BREAKING NEWS

సినిమా హాల్స్ లో టికెట్ ధరలు

సినిమా హాల్స్ లో    టికెట్ ధరలు   మరియు  తినుబండారాల - ధరలు
       
సినిమా... ప్రతి సాధారణ మనిషికి ఉన్న ఏకైక వినోద సాధనం... పేదవాడి దగ్గర నుంచి ధనవంతుడి వరకు అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ధనవంతులని పక్కన పెడితే సామాన్య ప్రేక్షకుడు కుటుంబంతో కలిసి నిజంగా సినిమాని సంతోషంగా చూడగలుగుతున్నాడా.... ఎంజాయ్ చేయగలడా.. కచ్చితంగా లేదనే చెప్పాలి... ఈ పరిస్థితికి ఒకటో రెండో కాదు. ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి... 

              ఈ రోజుల్లో  సాధారణ సినిమా హాల్స్ లో చిన్న హీరోస్ సినిమాలకు టికెట్ ధర  112 రూపాయలు. అదే పెద్ద థియేటర్ కానీ , పెద్ద హీరోలు కానీ అయితే 250 రూపాయలు. పోనీ సరేలే సరదా కదా అని వెళితే పార్కింగ్ ఫీజుతోనే స్వాగతం పలుకుతారు. ఇక ఇంట్రవల్ లో స్నాక్స్ కొందామంటే ఆస్తులు అమ్ముకోవల్సిందే...

ఒక చిన్న కప్పులో వేయించిన బంగాళా దుంపలు, పాప్ కార్న్ మొదలైనవి కనీస ధర 50 రూపాయలు. పోనీ ధర ఎక్కువైనా  కొనడానికి వెళ్తే అక్కడ వరద బాధితులకు పులిహార పొట్లాలు పంచతున్నట్లుగా వాడి బిల్డప్. డబ్బులు చేత్తో పట్టుకుని జనం మధ్యలో నుండి ఎంత అరచినా పట్టించుకోడు. మన పుణ్యం బాగుంటే దొరుకుతాయి లేదా అయిపోవచ్చు. మరో వైపు ప్రభుత్వం తగిన సూచనలు ఇచ్చినా సరే ఆయా యాజమాన్యం అమలు చెయ్యదు.
 
                 ఈ విషయాలు మనం ఇంతకు ముందు చర్చించుకున్నాం... అయితే మరి దీనికి పరిష్కారం లేదా ? ఇందులో మన పాత్ర ఎంత ? ఓ సారి ఆలోచిద్దాం ...! రోజు రోజుకి సినిమా టికెట్ ధరలు పెంచే బదులు హాల్స్ లో వాణిజ్య ప్రకటనలు వేస్తారు కదా .. వారి వద్ద నుండి ఎక్కువ మొత్తం వసూలు చెయ్యవచ్చు. ఫలితంగా టికెట్ ధరపై సబ్సిడీ ఇవ్వొచ్చు. ప్రింట్ మీడియా న్యూస్ పేపర్స్  వాళ్ళు చేస్తున్నది ఇదే కదా.. హాల్ కు వచ్చే ప్రేక్షకులు పెరుగుతారు. ఒక వస్తువు ధర అధికంగా ఉండి, కొనుగోలు దారులు తక్కువగా ఉండే కంటే ,
ఆ వస్తువు ధర తక్కువగా ఉండి, కొనుగోలుదారులు ఎక్కువగా ఉన్నప్పుడే వ్యాపారం బాగా జరుగుతుందనేది నిజం. అలాగే ... ఏ షాపింగ్ మాల్, షాప్ యజమానులు అయినా కూడా తమ వినియోగ దారుల వాహనాల పార్కింగ్ కు స్థలం కేటాయించాలని చట్టం చెబుతోంది. తమ వద్ద కొన్నా కొనకపోయినా,  తమ  షాప్ కు వచ్చినందుకే పార్కింగ్ ప్లేస్ చూపించినప్పుడు తమ హాళ్ళో సుమారు 2 , 3 గంటలు ఉండి సినిమా చూడటానికి వచ్చినవారికి ఉచిత పార్కింగ్ చూపించాల్సిన బాద్యత సినిమా హాల్ యజమానులదే కదా .. 

ఏదైనా ప్రొడక్ట్ బాగలేకపోతే ఆయా కంపెనీలు వెంటనే చర్యలు తీసుకుంటాయి. ఓ కంపెనీ కారులో లోపం ఉందని తెలుసుకున్న ఆ కంపెనీ అప్పటి వరకు మార్కెట్ లో ఉన్న తమ కార్లను కాల్ బాక్ చేసింది.. లోపాన్ని సరిచేసి కొత్త కార్లను వినియోగదారులకి అందించింది. కొన్ని మొబైల్ కంపెనీల్లో కూడా అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు చూస్తూ ఉంటాం...

ఎందుకు? తమ కంపెనీకి ఉన్న మంచి పేరు పాడవుతుంది అనే ఉద్దేశంతోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి. అలాంటిది ఇన్ని కోట్ల మంది ప్రజలతో సంబంధం ఉన్న సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఎవ్వరూ ఎందుకు స్పందించడం లేదు... సినీ పెద్దలుగా చెప్పుకుంటున్న వారు దీన్ని అసలు సమస్య గానే చూడడం లేదా....
 
ప్రభుత్వాలు చట్టాల రూపంలో తయారుచేయగలవే తప్ప నిత్యం హాల్స్ వద్ద కాపలాగా ఉండలేదు కదా.. కాబట్టి .. తమ వ్యాపారం బాగా జరగాలంటే ..సినిమా నిర్మాతలు , హీరోలు మొదలైన వారు ఈ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరిస్తే , ప్రతి ఒక్కరూ థియేటర్ లోనే  కుటుంబసమేతంగా సినిమా చూస్తారు. అంతవరకు మనం కనీసం థియేటర్స్ లో స్నాక్స్ కొనడం అయినా మనేద్దాం ..

Photo Gallery