BREAKING NEWS

ఆంధ్రప్రదేశ్ లో తప్పక చూడాల్సిన ఐదు ఆలయాలు


దేవాలయాలని దర్శిస్తే ఎంతో  ప్రశాంతంగా ఉంటుంది. ఆ పురాతన కట్టడాలని, వాటి యొక్క  అందమైన రూపకల్పనని   చూడడంలో ఎంతో ఆసక్తి ఉంటుంది. వీటిని సందర్శించడానికి వెళ్ళాలనుకుంటే ఎంతో కుతూహలం కూడా ఉంటుంది. భక్తులు దూర ప్రాంతాల నుండి వచ్చి దేవాలయాలని దర్శిస్తారు. పాజిటివ్ ఎనర్జీని ఇచ్చి అన్ని ఇంద్రియాలని ఏక్టివ్ చేస్తాయి. అందుకనే ఎంతో మంది దైవం వైపు దేవాలయాల వైపు మక్కువ చూపిస్తారు. ఇలా పాజిటివిటిని  రప్పించి నెగిటివిటి  ని దూరం చేస్తాయి మన ఆలయాలు.

మన ఆంధ్ర ప్రదేశ్ లో   అనేక దేవాలయాలు ప్రాచీన కాలం నుండి ఎంతో  ప్రసిద్ధి చెందాయి . అయితే ముఖ్యమైన కొన్ని ఆలయాలు ఏవి? తప్పక చూడవలసిన ఆ ఆలయాలు ఎక్కడున్నాయో తెలుసుకోవాలంటే ఆలస్యం ఎందుకు చదివేయండి....

విజయవాడ కనక దుర్గ ఆలయం:

విజయవడ కనక దుర్గ ఆలయం చూడవలసిన ఆలయాల్లో ఒక అద్భుతమైన ఆలయం. ఇక్కడ కనక దుర్గమ్మ  కొలువైనది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆలయాల్లో రెండో పెద్ద ఆలయం. కృష్ణ జిల్లాలో ఇంద్రకీలాద్రి  పర్వతం పై ఉంది ఈ ఆలయం. సుమారు నాలుగు అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం ఎంతో మహిమగలది అని భక్తుల నమ్మకం. ఈ అమ్మవారు ఒక చేత్తో త్రిశూలం పట్టుకుని మహిషారుడుని పొడుస్తున్నట్లు ఉంటుంది. ఇక్కడ విగ్రహం స్వయంభువుగా వెలిసినది అని ఈ క్షేత్ర పురాణంలో చెప్పబడినది. ఇక్కడకి వచ్చి ఆదిశంకరాచార్యులు వారి పర్యటనలో శ్రీచక్రాన్ని ప్రతిష్టించారని అంటారు. సుమారు కొన్ని లక్షల మంది ఈ క్షేత్రాన్ని దర్శించడానికి ప్రతి ఏటా వస్తారు.

నవరాత్రి వేడుకలు ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతాయి. భవాని మాలలు వేసుకుని భక్తులు వారి ఇరుముళ్ళని అమ్మవారి వద్దకి వచ్చి సమర్పిస్తారు. అర్జునుడు ఈ కొండపై తపస్సు చేసాడని కూడా చెప్పుకుంటారు. అలానే అమ్మవారి నక్షత్రం మూల నక్షత్రం అని అంటారు. ఆ రోజున అమ్మవారిని సరస్వతి రూపంలో ఉంచుతారు. అప్పుడు చదువుకునే విద్యార్థులు, భక్తులు తరలి వస్తారు. ఈ ప్రాచీన ప్రసిద్ధి ఆలయం చూడదగ్గ ప్రదేశం.

తిరుపతి వెంకన్న ఆలయం:

ఏడు కొండల మీద ఉంటాడు ఈ దేవుడు. వేంకటేశ్వరుడు, వడ్డీ కాసుల వాడు, గోవిందుడు, ఆపద మ్రొక్కుల వాడు, శ్రీనివాసుడు, భక్తవత్సలుడు ఇలా అనేక పేర్లు ఉన్నాయి ఈ దేవుడికి. ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో ఉంది. అయితే పట్టణాన్ని, కొండని కలిపి తిరుమల  తిరుపతి అని అంటారు. ఈ దేవుడికి బ్రహ్మోత్సవాలు  జరుపుతారు. తిరుమల కలియుగ వైకుoఠమని భక్తుల నమ్మకం. స్వయంభువుగా వెలిసిన వెంకన్నని గోపీనాధ దీక్షితులు చీమల పుట్టలో చూసి ఆ దేవుడిని ఇప్పుడున్న స్థలం లో పెట్టి అనేక పూజార్చనని  మొదలగు అన్ని కార్యక్రమాలు దేవుడికి అర్పించేవారట. అయన తదనాంతరం వారి వంశీకులే ఈ బాధ్యతని నిర్వర్తిస్తున్నారు.

సుప్రభాత సేవ, సుద్ధి, తోమాల సేవ, కొలువు, సహస్రనామార్చన, మొదటి గంట, నైవేద్యం, అష్టోత్తర శతనామార్చన, రాత్రి కైంకర్యాలు, ఏకాంత సేవ, ముత్యాల హారతి, గుడిమూసే ప్రక్రియ ఇలా అనేక విధాలుగా స్వామి వారికీ రోజు సేవలని అందిస్తారు. కాలి నడకన కొండెక్కి ఎంతో మంది భక్తులు వెంకన్న వారిని దర్శిస్తారు. నిజంగా మన ఆంధ్రప్రదేశ్లో చూడవలసిన దేవాలయాల్లో తిరుపతి ఒకటి.

సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం:

వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం సింహాచలం అనే గ్రామంలో ఉంది. ఇది విశాఖపట్నముకు 11 కిలోమీటర్ల దూరంలో ఉంది.  తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం లభించే క్షేత్రం ఇదే. ముఖ్యమైన వైష్ణవ క్షేత్రాలలో ప్రసిద్ధి చెందిన క్షేత్రం ఈ సింహాచలం. ఇక్కడ ఘనంగా చందనోత్సవాలు నిర్వహిస్తారు. సింహాచలం అంటే సింహం యొక్క పర్వతం అని అర్ధం. సంవత్సరం అంతా ఇక్కడ స్వామి వారిని  చందనంతో కప్పి ఉంచుతారు. కేవలం వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే నిజ రూప దర్శనంలో కనిపిస్తారు. గాలి గోపురం, కప్ప స్థంభం, జలధారలు ఇలా అనేక ప్రదేశాలు చూడదగ్గవి. కప్ప స్థంభం ఎంతో శక్తివంతమైనది అని భక్తుల నమ్మకం. దంపతులు కప్ప స్తంభాన్ని కలిసి కౌగిలించుకుంటే సంతానం కలుగుతుంది అని వారి నమ్మకం.

కాణిపాకం సిద్ధి వినాయక ఆలయం:

కాణిపాకం సిద్ధి వినాయక ఆలయం  ప్రాచీనమైనది. ఈ ఆలయం బాగా  ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయం తిరుపతి-బెంగుళూరు జాతీయ రహదారిపై, మన చిత్తూరు జిల్లాకి 12  కిలోమీటర్లు దూరంలో ఉంది. అయితే కాణిపాకం పేరు వెనుక ఎంతో ఘన చరిత్ర ఉంది. నూతిలో దొరికిన విఘ్నేశ్వరుడికి గ్రామం అంతా కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసారు. దీనితో నీరు వాగులా పారింది. అందుకే కాణిపరకం అని తమిళ్ పేరుపిలిచే వారు కానీ రాను రాను ఈ పేరు కాణిపాకం అయిపొయింది. ఇక్కడ వినాయకుడిని దర్శించేందుకు అనేక ప్రాంతాల వారు వస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆలయాల్లో ఈ ఆలయం కూడా చూడవలసిన ప్రదేశం.

మహానంది ఆలయం:

ఈ ఆలయం నంద్యాలకు 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. చాలా  అద్భుతమైన క్షేత్రం ఇది. అతి పెద్ద నంది విగ్రహం ఇక్కడ ఉంది. ఇక్కడ ఒక చిన్న గోపురం, పెద్ద ఆలయ గోపురం కలవు. మహానంది ఆలయంలో చిన్న పుష్కరిణి కూడా ఉంది. ఇక్కడ మహానంది ఏడవ శతాబ్దం నాటిది. ఈ క్షేత్రం కూడా చూడవలసిన ప్రదేశం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆలయాల్లో ఈ ఆలయం కూడా ముఖ్యమైన ఆలయం.

పురాణాలు, ఆలయాలు, పండుగలు, పద్ధతులు, ఆచారవ్యవహారాలు ఇవన్నీ మన సంస్కృతికి చిహ్నాలు. సంస్కృతిని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిదీ....కనుక నూతన పద్ధతులని అనుసరించినా....ప్రాచీన సంస్కృతిని కాపాడండి...