BREAKING NEWS

ఎన్నికల వేళ కప్ప గెంతులు

         ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారడాన్ని మనం గత కొన్ని ఎన్నికల సీజన్ నుండి చూస్తూనే ఉన్నాం... అప్పటి వరకు ఒక పార్టీలో ఉండడం. కట్ చేస్తే తర్వాతి రోజే మరో పార్టీలో ప్రత్యక్షం అవ్వడం...

ప్రజల దృష్టిలో కాకుండా పార్టీ అధిష్టానం దృష్టిలో మాత్రమే పడేలా చవకబారు రాజకీయాలు చేయడం ..
నిజంగా కళ్లెదురుగా కనిపిస్తున్న నగ్న సత్యాన్ని కాదని అడ్డంగా బుకాయించడం ..లేదా లేని దానిని , అసలు జరగని దానిని జరిగినట్లుగా విపరీతమైన ప్రచారాలు చెయ్యడం ... చూస్తున్న ప్రజలు ఏమీ తెలియని  అమాయకులు అనుకుని నాయకులు మాట్లాడతారు.

కానీ ప్రజలు అప్పుడు , ఇప్పుడు , ఎప్పుడూ తెలివైనవారే ...!! ఎవరికి  ఎప్పుడు ఎక్కడ ఏ స్థాయిలో చురక పెట్టాలో వారికి బాగా తెలుసు ..పాత తరం నాయకులు ఒక పార్టీకే కట్టుబడి ఉండి పార్టీ పెద్దలు చెప్పినట్లుగా తు. చ.తప్పకుండా నడుచుకొనేవారు.

ఆ పార్టీ నుండి పోటీకి వారు అర్హులా కాదా అన్నది వారికి వారే నిర్ణయించుకుని మరీ టికెట్ కోసం అభ్యర్ధించేవారు.
                 అలా ప్రకటించబడ్డ నాయకులకి ఆ ప్రాంత సహచర నాయకుల మద్దతు ఉండేది. ఇలా ఒక నియోజకవర్గ పరిధిలో వచ్చిన దరఖాస్తులు అనేకవిధాలుగా వడపోసి ఒకరికి ఖరారు చేసేవారు ఆ పార్టీ అధిష్టానం.... ఇక అంతే .. మరుక్షణం నుండే టికెట్ లభించని వారు కూడా మారు మాట్లాడకుండా
ప్రచారంలో పాల్గొని అధిష్టానంపై తమకున్న గౌరవాన్ని నిరూపించుకునేవారు.. అందుకే .. ఆ తరం నాయకులు అధికారంలో ఉన్నా ,  ప్రతిపక్షంలో ఉన్నా , చిన్న పార్టీలో ఉన్నా, పెద్ద పార్టీలో ఉన్నా ఎవరి గౌరవం వారికుండేది.
రాను రాను ఈ ధోరణి మారిపోయింది.

                     అప్పటి వరకు ఎటువంటి ప్రజాసేవ చెయ్యకుండా , వారి వారి వ్యాపారాలు చేసుకుంటూ , విదేశాలలో ఉన్న భారతీయులు సైతం తమ దగ్గర ఉన్న సంపాదనను ఎరగా చూపించి , ఓవర్ నైట్ లో టికెట్ సంపాదించిన తరువాత డైరెక్టుగా రాజకీయర రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. అప్పటి వరకూ అదే పార్టీలో ఆ టికెట్ కోసం ఆశిస్తూ ఉన్న అభ్యర్థి వెంటనే మరో పార్టీలోకి జంపు .. అక్కడ ఆ వ్యక్తికి టికెట్ ఖరారు .. అక్కడ  మళ్ళీ సిన్ రిపీట్.

ఆ పార్టీలో అంతవరకూ ఉండి ఆ టికెట్ ఆశించి భంగపడ్డ ఆ వ్యక్తి తక్షణమే మరో పార్టీలోకి జంప్..
     ఇంకొన్ని విచిత్ర పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి.
ఒక పార్టీలో టికెట్ కేటాయించి అధికారికంగా ప్రకటించాక కూడా ఎందుకో ఆ పార్టీని కాదనుకుని మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు.. ఇంకా  చిత్రాతి చిత్రం ఏమిటంటే ..ఒక పార్టీ గుర్తుతో గెలిచి , ఆ పార్టీ అధికారంలోకి రాకపోయేసరికి అధికార పార్టీలోకి జంప్ . అక్కడ అదృష్టం బాగుంటే మంత్రి పదవి కూడా వరిస్తుంది. పార్టీ ఫిరాయింపు చట్టప్రకారం  వారి ఎన్నికను రద్దు చేసే అధికారం స్పీకర్ వ్యవస్థకు ఉన్నప్పటికిని ఎందుకనో ఆ దిశగా చర్యలు జరగడం లేదు.

మన ప్రక్క రాష్ట్రంలో ఇటీవలనే జరిగిన ఎన్నికలలో విజయం సాధించిన ఓ జాతీయ పార్టీ శాసనసభ్యులు అధికార పార్టీలోకి జంప్ అవడం వలన ఆ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్షమే లేకుండా పోయే పరిస్థితి.

               అయితే ఇక్కడ మనకు అర్ధం కానిదేమంటే పోల్ అయిన ఓట్లలో  , పోటీ చేసిన అభ్యర్థులలో ఎవరు ఎక్కువ సాధిస్తే వారు విజయం సాధించనట్లుగా ప్రకటిస్తారు.ఇక అప్పటినుండి ఆ శాసన సభ్యుని నిర్ణయమే ఆ నియోజకవర్గ ప్రజల నిర్ణయంగా పరిగణించాలి. బహుశా ఇదే కారణంతో ఏమో ..
ఒక పార్టీ గుర్తుతో గెలిచి , మరో పార్టీలోకి మారిన సదరు MLA గారి నిర్ణయాన్నే ఆ నియోజకవర్గ ప్రజల నిర్ణయంగానే పరిగణించినందునేనేమో స్పీకర్ గారు చేష్టలుడిగి ఉండిపోయారు.

ఇదే నిజమైతే  రానున్న కాలంలో ... అత్యధిక సీట్లు గెలిచి, ప్రభుత్వాన్ని స్థాపించినా  ఏ క్షణంలో అధికారం కోల్పోవాలో తెలియని అనిచ్చితి .. ఇది ఈ దేశానికి గానీ , ప్రజలకు గానీ ఏమాత్రం మంచిది కాదు..... తస్మాత్ ...జాగ్రత్త ...!!

Photo Gallery