BREAKING NEWS

కోట్ల ప్రజల ఆకాంక్షకు ఆలవాలం.. 'అమరావతి' నగర నిర్మాణం..!

ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని మరోసారి రుజువైంది. 

ఏళ్లుగా నిరీక్షిస్తున్న ఏకైక రాజధాని కల నెరవేరింది.

ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఏకరువుకు ఆలంబన దొరికింది.
ఆ దైవం మనసు కరిగిందేమో…

ఏకంగా న్యాయదేవత రూపంలో అవతరించి…
కోరిన న్యాయాన్ని అందించింది.

ఒకటా… రెండా… 

ఏకంగా 800ల రోజులు పాటు ఏకైక రాజధాని అమరావతి కోసం నిద్రాహారాలు మాని, అరెస్టులు, ధర్నాలు, పాదయాత్రలు, లాఠీ ఛార్జీలకు ఓర్చి, అలుపెరగక ఉద్యమించారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు.

ఇందుకు రోడెక్కని రైతుగాని, మహిళలుగాని, సామానీక ప్రజలుగాని లేరు.
ఒకానొక దశలో తమ ప్రాణాలకు తెగించి వందల మంది అమరులైనవారున్నారు.

ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ, తమకు కావాల్సిన అమరావతిని న్యాయంగా సాధించుకున్నారు. 
ఇది చారిత్రాత్మక విజయం.. 
5 కోట్ల ఆంధ్రుల విజయం..! 
గురువారం అమరావతి రాజధాని విషయంలో భిన్న వాదనలు విన్న హైకోర్టు తుది తీర్పును వెల్లడించింది. ఏకైక రాజధాని అమరావతి అని ఉత్తర్వులు వెలువడిన వెంటనే అమరావతిలో సంబరాలు మిన్నంటాయి.

వివరాల్లోకి వెళ్తే… 
అమరావతి రాజధానిపై కొన్ని వందల రోజులుగా ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై మొన్న(గురువారం) హైకోర్టులోని త్రిసభ్య ధర్మాసనం 307 పేజీల తీర్పును వెల్లడించింది. ఇప్పటిదాకా మూడు రాజధానులను అభివృద్ధి చేయాలన్న అధికార ప్రభుత్వ ప్రణాళికలను తోసిపుచ్చింది. 

అమరావతి రాజధాని నగర మాస్టర్ ప్లాన్‌ను ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ దిశగా ఆదేశించింది. ఈ తీర్పును న్యాయస్థానం ధృవీకరించింది. తొలుత రాజధాని పిటిషన్లపై విచారణకు అంగీకరించిన హైకోర్టు.. ప్రభుత్వానికి ఇకపై శాసనాధికారం లేదని కూడా తేల్చిచెప్పింది. 
సీఆర్డీఏ చట్టం ప్రకారమే ప్రభుత్వం వ్యవహరించాలని ఆ దిశగా ఏపీ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. 
 
సీఆర్డీఏ చట్టం ప్రకారమే

ముందుగా రాజధానిపై దాఖలైన 64 పిటిషన్ల విచారణకు హైకోర్టు అంగీకారం తెలిపింది. 
ప్రభుత్వానికి శాసన అధికారం లేదని, ఇకమీదట సీఆర్‌డీఏ చట్టం ప్రకారం రైతులకు.. న్యాయం చేయాల్సిన పూర్తి బాధ్యత కూడా ప్రభుత్వంపైనే ఉందని స్పష్టం చేసింది. 

రాజధాని కోసం అప్పట్లో భూములిచ్చిన రైతులకు 3 నెలల్లో నివాసయోగ్యమైన ప్లాట్లను నిర్మించి ఇవ్వాలంది. 6 నెలల్లో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్‌ వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని ఆదేశించింది. హైకోర్టు పర్యవేక్షణలోనే అభివృద్ధి పనులు జరగాలని నిర్దేశించింది. మౌలిక సదుపాయాల రూపకల్పనపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని, 6 నెలల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు పేర్కొంది. 
తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు రీటాఫ్ మ్యాడమస్‌ ఇలానే కొనసాగుతుందని, మాస్టర్‌ ప్లాన్ ప్రకారం ఉన్నది ఉన్నట్లు అభివృద్ధి చేయాలని కోర్టు ఆదేశించింది.

అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ కూడా తరలించకూడదని, అలాగే అమరావతి భూములను తనఖా(తాకట్టు) పెట్టకూడదని న్యాయస్థానం ఆదేశించింది. రాజధాని అవసరాలకు తప్ప వేరేందుకు భూములు ఇవ్వొద్దని తెలిపింది. మరీ ముఖ్యంగా ఒక్కో పిటిషనర్‌కు ఖర్చు కోసం రూ.50 వేలు ఇవ్వాలని హైకోర్టు తీర్పులో వెల్లడించింది.
 
కోర్టు తీర్పులోని ముఖ్యమైన అంశాలు

◆ రైతులతో చేసుకున్న ఒప్పందం చట్టబద్ధమైంది. ఈ ఒప్పందాన్ని అటు ప్రభుత్వం, ఇటు సీఆర్డీఏ రెండూ ఉల్లంఘించాయి. కావున కోర్టు అందుకు తగ్గ ఆదేశాలు జారీ చేయొచ్చు.

◆ రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం..
నిర్మాణాలు చేపడతామని చెప్పి అవి చేయలేకపోవడం. భూములిచ్చిన రైతులకు హామీ ఇచ్చి, దాని నుంచి తప్పుకోవడానికి వీల్లేదని చెప్పింది.

◆ బతుకుదెరువైన భూముల్ని అప్పగించిన రైతుల హక్కుల్ని కాలరాసే అధికారం ప్రభుత్వానికి లేదు.

ఒప్పందం ప్రకారం భూములిచ్చిన రైతులకు, ఇళ్ల నిర్మాణాలు చేపట్టి, మూడేళ్లలో వారికి అందజేయాలి. కానీ ఆ ఒప్పందం గడువు 2018తోనే ముగిసిపోయింది.

◆ గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను, నిర్మాణాలను పూర్తి చేయాల్సిన చట్టబద్ధమైన బాధ్యత ఇప్పటి ప్రభుత్వానిదే. ప్రభుత్వం మారినంత మాత్రాన విధానాలు మారవు కదా!
బడ్జెట్ ను కారణంగా చూపి, అభివృద్ధి పనులను ఆపడాన్ని అనుమతివ్వమని స్పష్టం చేసింది.

◆ ఇప్పటివరకు చేసిన ఖర్చుకు, పూర్తి బాధ్యత సీఆర్డీఏ, ప్రభుత్వానిదే. ఈ నేపథ్యంలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

◆ రాజధానిని మార్చడానికిగాని, మూడుగా చేయడానికిగాని, శాసనం చేసే అధికారం గాని ప్రస్తుత ప్రభుత్వానికి లేదని స్పష్టపరిచింది.
 
ప్రస్తుత ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతుందంటే

ఇప్పుడు ప్రభుత్వం ముందున్న మార్గాలు ఏంటనే అంశంపై వివిధ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
రైతులతో సీఆర్డీఏ కుదుర్చుకున్న 9.14 ఒప్పందం ప్రకారం, 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత, అమరావతిని ఏకైక రాష్ట్ర రాజధానిగా అభివృద్ధి చేయాలనే గత టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) వెనక్కి తీసుకుంది. రాజధాని కోసం 33,000 ఎకరాల భూమిని ఇచ్చింది. కానీ అవి నెరవేరలేదు. ఇప్పుడు వారికి ఇచ్చిన హామీల అమలు ప్రకారం హైకోర్టు కొన్ని గడువులను నిర్దేశించింది. దీని ప్రకారం చూసుకుంటే… 

నెలరోజుల్లో రాజధానిలో మౌలిక వసతుల ఏర్పాటు.. మూడు నెలల్లో లేఅవుట్ లు పూర్తి చేసి, స్థలాలు అప్పగించడం. ఆరు నెలల్లో రాజధాని నగర అభివృద్ధి పనులు పూర్తి అవ్వడంతో పాటు, ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలంటే సుసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే గతంలో ప్రాజెక్టు పనులు చేపట్టిన గుత్తేదారులకు ప్రభుత్వం ఇంకా పాత బిల్లులు చెల్లించలేదు.

అవి అందకుండా మరలా పనులు చేపట్టమంటే వారు చేస్తారో… లేదో తెలియదు. ఒకవేళ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం  చేయాలనుకుంటే మాత్రం ముందుగా సీఆర్డీఏ రంగంలోకి దిగితే తప్ప వేరే మార్గం కనపడటం లేదు.