BREAKING NEWS

ఎన్నికలకు  నెలరోజులు ఎలక్షన్ ఫీవర్

సరిగ్గా ఎన్నికలకు  నెలరోజులు. ఎన్నికల్లో పోటీ చెయ్యాలంటే ముందుగా నామినేషన్ వెయ్యాలి. అందుకు గడువు ఈ నెల 25 వ తేదీతో ముగుస్తోంది. 175 అసెంబ్లీ , 25 పార్లమెంట్ నియోజకవర్గాలు. పోటీలో పాల్గొనే రాజకీయ పార్టీలు చూస్తే ఒకటా ? రెండా?? టిడిపి, వైసిపి, బిజెపి, కాంగ్రెస్, జనసేన, సీపీఐ, సిపిఎం, ప్రజాశాంతితో పాటు మరికొన్ని చిన్న పార్టీలు కూడా ఉన్నాయి... 

అయితే ఇంతవరకూ ఏ పార్టీ కూడా తమ అభ్యర్థులను పూర్తి స్థాయిలో అధికారికంగా ప్రకటించలేదు. అసలే సమయం తక్కువగా ఉంది . ఇది ఒక విధంగా పోటీలో ఉన్న అభ్యర్థులకు EC ఇచ్చిన వరం. మరో విధంగా శాపం. తక్కువ సమయం వలన రోజు వారీ ఎలక్షన్ ఖర్చులు తగ్గుతాయి. కానీ మొత్తం నియోజకవర్గం తిరగాలంటే టైం సరిపోదు. అభ్యర్థుల పాలిట మొదటిది వరమైతే రెండవది శాపం. 

నామినేషన్ ల సమయం దగ్గర పడుతున్నా సరే  అసలు అధిష్ఠానాలు ఎందుకు అభ్యర్థులను ప్రకటించలేదు.కారణాలు చూద్దాం....అభ్యర్థుల ప్రకటనలో సర్వేలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి... ఎవరు, ఎక్కడ, ఎందుకు మొదలుపెట్టారో తెలియదు గానీ ఇప్పుడు ప్రతీ ఒక్కరూ ఈ సర్వేల పనిలో పడ్డారు.  అదే పనిగా సర్వేలంటూ ఎదో ఒక కన్సల్టెన్సీ కి బోలెడు డబ్బు ఇచ్చి ఆయా నియోజకవర్గంలో అభ్యర్థుల గురించి తెలుసుకుంటున్నారు. వారు ఇచ్చిన రిపోర్ట్ మేరకు అభ్యర్థులకు టికెట్ ఇవ్వడం, వారు గెలిస్తే కచ్చితమైన సర్వే ఇచ్చినట్లు , ఒక వేళ గెలవకపోతే ఓటర్ మనోభావాలు అంతు పట్టలేదనడం ..

అసలు ఈ సర్వేలలో శాస్త్రీయత ఏమిటి ?

కొంతమంది బృందాలుగా ఏర్పడి ఒక ప్రాంతాన్ని ఎంచుకుని కొంతమంది ప్రజలను కలసి మాట్లాడి , వారి మాటలను బట్టి  వీరికి అర్ధమైన మేరకు ఒక నివేదిక ఇవ్వడం. అదే ఒక గొప్ప నిబద్దత కలిగిన సర్వేగా పార్టీలు భావించడం. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ అంతా ..

ఈ బృందాలు కలసిన ప్రజలలో ఓటు హక్కు ఉన్నవారు ఎంతమంది ? లేనివారు ఎంతమంది ? వారు నిజంగా వారి మనసులో మాట చెప్పారా ..లేదా .. అసలు ఓటర్లు అందరిని కలసి వారి మనసులో మాటను తెలుసుకోవడం సాధ్యమయ్యే పనేనా ??? మరి ఎవరిని మభ్యపెట్టడానికి ఈ సర్వేలు .. వారిని వారే మోసపుచ్చుకోవడం తప్ప..

సుశిక్షితులైన పోలీసు అధికారులు ఇచ్చిన విజిలెన్స్ రిపోర్ట్స్ కూడా ఒక్కోసారి అంచనాలు తప్పడం మనం చూస్తున్నాం. అలాంటిది సామాన్య ఉద్యోగులు చేసే సర్వేలు ఏ మేరకు ఫలిస్తాయి ?? అంటే ఈ సర్వేలన్నీ ఒక కల్పితం అని తెలిసినా తమను తాము నమ్మడానికి ధైర్యం చాలక ఎవరో చెప్పిన మాటను నమ్ముతున్నారు.  ఫలితం వ్యతిరేకంగా వస్తే  కన్సల్టెన్సీ సంస్థ తప్పుగా నివేదిక ఇచ్చిందనడం , ఫలితం అనుకూలంగా వస్తే మంచి సంస్థకు భాద్యత అప్పజెప్పాం అని జబ్బలు చరుచుకోవడం.

ఇంతకీ ఈ సర్వేల విషయం ఇప్పుడెందుకంటే ఇప్పటివరకూ అభ్యర్థులను ప్రకటించకపోవడానికి అసలు కారణం ఇదుగో ఈ సర్వేలే.. వీటి ఆధారంగానే అభ్యర్థులను , నియోజకవర్గాలను మార్చి మార్చి నానా తంటాలు పడుతున్నారు అందరూ కూడా ..

అభ్యర్థులను ఖరారు చేయకపోవడానికి మరో కారణం కూడా ఉంది. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలోకి జంప్ అవుతారో తెలియని పరిస్థితిలో ఉన్నాయి రాజకీయ పార్టీలు. కొత్తగా ఎంత మంది వస్తారు, ఎలాంటి వాళ్ళు వస్తారు అనే విషయాలు చూసుకుని టికెట్ కేటాయించాలి. పైగా సొంత పార్టీల్లోని అసమ్మతి సెగలు, రెబల్స్ కూడా ఉంటున్నారు.

టికెట్ ఆశించి రానివాళ్ళందరూ పార్టీలు మారుతున్నారు. కాబట్టి రెబల్స్ కి ఆ అవకాశం లేకుండా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడానికి కొన్ని రోజుల ముందు లేదా గడువు దగ్గర్లో అభ్యర్థులను ప్రకటిస్తారు. వైసిపి లో  నూతన చేరికల వలనే అభ్యర్థుల ప్రకటన ఆలస్యం అయ్యింది... ఈ నెల 16వ తేదీన వైసిపి తుది జాబితా ప్రకటించనుంది. టిడిపి కూడా త్వరలోనే అభ్యర్థులను ఫైనల్ చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు...   మరి చివరాఖరికి ఎవరు ఎవరిని ఖరారు చేస్తారో ?? గెలిచేదెవరో ?? ఓడేదెవరో ??? చూద్దాం ...

Photo Gallery