BREAKING NEWS

'రాధే శ్యామ్' మెప్పించిందా…?

ప్రభాస్ సినిమా వస్తుందంటే అభిమానుల్లో క్రేజ్ మామూలుగా ఉండదు. 'బాహుబలి', 'సాహో' లాంటి సినిమాల తర్వాత పాన్ ఇండియా స్థాయికి చేరారు మన డార్లింగ్. ఆ మార్కెట్ ను లక్ష్యంగా చేసుకొనే భారీ బడ్జెట్ లో రూపొందించారు ఈ రాధే శ్యామ్. ట్రైలర్ చూస్తుంటే ప్రేమకి, విధికి మధ్య జరిగిన గొప్ప సంఘర్షణలా కనిపిస్తుంది.

దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందోనన్న ఆసక్తి అందరిలోనూ పెరిగింది. సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. ఎన్నో వాయిదాల అనంతరం 'రాధే శ్యామ్' నేడు(శుక్రవారం, 11న) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో తెరెకెక్కిన్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూ ద్వారా తెలుసుకుందాం:
 
నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్‌కర్, జగపతిబాబు, సత్యరాజ్ తదితరులు.
దర్శకత్వం : కె రాధాకృష్ణ కుమార్
నిర్మాత: వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌
సంగీత దర్శకుడు: జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్, థమన్
సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు
 
రాధేశ్యామ్‌.. 

ఈ సినిమా కోసం రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ అభిమానులే కాదు ఆల్‌ ఇండియా మూవీ లవర్స్‌ అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో ఇటలీ నేపథ్యంలో  తెరకెక్కిన ఈ సినిమా.. దాదాపు నాలుగేళ్ల పాటు షూటింగ్‌ జరుపుకోవడం విశేషం! 
భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7010 స్క్రీన్స్‌లలో ఈ చిత్రం రిలీజైంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు మంచి స్పందన రావడంతో మూవీపై భారీ హైప్‌ ను క్రియేట్‌ చేసింది. 
 
ఇక కథలోకి వెళ్తే

విక్రమాదిత్య (ప్రభాస్) ఫేమస్‌ పామిస్ట్(జ్యోతిష్యుడు). ఇటలీలో ఉంటాడు. హస్త సాముద్రికంలో ఆయన చెప్పింది చెప్పినట్లుగానే జరుగుతుంది. తన చేతిలో ప్రేమ రేఖ లేదని తెలుసుకున్న విక్రమాదిత్య, తన జీవితం గురుంచి ఒక స్పష్టమైన అంచనాతో ఉంటాడు. అనుకోకుండా ప్రేరణ(పూజా హెగ్డే)ను కలుస్తాడు. తన జీవితంలో ప్రేమ, పెళ్లి లేవని నమ్మే విక్రమాదిత్య కాస్త కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ప్రేరణను చూసి ప్రేమలో పడతాడు. మరి ఆమె ప్రేమను గెలుచుకోవడానికి విక్రమాదిత్య(ప్రభాస్) ఏం చేశాడు? ఇంతకీ ప్రేరణకు ఉన్న ఆరోగ్య సమస్య ఏంటి? అలాగే వీరి ప్రేమలో వచ్చిన సమస్య ఏంటి? చివరకు విక్రమాదిత్య- ప్రేరణ జీవితాల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి? ఇక ఈ మధ్యలో పరమహంస(కృష్ణం రాజు) పాత్రకు ఉన్న ప్రాధాన్యం ఏంటి? చివరకు వీరిద్దరూ ఒక్కటయ్యారా? లేదా? లాంటి విషయాలు తెలియాలంటే చిత్రాన్ని చూసి తెలుసుకోవాల్సిందే..!
 
ఎలా ఉందంటే...

మన రాత మన చేతుల్లో లేదు. చేతల్లోనే ఉంటుందని ఓ ప్రేమకథ ద్వారా తెలియజెప్పే అంశమే ఈ సినిమా. బాహుబలిలాంటి యాక్షన్ డ్రామా తరహా సినిమా తర్వాత పూర్తి భిన్నమైన కథాంశాన్ని సెలెక్ట్ చేసుకున్నారు ప్రభాస్. ఆయన మాస్ ఇమేజ్ కు తగ్గట్లు ఇందులో మాస్ ఫైట్ అంశాలేవీ ఉండవు. ప్రేమకు సంబంధించిన సంభాషణలు, వాటి చుట్టూ అలుకునే పరిణామాలే ఎక్కువగా తారసపడతాయి. 

ప్రేమ కథలంటే హీరో హీరోయిన్ మధ్యన చక్కని కెమిస్ట్రీ కుదరాలి. ఈ సినిమాలో ప్రేమికులుగా నాయకనాయికలు బాగానే అలరించారు. వారి నడుమన వచ్చే యూరప్ బ్యాక్ గ్రౌండ్ సన్నివేశాలు బావున్నాయి. కానీ అందుకు తగ్గ సన్నివేశాలే లేకపోవడం మైనస్. 

కథలో కొత్తదనం అంటే అది జ్యోతిష్యం ఒక శాస్త్రమని చెబుతూనే... మన రాత మనం రాసుకునేదనే చెప్పే ప్రయత్నమే చేశారు.

ఫస్టాఫ్ అంతా యూరప్ అందాలు, హీరోహీరోయిన్ల పరిచయం, ప్రేమ నేపథ్యంలోనే సాగుతుంది. అక్కడక్కడా వినూత్నంగా క్రియేట్ చేసిన సన్నివేశాలు థ్రిల్ కలిగిస్తాయి. ట్రైలర్ లో చూపినట్లే హీరోయిన్ ట్రైన్ లో కనపడే సీన్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. పతాక సన్నివేశాలు బావున్నాయి. నాయకనాయికలు కలుసుకోవడం, దగ్గరవ్వడం... ఒక పార్ట్ అనుకుంటే, తిరిగి ప్రేరణ విక్రమాదిత్యను ప్రేమించడంతో కథ పూర్తిగా టర్న్ అవుతుంది. మాస్ హీరోగానే గాక క్లాస్ లుక్ లో కూడా మెప్పించే ప్రయత్నం చేశారు ప్రభాస్.
 
ఎవరెలా చేశారంటే....

ముఖ్యంగా ప్రభాస్, పూజాల జోడి అలరించింది. విక్రమాదిత్యకు గురువు పాత్రలో కృష్ణంరాజు కనిపిస్తారు. భాగ్య శ్రీ ప్రభాస్ తల్లిగా నటించింది. కానీ ఆ పాత్రకు పెద్దగా ప్రాధ్యానం లేదు. సచిన్ ఖేడేకర్, జగపతిబాబు తదితరులు ఉన్నా లేనట్లుగానే అనిపిస్తారు. సాంకేతిక విలువలు మెండుగా ఉన్నాయి. రవీందర్ ప్రొడక్షన్ డిజైనింగ్ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టింది. విజువల్ గా ఈ చిత్రాన్ని యూరప్ లో తీయడం సినిమాకు కలిసి వచ్చిందనే చెప్పాలి. సంగీతం బావుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. దర్శకుడు తాను చెప్పాలనుకున్న అంశాన్ని స్పష్టంగా చెప్పారు. కానీ అందుకు తగ్గ కసరత్తులు ఇంకా చేసి ఉండాల్సింది.
 
ప్లస్ పాయింట్స్

◆ అద్భుతమైన విజువల్స్,
◆ ప్రభాస్ ఉత్తమమైన నటన,
◆ పూజా హెగ్డే స్క్రీన్ ప్రెజెన్స్, హావభావాలు,
◆ క్లైమాక్స్.
 
మైనస్ పాయింట్స్

◆ కథనంలో కొత్తదనం లేకపోవడం, 
◆ ఫస్ట్ హాఫ్, సెకండాఫ్ లలో వచ్చే సాగదీత సీన్స్,
◆ స్లోగా సాగే స్క్రీన్ ప్లే.
 
సాంకేతిక విభాగం

సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలతో పాటు మిగిలిన సన్నివేశాలను కూడా కథాకథనాలకు తగ్గట్లుగా చాలా గొప్పగా చిత్రీకరించారు.
ఎడిటింగ్ చాలా బాగుంది. 
పాటల పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది.
నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.
 
◆ మొత్తానికి ఈ చిత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా.. ప్రభాస్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఓ మంచి విజువల్ ట్రీట్ అని చెప్పొచ్చు.