BREAKING NEWS

'సరస్వతి' కటాక్షం లభించే రోజు…!

'సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిని…
విద్యారంభం గరిష్యామిని సిద్ధురు భవతు మే సదా!'
పాఠశాల్లో చెప్పే మొదటి శ్లోకం ఇది. ఆ చదువుల తల్లిని, ప్రతి విద్యార్థి మాకు విద్య, జ్ఞానం రెండు కలగాలని నిత్యం ఈ శ్లోకంతోనే రోజును ప్రారంభిస్తాడు. అక్షరాభ్యాసం రోజున కూడా ఈ తల్లినే పూజిస్తాం. ఎందుకంటే ఆమె జ్ఞానానికి ప్రతీక. విద్యా ప్రదాయిని, విద్యా దేవత. 

ఆమె కటాక్షం లభించేందుకు ఎన్నెన్నో యాగాలు, పూజలు చేస్తుంటాం. అటువంటి సరస్వతి దేవి పుట్టినరోజును 'వసంత పంచమి'గా వ్యవహరిస్తారు. వసంత పంచమికి అసలైన పరమార్ధం ఏంటి?, ఈరోజున చదువుల తల్లిని ఎలా ఆరాధిస్తారు?, ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో వంటి విషయాల గురుంచి ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం:
 
మాఘ శుద్ధ పంచమినే మదన పంచమి లేదా 'వసంత పంచమి' అని అంటారు. కొన్నిచోట్ల 'శ్రీ పంచమి' అని కూడా పిలుస్తారు. ఈరోజున సరస్వతి దేవీ జయంతిగా భావిస్తారు. కళలు, శాస్త్రాలు, వేదాలు, సకల వృత్తులకు అధిష్టానం వహించే దేవతగా సరస్వతి దేవీని కొలుస్తారు.

ఈరోజున సరస్వతి దేవీతోపాటు కామదేవుడు, రతీదేవి, వసంతులకు పూజ చేస్తారు. ఈ మాసంలో చెట్లు వృద్ధి చెంది, పూలు వికసించి ప్రకృతి మొత్తం నిండుగా కనిపిస్తుంది. 

'సరస్వతి' అనే పదం 'తనను తాను తెలుసుకునే శక్తి' అని కూడా చెప్పొచ్చు. ఈ శక్తి జ్ఞానులకు మాత్రమే సాధ్యం! అటువంటి జ్ఞానానికి, సర్వ కళలకు ఆదిదేవతైన శ్రీ సరస్వతీదేవి మాఘ శుద్ధ పంచమి నాడు జన్మించింది.

అందువల్ల ఆ దేవి సకల చరాచర బ్రహ్మాండాలలో విశిష్ట పూజలందుకుంటోంది. ఎంత ధనాన్ని సంపాదిస్తే ఏం లాభం, సరస్వతీ కటాక్షం లేకుంటే ఆ డబ్బును ఎలా వినియోగించుకోవాలో తెలియదు. అప్పుడు ఆ జీవితానికి అర్ధం ఉండదు. ఙ్ఞానంలేని జీవితం వ్యర్థంతో సమానం! జీవితానికి మొదటి మెట్టుగా నిలిచే విద్యను అందరూ పొందినప్పుడే ఆ జీవితం సార్థకమవుతుంది.
 
నిర్మలమైన రూపం

సరస్వతీదేవి పరమ సాత్వికమూర్తి. ఆమె మనకు నిర్మలంగా, ప్రశాంతంగా దర్శనమిస్తుంది.  
శ్వేత వస్త్రాల్ని ధరించి, తెల్లని హంస వాహనంపై, తెల్లటి తామర పుష్పంపై కొలువు తీరి ఉంటుంది. నాలుగు చేతులు నాలుగు దిక్కులలో ఉండే సర్వదిక్పాలకులకు సంకేతంగా నిలిస్తే, ఎడమ చేతిలోని పుస్తకం సమస్త విద్యలకు చిహ్నం కాగా, కుడి చేతిలోని అక్షరమాల జ్ఞానాన్ని సూచిస్తుంది. 
హస్త భూషణమైన వీణ ఆమె పుట్టుకకు చిహ్నం కాగా, పాలను నీటిని వేరు చేసే హంస వాహనం మంచి, చెడుల విచక్షణ జ్ఞానాన్ని తెలుపుతుంది. 
 
జననం గురుంచిన కథ...

బ్రహ్మదేవుడు సృష్టిని తయారు చేస్తుండగా చెట్లు, జీవులతో పాటు మానవుడ్ని పుట్టించాడు. కానీ ఎన్ని జీవులున్న అంతటా నిశ్శబ్దం నెలకొనేసరికి ఆయనకంత సంతృప్తి కలగలేదట. ఇంతలా ప్రపంచాన్ని సృష్టించినప్పటికీ, ఏదో వెలితిగా అనిపించిందట. అప్పుడాయన కంట్లో చిన్న నీటిచెమ్మ వచ్చిందట.

అలా ఆయన కంట్లోంచి రెండు నీటి బొట్లు రాలి పడగా, కింద చెట్టు మీదున్న ఆకుపై పడి, అది చలించి, ఒక ప్రత్యేకమైన శబ్దం చేసిందట. అలా ప్రత్యేక నాదం నుంచి పుట్టిందే సరస్వతీ దేవి. ఆమెనే మనం నిత్యం కొలుస్తూ ఉన్నామని, శ్రీ పంచమినాడు ఈ కథను చెబుతుంటారు. సరస్వతీదేవిని బ్రహ్మే తనకు తోడుగా ఉండటానికి సృజించాడని విష్ణుపురాణంలో ఉంటే, దుర్గామాత సృజించిందని దేవీభాగవతంలో మనకు కనిపిస్తుంది. 
 
ఈరోజునే చేయొచ్చు

మనం దేనికైనా మంచిరోజునే చూస్తుంటాం. అలాంటిది తిథి, నక్షత్రాలు, ముహూర్తాలతో పని లేని మంచిరోజు ఈ వసంత పంచమి పండుగ రోజు.  ప్రకృతి నుంచి వెలువడిన ఆ తల్లి పుట్టినరోజే ఎంతో దివ్యమైన రోజు. ఈ పర్వదినం అన్ని కార్యాలకు శుభసూచకం!

◆ ఈరోజున పిల్లలకు ప్రత్యేకంగా అక్షరాభ్యాసం చేయించొచ్చు. 

◆ సంగీత విద్యను మొదలు పెట్టాలనుకునేవారు ఈరోజునే మొదలు పెట్టొచ్చు. 

◆ కొత్తగా ఏ కోర్సులో చేరాల్సి వచ్చిన ఈరోజునే మొదలు పెట్టొచ్చు. 

◆ వేదాంత విద్యను అభ్యసించేవారు ఈరోజునే చేరొచ్చు. 

◆ ఈరోజున పిల్లలతో కొత్త పలకల మీద 'ఓం నమః' అని రాయించండి.

◆ భగవద్గీత శ్లోకాలను పఠించాలనుకునేవారికి కూడా ఈరోజే ఉత్తమమైనది.

◆ యోగాభ్యాసనానికి కూడా ఇదే తొలిరోజు. 

◆ పెయింటింగ్, డ్రాయింగ్ లాంటి ఏవైనా నైపుణ్యాలను పెంచుకునే క్లాసులకు ఎంచక్కా వెళ్లొచ్చు. 

◆ ట్యూషన్లకు సైతం ఈరోజునే చేరొచ్చు. 
చదువును, జ్ఞానాన్ని మరింత పెంపొందించుకునే అత్యద్భుతమైన రోజు. ఈరోజున విద్యను ఇవ్వడానికి ఆ తల్లి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు దాన్ని సంతోషంగా స్వీకరించండి.
 
ఎలా ఆరాధించాలంటే...

పొద్దునే తలస్నానం చేసి, దేవాలయానికి వెళ్లి ఆ తల్లి దీవెనలు పొందొచ్చు. ఒకవేళ దేవాలయానికి వెళ్లే వీలు లేనప్పుడు ఇంట్లోనే పూజించుకోవాలి. 
ఉదయాన్నే లేచి, తలస్నానం చేసి, సరస్వతి దేవిని తెల్లటి వస్త్రాలతో అలంకరించి, తెల్లని పుష్పాలతో ఆరాధిస్తే గనక విశిష్టమైన ఫలితం లభిస్తుంది. 
ఈరోజు ప్రధానంగా క్షీరాన్నం పేలాలు, నువ్వుండలు, అటుకులు, చెరుకు ముక్కలను నివేదించాలి.

◆ పెరుగు, వెన్న, బెల్లం, తేనె పంచదార, కొబ్బరికాయ, రేగుపండ్లు నైవేద్యంగా సమర్పించి, విశిష్టమైన ఆ తల్లి అనుగ్రహం పొందొచ్చు.

◆ ఆయా వృత్తుల వారు తమ పనిముట్లను దేవిరూపంగా భావించి, వాటికి పూజ చేస్తే, మరింత ప్రయోజనం చేకూరుతుంది. 

◆ రాజస్థాన్ లో ఈ పర్వదినాన్ని విశేషంగా జరుపుతారు. 
 
★ మీరు కూడా ఏదేని విద్యను నేర్చుకోవాలనుకుంటే, ఆ తల్లిని మనసులో తలచుకొని, ఆమె దీవెనలతో మొదలు పెట్టొచ్చు.