి ధర్మరాజు శ్రీకృష్ణుడుని అడగ్గా ఇలా చెబుతూ... పూర్వ కాలంలో కాంభోజ దేశంలో యశోధర్ముడనే రాజుకి ఒక కొడుకు ఉండేవాడు. అతను ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడేవాడు. అతని బాధను చూసి రాజు బ్రాహ్మణులను పిలిచి కుమారుడి అనారోగ్యానికి గల కారణం ఏంటని అడిగాడు. అప్పుడు బ్రహ్మాణులు “నీ కుమారుడు పూర్వజన్మలో ఒక వైశ్యుడు. రథసప్తమీ మహాత్మ్యము వలన నీకు జన్మించాడు. అతను వైశ్యుడు అయినందున వ్యాధిగ్రస్తుడయ్యాడు” అని చెప్పారు. కొడుకు మాములు వ్యక్తి కావడానికి ఏం చేయాలి అని రాజు బ్రాహ్మణుడిని అడిగాడు. ఏ పూజ కారణంగా నీకు కుమారుడు పుట్టాడో ఆ రోజు ఆ వ్రతం (రథ సప్తమి) చేస్తే ఆరోగ్యవంతుడవుతాడని, ఈ సామ్రాజ్యానికి చక్రవతి అవుతాడని చెప్పారు. వారు చెప్పినట్లుగానే చేసాడు రాజు. అతను కోరుకున్నట్లే జరిగిందని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు.

అనేక రూపాల్లో...

సూర్య భగవానుడు చాలా రూపాల్లో దర్శనమిస్తాడు. అవి లోలార్కదిత్య, విమలాదిత్య, సాంబాదిత్య, ఉత్తరార్కదిత్య, కేశవాదిత్య, ఖఖోల్కాదిత్య, అరుణాదిత్య, మయూఖాదిత్య, యమాదిత్య, వృద్ధాదిత్య, గంగాదిత్య, ద్రౌపాదిత్యగా పిలుస్తారు.

ముఖ్యంగా కాశీలో సూర్య భగవానుడు అనేక సందర్భాల్లో కలిపి మొత్తం పన్నెండు రూపాల్లో కొలువైనట్లు కాశీ క్షేత్రంలో ఉంది. అవి కాశీలోని పలు ప్రాంతాల్లో వివిధ ఘాట్ ల వద్ద ఈ ఆలయాలు ఉన్నాయి.
 
ఈరోజు ఏం చేస్తారంటే...

ఈ రోజున ప్రాతఃకాల సమయంలో గంగా నదిలో స్నానం చేస్తే మరణించిన తర్వాత సూర్య లోకానికి వెళ్తారని పండితులు అంటుంటారు. అదే విధంగా నది తీరాల్లో నూనెతో లేదంటే నెయ్యితో కాని దీపాలు వెలిగించి నీటిలోకి వదులుతారు. ఆ తర్వాత తలమీద ఏడు జిల్లేడు ఆకులను, రేగు పళ్ళను పెట్టుకొని, స్నానం చేసే నీళ్ళలో శాలిధాన్యం, నువ్వులు, అక్షింతలు, చందనం కలుపుకొని స్నానం చేయాలి అని చెబుతారు. 

నైవేద్యంగా ....

రథ సప్తమి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్ముతారు. ఈ రోజు సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసికోట దగ్గర పరమాన్నం ప్రసాదం తయారు చేస్తారు. దానికి ఎదురుగా చిక్కుచేస్తారుడు కాయలతో రథం చేసి చిక్కుడు ఆకులపైన పరమాన్నం ఉంచి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఎరుపు రంగు పూలతో పూజిస్తారు.

నోములు....

ఈ నాడు పూజలు, వ్రతాలు చేస్తారు. అందులో భాగంగా చిత్రగుప్తుని నోము, ఉదయకుంకుమ నోము, పదహారుఫలాల నోము, గ్రామకుంకుమ నోములను ఈరోజు ప్రారంభిస్తారు.

సూర్య భగవానుణ్ణి కొలిచే ఆలయాలు...

ఒడిశాలోని కోణార్క్ లోని కోణారక్ సూర్య దేవాలయం, గంజాం జిల్లాలోని బుగుడాలోని బీరంచినారాయణ ఆలయం. గుజరాత్ లోని మొధేరా ఆలయం, ఆంధ్రప్రదేశ్ లోని అరసవల్లిలో, తమిళనాడులో, అస్సాంలో సూర్యదేవాలయాలు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ లోని మార్తాండ్ లో, ముల్తాన్ లో సూర్యుడి ఆలయాల్లు కొలువు తీరాయి.