BREAKING NEWS

నటసార్వ భౌమ.నీ కృషి అనితర సాధ్యం!

అవిభక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, దిగ్గజ రాజకీయవేత్తగా, లోకల్ పాలిటిక్స్ లొనే కాక జాతీయ రాజకీయాల్లోనూ ఒక ప్రభంజనం సృష్టించి, భారతీయ ప్రజాస్వామ్య విలువల్ని పెపొందించేలా ఎన్టీరామారావు గారు ఒక కొత్త రాజకీయ చరిత్రకు పునాదులు వేశారంటూ సీనియర్ జర్నలిస్ట్ అయిన కందుల రమేష్ రాసిన 'మెవరిక్ మెస్సయ్య' అనే ఈ పుస్తకం ద్వారా ఓ గొప్ప వ్యక్తి బయోగ్రఫిని మన ముందుకు తీసుకొచ్చారు. ఇందులో ఎన్టీరామారావుగారి రాజకీయ జీవిత చరిత్రలోని పలు ఆసక్తికర, ముఖ్య ఘట్టాలు ఎన్నో పొందుపరచడమైంది. 

తెలుగు జాతిని,
తెలుగు ఖ్యాతిని,
తెలుగు సంస్కృతిని,
తెలుగు వారి ఆత్మగౌరవాన్ని,
తెలుగువారి ఆత్మాభిమానాన్ని,
కాపాడడానికంటూ...

అరవై పదుల వయసులో రాజకీయ అరంగేట్రం చేసి నూతన పార్టీ స్థాపనకు బీజం వేసి, జననేతగా, స్ఫూర్తిదాతగా నిలిచిన అందరి అభిమాన తార, తెలుగువారిచే అన్నగా పిలువబడ్డ నందమూరి తారకరామారావుగారి రాజకీయ ప్రస్థానం చరిత్రలోనే చెరగని ముద్ర వేసింది.

"ఈ తెలుగుదేశం 
శ్రామికుడి చెమటల్లోంచి,
కార్మికుడి కరిగిన కండరాల్లోంచి,
రైతు కూలీల రక్తం నుంచి,
నిరుపేదల కన్నీటిలో నుంచి,
కష్టజీవుల కంటి మంటల్లోంచి,
అన్నార్తుల ఆక్రందనల్లోంచి,
పుట్టింది...
ఈ తెలుగు దేశం."

'తెలుగువాడి పౌరుషాన్ని చాటి చెప్పడానికి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి పుట్టింది' ఈ తెలుగు దేశం...

అంటూ తెలుగుదేశం పార్టీ స్థాపనలో భాగంగా అన్నగారు ఎంతో ఉద్దేశపూరిత, ఉద్వేగభరిత ప్రసంగాలతో తెలుగు ప్రజల హృదయాల్లో ఉద్యమస్ఫూర్తిని నింపారు. ఆయన జన నేతగా, నేటితరానికి రాజకీయ స్ఫూర్తిప్రదాతగా ఎలా మారారో వివరంగా తెలుసుకుందాం:

1923 మే 28వ తేదీన కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య, వెంకట్రామమ్మలకి నందమూరి తారక రామారావుగారు జన్మించారు. బాల్యంలోనే ఎన్నో వేదాలు, ఉపనిషత్తుల్ని అభ్యసించారు. విజయవాడలోని మునిసిపల్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. తరువాత ఎస్.ఆర్.ఆర్ కాలేజీలో ఇంటర్, గుంటూరులోని ఏసి(ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీ)కాలేజీలో బి.ఏ డిగ్రీ పూర్తి చేశారు. 1942వ సంవత్సరంలో బసవతారకం గారిని వివాహం చేసుకున్నారు. 1947లో మద్రాస్ సర్వీస్ కమీషన్ లో సబ్ రిజిస్టార్ గా ఉద్యోగంలో చేరారు. కానీ చేరిన 3వారాలకే అక్కడ పని చేయడం ఇష్టంలేక ఆ ఉద్యోగాన్ని వదిలేసి, సినిమాలపై ఆసక్తితో మద్రాసు వెళ్లారు. 

★ 1949లో వచ్చిన 'మన దేశం' అనే సినిమాతో మొట్టమొదటిసారిగా  వెండితెరకి పరిచయమై... కొన్ని దశాబ్దాలపాటు తిరుగులేని సినీప్రస్థానం సాగించారు.

★ 300కి పైగా పలు చిత్రాల్లో నటించి రాముడిగా, కృష్ణుడిగా, శివుడిగా, రావణాసురుడిగా, అర్జునుడిగా, దుర్యోధనుడిగా విభిన్న పాత్రల్ని పోషించి కలియుగ దైవంగా ప్రతి తెలుగువారి ఇంటా కొలువై ఆరాధించబడ్డారు.

నటుడిగానేగాక దర్శకుడిగా, నిర్మాతగా స్క్రిప్ట్ రైటర్ గా కూడా పని చేశారు. 
 
రాజకీయ ప్రస్థానం:                 

6కోట్ల ప్రజల అభిమానాన్ని చూరగొన్న రామారావుగారు 35 సంవత్సరాలు ఆయన శేషజీవితాన్ని తెలుగు ప్రజలకు అంకితం చేయడానికి పూనుకొన్నారు. ఒక నూతన పార్టీ స్థాపన ద్వారానే ఇది సంభవమని భావించారు. 1982 మార్చి 29న హైదరాబాద్ లో చిన్న ప్రెస్ మీట్ పెట్టి 'తెలుగుదేశం' పార్టీని స్థాపిస్తున్నట్లుగా  ప్రకటించారు.

'కూడు, గూడు, గుడ్డ' అంటూ పేదల పాలిట పెన్నిధిలా మారారు. పార్టీ ప్రచారానికై ఆయన తన పాత చెవోలైట్ కారును బాగు చేయించి చైతన్య రథంగా మార్చారు. దాన్ని కదిలే వేదికగా చేసుకొని ప్రజల్లోకి వెళ్లి, తన ప్రసంగాలను వినిపించారు. ఇలా రాష్ట్రమంతా చుట్టేసి తొలిసారి ఎన్నికల్లోనే ఎదురులేని విజయం సాధించారు. 

1983 జనవరి 7న ఎన్నికల ఫలితాల్ని విడుదల చేశారు. ఆ ఫలితాలు...

తెలుగుదేశం పార్టీ 199, 
కాంగ్రెస్ 60, సీపీఐ 4, 
సీపీఎం 5, బీజేపి 3 
సీట్లను గెలుచుకున్నాయి.

తొంభై ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ, 9 నెలల కింద ఉద్భవించిన టీడీపీ చేతిలో చిత్తుగా ఓడిపోయింది.

1983 జనవరి 9వ తేదీన అత్యధిక మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ పదవ ముఖ్యమంత్రిగానే కాక, తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా అతి సాధారణంగా ప్రజల సమక్షంలోనే  ప్రమాణ స్వీకారం చేసి కొత్త అనవాయితీకి నాంది పలికారు. అప్పటివరకున్న ముఖ్యమంత్రులంతా రాజ్ భవన్ లోనే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ గెలుపు రాజకీయ చరిత్రలోనే అపూర్వ ఘట్టంగా నిలిచింది. ఇది ప్రజాతీర్పు. దీంతో పార్టీలోకానీ, రాష్టంలోకానీ ఆయన్ని ప్రశ్నించేవారే లేరప్పుడు. అలా అని ఇష్టారీతిన వ్యవహరించలేదు. ముఖ్యమంత్రిగా ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నా చెల్లేది. ఆయన ప్రజాస్వామ్య విలువలకే ప్రాధాన్యతనిచ్చారు. 

★ ప్రజా శ్రేయస్సుకై ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారు. అందులో ముఖ్యంగా రూ.2లకే కిలో బియ్యం పథకం తీసుకొచ్చి అన్నార్తుల ఆకలి బాధలు తీర్చారు. అధికారంలోకి వచ్చిన 3సార్లు ఈ పథకాన్ని నిర్విఘ్నంగా కొనసాగించారు. 

జనతా వస్త్రాల పేరుతో సగం ధరకే కట్టుబట్టల్ని అందజేశారు.

ఇవేకాక 'సంపూర్ణ మద్య నిషేధా'న్ని అమలుపరిచారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాకు గండి పడుతుందని ఆర్థిక శాస్త్రవేత్తలు ఎంతలా హెచ్చరించినప్పటికి... కుటుంబాలు బాగు పడతాయనే ఉద్దేశంతో సంపూర్ణ మద్య నిషేధానికి పూర్తి న్యాయం చేసి, తెలుగు మహిళల మనసుల్లో సుస్థిర స్థానం పొందారు.

ఆయన హయాంలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారు. నీటి పారుదల ప్రాజెక్టులకు ప్రాతినిధ్యం వహించారు. రైతులకు విద్యుత్ రాయితీలు ఇవ్వడం, మార్కెట్ యార్డులను నిర్మించడం వంటివి అన్నగారి నిర్ణయాలే!

కేంద్రంలో ప్రధానమంత్రి ఇందిరాగాంధీని ఒప్పించి 'తెలుగు గంగ' పథకం పేరుతో రాయలసీమ లాంటి కరవు ప్రాంతంలో సాగునీరు, తాగునీరు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఆయన ఏసీల్లో, కాన్ఫరెన్స్ హాల్లో జరిపిన మీటింగ్ లను మనం చూసి ఉండం. ఆయన ఎక్కడుంటే అక్కడే సచివాలయం. పేదవాడికి మేలు జరుగుతుందంటే ఎన్ని కోట్ల రూపాయల పథకమైన వెంటనే మంజూరయ్యేలా కృషి చేసేవారు. 

తెలుగు భాషలోనే అన్ని పాలనా వ్యవహారాలు సాగేలా చూసేవారు. 

ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, ప్రత్యేకంగా తెలుగు టైపు మెషిన్లను తయారు చేయించి ఏర్పాటు చేశారు.

ప్రభుత్వ సంస్థలకు, భవనాలకు ఎక్కువ శాతం తెలుగు పేర్లనే పెట్టమనేవారు.

దరఖాస్తులను సైతం తెలుగులోనే ఉండేలా చూడమనేవారు. 

హుస్సేన్ సాగర్ లోని బుద్ధుడి విగ్రహం, ట్యాంక్ బండ్ పై ఎందరో తెలుగుతేజాల విగ్రహాల్ని పెట్టించడంతో తెలుగు జాతికి, సంస్కృతికి తిరిగి పునరుజ్జీవనం ఇచ్చారు అన్న.

ఆయన ఎక్కడికెళ్లినా అచ్చతెనుగు పంచ కట్టుతో, భుజాన కండువాతో తెలుగువాడికి నిలువెత్తు నిదర్శనంగా కనిపించేవారు. 

బీసీలకు రిజర్వేషన్లు, కార్మికులకు కనీస సౌకర్యాల లాంటి విధి విధానాల్ని రూపొందించిన మహానేత.

తెలుగు రాష్ట్రాల్లో అనేక బస్టాండ్లు అన్నగారి హయాంలో కట్టించినవే.

ప్రజల వద్దకే పాలన అనే మాటకి కట్టుబడి... ఎటువంటి లాభాపేక్ష లేని పథకాల్ని, కార్యక్రామాల్ని ప్రవేశపెట్టారు.

పార్టీని, అందులో పని చేసే కార్యకర్తల విషయంలోనూ శ్రద్ధ చూపేవారు.

ఆయన అధికారంలో ఉన్నప్పుడు నెలల తరబడి ఫైళ్లు మూలగడమనేది అసంభవమనే చెప్పాలి.

"పేదవాడే నా దేవుడు సమాజమే నా దేవాలయం"
                                   - ఎన్టీఆర్

ఎన్టీరామారావు గారి సమక్షంలో 'అన్న రాజ్యం ఓ రామ రాజ్యం'లా వెలుగొందిది. ప్రజాసంక్షేమం తప్ప, రాజకీయ లొసుగులు తెలియవు ఆయనకు. తెలుగు ప్రజలందరికీ చేయాల్సిన మంచి గురుంచే ఎల్లప్పుడూ ఆలోచించేవారు. వారసత్వ రాజకీయాలు ఆయనకి పరిచయం లేదు. అందుకే కుటుంబ సభ్యుల్ని ఆయన నిర్ణయాల్లో కలగజేసుకొనిచ్చేవారు కాదట. కుమారులు ఉన్నప్పటికీ ఎవర్ని కూడా అందులో కూర్చోబెట్టలేదు.

1983లో ఇందిరాగాంధీ దారుణహత్యకు గురయ్యాక మరుసటేడాది కేంద్రంలో లోక్ సభ రద్దైంది. పంజాబ్ మినహా 514 స్థానాల్లో జరిగిన 8వ లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ 404 సీట్ల మెజారిటీతో ఘన విజయం సాధించింది. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రం టీడీపీ 30 స్థానాల్ని దక్కించుకొని లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా నిలబడింది. 
దేశ లోక్ సభ చరిత్రలోనే ఒక ప్రాంతీయ పార్టీ, కేంద్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గెలవడం అదే తొలిసారి.

అవినీతి ఆరోపణలు లేని ముఖ్యమంత్రుల జాబితాలో ప్రధానంగా వినబడే పేరు ఎన్టీరామారావు అనే చెప్పుకోవాలి. అందుకేనేమో అవినీతి పంకిలం ఎరుగని ఆయన అవినీతిపరుల్ని, అన్యాయవాదుల్ని ఘాటుగా విమర్శించేవారు. 

1984లో అనారోగ్యరీత్యా వైద్యం కోసం అమెరికాకు వెళ్లారు. కేబినెట్ లో ఆర్థికమంత్రిగా ఉన్న నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు కారణంగా మొదటిసారి అన్నగారు అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అదే సంవత్సరంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో మరలా విజయం సాధించి, రెండోసారి అధికారాన్ని చేజికించుకున్నారు. 

ప్రధానాంశాలు:

'చైతన్య రథం'పై "తెలుగు దేశం పిలుస్తోంది, రా! కదిలి రా!!" అనే నినాదాన్ని రాయించారు.

★1994లో జరిగిన ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి గెలిచి అధికార పీఠం ఎక్కారు.
భారత రాజ్యగంలోని ముఖ్యమైన ఫెడరల్ వ్యవస్థల్ని సాధారణ నాయకులు కూడా అర్ధం చేసుకునే విధంగా మలిచారు.

★వారసత్వ రాజకీయాలకు నిలయమైన కాంగ్రెసుకు వ్యతిరేకంగా దేశంలో ప్రతి పక్షాలను, వామ పక్షాలను ఒకే తాటి మీదకి తీసుకొచ్చి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటులో కీలకంగా అడుగులేసి జాతీయశక్తిగా ఎదిగారు.

★ఎన్టీరామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో గంజి కేంద్రాలు పెట్టాలంటూ వామపక్షాలు యాత్ర చేపట్టాయి. ఎదురుగా వస్తున్న వారితో గంజి కేంద్రాలేంటి బ్రదర్ ఏకంగా అన్నం సాంబార్ పథకాన్నే ప్రవేశ పెడదామంటూ క్రియారూపంలోకి తీసుకొచ్చారు. ఆ పథకమే నేడు దేశవ్యాప్తంగా చాలా కాంటీన్లకు మూలమైంది.

★ పటేల్, పట్వారీ వ్యవస్థల్ని రద్దు చేయడం, స్త్రీలకు ఆస్తిలో వాటా వుండాలని చెప్పి చట్టం తీసుకొచ్చిన ఘనత కూడా ఆయనదే!

★1996లో జనవరి 18వ తేదీన ఆయన  తుది శ్వాస విడిచారు.అయినప్పటికీ  ఆయన తెలుగు వారి గుండెల్లో అన్నగా, అభిమాన నాయకుడిగా చిరస్థాయిగా నిలిచిపోయారు. రాజకీయాల్లో ఆయన చూపిన క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీ, నిష్పాక్షికత ఎందరికో స్ఫూర్తి మంత్రం.

Photo Gallery