BREAKING NEWS

తుపాకీ చేతబట్టిన తొలి మహిళ... మల్లు స్వరాజ్యం..!

11 ఏళ్లకే వెట్టిచాకిరి చేయించుకునే దొరల దుర్మార్గాన్ని వ్యతిరేకించింది. 13 ఏళ్ల ప్రాయంలో ఊరూరా తిరిగి విప్లవ గీతాలు పాడింది. 16వ యేటకు తుపాకీ పట్టి, దొరలపై తిరుగుబాటు చేసింది.  బాధింపబడ్డ ప్రజలకు అండగా నిలిచింది. అటువంటి విప్లవ గీతిక నేడు(ఈ నెల 19న) అస్తమించింది. జీవితమంతా సుత్తికొడవలి, చుక్క గుర్తుతోనే సాగిన పోరు చుక్క.. మల్లు స్వరాజ్యం(91) అనారోగ్యం కారణంగా   హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత శనివారం రాత్రి 8 గంటలకు తుదిశ్వాస విడిచింది.

కొన్నాళ్లుగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆమెకు ఈనెల 1వ తేదీన ఊపిరితిత్తుల్లోనూ ఇన్‌ఫెక్షన్‌ వచ్చింది. చికిత్స అనంతరం ఆరోగ్యం కాస్త మెరుగవ్వడంతో ప్రత్యేక గదికి తరలించి వైద్య సేవలందించారు. అంతా బాగుందనుకున్నా శుక్రవారం మళ్లీ ఆరోగ్యం దెబ్బతింది. దీంతో మళ్లీ ఐసీయూకు తరలించాల్సి వచ్చింది. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తుండగానే శరీరంలోని అన్ని అవయవాలూ పాడవ్వడంతో పరిస్థితి విషమించి శనివారం రాత్రి ఆమె కన్నుమూశారు. ఈ సందర్బంగా ఆమె నిజజీవిత, ఉద్యమ విశేషాలను ప్రత్యేకంగా తెలుసుకుందాం:
 
భూస్వామ్య కుటుంబంలో పుట్టినా..

1931 సూర్యాపేటలోని తుంగతుర్తి మండలంలో కరివిరాల కొత్తగూడెం గ్రామంలో భీంరెడ్డి రామిరెడ్డి, చొక్కమ్మ దంపతులకు జన్మించారు స్వరాజ్యం. రాంరెడ్డికి ఐదుగురు పిల్లలు కాగా, ఈమె నాలుగో సంతానం. భూస్వామ్య కుటుంబంలో పుట్టినప్పటికీ అనగారిన వర్గాల కోసం పాటుపడిన యోధురాలు ఆమె. దున్నే వాడిదే భూమి కావాలని, దొరల పాలన పూర్తిగా అంతమవ్వాలని 11 ఏళ్ల వయస్సులోనే పోరుబాట పట్టింది.

చదువుతోపాటు ఈత, గుర్రపు స్వారీ కూడానేర్చుకుంది. ఆంధ్ర మహాసభ పిలుపుతో తన పొలంలో పండిన ధాన్యాన్ని పేదలందరికీ పంచి పెట్టింది. ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో రైతులు, ప్రజల్లో చైతన్యం రగిలించింది. రష్యన్‌ రచయిత మాక్సిం గోర్కి రాసిన 'అమ్మ' అనే నవలను పదేళ్ల వయసులో చదివి, బాగా ప్రభావితురాలయింది. ఆనాటి సామాజిక దురాచారాలపై పిడికిలి బిగించి, రజాకార్లు, భూస్వాముల ఆగడాలపై గళమెత్తింది.

16 ఏండ్ల వయసులోనే తుపాకీ పట్టి సాయుధ పోరాటంలో మొట్టమొదట తుపాకీ పట్టిన మహిళగా చరిత్రలో నిలిచింది. 1954 మే నెలలో సాయుధ పోరాటంలో కలిసిన ఉద్యమ సహచరుడు మల్లు వెంకటనర్సింహారెడ్డిని స్వరాజ్యం వివాహామాడారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, ఉమ్మడి నల్లగొండ జిల్లా సీపీఎం కార్యదర్శిగా పనిచేసిన ఈయన 2004 డిసెంబర్‌ 4న మరణించారు. వీరికి ముగ్గురు సంతానం.
 
పోరాటమే ఊపిరిగా.. 

నైజాం సర్కారుకు వ్యతిరేకంగా నాడు తన అన్న భీంరెడ్డి నర్సింహారెడ్డి, బావ రాజిరెడ్డిలతో కలిసి స్వరాజ్యం సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. అంతేకాక తన మాటలు, పాటలు, ప్రసంగాలతో మహిళలను ఉద్యమంలో పాల్గొనేలా ఉత్తేజపరిచింది. దొరల దురహంకారాన్ని వేలెత్తి చూపుతూ, పాటల ద్వారా ప్రజలను చైతన్యపరిచింది. సాయుధ పోరాటంలో భాగంగా ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్‌ తదితర జిల్లాల్లో పని చేసింది. గెరిల్లా వంటి దళాలతో దాడులు చేస్తూ నైజాం సర్కారును గడగడలాడించిన ధీర వనిత మల్లు. ఆపై అజ్ఞాతంలోకి వెళ్లి , రాజక్క పేరుతో దళాలను నిర్మించి, నడిపించింది. ఆమెను పట్టుకోవడానికి వీలుకాకపోవడంతో నైజాం పోలీసులు ఆమె ఇంటిని తగలబెట్టారు.  అయినా వెరవకుండా పోరాటాన్ని ముందుకు సాగించింది. 
 
రాజకీయ ప్రస్థానం.. 

సాయుధ పోరాటం ముగిసిన తర్వాత స్వరాజ్యం రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1978, 1983లలో రెండుసార్లు సీపీఐ(ఎం) పార్టీ తరఫున ఎన్నికయ్యారు. రెండుసార్లు శాసనసభకు ఎన్నికై ప్రజాసేవ చేశారు. ఆమె ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అక్కడి తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రానికి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను మంజూరు చేయించింది. అప్పట్లో కార్పస్‌ ఫండ్‌ చెల్లిస్తేనే కళాశాలల ఏర్పాటుకు అనుమతి దక్కేది. కానీ, మల్లు తుంగతుర్తి ప్రాంతం బాగా వెనుకబడిన ప్రాంతమని ప్రభుత్వంతో పోరాడి, కార్పస్‌ ఫండ్‌ చెల్లించకుండానే జూనియర్‌ కళాశాలను మంజూరయ్యేలా కృషి చేసింది. ఆ తరువాత ఎన్నో భూసమస్యలను పరిష్కరించింది.

1985లో ప్రభుత్వం కాస్త కూలిపోవడంతో.. 1985, 1989లో రెండుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా, 1996లో మిర్యాలగూడెం పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేసింది. కానీ ఓటమిని చవిచూసింది. అయితేనేం పార్టీ నాయకురాలిగా ఆమె నిరంతరం సభలు, సమావేశాల ద్వారా ప్రజలకు దగ్గరగానే ఉన్నారు.
 
1994లో నెల్లూరు జిల్లా దూబగుంట నుంచి ప్రారంభమైన సారా వ్యతిరేక ఉద్యమంలో స్వరాజ్యం పాల్గొన్నారు. రాష్ట్ర మహిళా సంఘం ప్రధాన కార్యదర్శిగానూ పనిచేశారు. వామపక్షభావాలతో మొదలైన ’చైతన్య మానవి’ అనే పత్రికకు సంపాదకవర్గంలో ఒకరిగా చేరి సేవలందించారు. 91 ఏళ్ల వయోభారంలోనూ ఆమె పీడిత ప్రజలకు అండగా ఉన్నారు. 
 
ఇతరాంశాలు...

◆ ఆడపిల్లలు కష్టాలను వివరిస్తూ, స్వరాజ్యం తన పుస్తకంలో ఒక ఉయ్యాల పాటను రాసుకుంది. 'భారతి భారతి ఉయ్యాలో మా తల్లి భారతి ఉయ్యాలో నైజాము రాజ్యాన ఉయ్యాలో నాజీ పాలనలో ఉయ్యాలో భూస్వాములందరూ ఉయ్యాలో భూమంతటిని చెరబట్టి ఉయ్యాలో..' అంటూ నాటి పరిస్థితిని అర్థమయ్యేలా తనదైన శైలిలో పాటగా మలిచింది. పాలకుల దురాగతాలను ప్రజలకు వివరించింది.  

◆ 1945-48 వరకు సాగిన సాయుధ పోరాటంలో తన 16వ ఏటనే తుపాకీ చేతపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు.

◆ స్వరాజ్యం జీవితకథ ఆధారంగా ‘నా మాటే తుపాకీ తూటా’ను పుస్తక రూపంలో ప్రచురించడం జరిగింది. 

◆ తనకు మేజర్ జైపాల్ సింగ్ తుపాకి పట్టడం నేర్పినట్లు స్వరాజ్యం ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
 
చివరివరకు తాను నమ్మిన సిద్ధాంతాల కోసం కట్టుబడి, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడింది ఈ ధీరవనిత. 
నేటితో ఒకతరం వీరోచిత పోరాటగాథ ముగిసింది. జీవితకాల స్ఫూర్తిని మనలో నింపి, ఇక సెలవు అంటూ నిష్క్రమించింది ఆ వేగుచుక్క.