BREAKING NEWS

లెజిస్లేటివ్ అసెంబ్లీ

లెజిస్లేటివ్ అసెంబ్లీ (విధాన సభ),  భారత దేశంలోని రాష్ట్రాలలో పరిపాలనా విధానాలు రూపొందించడానికి, ప్రజా సమస్యలు చర్చించి పరిష్కరించడానికి ఉద్ధేశించబడిన రాజ్యాంగబద్దమైన వేదిక. ప్రజాస్వామ్య వ్యవస్థలో , రాష్ట్రంలోని వివిధ నియోజక వర్గాల నుండి ఎన్నికలలో  వోటింగ్ ద్వారా ప్రజలచే ఎన్నుకోబడిన M.L.A. లు అందరూ చర్చలు చేసి, రాష్ట్రానికి సంబంధించిన చట్టాలు రూపొందిస్తారనే విషయం విదితమే. 
 
అయితే ఎన్నికలలో గెలవాలంటే ప్రజాకర్షణ ఉండాలి.  ప్రజలను మెప్పించే నేర్పు ఉండాలి. నిత్యం ప్రజలలో తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలి. ఇంకా చాలా రాజకీయ, సామాజిక, ఆర్థిక, వర్గ సమీకరణాలు కలిస్తే గానీ ఎమ్మెల్యే గా గెలవడం అంత సులభం కాదు. 
                   
కానీ  పరిపాలనా పరమైన చట్టాలు, విధానాలు నిర్ణయించడానికి ప్రజా ప్రాతినిధ్యం ఉన్న ఎమ్మెల్యే ల తో పాటు, ఆర్థిక, సాంకేతిక, రాజకీయ, రాజ్యాంగ నిపుణులూ, మేథావుల మేథస్సు చాలా అవసరం. వారి సలహాలు, విషయ పరిజ్ఞానం చాలా అంశాలలో అవసరమవుతాయి.  
                 
అయితే ఈ మేథావులన్న వారెవరూ సాధారణంగా ప్రజలలో పాపులారిటీ కలిగి ఉండరు‌. ప్రజాక్షేత్రంలో గెలవలేరు. అందుకే అటువంటి వారిని చట్ట సభలలో భాగస్వాములను చేసి వారి జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని మేథోమథనం చేసి‌ మెరుగైన జీవన విధానాన్ని ప్రజలకు అందించేందుకు " శాసన మండలి " అనే శాశ్వత ఎగువ సభ ద్వారా భారత రాజ్యాంగం అవకాశం కల్పించింది. ఆరేళ్ల పదవీకాలం ఉండే ఈ శాసన మండలి కి ప్రతి రెండేళ్లకు 1/3వ వంతు సభ్యుల పదవీకాలం ముగుస్తుంది. శాసన మండలి సభ్యులు, పరోక్ష ప్రజాస్వామ్య పద్థతులలో వివిధ మార్గాల ద్వారా ఎన్నిక‌ కాబడతారు‌. 

1/3 వ వంతు స్థానిక సంస్థలు అయిన మున్సిపాలిటీ, జిల్లాపరిషత్, గ్రామ పంచాయితీ సభ్యులు ఎన్నుకుంటారు.

1/3 వ వంతు ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు‌

1/6 వ వంతు సభ్యులను సాహిత్య, వైజ్ఞానిక, కళా, సామాజిక మున్నగు రంగాలలో విశేష అనుభవం, జ్ఞానం ఉన్న వ్యక్తులను నామినేట్ చేస్తారు.

1/12 వ వంతు మందిని గ్రాడ్యుయేట్స్ గా మూడేళ్లయిన వాళ్లు ఎన్నుకుంటారు.

1/12 వ వంతు మందిని హయ్యర్ స్కూల్స్, కాలేజీలు, యూనివర్శిటీ ల్లో ఉపాధ్యాయులుగా మూడేళ్ల  అనుభవం ఉన్న వాళ్లు ఎన్నుకుంటారు.
 
అయితే ఇంత మహత్తరమైన బాధ్యత కలిగిన శాసన మండలి నిజంగా ఆ స్థాయికి తగినట్లు పని చేస్తున్నాయా అంటే "అవును" అని చెప్పలేని పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే, లోకల్ బాడీస్, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ లను వారి అర్హతలను బట్టి కాకుండా, వారి రాజకీయ అవసరాలను బట్టి భర్తీ చేయడం ఆనవాయితీ‌గా మారింది. ఒక రకంగా, పదవుల పంపకంలో భాగంగా,  రాజకీయ పునరావాసంగా, సభ్యులను సంతృప్తపరిచే సాధనంగా ఉపయోగించుకుంటున్నారు. అవకాశం, ఎమ్మెల్యేల బలగం ఉన్న ప్రతీ పార్టీ కూడా ఈ రీతిగానే వ్యవహరిస్తుండడం గమనార్హం. ఆ అవకాశం లేనివాళ్లు ఉన్నవాళ్లను విమర్శిస్తుంటారు.

అర్హత లేని ఎమ్మెల్సీలు ఉంటే వారిని మాత్రమే కాకుండా, అసలు ఈ ఎమ్మెల్సీ విధానాన్నే "దొడ్డి దారి", "దొంగ దారి" అని విమర్శలు చేస్తూ, నిజంగా అర్హత కలిగిన ఉన్నతమైన ఎమ్మెల్సీలను కూడా అవమానిస్తుండడం విచారకరం. ఒక రకంగా అది రాజ్యాంగాన్ని కూడా అపహాస్యం చేసినట్లే.
           
అందుకే దేశంలో కేవలం 7 రాష్ట్రాలలో మాత్రమే ఈ విధానమండలిని కలిగి ఉన్నాయి. అలా‌ కాకుండా మ, కేవలం అర్హత కలిగిన, అనుభవం, విద్యా స్థాయి మున్నగు నిర్దుష్టమైన ప్రమాణాలు ఏర్పరచి వారు మాత్రమే శాసన మండలికి ఎన్నిక కాగలిగేలా, రాజకీయ ప్రయోజనాలకు అవకాశం లేని విధంగా చట్టాలు సవరించబడాలి. తద్వారా రాజ్యాంగం కల్పించిన గొప్ప అవకాశాన్ని ప్రతి రాష్ట్రం వినియోగించుకునేలా చేసి, ఉన్నతమైన, మెరుగైన పరిపాలనను ప్రజలకు  అందివ్వాలి........

Photo Gallery