BREAKING NEWS

ఉగాది విశిష్టత ,ఆచారాలు ,పుట్టు పూర్వోత్తరాలు ఇవే

 
ఉగాది ప్రాముఖ్యత:

ఉగాది ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది మన తెలుగు పండుగ అని. ఉగాది నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఈ రోజు కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలసుకొని గ్రహశాంతుల లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగశ్రవణాన్ని చేస్తారు.

ఆనాటి కాలం నుంచి వస్తున్న పండుగల్లో ముఖ్యమైన పండుగ మన ఉగాది పండుగ. ఈ పండుగ సాధారణంగా మార్చి నెలలో లేదా కొన్ని సార్లు ఏప్రిల్ నెలలో రావడం జరుగుతుంది . ఉగాది అనేది ఒక్క రోజు పండుగ. తెలుగు ప్రజలు మాత్రమే కాక మరాఠీలు గుడి పడ్వాగా నూ, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతోను, సిక్కులు వైశాఖీ గానూ, బెంగాలీలు పొయ్‌లా బైశాఖ్ గానూ  ఈ నూతన సంవత్సర పండుగ ని జరుపుకుంటారు.

 
ఉగాది ప్రాముఖ్యంచైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు. మత్స్యావతారము ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది పెద్దల భావన. అంతే కాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన దినం కారణంగా ఈ పండుగ ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరొక గాధ.”ఉగాది”, మరియు “యుగాది” అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. “ఉగ” అనగా నక్షత్ర గమనం.కి ‘ఆది’ ‘ఉగాది’.అంటే సృష్టి ఆరంభమైనదినమే “ఉగాది”. ‘యుగము’ అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం ‘యుగం’ (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది.

ఉగాది అనే పదం ''ఉగస్య'' అనే పదం నుండి వచ్చింది. ఉగ అంటే నక్షత్ర గమనం - జన్మ ,ఆయుష్షు అని కూడా దానికి అర్ధం .'' ఆది ' అంటే మొదలు లేదా  ప్రారంభం, . అంటే ఉగాది అనగా ప్రపంచం యొక్క జన్మ ఆయుష్షులకు మొదటి రోజు కనుక ఉగాది అని అయ్యింది. భారత దేశ సాంప్రాదాయము ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అంటే ఈ ఉగాది రోజునే సృష్టి జరిగింది అని పురాణాల నుండి చెప్పడం జరిగింది.

ఉగాది చైత్ర మాసం లో వస్తుంది. పక్షుల కిలకిలలతో, ఆకుల చిగురులుతో, కోకిల సుస్వరాల రాగాలతో, పూల పరిమళాల తో అందంగా ఉంటుంది ఈ సమస్త ప్రకృతి. అయితే ఈ ప్రకృతి అందాలని ప్రత్యక్షంగా చూస్తే తెలిస్తే... పరోక్షంగా  కవి కలంలో, ఉగాది పాటల్లో కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చే తెలుగు సంవత్సరం శార్వరి నామ సంవత్సరం. శిశిర ఋతువులో ఆకులు రాలి ఆ తర్వాత వసంతం వస్తుంది. ఈ సమయం లో ప్రకృతి ఎంతో శోభాయమానంగా ఉంటుంది. ఈ రోజు నుండే తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి తెలుగు వారు ఈ పండుగని బాగా జరుపుకుంటారు. ఇదే సంవత్సరం లో వచ్చే మొదటి పండుగ కనుక కొత్తగా పనులని ప్రారంభిస్తారు.

పండుగ రోజు చక్కగా తెల్లవారే నిద్ర లేచి ఇల్లు, పరిసరాలు శుభ్ర పరుచుకుని, మామిడి తోరణాలతో  అలంకరించి, తల స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. అలానే అన్నింటి కంటే ముఖ్యం అయినది ఉగాది పచ్చడి. అయితే  ఈ ఉగాది పచ్చడిని అనేక ప్రాంతాల వాళ్ళు అనేక విధాలుగా చేసుకుంటారు. అయితే ఇందులో ప్రత్యేకం అయినవి షడ్రుచులు. మధురం, ఆమ్లం, లవణం, కటు, తిక్త, కషాయం. ఇలా ఈ  ఆరు రుచులు ఉగాది పచ్చడిలో ప్రదానం . మధురం అంటే తీపి ,ఆమ్లం అంటే పులుపు ,లవణం అంటే ఉప్పు , కటు అంటే కారం ,తిక్త  అంటే చేదు ,కషాయం అంటే వగరు . షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి . ఎదురయ్యేది కష్టమైన సుఖమైనా సంయమనం తో ప్రతి ఒక్కరు స్వీకరించాలి అని మన ఉగాది పచ్చడి తెలియచేస్తుంది. ఒకొక్కరు ఒక్కో విధంగా  పచ్చడిని తయారు చేస్తారు. అయితే ఈ పచ్చడి లో  చెరకు అరటి పళ్ళు , మామిడి కాయలు , చింతపండు, వేప పువ్వు , జామ కాయలు, బెల్లం వగైరా పదార్దాలను వాడుతారు. హిందువులు కి అత్యంత శ్రేష్ఠమైన పండుగ ఇది.

ఉగాది పచ్చడి ప్రాముఖ్యత :

ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్ధవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతీక.

బెల్లం – తీపి – ఆనందానికి సంకేతం
ఉప్పు – జీవితంలో ఉత్సాహమ, రుచికి సంకేతం
వేప పువ్వు – చేదు -బాధకలిగించే అనుభవాలు
చింతపండు – పులుపు – నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు
పచ్చి మామిడి ముక్కలు – వగరు – కొత్త సవాళ్లు
కారం – సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు

ఉగాది పండుగ తరతరాల నుండి జరుపుకుంటున్న పండుగ. ఈ పండుగ రోజు వేప పువ్వు పచ్చడి అంటే ఉగాది పచ్చడిని తప్పక తినాలి. అలానే పంచాంగ శ్రవణమ్, ఆర్య పూజానం, గోపూజ, మిత్ర దర్శనమ్ వంటి ఈ ఆచారాల్ని తప్పక పాటించాలి, 
 
ఉగాది పచ్చడి :

ఉగాది పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. కేవలం ఆ ఒక్క రోజునే దీనిని చేసుకుంటారు. షడ్రుచులు ఇందులో ఉండడం వల్ల ఎంతో రుచిగా ఉంటుంది.

ఈ పచ్చడికి కావాల్సిన పదార్ధాలు:

చింతపండు, బెల్లం, వేప పువ్వు, మామిడి కాయ, ఉప్పు, కారం, బెల్లం, కొబ్బరి పొడి, శనగట్నాల పొడి

ఉగాది పచ్చడి చేయు విధానం:

చింతపండు లో నీళ్లు పోసి పులుసు తీయాలి. ముందు అరటి పండు ముక్కలగా తరిగి దానిలో వెయ్యాలి. మామిడి కాయని  చిన్న ముక్కలాగా తరిగి వేసుకోవాలి. బెల్లం పొడి, కొబ్బరి కోరు, కారం, ఉప్పు, శనగట్నాల పొడి, చెరకు ముక్కలు, చింతపండు  లో బెల్లం  వేసి ఇందులో కలపాలి. చివరగా వేప పువ్వు కూడా దీనిలో వేసి బాగా కలుపుకోవాలి. ఇంకేం ఉంది షడ్రుచుల పచ్చడి రెడీ.

ఉగాది రోజు తప్ప చేయాల్సినవి:

ఉగాది పండుగ తరతరాల నుండి జరుపుకుంటున్న పండుగ. ఈ పండుగ రోజు వేప పువ్వు పచ్చడి అంటే ఉగాది పచ్చడిని తప్పక తినాలి. అలానే పంచాంగ శ్రవణమ్, ఆర్య పూజానం, గోపూజ, మిత్ర దర్శనమ్ వంటి ఈ ఆచారాల్ని తప్పక పాటించాలి,