BREAKING NEWS

" హిందూ వైవాహిక వ్యవస్థ" నాడు - నేడు ....

పెళ్లి.... ప్రతీ ఒక్కరి జీవితంలో మరచిపోలేని ఓ మధుర ఘట్టం.... అక్షరాలు రెండే అయినా భావాలు , బంధాలు ఎన్నో. అన్ని కుల మతాల వాళ్లు కూడా పెళ్లి చేసుకుంటారు.

అయితే మన హిందూ వ్యవస్థలో పెళ్లికి ఎంతో తతంగం ఉంటుంది. పూర్వం 5 రోజుల పెళ్లి చేసేవాళ్ళు.... తర్వాత్తర్వాత ఒక రోజులో పెళ్లి చేసేవారు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి... ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్లి కానిచ్చేస్తున్నారు.

మన హిందూ విధానంలో ఏం చేసినా దాని వెనుక ఒక బలమైన కారణం ఉంటుంది. అయితే ఈ పెళ్లి లో భాగంగా చేసే వివిధ కార్యక్రమాలు , ఆచారాలు ఏమిటి? 
  
మన హిందూ వివాహాలలో అనేక సంప్రదాయాలు పూర్వీకుల నుండి మనకు వారసత్వంగా వచ్చాయి. అయితే కొన్ని సామాజిక వర్గాల్లో ఇవి మరి కొంచెం ఎక్కువగా ఉంటాయి.. వీటన్నింటి వెనుక సహేతుకమైన కారణాలు అనేకం ఉన్నాయి. మన పూర్వీకులు అవలంబించిన పద్దతులన్నీ ఆచరణ యోగ్యమైనవే అయినప్పటికీ ,  నేటి పరిస్థితుల్లో ఇవన్నీ పాటించడంలోనే ఉంది అసలు ఇబ్బందంతా.. సమయం ఉండదు, ఓపిక ఉండదు... ఇంతకీ మన పూర్వీకులు నుంచి వచ్చిన పెళ్లి ఆచారాలు ఏమిటీ???
 
1).తోట సంబరం :
        ఆ రోజుల్లో చాలా దూరం నుండి పెళ్లికి తరలి వచ్చేవారు. ఇప్పుడంటే అద్దెకు గదులు దొరుకుతున్నాయి... కానీ అలాంటి వేరే వసతి సదుపాయాలు ఏమీ లేని ఆ రోజులలో నేరుగా వివాహం జరిగే గ్రామానికి / ప్రాంతానికి వచ్చేవారు. అందుకని వచ్చిన వారికి ఊరి మొదట్లో ఉన్న ఒక తోటలో విడిది సత్కారాలు ఏర్పాటు చేసి , పరస్పరం అందరిని పేరు పేరునా పరిచయాలు చేసుకుని , స్నానాదికాలకు కావలసినవి ఏర్పాటు చేసేవారు. అందులో భాగమే నలుగుపిండి ,సబ్బు , కొబ్బరినూనె, అద్దం,దువ్వెన,పౌడర్,సెంటు మొదలైనవి అందజేయడం.

2). వివాహం పూర్తి అయ్యాక మళ్ళీ వారి స్వస్థలానికి వెళ్ళాలి కనుక, మార్గమధ్యంలో ఆకలేస్తే తినడానికి అవసరమైన బలమైన ఆహారపదార్ధాలు ( పెద్ద సైజులో  మినపసున్ని , లడ్డు, మైసూరు పాక్ మొదలనవి) అప్పగింతల సమయంలో అందజేసే వారు...

3).పెళ్లి కూతురుని గంపలో కూర్చోబెట్టి మేనమామలు పెళ్లి పీటల మీదకు తీసుకురావడం వెనుక కూడా ఓ కారణం ఉంది... అక్క/చెల్లెలి కూతురుపై తమకు హక్కు ఉంటుంది కాబట్టి  , ఆమె మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి మాకు  అభ్యంతరం లేదని సభాముఖంగా తెలియజేస్తూ మేనమామలు పెళ్లి కుమార్తెను గంపలో తీసుకొచ్చేవారు. అప్పట్లో ఈ గంపను ప్రత్యేకంగా తయారుచేసేవారు... ధర కూడా తక్కువే ఉండేది. కానీ ఇప్పుడు ఈ గంప కూడా  వేల రూపాయల ధర పలుకుతోంది. ఇక దింపుల్లో ఇచ్చిన ఖరీదయిన స్వీట్స్ అందరికీ పంచబోతే , అబ్బే ... షుగరండీ .. స్వీట్స్ తినం  అనడం , నిల్వ ఉంటే పాడైపోతాయనే భయం...
 
            ఇవన్నీ నిజంగా గొప్ప గొప్ప సంప్రదాయాలు అయినప్పటికిని ఈ రోజులలో కూడా ఇవన్నీ మక్కీకి మక్కి పాటించడం అవసరమేనా అన్నది మనకు మనంగా ఆలోచించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ...ఎంతో డబ్బు అంతకు మించి కఠోర శ్రమతో కూడిన , కాలం చెల్లిన కొన్ని సంప్రదాయాలను విడిచి పెట్టి , ఈ కాలానికి తగినట్లుగా కొన్ని పద్దతులను ప్రవేశపెట్టుకోవడంలో తప్పు లేదు కదా ... పాత తరాల వారికి మనం అత్యంత విలువనిస్తూనే , మనం కూడా కొన్ని మంచి సంప్రదాయాలను ప్రవేశపెట్టి , మన భావితరాలవారికి
ఒక కానుకగా అందించే ఓ భాద్యత మనమీద ఉంది.

Photo Gallery