BREAKING NEWS

కియా - నయా అభివృద్ది

                        ఆటో మోబైల్ ఇండస్ట్రీ , ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న అతిపెద్ద రంగం. ఒక కార్ల కంపెనీ వచ్చిందంటే అందులో కొన్ని లక్షల మందికి ప్రత్యక్ష ఉద్యోగాల (మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్, రీసెర్చ్ & డెవెలెప్మెంట్, సెర్వీసింగ్ సెంటర్స్ etc) ద్వారా ఎంప్లాయిమెంట్ కలుగుతుంది.

ఉదాహరణకు టొయోటా కంపెనీ లో సుమారుగా 3,64,000, హోండా 2,15,000, హ్యుందాయ్ 1,18,320 మంది శాశ్వత ఉద్యోగులు పని చేస్తున్నారు. అది కాక ఆ కంపెనీ అనుబంధంగా నడిచే పెయింట్స్, ఆక్ససరీస్, టైర్స్, ఎలక్ట్రికల్ యూనిట్స్ మొదలైన ఎన్నో ఇండస్ట్రీస్ ద్వారా మరెంతోమందికి ఆధారమవుతుంది. ఇవి గాక అసంఘటిత రంగం లో ప్రైవేట్ మెకానిక్స్ దగ్గర నుంచి కార్ డెకార్స్, స్టిక్కరింగ్ చేసే వాళ్ల వరకు ఎన్నో కోట్ల మందిని పోషించగల సత్తా ఉన్న రంగం.
 
                             అలాంటి ఒక పెద్ద కార్ల కంపెనీ వోక్స్ వ్యాగన్ మన ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం లో వచ్చే అవకాశం 2005 లో మన ముంగిటకి వచ్చింది. విశాఖపట్నం అంటే ఆంధ్రప్రదేశ్ లోని సకల వసతులు కలిగిన ఒక మహానగరం.  అన్ని రకాల ట్రాన్స్“పోర్ట్” ఫెసిలిటీస్ మరియు వాణిజ్య అవకాశాలు కలిగిన విశాఖ నగరానికి వోక్సవ్యాగన్ ఇండస్ట్రీ రావడం లాంఛనమే అనుకున్నాం.

అలా వచ్చుంటే నేటికి 6 లక్షల మంది పైగా ఎంప్లాయిస్ ఉన్న ఆ మహా కంపెనీలో కొన్ని వేల మంది మన లోకల్ ఆంధ్రా యువకులు భాగస్వాములు అయ్యే వారు. కానీ “దురదృష్టవ శాత్తూ” ఆ కంపెనీ  చివరి నిమిషంలో మహారాష్ట్ర కి తరలిపోయింది. దాని వల్ల ఆంధ్రా యువత చాలా నష్టపోయిందని చెప్పొచ్చు. అయితే  ఆ నష్టం సరిగ్గా పన్నెండేళ్ల తర్వాత సరిచేయబడింది.
           
                   కియా :   సౌత్ కొరియా బేస్డ్ గా పని చేస్తున్న కార్ల కంపెనీ. 1944 లో చిన్న సైకిల్స్ తయారీ కంపెనీ గా మొదలై , అంచెలంచెలుగా మోటార్-సైకిల్స్, ట్రక్స్ , తర్వాత కార్ల తయారీ దాకా ఎదిగి, నేడు ప్రపంచంలో  “8 వ” అతిపెద్ద ఆటో-మేకర్ గా ఉన్నది ! ఇప్పటికి అమెరికా, యూరోప్, మెక్సికో తదితర దేశాల్లో ప్రపంచ వ్యాప్తంగా 14 మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్లతో 180 దేశాల్లో వాణిజ్యపరంగా విస్తరించి ఉంది. డిజైనింగ్, క్వాలిటీల్లో ఎన్నో అవార్డులు అందుకున్న సంస్థ. అంతే కాకుండా మరో సౌత్ కొరియన్ బేస్డ్ గా పని చేసే ప్రముఖ కార్ల కంపెనీ “హ్యుందాయ్” కి 1/3 వ వంతు వాటా ఉంది. రెండూ కంపెనీలు పరస్పర వ్యాపార భాగస్వాములు. ఇప్పటికే గ్లోబల్ గా యాభై వేల మందికి పైగా ప్రత్యక్ష ఉద్యోగులు కియా లో పని చేస్తున్నారు.
 
                       అటువంటి కంపెనీ, ఇండియాలో అడుగు పెడదామనుకున్నప్పుడు చాలా రాష్ట్రాలు పోటీ పడ్డాయి. ముఖ్యంగా ఇప్పటికే ఆటోమోబైల్ హబ్స్ గా ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ మొదలగు రాష్ట్రాల వైపు ఎక్కువ మొగ్గు ఉండే అవకాశాలు ఉండేవి. సౌత్ ఇండియా లో కేవలం తమిళ నాడు లో తప్ప ఇంకెక్కడా ఆటో ఇండస్ట్రీ విస్తరించలేదు. పైగా తమిళ నాడు ప్రపంచంలోనే టాప్-10  ఆటోమోబైల్ హబ్స్ లో ఒకటి. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతమైన దౌత్యం వలన, సంపూర్ణ సహకారం మరియు విశ్వసనీయత కారణంగా తమ 15 వ  ప్లాంట్ ను ఆంధ్రప్రదేశ్ లో పెట్టడానికి ముందుకు వచ్చి 2017-ఏప్రిల్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తో M.O.U.  చేసుకోవడం జరిగింది.

ఇది కూడా 2005 లోని వోక్స్ వ్యాగన్ ఉదంతం వలె అవుతుందేమోననే భయాలను పటాపంచలు చేస్తూ, ప్రభుత్వం వేగంగా అందుకు కావలసిన భూమిని చదును చేసి అప్పగించడం వలన వెంటనే 2017 సంవత్సరం చివరి కల్లా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. అందులోనూ ఒకప్పుడు కరవు కు ప్రసిద్ధి చెంది, ఆంధ్రా లో వెనకబడిన ప్రాంతంగా చెప్పబడే రాయలసీమ లోని అనంతపురం జిల్లా, పెనుకొండలో 1.1 బిలియన్ డాలర్స్ అంటే సుమారు 7,500 కోట్ల రూపాయల పెట్టుబడితో అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ 536 ఎకరాలలో, సంవత్సరానికి 3,00,000 కార్ల తయారీ కెపాసిటీ తో స్థాపించబడింది. సరిగ్గా రెండేళ్ల లోపే దాదాపుగా పూర్తి అయి ట్రయిల్ ప్రొడక్షన్ లో తయారైన కార్ కూడా రోడ్ పైకి వచ్చేసింది.

ఈ సంవత్సరం అంటే 2019 ద్వితీయార్థం నుంచి పూర్తి స్థాయి లో మార్కెటింగ్ మొదలు పెట్టి ఆరు నెలలకు ఒక మోడల్ రిలీజ్ చేయాలనే ప్రణాళికతో ఉన్నారు. అంతేకాకుండా భవిష్యత్ లో ఇంకా విస్తరించేందుకు సిద్ధంగా ఉంది. కేవలం రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం మరియు ఇచ్చిన రాయితీలు, ఇన్వెస్ట్ మెంట్ లో అందించిన సహకారం పై ఆధార పడే ఈ ప్రాజెక్ట్ చేపట్టినట్లు కియా-మోటార్స్ ఇండియా M.D. KOOKHYUN SHIM ఒక ఇంటర్వ్యూ లో చెప్పడం విశేషం.
 
                   అనంతపురం జిల్లా చరిత్రలో కియా రాక ఒక అద్భుతమైన మలుపు గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా ఒక ప్రాంతానికి కియా వంటి పొటెన్షియల్ కలిగిన ఒక పెద్ద ఇండస్ట్రీ వచ్చిందంటే ఆ ప్రాంతం రూపురేఖలు సమూలంగా మారిపోతాయి.

అక్కడి స్థానిక ప్రజల జీవన శైలి ఎంతో మెరుగవుతుంది. ఈ విషయం IT ఇండస్ట్రీ వచ్చిన తర్వాత హైదరాబాద్ మరియు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత గాజువాక సాధించిన అతి వేగవంతమైన అభివృద్ధిని చూస్తే అర్ధమవుతుంది. అలాగే అనంతపురం స్థాయి కూడా మారబోతోంది. ఇప్పటికే అక్కడ సందడి మొదలైంది.  పదివేల మందికి పైగా స్థానికులు మరియు ఆంధ్ర యువతకు ఉద్యోగాలు వస్తున్నాయి. ఇంకా స్థానిక వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ మరియు ఇంటి అద్దెలు సైతం గణనీయంగా పెరిగాయి.
 
                   అయితే కియా రాక కేవలం నాంది మాత్రమే.  దీని ఆధారంగా మరెన్నో ఆటో పరిశ్రమలు మన రాష్ట్రానికి వస్తున్నాయి, ఇంకా రాబోతున్నాయి. ఇప్పటికే హీరో మోటోకార్ప్, హోండా, ఇసుజు, అశోక్ లే-ల్యాండ్ వంటి పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ లో తయారీ పరిశ్రమలు నెలకొల్పుతున్నాయి. అలాగే మరెన్నో ఆటో కంపెనీలు వస్తాయి. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రపంచ స్థాయి ఆటో హబ్ గా ఎదుగుతుందని ఆశిద్దాం..... !!!

Photo Gallery