BREAKING NEWS

ఓట్లు - గల్లంతు

గత ఎన్నికలలోనూ నిన్న గాక మొన్న జరిగిన ఎన్నికల్లోనూ కూడా చాలా మంది , తమ వద్ద ఓటర్ ఐడి కార్డు ఉన్నప్పటికి తమ ఓటు గల్లంతు అయిపోయింది అని వాపోవడం మనం చూసాం. దీనిపై కొందరు  సెక్షన్ 49 A  , ఆధార్ , EPIC కార్డు మొదలైనవి చూపించి ఛాలెంజ్ లేదా టెండర్ ఓటు వేయవచ్చు అని తమకున్న నాలెడ్జ్ మేరకు ఓటర్లులో చైతన్యం తేవడానికి ప్రయత్నం చేయడం , ఇది నిజమే అని నమ్మి , ఎలక్షన్ బూతుల దగ్గర పెద్ద సంఖ్యలో వేచి ఉండి , చివరకు ఓటర్ లిస్టులో పేరు లేనందున ఓటు వేయడానికి అధికారులు నిరాకరించిన కారణంగా నిరాశతో అధికారులను నిందించడం , EC ని నిందించడం మీడియాలో మనం చూసాం.

తాము ఓటు వెయ్యలేకపోవడానికి కేవలం అధికారులదే తప్ప తమ భాద్యత ఎంతమాత్రమూ లేనట్లుగా చాలామంది అభిప్రాయపడ్డారు. నిరక్షరాస్యులలోనే కాక ఉన్నత విద్యావంతులలో కూడా ఇదే అభిప్రాయం ఉన్నట్లుగా మనకు స్పష్టమైంది. 

అసలు చట్టం ఏమి చెబుతోంది?

మన పేరు ఓటర్ లిస్టులో లేకపోవడానికి కారణం ఎవరు? ఓటు గల్లంతు అంటే ఏమిటి ? మొదలైన విషయాలు ఓ సారి పరికిద్దామా ... మన పేరు ఓటర్ లిస్టులో ఉండి , EC వారు అనుమతించిన ఏదో ఒక గుర్తింపు కార్డు పట్టుకుని లైన్లో నిలబడి  తీరా మన వంతు వచ్చేసరికి మీ ఓటు ఇప్పటికే పోల్ అయిపోయింది అని అక్కడి అధికారి చెప్పిన సందర్భంలో తాను ఓటు వేయలేదు అని తగు రుజువు చూపించి " నా ఓటు హక్కు నేను వినియోగించుకుంటాను "

అన్న సందర్భంలో ప్రోసీడింగ్ అధికారి ప్రత్యేకంగా ఇచ్చే ఓటుని " టెండర్ ఓటు " అంటారు. అలాగే ఓటు వేసే సమయంలో  ఏ పార్టీకి చెందిన పోలింగ్ ఏజెంట్ అయినా అతను నకిలీ ఓటర్ అని అభ్యంతరం పెట్టినప్పుడు అసలు ఓటర్ని నేనే అని తగు రుజువు చూపించి ఓటు హక్కు పొంది, వేసిన ఓటును " ఛాలెంజ్ ఓటు " అంటారు.

ఇక ...ఓటు గల్లంతు అంటే ...
EC వారిచే జారీ చేయబడిన EPIC కార్డు కలిగి ఉండి,  క్రిందటి ఎన్నికల్లో ఓటు వేసిన వారు ఈ ఎన్నికలలో కూడా ఓటు వేద్దామని బూత్ కి వెళ్ళేసరికి అక్కడ తమ పేరు లిస్టులో లేదని తెలిసి తమ ఓటు గల్లంతు అయ్యిందని ఆరోపిస్తున్నారు.

అయితే ఇందులో ఎవరి పాత్ర ఎంత ?? అన్నది చూద్దాం..
EC వారు అనేక సార్లు TV ల ద్వారా పేపర్లు ద్వారా సోషల్ మీడియా ద్వారా ఓటు ఉన్నది లేనిది చెక్ చేసుకుని,లేకపోతే ఓటు కోసం నిర్ణిత సమయంలోగా దరఖాస్తు పెట్టుకోమని ప్రకటనలు ఇవ్వడం నిజం..

అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రజలను చైతన్య పరచడం జరిగింది.అయినా సరే చాలామంది అలా చెయ్యకుండా గత ఎన్నికలలో ఓటు వేసాం కదా అనే ధీమాతో తమ ఓటు ఉందా లేదా అన్నది చెక్ చేసుకోలేదు. అదిగో సరిగ్గా అలాంటి వారే ఎన్నో ముఖ్యమైన పనులను కూడా పక్కన పెట్టి మరీ ఓటు వేద్దామనే ఆశతో వచ్చి ఓటు లేదని తెలిసి తీవ్ర నిరాశకు గురి అయ్యారు.

అయితే జరిగిన దాంట్లో ఓటర్ గా మన పొరబాటు ఉందా ?కేవలం అధికారుల నిర్లక్ష్యమే ఉందా?? పరిశీలిద్దాం ...అసలు గత ఎన్నికల సమయంలో ఉన్న మన ఓటు ఇప్పుడు లేక పోవడానికి కారణం ఏమిటి ??
చాలామంది రాజకీయ నాయకులు అంటున్నట్లుగా మనం ఏ పార్టీకి ఓటు వేస్తామో ముందుగానే తెలుసుకుని ప్రత్యర్ధ పార్టీ వారు మన ఓటుని తొలగించారా ??? లేక అధికారులే తొలగించారా ?? ఓటర్ నమోదు కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు గాని ఔట్ సోర్సింగ్ సిబ్బంది గాని ఇంటింటికి వెళ్లి పేర్లు నమోదు చేసే క్రమంలో ,,ఆ సమయానికి ఆ ఇంట్లో ఉన్న వారి పేర్లు మాత్రమే నమోదు చేయడం , అంతకు ముందు అదే ఇంట్లో ఉన్నవారి పేర్లు తొలగించడం, ఉద్యోగ రీత్యా వేరే ప్రదేశాల్లో ఉన్న వ్యక్తుల పేర్లు నమోదు చేయకపోవడం ,స్వంత ఇంట్లో ఉన్నవారు కూడా ఓటర్ నమోదు సమయంలో ఇంట్లో లేకపోతే వారి పేర్లు కూడా తొలగించడం అన్నింటికీ మించి సిబ్బందికి సరిపడినంత సమయం ఇవ్వకుండా తక్కువ సమయం ఇచ్చి ఫలానా తేదీ లోగా టార్గెట్ రీచ్ అవ్వాలనడం ఫలితంగా విపరీతమైన ఒత్తిడికి గురై ఏదోలా పని పూర్తి అయ్యింది అనిపించడం. ఫలితంగానే ఇన్ని పొరబాట్లు జరుగుతున్నాయి. పోనీ వారు అంతమంది ఓట్లు నమోదు చేయాల్సిన పరిస్థితిలో పొరబాటు జరిగి మన ఓటు ఎక్కడ గల్లంతు అయిపోతుందో అనే భయం గాని భాద్యత గాని ఓటర్ కు ఉన్నా బాగుండేది.

చిన్న చిన్న విషయాలలో ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకునే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. ఉదాహరణకు..

షాప్ లో ఒక చిన్న రుమాలు కొన్నా సరే ఎలా ఉందో అని పరిశీలిస్తామే... మనం ఇల్లు మారిన తక్షణమే గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి  అడ్రస్ మార్పించుకుంటామే ..అర్హులైనవారు  ప్రభుత్వ పధకంలో తమ పేరు నమోదుకు రోజులకొద్దీ తిరుగుతారు కదా ..!!! మరి అలాంటిది ..

మరి అలాంటిది మన నాయకుల తల రాతలు కాదు మన తలరాతలు మార్చే బ్రహ్మాస్త్రం లాంటి ఓటు అనే ఆయుధాన్ని మన వద్ద భద్రపరచుకోవడంలో మనకెందుకంత నిర్లక్ష్యం ?? నిర్లిప్తత ?? మనం కూడా ఆలోచించాలి... ఇచ్చిన నిర్ణీత సమయంలో స్పందించకుండా , సమయం మించిపోయాక ఎవరూ ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో అప్పటికప్పుడు గగ్గోలు పెడితే ప్రయోజనం ఏముంటుంది ??? మరి .... దీనికి పరిష్కారం లేదా ?? అనేక వాటికి ఆధార్ లింక్ పెట్టినట్లుగానే ఓటుకు కూడా ఆధార్ లింక్ అయి ఉండాలి. మార్పులు చేర్పుల సమయంలో ఓటర్ సెల్ ఫోన్ కు OTP రావడం , తరువాతనే రద్దు గానీ బదిలీ గానీ జరిగేలా చెయ్యాలి. ఓటర్ కూడా తమ ఓటు గురించి తామే శ్రద్ద వహించాలి.

నిర్ణీత సమయంలోగా  ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని తదనుగుణంగా భాద్యతతో వ్యవహరిస్తే నిరాశ , వృధా ప్రయాస తప్పుతాయి. కనీసం రానున్న స్థానిక ఎన్నికలకైనా సరే అర్హులందరికీ ఓటు హక్కు ఉండేలా అటు ప్రభుత్వం ఇటు ప్రజలు పాటుపడి ప్రజస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి ....

జై హింద్...

Photo Gallery