BREAKING NEWS

వార్ ఆఫ్ పుతిన్…!

ఉక్రెయిన్, రష్యా…

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసిన ఈ రెండు దేశాల పేర్లే వార్తల్లోకి ఎక్కాయి. ప్రపంచాన్ని గడగడ వణికెలా చేసింది ఈ రెండు దేశాల మధ్య చిచ్చు. చినికి చినికి గాలి వానలా… రెండు దేశాల మధ్య తగాదా కాస్త ప్రపంచ యుద్ధంగా మారింది. అసలు ఉక్రెయిన్‌తో రష్యా వివాదం ఇప్పటిది కానే కాదు. వందల ఏళ్లుగా రష్యన్‌ సామ్రాజ్యంలో భాగంగానే ఉంది ఉక్రెయిన్. ఆ తర్వాత కూడా అవిభక్త సోవియట్‌ యూనియన్లో భాగంగా కొనసాగుతూ వచ్చింది. 

ముఖ్యంగా ఉక్రెయిన్‌ యూరప్‌ దేశాలవైపు మొగ్గు చూపడం రష్యాను బాగా కలవరపెడుతూ వచ్చింది. మరోపక్క నాటో కూటమిలో చేర్చుకోవాలని కూడా ఉక్రెయిన్‌ ఉవ్విళ్లూరింది. అమెరికాలాంటి సభ్య దేశాల సైనిక తోడ్పాటుతో ఉక్రెయిన్‌ మరింత బలోపేతమవుతుందనేసరికి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ బాగా ఆందోళన చెందాడు. ఈ కల్లోల సమయంలో రష్యా హఠాత్తుగా దాడికి దిగి, తూర్పు ఉక్రెయిన్ లోని డొనెట్‌స్క్, లుహాన్‌స్క్‌ల సమాహారమైన డోన్బాస్‌ ప్రాంతంలో వేర్పాటువాద ఆందోళనలకు అన్ని విధాలా మద్దతు తెలుపుతూ వచ్చింది. అక్కడ చెలరేగిన హింసాకాండకు 14వేల మందికి పైగా బలయ్యారంటే నమ్మశక్యం కలుగక మానదు.

తమకు యుద్ధం ఆలోచన లేదంటూనే మరోవైపు మోహరింపులను రెండు లక్షలదాకా పెంచింది రష్యా. బెలారస్‌లో వేలాదిమంది సైనికులతో అణు విన్యాసాలు చేస్తూ వచ్చింది. తాజాగా డోన్బాస్‌కు స్వతంత్ర హోదా ఇస్తున్నట్లు ప్రకటించడమే గాక, ఉక్రెయిన్‌కు చరిత్రలో ఎన్నడూ ప్రత్యేక అస్తిత్వం లేదంటూ తన ఉద్దేశాలను చెప్పకనే చెప్పింది. వెనువెంటనే యుద్ధానికి దిగి, యూరప్‌లో పెను సంక్షోభానికి తెర తీసింది రష్యా. 

అసలుకైతే రష్యా అధినేత ఉక్రెయిన్ మీద యుద్ధం ప్రకటించటానికి గల మూల కారణమేమై ఉంటుంది? 24 గంటల్లోనే రష్యా బలగాలు ఉక్రెయిన్ భూభాగాలను ఆక్రమించేశాయంటే… అంత పెద్ద గొడవ ఏం జరిగి ఉంటుంది? ఇప్పటికే భరించలేని ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. మరీ ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా..? ఈ యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల మీద కూడా పడబోతుందా..? లాంటి ఆసక్తికరమైన విషయాల గురుంచి మనం ఈరోజు తెలుసుకుందాం:
 
భౌగోళికంగా చూస్తే ఉక్రెయిన్ కన్నా రష్యా 28 రెట్లు పెద్దది. జనాభా పరంగా చూస్తే 3 రెట్లు. యుఎస్ఎస్ఆర్ లో ఉక్రెయిన్, రష్యాలు కలిసి ఉండేవి. రష్యా ఎక్కువ సఖ్యతగా ఉంది కూడా ఉక్రెయిన్ తోనే.
ఈ యుద్ధానికి ప్రధాన కారణాలు3. అవి విశ్లేషించుకుంటే…
 
◆ ది మిన్స్క్ అగ్రిమెంట్
నాటో
◆ అమెరికా 
 
ది మిన్స్క్ అగ్రిమెంట్:

◆ 1922లో 15 కమ్యూనిస్టు దేశాలు కలిసి ఒక సంయుక్త దేశంగా ఏర్పడ్డాయి. దాని పేరే 'యుఎస్ఎస్ఆర్ (యూనియన్ సోవియట్ ఆఫ్ సోషలిస్టిక్ రిపబ్లికన్స్)' ఇందులో రష్యా, ఉక్రెయిన్ లు కూడా భాగస్వాములుగా ఉన్నాయి.

◆ 1991 ఆగస్టులో ఉక్రెయిన్ సోవియట్ యూనియన్ నుంచి బయటకు వచ్చి, స్వతంత్ర దేశంగా మారింది. అదే ఏడాది డిసెంబరులో ఆ యూనియన్ కాస్త చీలిపోయింది. 

ఉక్రెయిన్ లో భాగంగా ఉన్న డొనెట్‌స్క్, లుహాన్‌స్క్‌ ప్రాంతాల్లో రష్యన్లే ఎక్కువమంది ఉండేవారు. తమ భూభాగాలను తమకే ఇవ్వాలని రష్యా ఉక్రెయిన్ మీద, ఉక్రెయిన్ రష్యాల నడుమ తరచూ గొడవలు జరిగేవి. 
నిజానికి ఉక్రెయిన్, రష్యాలు ఒక్కటే! అంతకుముందు వరకు కూడా వీరిని సోవియట్లు అనేవారు. గొడవ సద్దుమనక రెండు దేశాలు 2014లో 'ది మిన్స్క్ అగ్రిమెంట్'ను చేసుకున్నాయి.

ఈ ఒప్పందం ప్రకారం సరిహద్దులో మోహరించిన ఇరు దేశాల భద్రత బలగాల్ని వెనక్కు తీసుకోవాలి. ఒకరిపై ఒకరు దాడి చేసుకోకూడదు. ఇలాంటి 13 శాంతియుత అంశాలతో కూడిన ఒప్పందాన్ని రాసుకున్నాయి. 
పైగా ఉక్రెయిన్ లో భాగంగా ఉన్న డొనెట్‌స్క్, లుహాన్‌స్క్‌ లకు స్వయం ప్రతిపత్తి కల్పించాలనే అంశం కూడా ఇందులో రాసి ఉంది. ఇరు దేశాలు ఈ ఒప్పందాన్ని అంగీకరిస్తూ, సంతకాలు కూడా చేశాయి.

ఉక్రెయిన్ ఎప్పుడైతే ఒప్పందం మీరి ప్రవర్తించిందో, రష్యా కూడా ఒప్పందం మీరి సరిహద్దులో మోహరింపులు మొదలు పెట్టింది. అప్పుడే ఈ సమస్యలోకి అమెరికా పరకాయ ప్రవేశం చేసింది. అమెరికా తనకు ఏమాత్రం సంబంధం లేని ఈ ఇరు దేశాల గొడవలో జోక్యం చేసుకొని, ఉక్రెయిన్ కు నాటోలో భాగస్వామ్యం ఇస్తానని ప్రకటించింది. అమెరికా అంటే గిట్టని పుతిన్ కు ఇది అస్సలు నచ్చలేదు. తమ దేశ భద్రతకు భంగం వాటిల్లకుండా ముందుగానే యుద్దాన్ని ప్రకటించేసింది.
 
నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటి ఆర్గనైజేషన్):
1949లో నాటో స్థాపించడమైంది. మొదట ఇందులో 12 దేశాలు భాగస్వామ్యం కాగా, తరువాత 18 దేశాలు వచ్చి చేరాయి. తమ వద్ద ఉన్న ఆయుధాల్ని, టెక్నాలజీని, భద్రత సైన్యాన్ని, ఆర్థిక భాగస్వామ్యాన్ని ఇచ్చాయి. యుఎస్ఎస్ఆర్ కు వ్యతిరేకంగా వెస్ట్రన్ యూరోపియన్ దేశాలు కలిసి ఈ నాటోను ఏర్పర్చుకున్నాయి. సోవియట్ యూనియన్ విడిపోయినా కూడా ఈ నాటో మాత్రం అలానే కొనసాగుతూ వస్తుంది. 
 
అమెరికా:

నాటోలో అగ్ర రాజ్యమైన అమెరికా ప్రధానంగా ఉంది. అమెరికా మొదట్నుంచి కూడా రష్యా మీద వ్యతిరేకత కలిగి ఉంది. అదను చూసి ఉక్రెయిన్ ను అడ్డుగా చేసుకొని, రష్యా మీద ప్రతీకార చర్యకు పాల్పడాలనుకుంది. ఇది ముందే గ్రహించిన రష్యా అధినేత పుతిన్… అమెరికా తోడ్పాటును కోరుకున్న ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది. లేకుంటే అమెరికా ఉక్రెయిన్ ద్వారా రష్యా మీద దాడికి దిగే ప్రయత్నాల్లో ఉండేది. ప్రస్తుతం ఉక్రెయిన్ లో జరుగుతున్నది కూడా అదే. దేశాల మధ్య ఉన్న అపార్థాలకు సామాన్య ప్రజలు బలవుతున్నారు.

ఈ యుద్ధానికి ముఖ్య కారణంగా మనకు పుతిన్ కనిపిస్తున్నా, కనపడని కారణం ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అయిన వోలొదిమిర్ జలన్ స్కీ. 

ఇతను ఒక టీవీ షో ద్వారా హాస్యనటుడిగా చేరి,  ప్రముఖుడిగా మారి, ఆపై 2019లో ఊహించని రీతిలో ఉక్రెయిన్ కు ప్రెసిడెంట్ అయ్యాడు.

అతనికి రాజకీయానుభవం లేదు. అలాగని దౌత్య పరమైన విషయాల్లో అవగాహన లేదు. అలా లేకే రష్యాతో సరిగా సమన్వయపర్చుకోలేదు. ఆయన తీసుకున్న సంచలన నిర్ణయం వల్ల ఈ యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది.

ఎందుకంటే సరిహద్దులో రష్యా భద్రత బలగాల్ని మోహరించినప్పుడు, ప్రజల్లోకి వచ్చినప్పుడు… ఏం చేయాలో తెలియని స్థితిలో, ఉక్రెయిన్ ప్రజల్ని స్వయంగా ఆయుధాలు పట్టుకోమన్నాడు. ఎదురు దాడికి పాల్పడమన్నాడు. అంటే అమాయక ప్రజల ప్రాణాల్ని బలమైన సేన కలిగిన దేశం చేతిలో పెట్టేశాడు. నేరుగా ఆ దేశం యుద్ధానికి దిగేలా చేశాడు. ఇప్పుడు బాంబుల దాడులతో, ప్రజలు తమ నివాసాలను విడిచి ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకొని తిరిగేలా చేశాడు. 

ఉక్రెయిన్ నాటోలో చేరితే అమెరికాకు చక్కని బ్రాంచ్ ఆఫీస్ ఏర్పాటు అయినట్లే! ఎందుకంటే 
అమెరికా తన దేశ సంపదగా భావిస్తున్న ఆయుధాలు, మిస్సైల్ లాంచర్లు, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ ఫోర్స్ విభాగాలతో ఉక్రెయిన్ ను అడ్డంగా పెట్టుకొని నేరుగా రష్యాలోకి ప్రవేశించేలా ప్రణాళికలు వేసుకుంది.

పుతిన్ కు ఈ విషయం అవగతమయ్యే, రష్యా దేశ భద్రత కోసం యుద్ధం చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. 

పుతిన్ మొదలు పెట్టిన ఈ యుద్ధం వల్ల ఒక్క ఉక్రెయిన్ మాత్రమే కాదు ప్రపంచ దేశాలు సైతం నష్టపోతున్నాయి.
 
ఇతరాలు 

◆ బెలారస్ బార్డర్ లో రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు మొదలయ్యాయి. ఎలాంటి షరతులు లేకుండానే చర్చలు జరుపుతామని ఇరు దేశాల తరపున తొలుత ప్రకటన వచ్చినా.. చర్చలకు వెళ్లడానికి ముందే రెండు దేశాలు తమ తమ డిమాండ్లను ప్రకటించాయి. 

◆ తమను వెంటనే యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో చేర్చుకోవాలని, రష్యా కాల్పులను, బాంబు దాడులను ఆపాలని, తమ భద్రత బలగాలను వెనక్కి తీసుకోవాలని ఉక్రెయిన్ డిమాండ్ చేసింది. 

◆ ఈయూలో చేరబోమని ఉక్రెయిన్ అగ్రిమెంట్ పై సంతకం చేయాలని రష్యా డిమాండ్ చేసింది. అయితే, ఏమీ తేలకుండానే రెండు దేశాల మధ్య మొదటి దఫా చర్చలు ముగిశాయి. 

రెండు దేశాల ప్రతినిధులు తమ తమ ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపిన వెంటనే లాండ్– బెలారస్ బార్డర్ లో రెండో రౌండ్ చర్చలు ఉంటాయని తెలిపింది.

◆ ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్ రాజధాని అయిన కీవ్ ని ఆక్రమించుకోవడమే లక్ష్యంగా రష్యా సేనలు ప్రణాళికలు వేస్తున్నాయి. కీవ్ వైపు రష్యా బలగాలు ముందుకు సాగుతూనే ఉన్నాయి. కీవ్ వైపుకు వెళ్తున్న ఓ భారీ సాయుధ కాన్వాయ్ ను శాటిలైట్ ఫొటోల ద్వారా ఉక్రెయిన్ ప్రభుత్వం గుర్తించింది. కాన్వాయి పొడవు 64 కిలోమీటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ లోని నగరాల్లో ఉదయం నుంచి ఎయిర్ సైరన్ల మోతలు వినిపిస్తున్నాయి. కీవ్ తో పాటు పశ్చిమ నగరాలైన టెర్రోపిల్, రివ్నే ప్రాంతాల్లో ఎయిర్ సైరన్లు వినిపిస్తున్నాయి.

ఉక్రెయిన్​పై యుద్ధం ప్రకటించడాన్ని నిరసిస్తూ ప్రపంచ దేశాలు తనపై ఆంక్షలు విధిస్తుండడంతో రష్యా కూడా చర్యలు తీసుకుంటోంది. తమ గగనతలంలోకి రాకుండా 36 దేశాలకు చెందిన పలు విమానాలపై బ్యాన్​ విధించింది. ఇందులో బ్రిటన్, జర్మనీ సహా పలు యురోపియన్​ దేశాలు ఉన్నాయి. 

◆ తూర్పు ఉక్రెయిన్ లోని ఖార్కివ్ సమీపంలోని మిలిటరీ బేస్ ను లక్ష్యంగా చేసుకొని రష్యా సేనలు దాడులు చేశాయి. ఈ దాడిలో 70 మంది ఉక్రెయిన్ సైనికులు చనిపోయారు. మిలిటరీ యూనిట్ ధ్వంసమవ్వగా, ఆ శిథిలాల కింద సైనికుల మృతదేహాల వెలికితీసినట్లు తెలిపాయి మీడియా ఏజెన్సీలు.

◆ ఉక్రెయిన్‌లో బాంబుల మోత మోగుతూనే ఉంది. రష్యా చేస్తున్న ఈ బాంబు దాడుల్లో తాజాగా భారతీయ విద్యార్థి ఒకరు మృతి చెందారు. కర్ణాటక రాష్ట్రం హవేరి జిల్లా రాన్ బెన్నూర్ మండలంలోని చలగేరి గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడు ఖార్కియెవ్‌లో ఈరోజు ఉదయం జరిగిన బాంబు దాడిలో మృతిచెందాడు.
 
★ ఈ యుద్ధాన్ని నివారించే శక్తి ఇంకా ఉన్నప్పటికీ, రష్యా ఈ యుద్దాన్ని వీడేలా లేదు. మూడో ప్రపంచ యుద్ధంగా మారకముందే శాంతి చర్చలు జరిగి, యుద్ధం ముగియాలని కోరుకుందాం.