BREAKING NEWS

ఫాల్స్ ప్రెస్టేజ్ - నో జాబ్స్

చదువుకున్నోళ్లు ఎక్కువ... ఉద్యోగాలు తక్కువ ..
ఎవరి నోటా విన్నా ఇదే మాట... ఈ నిరుద్యోగ సమస్య నిజంగా ఉందా ?? ఉంటే ... దీనికి పరిష్కారం లేదా ??? పూర్వం అప్పటి పరిస్థితుల బట్టి వారి వారి స్తోమతను బట్టి వారికి అందుబాటులో ఉన్నంత వరకు చదువుకుని , తర్వాత వారి కుల వృత్తులను గాని , అప్పటికే తండ్రులు చేస్తున్న వర్తక , వ్యాపారాలలో గానీ ప్రవేశించేవారు. అప్పటికే తల్లిదండ్రుల ద్వారా స్థిరత్వం పొందిన రంగాలలో ప్రవేశించిన యువత తమదైన శైలిలో ఆయా రంగాలలో నైపుణ్యం చూపించి , మరి కొంతమంది నిరుద్యోగులకు జీవనోపాధి కల్పించేవారు. ఇవేవీ చేతగాని , అవకాశం లేని వారు మాత్రమే ఎన్ని కష్టాలకైనా  ఓర్చి  పై చదువులు చదివి ఏదో ఒక ఉద్యోగంలో చేరి బ్రతుకు బండిని భారంగా లాగేవారు... 
కాబట్టి ఆ రోజుల్లో నిరుద్యోగ సమస్య అంతగా పీడించేది కాదు.

     కాలాన్ని బట్టి వచ్చే మార్పుల్లో క్రమ క్రమంగా ప్రతీ తల్లితండ్రులు తమ పిల్లలును బాగా చదువుకుని మంచి ఉద్యోగం లో స్థిరపడాలి అనే ఆలోచనతో ఎంత డబ్భైనా ఖర్చు పెట్టి , ఎంత దూరం అయినా పంపిస్తున్నారు. "మీరు మా లాగా కాకూడదు , బాగా చదవండి" అని అనుక్షణం వారికి నూరి పొయ్యడం వలన వారు అలవాటు లేని క్రొత్త ప్రదేశంలో అమ్మా నాన్నలను వదిలి ఉండలేక , చదవలేక తల్లితండ్రులు తమపై పెట్టుకున్న ఆశలను తీర్చలేని అసహాయ పరిస్థితులలో అఘాయిత్యానికి పాల్పడుతున్న ఘటనలు మనం ఎన్నో చూస్తున్నాం.

అప్పుడు ఆ తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే .. తాము అప్పటికే గౌరవంగా బ్రతుకుతున్న తమ తమ వృత్తి వ్యాపారాలలోకి తమ పిల్లలు రా కూడదు అని అనుకోవడం.. ఇంకెవరి దగ్గరో ఉద్యోగం చేయాలనుకోవడం.. ఇక ప్రస్తుతానికి వస్తే. జీవనోపాధి లేదు అని ఈ రోజుల్లో ఎవరైనా అన్నారు అంటే .. వారు తప్పనిసరిగా బద్దకిస్తులైనా అయి ఉండాలి లేదా పరాన్నజీవులైనా అయి ఉండాలి. 

                        ఎందుకంటే పూర్వం అయితే కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఉండేవి. మరో ప్రత్యామ్నాయం ఉండేది కాదు. కానీ నేడో ? పని చేయడానికి మనుషులు దొరక్క ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అంటే చెయ్యడానికి పని దొరకని రోజుల నుండి , పని చేయడానికి మనుషులు దొరకని రోజులు వచ్చాయన్నమాట. చదువుతో కూడా సంబంధం లేదు. చక్కని నడవడిక , క్రమశిక్షణ ఉంటే చాలు నెలకు కనీసం 10 నుండి 15 వేలు సంపాదించుకుని తమ కుటుంబాన్ని గౌరవంగా పోషించుకోవచ్చు. ఇక ఆ కుటుంబంలో భార్య కూడా పనిచేస్తే .. ఇక వారి గురించి ఆలోచనే అనవసరం.
అందుకు తగ్గ పరిస్థితులు ఈ రోజు మనకు ఉన్నాయి.

అనేకమైన ప్రవేటు కంపెనీలు , సంస్థలు , హోటల్స్ , డిపార్ట్మెంట్ స్టోర్స్ , కల్యాణ మండపాలు , ట్రావెల్స్ , ఈవెంట్స్ మొదలైనవి దినదినాభివృద్ధి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో మనం ముందు చెప్పుకున్నట్లుగా మంచి ప్రవర్తన , క్రమశిక్షణ , నోటి మంచితనం ఉంటే చాలు. అలా అని చదువు అనవసరం అని కాదు. కానీ ప్రక్కవారితో పోటీ పడి మనకు తాహతు లేకపోయినా సరే ఫాల్స్ ఫ్రస్టేజ్ కి పోయి " పేద్ద" చదువుల పేరుతో తల్లితండ్రులు బాధ పడుతూ పిల్లలను బాధ పెట్టడం సరికాదు కదా ..!

                 "కోటి విద్యలు కూటి కొరకే " ఎవరు ఎన్ని చదువులు చదివినా జానెడు పొట్టకోసమే కదా..
ఉన్నత చదువులు చదివిన వారంతా సిరి సంపదలతో తులతూగనూ లేదు , ప్రాధమిక చదువులు చదివిన వారందరూ దరిద్రంలో మగ్గిపోనూ లేదు ..  ఇందుకు
మనకెన్నో ప్రత్యక్ష ఉదాహరణలు ఉన్నాయి. వందలాది సంవత్సరాల క్రిందట కావచ్చు లేదా  వందలాది సంవత్సరాల భవిష్యత్తు కాలం కావచ్చు మానవుల దైనందిక కార్యక్రమాలలో మార్పు ఉండదు. హెయిర్ కటింగ్ , బట్టలు ఉతుక్కోవడం, బట్టలు కుట్టడం , వంటపాత్ర లు కొనుక్కోవడం (మళ్ళీ పాతతరం కుండలు వాడకం మొదలయ్యింది), చెవులు కుట్టించుకోవడం , చెప్పులు కుట్టించుకోవడం, కర్ర సామాన్లు చేయించుకోవడం మొదలైనవి ఎన్నో ..ఎన్నెన్నో ... మన సంప్రదాయాలు గొప్పవి.

మన వృత్తులు గొప్పవి. మన సంస్కారం గొప్పది.
మన సంస్కృతి గొప్పది. కనుక కేవలం ఓ ఫాల్స్ ఫ్రేస్టేజ్ కు బందీ కాకుండా , అవకాశం మరియు అవసరం ఉన్నంత మేరకే విద్యనభ్యసించి , మనం ఉన్నతంగా బ్రతకడమే గాక మరికొంతమందిని కూడా బ్రతికిద్దాం ...!!! బ్రతకనిద్దాం...

Photo Gallery