BREAKING NEWS

టెంపుల్ టూరిజం - విజయనగరం

భక్తి.... ఈ రోజుల్లో ఎవరు ఎంత బిజీగా ఉన్నా, ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నా దేవుడు విషయంలో మాత్రం భక్తి శ్రద్ధలు కనబరుస్తున్నారు... రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలు కు ఎక్కడెక్కడి నుంచి భక్తులు వస్తుంటారు. ఇక ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి.

వారిలో  ప్రధానంగా శృంగవరపు కోటలోని పుణ్యగిరి ఉమా కోటి లింగేశ్వరుడు, పార్వతిపురంలోని అడ్డాపుశీల శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం, సాలురులోని పారమ్మ ఆలయం, నెల్లిమర్ల లోని రామ తీర్ధాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇంతకీ ఈ ఆలయాల ప్రత్యేకత ఏమిటి....
 
ఉత్తరాంధ్రలో విశిష్ట శైవ క్షేత్రమైన పుణ్యగిరి అందమైన ప్రకృతి చుట్టూ ఎత్తైన పర్వత జలాల కొండలను ఆక్రమించి పచ్చని తివాచీ పరిచినట్లు అందంగా ఉంటుంది. జలజలమంటూ... జాలువారే జలపాతాలు మధ్య నయనానందం కలిగించే పరిసరాలు చూస్తూ ఉంటే మనసు ఆహ్లాదంగా మారిపోతుంది.. ఇక్కడ కనిపించే ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంటుంది...

ఈ ఆలయం కు సంబంధించి కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి...  మహాభారత కాలం అజ్ఞాతవాస సమయాన విరాటరాజు కొలువులో ఉన్న పాండవుల సంచరించిన ప్రాంతంగా పుణ్యగిరిని చెప్తారు... నాడు కోయ వాడి వేషంలో వచ్చిన శివునితో అర్జునుడు యుద్ధం చేసిన పవిత్ర స్థలమే పుణ్యగిరిగా చెబుతారు. పాశుపతo కోసం తపమాచరించిన ఫాల్గునుడుచే పూజింపబడిన శంకరుడే ఇప్పుడు ఉమా కోటిలింగేశ్వరుడిగా పూజలందుకుంటున్నారని కథనం. ప్రధాన ఆలయం పక్కనే ప్రవహిస్తున్న పుట్టధార...

పాప పరిహారం చేసి పుణ్యగతులు కలుగుతాయి అని ప్రజల ప్రగాఢ నమ్మకం.... ఈ పుట్ట ధార గర్భాలయం దిగువున ఉన్న స్వయంభు ఈశ్వర ఆలయం మీదుగా, ధార గంగమ్మ లోవ మీదుగా ప్రవహిస్తుంది 
 
దార గంగమ్మ లోవ : 

పుణ్యగిరి ప్రధాన ఆలయం లోకి వెళ్లే మార్గం మధ్యలో 20 అడుగుల కింద ఒక లోయ ఉంది. ఈ లోయ దగ్గరే ఓ గుహ మార్గం కూడా ఉంది. ఈ గుహ మార్గం గుండా ఇతరుల లోనికి రాకుండా నిలువరించేందుకు పాండవులు సృష్టించిన శక్తి మూర్తే... ఈ గంగమ్మ. ఈ గంగమ్మ దారి వేయడం వలనే ఈ ప్రాంతం క్రమేణా దార గంగమ్మ గా పిలవబడుతున్నది ...
 
ఇక విజయనగరం జిల్లాలోని మరో పుణ్య క్షేత్రం సాలురులో ఉంది... సాలూరు ప్రాంతంలో అతి ఎత్తయిన కొండపై వెలిసిన అమ్మవారే పార్వతి దేవి... అతి పురాతనమైన పార్వతీదేవి విగ్రహంగా చెబుతున్న అమ్మవారి విగ్రహాన్ని సుమారుగా 2400 సంవత్సరాలకు పూర్వమే ప్రతిష్టించి ఉండొచ్చు అని పురావస్తు శాఖ వారు చెప్తున్నారు.. అమ్మవారు వెలసిన ఈ శిఖరంకు ఓ ప్రత్యేకత ఉంది.. బాగా గమనిస్తే ఈ శిఖరం చూడడానికి శివలింగాకారంలో ఉంటుంది.. చాలా ఎత్తుగా ఉండే ఈ శిఖరం పై అమ్మవారి విగ్రహాన్ని దేవతలు ప్రతిష్టించారు అని భక్తులు చెప్తారు.....

మహిమ గల అమ్మవారి విగ్రహం 36 చేతులు శిరస్సు పై శివుడు కలిగి ప్రపంచంలోనే ఒక ప్రత్యేకత సంతరించుకుంది. జైన్ లకు సంబంధించిన కొన్ని పురాతన గ్రంధాలలో కూడా అమ్మవారి చరిత్ర వుంది.... అమ్మవారి రూపం ఒక్కో సమయంలో ఒక్కోలా ఉంటుంది. ఒకసారి నవ్వుతూ ఉంటే ఒకసారి చిన్నపిల్లలా మరోసారి మౌనంగా ఓసారి పెద్దమ్మలా ఇలా చాలా రకాలుగా అమ్మవారి విగ్రహం మారుతూ మనకు దర్శనం ఇస్తుంది అని భక్తులు చెప్తారు...

ఇప్పుడు కూడా అమ్మవారిని దేవతలు జ్యోతిరూపంలో దర్శించి పూజిస్తారు అని ఇక్కడ ప్రజల నమ్మకం .కొండ మధ్యలో ఓ గుహ వుంది... ఇక్కడే పాండవులు వనవాస సమయంలో కొద్దిరోజులు ఉన్నారట.... అందుకే ఆ గుహకు పాండవుల గుహ అని పేరు...  సిద్దులు ప్రసాదిస్తుంది కనుక తల్లిని సిద్దేస్వరి అని .. చేతిలో చక్రాలు వున్నాయి కనుక చక్రేస్వరి అని పార్వతీదేవి కనుక పారమ్మతల్లి అని అమ్మవారి పేర్లు రకరకాలుగా పిలుస్తారు.

దేవతలచే నిత్యం పూజింపబడే  అమ్మను ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున మాత్రమే వేలాది మంది భక్తులు  దర్శిస్తారు..  మిగతా రోజుల్లో ఈ కొండ ఎక్కడం చాల కష్టం.. ఒకవేళ కొండ ఎక్కి అమ్మవారిని దర్శించాలి అంటే స్థానిక గిరిజనుల సహాయం తీసుకోవాల్సిందే..
                    
జిల్లాలోని మరొక విశిష్ట మైన దేవాలయం పార్వతీపురం లోని అడ్డాపుశీల శ్రీ కాశి విశ్వేశ్వర స్వామీ ఆలయం ... ఈ ఆలయానికి సుమారు 1550 సంవత్సరాల చరిత్ర ఉంది... పదిహేను వందల యాభై సంవత్సరాల కిందట కబీర్ దాసు బాబాజీ అనే ఆజన్మ బ్రహ్మచారి ఒరిస్సా రాష్ట్రంలో ఉండేవారు. తన శిష్య బృందంతో ఈ ప్రాంతంలో ప్రయాణిస్తున్నప్పుడు రాత్రి ఇక్కడే బస చేయాల్సి వచ్చింది. ఆ రాత్రి పరమేశ్వరుడు బాబాజీ స్వప్నంలో కనిపించి స్వయంభూ లింగం రూపంలో కొండ పక్కన వెలసి ఉన్నానని, ఇక్కడ నుండి కాశీకి స్వరంగ మార్గం కూడా ఉన్నదని నిత్యం కాశీ నుంచి గంగాజలం తీసుకువచ్చి అభిషేకం చేయాలని స్వప్నంలో చెప్పినట్లు పూర్వపు కథల ఆధారంగా తెలుస్తున్నాయి .

ఈ విధంగా కొన్ని రోజులు పూజలు నిర్వహిస్తుండగా హఠాత్తుగా కొండ పైన ఒక పెద్ద బండరాయి దొర్లుకుంటూ వస్తున్నప్పుడు లింగం పై పడుతుందేమోనని భయంతో బాబా లింగంపై వంగి బండరాయిను తన తప: శక్తి తో అడ్డుకున్నారు . అందువల్లే వారి వీపు పై ఉన్న జంధ్యం ఆనవాళ్లు ఉంటాయి... కాశీ కి పోయే సొరంగ మార్గం కాలక్రమంలో మూత పడినప్పటికీ దాని ముఖద్వారం ఇప్పటికీ కనిపిస్తుంది. నిత్యం కాశీ నుండి గంగా జలం తీసుకువచ్చి పూజలు నిర్వహిస్తుండడంతో కాలక్రమేనా స్వామివారిని కాశీ విశ్వేశ్వరని గా పూజిస్తారు అని పెద్దలు చెబుతున్నారు .

నాటి నుంచి ఇప్పటివరకు వంశ పార పర్యంగా బ్రహ్మచర్యoను పాటించి కాశీ విశ్వేశ్వర స్వామి గుహలయానికి ప్రధానర్చుకులుగా ఏడుగురు బాబాలు ఉన్నట్టు గ్రంధాలు చెబుతున్నాయి. అప్పటినుండి ఇప్పటివరకు పూజలందుకుంటూ విశిష్ట దేవాలయంగా పేరు గాంచింది. 

టూరిజం పరంగా ఎంతో అభివృద్ది చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే ఆధ్యాత్మిక టూరిజం పై కూడా దృష్టి సారించాలి... ఇలాంటి పుణ్య క్షేత్రాలు గురించి అందరికీ తెలిసేలా, పర్యాటకులు ఈ ఆలయాలకు రప్పించేలా ప్రణాళిక తయారుచేయాలి.... అప్పుడు మన రాష్ట్రంలో టెంపుల్ టూరిజం కూడా బాగా అభివృద్ది చెందుతుంది... 

Photo Gallery