BREAKING NEWS

నాయకుడికి ఉండాల్సిన స్ఫూర్తి - సమయస్ఫూర్తి


జీవితంలో మనం చాలా ఆశలు, ఆశయాలు పెట్టుకుంటాం. వాటి సాధనకై నిరంతరం ప్రణాళిక రచించి శ్రమిస్తుంటాం. మనం అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంటే ఉత్సాహం ఉరకలేస్తుంది. నిరంతరాయంగా గోల్ రీచ్ అయ్యి విజేతలు అనిపించేసుకోవచ్చు. అయితే మన దారిలో అవరోధాలు ఎదురైతేనే వెంటనే డీలా పడిపోతారు. అనుకున్నది జరగకపోతే ఆగిపోతారు. ఇంక జీవితాన్ని నిస్తేజంగా గడిపేస్తుంటారు. తమ లైఫ్ లో “ టర్నింగ్ పాయింట్ ” కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
 
“సమయస్ఫూర్తి” అంటే ముందుగా ప్లాన్ చేసినట్లు జరగకుండా అనుకోని  అవాంతరాలు, అడ్డంకులు ఎదురైనా కృంగిపోకుండా ,సమయానుకూలంగా మన నిర్ణయాలు మార్చుకుంటూ చాకచక్యంగా వ్యవహరిస్తూ గమ్యం వైపు ముందడుగు వేయడమే. అంతే తప్ప “నా నిర్ణయం మారదు” అని పంతం పట్టి అక్కడే ఉంటే వికాసం ఆగిపోతుంది. పేస్ బౌలర్ అవుదామని ఎన్నో కలలు కని అకాడమీ కి వెళ్లిన సచిన్ దానికి తన ఎత్తు అవరోధం అని తెలుసుకుని, దిగులు పడకుండా బ్యాట్స్ మన్ గా “టర్న్” అయ్యి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన విషయం తెలిసిందే.
 
ముక్కు సూటిగా ఉండడం, పట్టుదలగా పని చేయడం చాలా‌ మంచి‌ లక్షణమే. అలా అని ముక్కు సూటి మార్గంలో అడ్డం‌ వచ్చిన చెట్టుకు గుద్దుకుని పడిపోవడం మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి లక్ష్యం నిర్దేశించుకుని అది చేరుకునే పథంలో "గెలుపు" కు అవసరమైన "మలుపులు"  తీసుకోవడం ప్రధానం. 
 
ముఖ్యంగా  నాయకుడు అన్న వాడికి ఈ సమయస్ఫూర్తి, విచక్షణ కచ్ఛితంగా ఉండవలసిన లక్షణాలు. కేవలం ఒక్క అవకాశం పై మాత్రమే ఆధారపడి, దాని కోసమే పోరాడుతూ ఉండిపోకుండా, ప్రత్యామ్నాయ అవకాశాల్ని సృష్టించుకుని తన వాళ్లను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకుడిపై ఉంది. అంతే తప్ప తన చేతుల్లో లేని దాని‌ గురించి ఆలోచిస్తూ అక్కడే ఆగిపోకూడదు.

ఆవేశం, అహంకారం చూపించకుండా, పరిస్థితులకు తగినట్లు సహనంతో వ్యవహరిస్తూ,  ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ‌ తగ్గాలో తెలిసుండాలి.  " అనుభవం " మరియు "సమర్థత" అంటే  చక్కగా ఉన్న రాచ మార్గంలో తిన్నగా దూసుకెళ్లడం కాదు, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగడం. కాబట్టి లక్ష్యం చేరే క్రమంలో  అవసరమైతే ఎన్ని " టర్న్స్" తీసుకున్నా తప్పు లేదు. 

అయితే ప్రజాస్వామ్య వ్యవస్థలో  నాయకుడికి నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ తక్కువ. ఎందుకంటే వారు ఆయా పదవులలో ఉండాలంటే ప్రజలలో పరపతి ఉండాలి. అందుకు ప్రజాభీష్టం మేరకు నడుచుకోక తప్పదు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వివిధ ప్రచార ఆర్భాటాల, తప్పుడు విమర్శ, ప్రతి‌ విమర్శల ప్రభావం లో పడకుండా, అవకాశ వాదానికి, అవసరానికి తగిన వ్యూహానికి గల తేడా ను గ్రహించి తమ జీవితాలకు అవసరమైన " మేలి మలుపు " తీసుకు రాగల సమయస్ఫూర్తి ఉన్న నాయకుడినే ఎన్నుకోవాలి.