BREAKING NEWS

జక్కన్న చెక్కిన 'ఆర్ఆర్ఆర్'..!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగేళ్ల నిరీక్షణ తరువాత ఎన్నో వాయిదాలు… మరెన్నో అడ్డంకులు… 
అన్నిటికి తెర తీస్తూ గత శుక్రవారం వెండితెర మీద అద్భుతమైన దృశ్య కావ్యం ఆవిష్కృతమైంది..
అదే 'రౌద్రం రణం రుధిరం'(త్రిపుల్ ఆర్).
తెలుగు సినిమా గర్వించదగ్గ రీతిలో…
1990 నాటి సోషియో డ్రామా చుట్టూ సాగే ఈ కథలో.. సీతారామరాజు, భగత్ సింగ్ లాంటి విప్లవ వీరులను స్ఫూర్తిగా తీసుకుని, ఇద్దరు అగ్ర కథానాయకుల మధ్య స్నేహం, వైరిలాంటి విరుద్ధ కోణాలను ఎక్కడ కూడా చెడకుండా చూపించాడు దర్శకధీరుడు రాజమౌళి..

ఇక సాంకేతికాంశాల విషయానికొస్తే.. అత్యద్భుత విజువల్ ప్రెస్సెన్స్, భారీ సెట్టింగ్ లతో మరచిపోలేని అనుభూతినందించారు.. మన జక్కన్న..!
సినిమాకు ముందే ఉత్కంఠభరిత హీరో పరిచయ టీజర్లు, ఆకట్టుకునే ట్రైలర్లు, ప్రతి ఒక్కరి చేత ఈలలు వేయించిన నాటు స్టెప్పులు.. హిట్టు పాటలు.. వీటికి తోడు సినిమా విడుదలకు ముందు నిర్వహించిన గ్రాండ్ ప్రమోషన్స్ తో అందరి దృష్టి ఈ సినిమాపైకే మళ్లింది. మరి ఈ ముగ్గురి క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన 'ఆర్ ఆర్ ఆర్' ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో… రివ్యూ ద్వారా తెలుసుకుందాం:
 
సినీ తారాగణం

నటీనటులు: ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అజయ్ దేవ్‌గణ్‌, ఆలియా భట్‌, శ్రియా శరణ్‌, ఒలివియో మోరీస్, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడీ, రాజీవ్‌ కనకాల, రాహుల్‌ రామకృష్ణ తదితరులు.
నిర్మాణ సంస్థలు: డివివి ఎంటర్‏టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్,
నిర్మాత: డివివి దానయ్య, 
దర్శకత్వం: ఎస్‌.ఎస్‌. రాజమౌళి,
కథ: విజయేంద్ర ప్రసాద్‌,
సంగీతం: ఎం.ఎం. కీరవాణి,
సినిమాటోగ్రఫీ: సెంథిల్‌ కుమార్‌,
ఎడిటర్‌: అక్కినేని శ్రీకర్‌ ప్రసాద్‌,
విడుదలైన తేది: మార్చి 25,2022.
 
కథలోకి వెళ్తే

1920 ప్రాంతంలో.. అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వంలో రామరాజు(రామ్‌ చరణ్‌) పోలీసు అధికారిగా పని చేస్తుంటాడు. పదోన్నతి కోసం పై అధికారుల ఆదేశాలకు తగ్గట్టుగా పని చేస్తుంటాడు. మరదలు సీత(ఆలియా భట్‌)కు, గ్రామస్తులకు ఇచ్చిన మాట నెరవేరాలంటే.. ఆయన కచ్చితంగా పదోన్నతి పొందాల్సిందే! 

అందుకోసం స్వాతంత్య్ర పోరాట యోధులపై కూడా దాడి చేస్తాడు. మరోవైపు గవర్నర్‌ స్కాట్‌(రే స్టీవెన్ సన్) ఓసారి తన ఫ్యామిలీతో కలిసి ఆదిలాబాద్‌ పర్యటనకు వచ్చినప్పుడు.. అక్కడ గోండు జాతికి చెందిన బాలిక మల్లిని చూసి, తన చేతి నైపుణ్యం చూసి, తమతో పాటు ఢిల్లీకి తీసుకెళ్తాడు. తమ బిడ్డని తీసుకెళ్లొద్దని అడ్డుకున్న కుటుంబ సభ్యులపై దాడి చేయిస్తాడు. ఇది అన్యాయమని భావించిన గోండు జాతికి చెందిన భీమ్‌(ఎన్టీఆర్‌).. ఎలాగైన మల్లిని తిరిగి తీసుకురావాలని భావిస్తాడు. తన స్నేహితులతో కలిసి అక్తర్ గా పేరు మార్చుకొని ఢిల్లీకి వస్తాడు భీమ్. అలా వచ్చిన భీమ్ ను పట్టుకోవడానికి బ్రిటీష్ ప్రభుత్వం నియమించిన పోలీస్ ఆఫీసర్ రాజు ఆశయం వేరైనా ఇద్దరి గమ్యం ఒక్కటే.. అయితే ఆ విషయం తెలుసుకోవడానికే కాస్త సమయం పడుతుంది. ఈ క్రమంలో రామ్-భీమ్ ల నడుమ జరిగిన పోరాటం, తెలిశాక ఇద్దరూ కలిసి చేసిన పోరాట సమాహారమే మిగతా కథ.
 
ఎలా ఉందంటే..?

రాజమౌళి ఏ సినిమా చేసినా ప్రేక్షకులను సంతృప్తి పరిచేవరకు ఊరుకోడు. బాహుబలి కోసం ఐదేళ్లు శ్రమిస్తే, ఆర్ఆర్ఆర్ కు దాదాపు నాలుగేళ్ల సమయం తీసుకున్నాడు. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఆయన కష్టమంతా తెరపై స్పష్టంగా కనిపిస్తోంది. ఓ చిన్న పాయింట్ను కథా వస్తువుగా ఎంచుకొని, దానికి భావోద్వేగాలను జోడించి, కథనాన్ని నడిపించిన తీరును మెచ్చుకోకుండా ఉండలేరు. గిరిజన బాలికను బ్రిటీష్‌ సైన్యం ఎత్తుకెళ్లే ఓ ఎమోషనల్‌ సీన్‌తో కథ ప్రారంభమవుతుంది. ఆ తరువాత నీరు, నిప్పు అనే ఎలివేషన్స్ తో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ల పాత్రలను పరిచయం చేశారు. అందుకు తగ్గట్టే బలమైన సన్నివేశాలతో ఫస్టాఫ్‌ ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది. ఇద్దరు హీరోలు కలిసే సీన్‌ని కూడా అద్భుతంగా చిత్రీకరించారు. ఇక ఇంటర్వెల్‌ సన్నివేశం అయితే.. సినిమాకే హైలెట్‌. బ్రిటీష్‌ కోటలోకి ఎన్టీఆర్‌ వెళ్లే సన్నివేశం గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. ఫైట్‌ సీన్‌లతో చాలా ఎమోషనల్‌గా ఫస్టాఫ్‌ అనేది ముగుస్తుంది.

ఇక సెకండాఫ్‌లో అజయ్‌దేవ్‌గణ్‌, శ్రియాల ఎంట్రీ.. కథను మరో లెవల్‌కు తీసుకెళ్తుంది. భీమ్‌ని అరెస్ట్‌ చేసి శిక్షించే సన్నివేశం అయితే కంటతడి పెట్టిస్తుంది. ‘కొమరం భీముడో.. కొమరం భీముడో’ అనే పాట హృదయాన్ని హత్తుకుంటుంది. ఆ తర్వాత కథ కాస్త స్లోగా సాగుతుంది. ఇక భీమ్‌, రామ్‌ కలిసిన తర్వాత వచ్చే ఫైట్‌ సీన్స్‌ అయితే మరో లెవల్‌ అని చెప్పాలి. 
 
ఎవరెలా చేశారంటే..

'యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయ్‌’.. ఆర్ఆర్ఆర్‌ చిత్రంలో హీరో పాత్ర గురించి అజయ్‌ దేవ్ గణ్‌ చెప్పే డైలాగ్‌ ఇది. ఈ డైలాగ్‌ ఆర్ఆర్ఆర్‌లోని నటీ, నటులందరిని ఉదేశించినట్లుగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఒక ఆయుధంగా మారి, నటించారు. భీమ్‌గా ఎన్టీఆర్‌, రామరాజుగా రామ్‌ చరణ్‌.. తమతమ పాత్రల్లో ఓ యోధుల్లా ఒదిగిపోయారు. ప్రతి సీన్‌లోనూ నువ్వా నేనా అన్నట్లుగా పోటాపోటిగా నటించారు. వీరిద్దరి మధ్య వచ్చే పోరాట ఘట్టాలు అయితే సినిమాకే హైలైట్‌..!
 
'నాటు నాటు' పాటకు ఈ ఇద్దరు హీరోలు వేసిన స్టెప్పులు థియేటర్ సీట్ లో కూర్చోనివ్వకుండా చేస్తాయి. ఈ సినిమా కోసం తారక్‌, చెర్రి పడ్డ కష్టమంతా తెరపై కనిపించడం విశేషం. ఇక సీత పాత్రలో ఆలియా భట్‌, జెన్నీఫర్‌ అనే బ్రిటీష్‌ యువతిగా ఒలివియా తమ అభినయంతో అలరించారు. వెంకట రామరాజు అలియాస్‌ బాబాగా అజయ్‌ దేవ్‌గణ్‌, అతని భార్య సరోజినిగా శ్రియ.. ఉన్నంతలో ఫర్వాలేదనిపించారు. వీరి పాత్రల నిడివి తక్కువే అయినా.. సినిమాకు ఆ పాత్రలు సైతం కీలకంగా ఉంటాయి. విలన్‌ స్కాట్‌ పాత్రలో రే స్టీవెన్ సన్, అతని భార్యగా అలిసన్ డూడీ తనదైన నటనతో మెప్పించారు. రామరాజు బాబాయ్‌గా సముద్రఖని, భీమ్‌ స్నేహితుడు లచ్చుగా రాహుల్‌ రామకృష్ణ తమ పాత్రలకు న్యాయం చేశారు. 
 
ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధాన బలం ఎం.ఎం కీరవాణి సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతం బావుంది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్స్‌కి ప్రాణం పోశాడు కీరవాణి. సెంథిల్‌ కుమార్‌ సినిమాటోగ్రఫి చాలా బాగుంది. రాజమౌళి ఊహించుకున్న ప్రతి సీన్‌ని తెరపై కళ్లకు కట్టినట్లు అద్భుతంగా చూపించాడు. సాల్మన్‌ పోరాట ఘట్టాలు సినిమా స్థాయిని మరికొంత పెంచాయి. 

1920 నాటి కథకు జీవకళ ఉట్టిపడేలా సెట్స్‌ని తీర్చిదిద్దాడు ప్రొడెక్షన్‌ డిజైనర్‌ సాబు సిరిల్‌. సాయి మాధవ్‌ బుర్రా మాటలు, డైలాగులు.. తూటాల్లా దూసుకుపోయాయి.  డివివి ఎంటర్‏టైన్మెంట్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా  ఉన్నాయి. 
 
మొత్తానికి సినీ అభిమానులకు చక్కని విజువల్ కానుక 'త్రిపుల్ ఆర్'.