BREAKING NEWS

పార్టీలు - ఎన్నికల మ్యానిఫెస్టోలు

ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన పార్టీ మినహా , ఓటమి చెందిన పార్టీలు  నాలుగున్నర సంవత్సరాలు తమ గత మ్యానిఫెస్టోల గురించి  మరచిపోయి తమ స్వంత పనుల్లో పూర్తిగా నిమగ్నమై పోతున్నారు. ప్రజలు తమకు అప్పచెప్పిన ప్రతిపక్ష  బాధ్యత కూడా నిర్వర్తించలేదు.

అసెంబ్లీకి కూడా వెళ్లకుండా రకరకాల కుంటి సాకులు చెబుతున్నారు. ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న వారికి  అర్హత ఉన్నంత వరకు మాత్రమే సెలవు వాడుకోవాలి. అంతకు మించి సెలవు పెడితే జీతం నష్టపోవల్సిన పరిస్థితి ఉంటుంది. అటువంటిది ఐదు సంవత్సరాల కాలంలో కేవలం 24 రోజులు మాత్రమే అసెంబ్లీ కి వెళ్లిన వ్యక్తికి జీతం తీసుకునే హక్కు ఉంటుందా ...?? సామాన్యులకొక న్యాయం .. ప్రజా ప్రతినిధులకొక న్యాయమా ..?? మరో ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయి అనగానే మళ్ళీ హడావిడి మొదలు. అధికార పార్టీతో పాటు పెద్ద ,చిన్న పార్టీలు అన్నీ హామీలతో మ్యానిఫెస్టోలు ప్రకటిస్తాయి.

సరిగ్గా అప్పుడే మొదలవుతుంది...అసలు కథ ..

అధికార పార్టీ ప్రకటించిన గత మ్యానిఫెస్టోలో ఏ ఒక్క అంశం అమలు చేయలేదు ..అని గొంతు చించుకుంటాయి ప్రతిపక్ష పార్టీలు.. మరి ఈ విషయం ఇప్పుడే గుర్తుకొచ్చిందా ..?? ప్రతిపక్ష హోదాలో ఉన్నవారు ప్రజల పక్షాన నిలబడి హామీల సాధనకు అధికారంలో ఉన్న పార్టీతో పోరాటం చెయ్యొచ్చు కదా.

అబ్బే ,,, లేదే ,, ఈ ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు కూడా కొంతమంది విజయం సాధించి ఉంటారు కదా .. ఆ పార్టీలు కూడా కొన్ని హామీలు ప్రజాలకిచ్చే ఉన్నారు కదా .. ఒక  MLA గా ఆ హామీలలో కొన్నైనా నెరవేర్చే అవకాశం ఉంది కదా ..మరి నెరవేర్చారా ??? ఊహూ .. లేదు సరి కదా ,, కనీసం అధికారపక్షంపై వత్తిడి కూడా తేలేదే !!! గడచిన ఐదు సంవత్సరాలు హాయిగా తమ వ్యాపారాలు,కాంట్రాక్టులలో బిజీగా గడిపి రెండు చేతులా సంపాదించుకుని ,ఎన్నికల వేళ బిలాబిలా జనం మధ్యకు వచ్చారు. జస్ట్ ... ఓ ఛాన్స్ ..అడుగుతున్నారు .. గెలిస్తే పదవితో బాటు పరపతి  హోదా, డాబూ, దర్పం, అదనపు సంపాదన,MLA గా నెల నెలా జీతం,అనంతరం జీవితకాల పింఛను ...ఆ భోగమే వేరు.. పొరబాటున ఓటమిపాలయ్యారా .. తమ బిజినెస్ తమకు ఎలాగూ ఉంటుంది. బ్యాక్ టు పెవిలియన్. సింపుల్ ..అంతేగా ..అంతేగా..

ఇదీ ప్రస్తుత ఎన్నికల్లో పోటీలో ఉన్న కొంతమంది అభ్యర్థుల ఆలోచన.
ఈ ఎన్నికల మ్యానిఫెస్టోల రూపకల్పనలో ఒక్కో పార్టీది ఒక్కో శైలి. వారి పార్టీ అధికారంలోకి వస్తే సగం ధరలకే అన్ని వస్తువులు అంటారు. ఇంకో పార్టీ వారు చెబుతారు ,తాము కనుక అధికారంలోకి వస్తే అన్ని పావు ధరలకే ఇస్తాం అంటారు. మరో పార్టీ వారిది మరీ విచిత్రం .. కావలసినవన్నీ పూర్తిగా ఉచితంగానే ఇచ్చేస్తాం అంటున్నారు..

ఇంతకూ ..ఈ ఆఫర్స్ అన్నీ ప్రజలందరికీ వర్తిస్తాయా ?? కానే కాదు ..కేవలం కొన్ని వర్గాలవారికి మాత్రమే వర్తిస్తాయి. మరి వారు మాత్రమేనా ఓటు వేసి గెలిపించేది ?? ఈ పథకాల వలన నిజంగా లాభపడింది ఎవరు?నష్టపడింది ఎవరు?
కుల మత భేదం లేకుండా మధ్య తరగతి ప్రభుత్వ ఉద్యోగులే నష్టపోతున్నారని నిర్ద్వంద్వంగా చెప్పొచ్చు. ఎలా అంటే ...ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధమైన ప్రభుత్వ పథకాలు వర్తించవు. అగ్ర వర్ణాల వారికే కాదు,  అన్ని తరగతుల వారికీ ఈ బాధలు తప్పవు. ప్రైవేట్ ఉద్యోగులు,వ్యాపారులు ఎంత సంపాదన ఉన్నప్పటికీ ఎంతో కొంత లాభపడుతున్నారు.  పోనీ ఏ పార్టీ అయినా తమ స్వంత డబ్బు ఏమైనా పథకాల రూపంలో ఖర్చు చేస్తుందా అంటే లేదు కదా ..!!

ఉదాహరణకు ..

ఒక వస్తువు ఖరీదు 100 రూపాయలు అనుకుంటే  తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆ వస్తువుని ఉచితంగా ఇచ్చి, అదే వస్తువును ప్రభుత్వ ఉద్యోగికి 200 రూపాయలకు విక్రయిస్తారన్నమాట. అంటే ఇక్కడ పూర్తిగా నష్టపడేది సగటు ప్రభుత్వ వేతన జీవి మాత్రమే .. అటు ప్రభుత్వానికి గాని ఉచితంగా పొందిన వారికి గాని నష్టం లేదు.  పోనీ   వీళ్లేమైనా ఓటు వెయ్యరా అంటే అదీ కాదు..

ఎంతో భాద్యతగా ఓటు వేసి గెలిపించేది వీరే .. కాబట్టి ఏ పార్టీ ఎన్ని హామిలిచ్చినా మన డబ్బు మనకే ఇస్తారు. అందుకే తాత్కాలిక హామీలతో ఉచితాలు ప్రకటిస్తూ ప్రజలను సోమరిపోతులుగా మార్చకుండా అందరికీ అందుబాటు ధరలలో కావలసినవి అందిస్తూ , సంక్షేమం, అభివృద్ధి కోసం పాటు పడితే అదే పదివేలు ......

Photo Gallery