BREAKING NEWS

ఆమెకి ఒక్క థాంక్యూ సరిపోదు..!

ఆమె ప్రతి ఇంటికి…
ఓ కూతురిగా,
ఓ చెల్లిగా,
ఓ అక్కగా,
ఓ కోడలిగా,
ఓ భార్యగా,
ఓ తల్లిగా,
ఓ అత్తగా,
ఓ బామ్మగా,
కాలం నిడివికి తగ్గ పాత్రలో ఒదిగిపోయి నూటికి నూరేళ్ల న్యాయం చేకూర్చిన నిజజీవిత దర్శిని 'ఆమె'.
ప్రతి గడపకి ఆమె సుపరిచితమే,
ప్రతి వంటింటికి ఆమె తోబుట్టువే!
అలా అని ఆమె వంటింటి కుందేలులా అక్కడే ఆగిపోలేదు. ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకొని నిలబడింది.
ఇంటిపని, వంటపని ఒంటి చేత్తో చకచకా చేయగల ఆమెకు, ఏసీలో కూర్చోని ఉద్యోగం చేయడం ఓ లెక్కా! కానీ ఆమె ఉద్యోగం కన్నా తన కుటుంబమే ఓ బాధ్యత అనుకుంది. వారి అవసరాలు తీర్చడమే నిత్యవిధి అనుకుంది.
అలా అనుకునే నోములంటూ పతి ప్రాణాల కోసం, క్షేమం కోసం ఎన్ని మాసాలైనా పస్తులుండగలిగింది ఆమె. 
ఆ కుటుంబం కోసం తనకంటూ ఉన్న ఆశలు, కోర్కెల్ని సమాధి చేసిన త్యాగశీలి ఆమె. 
పిల్లల బాగుకోసం రేయింబవళ్లనే తేడా లేకుండా ఆలంబనగా నిలిచే తోడు ఆమె.
స్వేచ్ఛ పొందినప్పటికీ మితిమీరని వ్యక్తిత్వం ఆమెది.
ఎంత చదివినా... 
ఎన్ని నైపుణ్యాలున్న…
అంతే ఒదిగి నడ్చుకోవడం ఆమె ప్రతీక. 
అటువంటి ప్రతిరూపం వెలసిన ప్రతీ ఇల్లు కోవెలే...! 
అలాంటి ఆమెకు ఒక్క  థాంక్యూ చెబితే సరిపోదు...!
మన ఇంట్లోని ఆమెను 
రోజుకోసారైనా 
పలకరిద్దాం...
గౌరవిద్దాం.. 
బతకనిద్దాం... 
ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మరోసారి ఆమెను మనసారా అభినందిద్దాం.
 
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు మొదలైందంటే
1908 న్యూయార్క్ సిటీలో 15వేల మంది మహిళలు కలిసి పని చేసే చోట తమకు తక్కువ పనిగంటలు, మెరుగైన జీతం, ఓటు హక్కు కావాలనే డిమాండ్ లు తెలుపుతూ, ధర్నా చేయడంతో అప్పటి అమెరికా సోషలిస్టు పార్టీ వీటన్నిటికీ అంగీకరించింది. 

తర్వాతి ఏడాది, 1909లో అధికారికంగా జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. అయితే అదే రోజును ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవాలని 1910లో జరిగిన ఓ సదస్సులో భాగంగా జర్మనీ మార్క్సిస్ట్ సిద్ధాంతకర్త, మహిళ హక్కుల న్యాయవాది క్లారా జెట్కిన్ ప్రతిపాదించారు.

అక్కడి సదస్సుకు వచ్చిన మహిళలు మద్దతు ఇవ్వడంతో అక్కడ్నుంచి అది అంతటా జరుపుకుంటున్నారు. 1911లో జర్మనీ, ఆస్ట్రియా, డెన్మార్క్ లలో తొలిసారి ఇంటర్నేషనల్ విమెన్స్ డేను జరుపుకోవడం విశేషం!
 
నేటి మహిళ

కొవిడ్ తర్వాత చాలావరకు కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు తాండవం చేశాయి. వ్యాపారాలు మూతపడ్డాయి. రుణాలు పెరిగాయి. రాబడి తగ్గింది. అప్పటివరకు వ్యాపారం అంటే కేవలం మగవారి హక్కుగా భావించినవారు… 

కొవిడ్ వల్ల మారిన జీవన విధానాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి ఆమె ఎంతో కీలకంగా మారడం చూసి అవాక్కైంది. ముందుగా ఆమె కొవిడ్ స్థిగతుల్ని అర్థం చేసుకుంది, ఇంట్లో అవసరాల్ని అంచనా వేసుకుంది. తనలో దాగి ఉన్న సృజనాత్మకతను తట్టి లేపింది. ఆ నేర్పుకు ఒక వ్యాపార రూపమిచ్చింది. అందుకు తగ్గ మెళకువలను స్వయంగా నేర్చుకొని, అంకురాలను స్థాపించే స్థాయికి చేరుకుంది. వంటలో చెయ్యి తిరిగిన మహిళ అయితే గనుక, యూట్యూబ్ కిచెన్ స్టార్ గా, మిస్ లేదా మిసెస్ చెఫ్ లుగా తయారవుతున్నారు.

పలు యూట్యూబ్ ఛానళ్లలో వారి రుచులను పరిచయం చేస్తూ, లెక్కలేనన్ని వ్యూస్ తో ఆకట్టుకుంటున్నారు. పాటలు పాడే శ్రావ్యమైన గొంతు ఉంటే, అతి తక్కువ వ్యవధిలోనే సినిమాల్లో సింగర్ లుగా రాణిస్తున్నారు. ఇలాంటి స్వతహాగా ఆసక్తి ఉన్న రంగాల్లో మరింతమంది మిస్ పెర్ఫెక్షనిస్టులుగా ప్రపంచానికి పరిచయమవుతున్నారు. దీనికోసం సోషల్ మీడియాను చక్కని వేదికగా వినియోగించుకుంటున్నారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వెబ్సైట్ ల ద్వారా వీరికి ఎంతో ఆదరణ లభిస్తోంది. ఆపై స్థిరమైన ఆర్థిక లావాదేవీలు జరిపి, మ్యూచువల్ ఫండ్స్ లలో సైతం  పెట్టుబడులు పెట్టే స్థాయికి చేరుకుంది నేటి మహిళ.

ఇటువంటి కొత్త తరహా వ్యాపార ఆలోచనలకు బీజం వారి గత ఆర్థిక స్థితిగతులే! ఏడాది కాలంగా చూసుకుంటే, దాదాపు 70 శాతం మహిళలు స్థాపించిన స్టార్టప్ లే ఉన్నాయంటే నమ్మగలరా!
ఆమెకు ఈ గెలుపు వెంటనే రాలేదు.
ఎందుకంటే సమాజానికి తనను తానుగా నిరూపించుకునే ప్రయత్నంలో 
ఎటు చూసినా 
నిరాశపరిచే మాటలు…
ఇంటా బయటా చీత్కారాలు…
అడుగడుగునా అవమానాలు…
అభద్రతా భావం ఇన్ని తరిమినా…
వాటన్నిటినీ దాటుకొని ఒక శక్తిలా ఎదిగింది.
అవును అవకాశాలే ఆమెను అందలం ఎక్కించాయి. అదృష్టం కాదు! 
కాబట్టి కుదిరితే వారిని ప్రోత్సాహించండి. 
మరోసారి మహిళామణులందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో…